Others

బాల్యాన్ని మావోలు బుగ్గిపాల్జేస్తే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదానికి బాల్యం బలవుతోందని తరచూ వార్తలు వెలువడుతున్నాయి. 14-15 సంవత్సరాల పిల్లలను మతోన్మాద ఉగ్రవాదులు ఆకర్షిస్తూ వారిని పావులుగా వాడుకుంటున్నారు. భద్రతా బలగాలతో జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో దారితప్పిన ఈ పిల్లలు సైతం మరణించడం పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
జెనీవా ఒప్పందం ప్రకారం 15 ఏళ్ల లోపువయసు పిల్లల్ని సాయుధ కార్యక్రమాల వైపు ఉసిగొల్పరాదు. సాయుధ ముఠాల్లో, గ్రూపుల్లో, దళాల్లో నియమించకుండా ఆ ఒప్పందం నిషేధం విధించింది. 1989 సంవత్సరంలో బాలల హక్కుల కోసం రూపొందించిన ఈ ఒప్పంద పత్రానికి ప్రపంచంలోని అన్ని దేశాలూ మద్దతు ప్రకటించాయి. జెనీవా ఒప్పంద పత్రానికి అటు కశ్మీర్ ఉగ్రవాదులు, ఇటు ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులు మాత్రం యథేచ్ఛగా తూట్లు పొడుస్తున్నారు. పసిప్రాయంలోనే పిల్లలకు ఆయుధ భాష నేర్పించి వారి జీవితాలతో ఆడుకోవడం పూర్తిగా అన్యాయం. కశ్మీర్ స్వయం నిర్ణయాధికారం పేర ఉగ్రవాదులు జరుపుతున్న పోరు, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని భారతదేశంలో విజయవంతం చేస్తామన్న పేర మావోయిస్టులు 14-15 ఏళ్ళ లోపువయసు పిల్లల్ని పెద్దఎత్తున తమ సాయుధ దళాల్లోకి ఆకర్షిస్తున్నారు.
ఉగ్రవాదులకు ఎలాంటి నిర్దిష్టమైన సిద్ధాంతాలు లేవు, శాస్ర్తియ అవగాహన లేదు. తాము సిద్ధాంతాల ప్రాతిపదికన ప్రయాణం చేస్తున్నామని చెప్పుకునే మావోయిస్టుల చర్యలు ఉగ్రవాద చర్యల కన్నా భిన్నమని ఎలా చెప్పగలం? ఉగ్రవాదులు అనుసరిస్తున్న వ్యూహం ఎత్తుగడలు, పద్ధతులను మావోయిస్టులు మరింత కఠినంగా అమలు జరుపుతున్న ‘దృశ్యం’ స్పష్టంగా నేడు కనిపిస్తున్నది. ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లోని ఆదివాసీ పిల్లల్ని పాఠశాలల నుంచి బలవంతంగా లాక్కెళ్లి ఆయుధ శిక్షణ శిబిరాల్లో మావోయిస్టులు చేర్చుతున్న సంఘటనలు కోకొల్లలు. మాయమాటలు చెప్పి ఆదివాసీల గుడిసెల నుంచి అమాయక బాలలను తరలిస్తున్న సందర్భాలు అనేకం. ఇదంతా ‘నూతన సమాజం’ పేర జరగడం శోచనీయం.
జెనీవా ఒప్పందం, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటివి ఏమి చెబుతున్నాయో తెలిసినా ఈ రకమైన కార్యక్రమాలకు మావోయిస్టులు పాల్పడటం ఏ మేరకు ఆమోదనీయం? దేశంలో కోట్లాది మంది బాలలు మెరుగైన విద్య- విజ్ఞానంతో తమ జీవితాలను తీర్చిదిద్దుకునే క్రమంలో పసితనాన్ని ఆస్వాదిస్తూ అడుగులు వేస్తుంటే- అటు కశ్మీర్ ఉగ్రవాదుల, ఇటు మావోయిస్టుల చెరలోని పిల్లలు మాత్రం ఆయుధ భాష నేర్చుకుని తుపాకుల మోత మధ్య గడపడం భావ్యమా? ఉగ్రవాదుల కన్నా తాము ఎంతో ఆలోచనాపరులమని చెప్పుకునే మావోల ‘చెర’లోనూ బాలలుండటం విషాదం గాక ఏమవుతుంది?
ప్రపంచంలో మార్క్సిస్టు సిద్ధాంతం సర్వోత్కృష్టమైనదని, గొప్ప మానవతా విలువలకు ప్రతీక అని, అత్యున్నత ప్రమాణాలకు అది ప్రాతిపదిక అని పదే పదే చెప్పే మావోయిస్టులు ఇలా బాలల బాల్యాన్ని బుగ్గిచేస్తే ఎలా ఆహ్వానించగలం? అతి సున్నితమైన ఈ అంశాన్ని సైనిక బూటు కాళ్ళ కింద తొక్కిపెట్టి ఎన్ని ఆదర్శాలు వల్లిస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? బాలలకు ‘చందమామ’ అంటే ఎంతో ఇష్టం. ఎంతో కుతూహలంతో తిలకిస్తారు. పలు ప్రశ్నలు ఆ బుర్రలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. అలాంటి చందమామపై పరిశోధనలు జరుగుతున్న సందర్భమిది. తాజాగా చైనా చంద్రుడి ఆవలి వైపున వ్యోమనౌకను దింపి ఎవరూ నిర్వహించని పరిశోధనలు నిర్వహిస్తోంది. రష్యా, అమెరికా దేశాల కన్నాఒక అడుగు ముందుకేసి ఈ పరిశోధనలు కొనసాగడం విశేషం. చందమామపైకి పట్టుపురుగులను, విత్తనాలను, బంగాళా దుంపలను తీసుకెళ్ళారు. అక్కడ అవి ఎదగడం- పెరగడంపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
ఇలాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పరిశోధనల- ప్రయోగాల వెనుకగల కొత్తతరం ఆలోచనలకు ఈ ఉగ్రవాదుల- మావోయిస్టుల విశ్వాసాలు, ఆలోచనలకు మధ్యగల అగాథం ఎలాంటిదో ఇట్టే ఊహించవచ్చు. వాస్తవ ప్రపంచం సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో ఎలా దూసుకుపోతున్నదో గమనిస్తూ ఆ జ్ఞానం- పరిజ్ఞానంతో బతుకుల్ని బాగుపరిచి ప్రజలకు మెరుగైన జీవితం అందించేందుకు కృషిచేయాల్సిన వారు, అందుకు తమవంతు సాయం అందించాల్సిన వారు ఇలా బాల్యాన్ని బందూకులకు బలి ఇస్తే అదెలా భావ్యమనిపించుకుంటుంది?
ఇదిలా ఉండగా ఇటీవల సిపిఐ (ఎంఎల్) న్యూ డెమొక్రసీ పార్టీకి చెందిన దళ కమాండర్, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సింగర్ బోయిన వీరభద్రం అలియాస్ రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఓ వైపు మావోయిస్టు పార్టీ, మరోవైపు జనశక్తి, న్యూ డెమొక్రసీ లాంటి ఇతర గ్రూపులు ఇలా దళాలను ఏర్పాటుచేసి చందాలు వసూలుచేస్తూ, యువతను బాలలను ఆకర్షిస్తూ అడవుల్లో తిరగడం వల్ల ఒరిగిన ప్రయోజనమేమిటి? జరుగుతున్న ఉపయోగమేమిటి?
ఇటీవల తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయాయి. మార్క్సిస్టు పార్టీ అయితే బహుజన లెప్ట్ ఫ్రంట్ పేర పోరులో దిగినా డిపాజిట్లు సైతం దక్కలేదు. దీంతో వామపక్ష భావజాలం పట్ల ప్రజలకు ఏమేరకు గౌరవం ఉందో అర్థమవుతోంది. వామపక్ష తీవ్రవాద పార్టీలు, గ్రూపులుగాని వామపక్ష పార్టీ (ఎన్నికల్లో పాల్గొనేవి)లు ప్రజల సంక్షేమం- అభివృద్ధి కోసం, వారికి మార్గదర్శనం చేసేందుకు పనిచేయాలి, త్యాగాలు చేయాలి తప్ప ప్రజలను గందరగోళంలో ముంచెత్తరాదు కదా? వర్తమానంలో ఈ శక్తులన్నీ చేస్తున్నదే అది. ప్రపంచం ఓ కొత్త కక్ష్యలో ప్రయాణిస్తుంటే, కొత్త మార్గం అనుసరిస్తూ దూసుకుపోతుంటే దాన్ని తిలకించకుండా ఊహాత్మక పద్ధతిలో ‘సోషలిజం’ పేర కాలం చెల్లిన ఆలోచనలు చేస్తే, వాటిని ఆచరణలో పెట్టేందుకు ప్రజల్ని ఉసిగొలిపితే నష్టపోతున్నది ప్రజలేనన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా?
70 సంవత్సరాలకు పైగా సోషలిజం గూర్చి కలవరిస్తున్నా కాలం అందుకు అనువుగా లేదని, ఆ భావన ప్రపంచం నుంచి నిష్క్రమించిందని తెలిసినా, ఆ ఊహాత్మక భావనలకు సాంకేతిక పరిజ్ఞానం కళ్ళెం వేసిందని స్పష్టంగా అవగతమైనా ఇంకా- ఇలా బాలలను, అమాయకులను ఆ సిద్ధాంతాలకు ‘బలి’ ఇచ్చే కార్యక్రమాల్లో తలమునకలైపోవడం ఏ మేరకు ఆహ్వానించదగ్గ అంశమమవుతుంది? అలా చేయడం ‘దగా’. ‘్ధ్యస’ ఉండాలి కదా? జర్మనీకి చెందిన రెండు వందల ఏళ్ల క్రితపుకారల్ మార్క్స్ ఊహలకు ఇక్కడ భారతదేశంలో ఊపిరి పోస్తామని చెబుతూ, ఇలా కొత్తతరాల బాల్యాన్ని ‘బలి’ తీసుకుంటే ఎలా కొత్త భావాలు- ఆలోచనలు మెరుస్తాయి? అతి సాధారణమైన ఈ విషయాన్ని విస్మరించి ఎవరు బాల్యాన్ని చిదిమేసినా అది నేరమే! ప్రపంచ జ్ఞానం తమ సొంతమని భావించే మావోలు ఇలా సమాజం ముందు నేరస్తులుగా నిలవరాదు కదా? కాంబోడియాలో ఇలాంటి అపరాధం చేసినవారిప్పుడు బోనులో నిల్చున్న సంగతి తెలిసినప్పటికీ అదే పొరపాటుకు పాల్పడటమంటే వారిలో ఏమేరకు విజ్ఞత దాగ ఉందో తేటతెల్లమవుతోంది.

-వుప్పల నరసింహం 99857 81799