Others

మావోలను ప్రశ్నిస్తున్న కృత్రిమ మేధ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు ప్రపంచాన్ని విప్లవీకరిస్తున్న పరిజ్ఞానం ‘కృత్రిమ మేధ’ (ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్సీ-ఏఐ) అని చెప్పాలి. అన్ని రంగాలలోకి దీన్ని తీసుకెళ్ళేందుకు, వివిధ సంస్థలకు, వ్యక్తులకు శిక్షణ ఇచ్చేందుకుగాను ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్ ఇండియా’ ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతోంది. ముఖ్యంగా యువతకు ఏఐలో శిక్షణ ఇచ్చేందుకు దేశంలోని పది విశ్వవిద్యాలయాల్లో పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఐదు లక్షల మంది యువతీ యువకులకు ఇందులో శిక్షణ ఇస్తామని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రకటించింది. ఏఐ రంగంలో విప్లవాత్మక పాత్రను భారతదేశం పోషించే స్థాయిలో ఉందని మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడు అనంత్ ఇటీవల వెల్లడించారు. హైదరాబాద్ ఐఐటిలో తొలిసారిగా దీనిపై పూర్తిస్థాయి కోర్సును ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నారు.
భారతదేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం కృత్రిమ మేధను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోంది. ప్రతి వ్యక్తికి, సంస్థకు సాధికారత కల్పించేందుకు వీలుగా ఈ కార్యక్రమం ఉండగలదని తెలుస్తోంది. ఏఐ అనుకూల వాతావరణ సృష్టికిగాను ఇప్పటికే 715 సంస్థలతో కలిసి మైక్రోసాఫ్ట్ ఇండియా పనిచేస్తోంది. 700కు పైగా ప్రభుత్వ-ప్రైవేట్ సంస్థలు తమ నుంచి ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాయని ఆ సంస్థ పేర్కొన్నది. ప్రజల అవసరాలను తీర్చేందుకు వీలుగా తమ సాంకేతికతను ప్రభుత్వం ఉపయోగిస్తోందని కూడా ఆ సంస్థ తెలిపింది. విద్య, నైపుణ్య కల్పన, వైద్యం, వ్యవసాయం లాంటి రంగాలలో ఏఐ అత్యంత కీలకం కానున్నదని నిపుణులు భావిస్తున్నారు.
వర్తమానంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి చోదకశక్తిగా కృత్రిమమేధ నిలవనున్నదని స్పష్టమైన ఈ సందర్భంలో ప్రపంచమంతా అటువైపు కదులుతున్న వేళ.. చైనా ఈ విషయంలో ముందున్న సమయంలో.. సంప్రదాయవాదులు ముఖ్యంగా కమ్యూనిస్టుల, మావోయిస్టుల సిద్ధాంతాలకు, ఆలోచనలకు అభిప్రాయాలకు ఏమైనా మాన్యత కనిపిస్తోందా? భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల మెదళ్ళలో ఇప్పటికీ కాలం చెల్లిన మార్క్స్ భావజాలాన్ని కుక్కడానికి కమ్యూనిస్టు పార్టీలు- మావోయిస్టులు ‘ఓవర్ టైం’ పనిచేయడం విడ్డూరం. ఇది దేశ ప్రజలకు ఉపయోగకరమైనదా?- అన్న ప్రశ్న వేసుకునేందుకు వారు నిరాకరిస్తూ ‘బండగా’ ముందుకు కదులుతున్నారు.
నాల్గవ పారిశ్రామిక విప్లవంలో అంతర్భాగంగా ఉబికివచ్చిన కృత్రిమ మేధ పరిజ్ఞానం అత్యంత కీలకమని అన్నివర్గాలూ అంగీకరిస్తున్నాయి. ఈ సరికొత్త విప్లవంలో భారతదేశం పాత్ర చాలా కీలకమైనదని ప్రపంచం గుర్తించింది. తదనుగుణంగానే ప్రపంచ స్థాయి సంస్థలు భారతదేశంలో పనిచేస్తున్నాయి. అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ ఇండియా ఈ రంగంలో విస్తరిస్తోంది. లక్షలాది మందికి శిక్షణ ఇచ్చేందుకు వ్యూహం సిద్ధమైంది. ప్రజల అవసరాలను తీర్చడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం పాత్ర ఎంతో ఉపయుక్తమైందని ‘కాలం’ ప్రకటించింది. మరి దాన్ని స్వాగతించాలి కదా? మరింత ఎక్కువమంది అవసరాలు తీరేందుకు దాన్ని వినియోగించుకోవడమెలా?- అని యోచించాలి కదా? ఈ అంశానికి తలుపులు మూసేసి, మూస ధోరణిలో దండకారణ్యానికే పరిమితమవుతామని మావోయిస్టులు భావిస్తే భారతదేశ ప్రజలు ఎలా అభివృద్ధిని సాధిస్తారు?
ఆలోచనాపరుడు...
కృత్రిమ మేధతో ముడిపడి ఉన్న టెలికం సంస్థ జియో. ఆ సంస్థతో భారతదేశంలో గొప్ప విప్లవాత్మక మార్పును ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తీసుకొచ్చారు. ఇప్పుడాయన ప్రపంచంలో గొప్ప ఆలోచనాపరుల జాబితాలో చేరారు. ప్రముఖ ప్రచురణ సంస్థ ‘్ఫరిన్ పాలసీ’ రూపొందించిన ‘గ్లోబల్ థింకర్స్-2019’ జాబితాలో ఆయన పేరు చోటుచేసుకుంది. ‘జియో’తో మన దేశంపై అమిత ప్రభావాన్ని చూపిన వ్యక్తిగా ముకేశ్‌ను గుర్తించారు. భారతదేశంలో స్మార్ట్ఫోన్ ద్వారా ఇంటర్నెట్ వినియోగాన్ని వేగంగా పెంచిన ఘనత ఆయనకే దక్కింది.
వాయు తరంగాలను ఉపయోగించుకుని సంపద సృష్టించే ఈ తరుణంలో ముకేశ్ అంబానీ ఆ కిటుకును వేగంగా పట్టుకుని, ఆచరణలో పెట్టి చరిత్ర సృష్టించారు. ఓ రకంగా ఆయన దార్శనికత దేశానికి వనె్న తీసుకొచ్చింది. గత మూడు పారిశ్రామిక విప్లవాలపై సమగ్ర అవగాహన ఉండటమేగాక వర్తమాన నాల్గవ పారిశ్రామిక విప్లవ ప్రగతిపై మరెంతో స్పష్టత ఉన్న విషయాన్ని ఆయన ప్రసంగాలు తెలుపుతాయి. అందువల్లే ఆయన గొప్ప ఆలోచనాపరునిగా (గ్రేట్ థింకర్)గా గుర్తింపుపొందారు. ముఖ్యంగా ‘డేటా’యే ఆధునిక కాలంలో ‘ఇంధనం’ అని పలు సందర్భాల్లో ప్రకటించి తదనుగుణంగా తన జియో సంస్థను రూపొందించారు. దానికి అనుబంధంగా మరెన్నో సంస్థలు వస్తున్నాయి. ఇవన్నీ నాల్గవ పారిశ్రామిక విప్లవ ఫలితాలను భారత ప్రజలకు అందించాలనే లక్ష్యంతో నెలకొల్పినవే.
ప్రజల్ని సమకాలీన టెక్నాలజీతో ముందుకు తీసుకుపోతూ వారికి ‘సాధికారత’ అందిస్తున్న ముకేశ్ అంబానీ లాంటి వారిని వామపక్షాలు- మావోయిస్టులు కార్మిక-కర్షక వర్గ శత్రువులుగా చిత్రీకరించే పనిలో తలమునకలవుతున్నారు. ఈ రకమైన వైఖరి, విధానం ప్రజలకు ఉపకరిస్తుందా? ఈ సమాజం అందరిదీ.. ఈ దేశం మనందరిదీ.. ఎవరి శక్తిసామర్థ్యాలను వాళ్లు ప్రకటించి ప్రపంచంతో పోటీపడాలన్న తత్త్వాన్ని కాదని రెండువర్గాల సిద్ధాంతాన్ని ఇంకా పట్టుకుని పాకులాడితే పేద-మధ్యతరగతి ప్రజలు ఎక్కడ తేలుతారు?
దేశంలో ‘ఐటి బూమ్’ రాకముందు పరిస్థితులు- వచ్చిన తర్వాత నేటి పరిస్థితులు కళ్ళకు కడుతున్నా, పేద- మధ్యతరగతి ప్రజలు తమ జీవితాలను తమ ‘శక్తి’మేరకు మెరుగుపరచుకున్న వైనాన్ని విస్పష్టంగా తిలకిస్తూనే ‘‘రెండువర్గాల సిద్ధాంతాన్ని’’ ప్రచారం చేయడంలో, ఆ సిద్ధాంతాన్ని సజీవంగా నిలిపేందుకు ప్రాణాలు సైతం తీసేందుకు మావోయిస్టులు సిద్ధమైతే, మానవ వనరులను దుర్వినియోగపరుస్తూ వారిని అరణ్యాలకు తరలిస్తే జనారణ్యం జేగీయమానంగా వెలుగొందుతుందా? ఇది చాలా సింపుల్ ప్రశ్న. ఈ ప్రశ్నను పట్టించుకోకుండా, దాటవేస్తూ ఇంకా ‘‘వర్గ కసి’’ని నూరిపోస్తూ ఆయుధాలు ధరించి వర్గపోరాటానికి రా.. రమ్మని పిలుపునిస్తే అది ఏమేరకు సబబుగా అనిపించుకుంటుంది?
యుగ ధర్మానికి అనుగుణంగా అశేష ప్రజల్ని నడిపించే శక్తి సామర్థ్యా లు, దూరదృష్టి, ఆలోచనగలవారు ఎవరైనా వారి చుట్టే... వారివైపే ప్రజలు పయనిస్తారు. ఇది యుగయుగాలుగా కొనసాగుతున్న వైనం. అదే ఇప్పుడు కృత్రిమ మేధ, డేటా, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రూపంలో ఉబికి వచ్చింది. అటువైపు మాత్రమే ప్రజలు కదులుతున్నారు. 5జీ విస్తరణలో భారతదేశం ముందున్నదని ‘ట్రాయ్’ చైర్మన్ శర్మ ప్రకటించారు. ‘ఇది పెట్టుబడిదారుల మార్గం... దోపిడీదారుల దారి కాబట్టి దాన్ని కాలదన్ని ప్రత్యామ్నాయ పద్ధతిలోకి కదిలి రండి.. 175 సంవత్సరాల క్రితం మార్క్స్ మహానుభావుడు పేర్కొన్న సిద్ధాంతం, సూత్రీకరణ అనుగుణంగా కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం రండి..’ అని దశాబ్దాలుగా మావోయిస్టులు పిలుపునిస్తున్నా, వనరులను ధ్వంసం చేస్తూ, సాటి మనుషులను హతమారుస్తూ తుపాకులు పేల్చి ఆహ్వానిస్తున్నా- జనంలో ఆదరణ లేదంటే అలాంటివారు ‘ఆత్మవిమర్శ’ చేసుకోవాలి కదా? దానికి బదులు మరింత మూర్ఖంగా అరణ్యాలలో మరింత లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి విముక్తి ప్రాంతాలను నిర్మిస్తున్నామని గొప్పలు పోతే ఆ పనికి ఏమైనా మాన్యత ఉంటుందా? అసలు ఆ రకమైన చర్యకు ప్రాసంగికత కనిపిస్తుందా? ప్రాసంగికత లేని, పనికిరాని, ప్రజల జీవనాన్ని మెరుగుపరచడంలో ఉపకరించని, పైగా వారిని మరింత వెనుకబాటుతనంలోకి నెట్టేసే ఇలాంటి రాజకీయ కార్యక్రమానికి మద్దతు ఎలా లభిస్తుంది? ఈ ప్రశ్నను వామపక్షాల- మావోయిస్టుల మేధకు- కృత్రిమ మేధ వేస్తోంది. మరి వారి సమాధానమేమిటి..?

-వుప్పల నరసింహం 99857 81799