Others

దేశం ఎటువైపు పోతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశ అభివృద్ధిని గురించి రాజకీయ నేతలు వేదికలపై పలికే ప్రగల్భాలను పక్కనపెట్టి, వాస్తవాలను పరిశీలిస్తే గత 70 ఏళ్లలో మనం సాధించిన ప్రగతి తక్కువేనని చెప్పాలి. ఎక్కడో మహానగరాలలో కొందరు అధికారులు, పాలకపక్ష నాయకులు చేరి దేశం కోసం ఖర్చుపెట్టినట్లుగా తెలిపే పద్దులను కంప్యూటర్‌లో చూసి- ఆ ఫలితాలను అంచనావేస్తే అసత్యాలు ఎక్కువే ఉంటాయి. వాస్తవాలను తెలుసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాలలో క్షేత్రస్థాయి అధ్యయనం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవాలకు సంబంధించిన సమాచార సేకరణకు యత్నించటం లేదు.
గత 70 ఏళ్ల ప్రగతిపై కొన్ని విషయాలను ఆలోచిద్దాం. దిగువస్థాయి సాధారణ ప్రజలదాకా స్వదేశీ వస్తూత్పత్తిని చేర్చే ప్రభుత్వరంగ పరిశ్రమలు అంతగా లేవన్నది మనందరికీ తెలిసిన విషయమే. విద్య, ఉద్యోగాలు, వస్తు ఉత్పత్తికి విదేశీ ప్రైవేటు రంగంపై ఆధారపడుతున్నందున, ఆ రంగం మన అవసరాలను, దేశాన్ని శాసిస్తోంది. విదేశీయ మార్కెట్ గుప్పిట్లోకి దేశం తరలివెళ్ళింది. మన పారిశ్రామిక విధానానికి దారీ తెన్నూ లేదు. 70 ఏళ్ల కాలంలో దేశ రక్షణావసరాలను తీర్చుకోలేకపోతున్నాం. ఈ విషయంలో జాతీయ పార్టీల ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి వాదాలు, ప్రతివాదాల చిక్కుల్లో సతమతమవుతున్నాయి. కావలసిన వనరులను సంతరించుకోగల సామర్థ్యమున్న పెద్ద దేశం మనది. దేశం పట్టనంతగా జనాభా ఉంది. అతి చిన్న దేశాల శక్తిసామర్థ్యాలపై భారత్ ఆధారపడుతున్నది. కొత్త సాంకేతికతతో రైలు ఇంజన్లు, రైలు పెట్టెలు, రైలుమార్గాలు వేయలేకపోవటం సిగ్గుచేటు అనిపించటం లేదు మన పాలకులకు. నిర్ణీత కాలపట్టిక ప్రకారం రైళ్లను నడిపే యోగ్యత కూడ లేని దశలోనే మనమున్నాం.
ఉత్పత్తి రంగంలో ప్రపంచపటంలో మన దేశం ఉండవలసిన స్థాయిలో లేదు. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఎంత భావ దారిద్య్రంతో కూడినదోకదా? ‘మేడ్ బై ఇండియా’ నినాదం గౌరవప్రదమైనది కదా అని మనం అవలంబించడం లేదు. ఇందుకు మన ప్రభుత్వాలు ముందుకు రావటం లేదు. ఇతర దేశస్తులు మన దేశానికొచ్చి మన అభివృద్ధి కోసం సర్వం వెచ్చించి ఖాళీచేతులతో తిరిగి వెళతారనుకోవటం పొరపాటు ఆలోచన. గతంలో బ్రిటీషు వాళ్ళు చేసిన పరిపాలన అనుభవం ఎంతైనావుంది మనకు. కాని మనకు అంతర్నేత్రం తెరుచుకొనే పరిస్థితి లేదు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం జపాన్ తీసుకున్న ‘నో ఎక్స్‌పోర్ట్స్’ ‘నో ఇంపోర్ట్స్’ నినాదంలో ఉన్న అర్థాన్ని మన దేశం చదవలేదు.
మన యువతరం, సాంకేతిక విద్య, నైపుణ్యాలు వంటివి పరదేశాలను వెతుక్కొని వెళ్ళాయి. వాటిని నిలువరించే ప్రణాళికలను మన దేశం రచించలేదు. నిరుద్యోగ అలజడి పోయిందని సంతోషిస్తుంది దేశం. యువత సామర్థ్యాలను మన దేశం పలు రంగాలలో ఉపయోగించుకోలేకపోయింది. పర్యవసానంగా దేశానికి అవసరమైన సాంకేతికతలను, ప్రావీణ్యాన్ని, సామగ్రిని సింగపూర్, ఫ్రాన్స్, కొరియా, ఫిలిప్పీన్స్, కీన్యా వగైరా దేశాల నుండి తెచ్చుకోవటం మన దేశానికి తలవంపుగా లేదు. అన్నింటికీ ‘గ్లోబలైజేషన్’ జవాబైంది.
70 శాతం ప్రజలు ఆధారపడి జీవించే వ్యవసాయ రంగాన్ని అన్ని ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. ప్రజలు వ్యవసాయం నుండి ఉద్యోగాలకు, వ్యాపారాలకు, కూలిపనులకు తరలిపోవటానికి, పొలాలు బీళ్లు పడడానికి కారణాలు తెలిసినా ప్రభుత్వాలు చూస్తూ మిన్నకున్నాయి. అధ్యయనం చేసి కారణాలు అనే్వషించి ఆదుకోవటంపై ధ్యాస పెట్టలేదు. విధివిధానాలపై సమగ్ర చర్చలు లేవు. గంగా-కావేరి నదుల అనుసంధానం ప్రణాళిక మూతబడింది. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్, ఎగుమతులు- దిగుమతులపై శ్రద్ధ లేదు. వ్యవసాయ ఉత్పత్తులను, మానవ వనరులను వినియోగంలోకి తెచ్చే సమగ్ర ప్రణాళికలు లేకుండా కర్షకుల చేతుల్లో తాయిలాలు పెట్టి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయి ప్రభుత్వాలు. చాలా ప్రాంతాల్లో రైతులు వ్యవసాయాన్ని వదులుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు.
సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఉండవలసిన నిష్పత్తులు చెరిగిపోయాయి. ప్రభుత్వాలను నడిపే పార్టీలు వారి ప్రయోజనాల కోసం పోటాపోటీలుగా నిష్పత్తులు చెరిపేశారు. అన్నింటినీ సంక్షేమ కార్యక్రమాలుగా మార్చారు. ఏమాత్రం బడ్జెట్ కూడా ఉత్పత్తి, అభివృద్ధి కార్యక్రమాలకు మిగిల్చడం లేదు. పేదలకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు వినియోగించటంలో అర్థమున్నది గాని ప్రతిపనికీ సంక్షేమం కింద దానమివ్వటం వల్ల ఆ డబ్బుతో దేశానికి తిరిగి ఉత్పత్తులు రాక అభివృద్ధి ఆగిపోయింది. ముద్రించిన డబ్బు వృథాగా ప్రజల్లో సంచారం చేస్తోంది. ప్రజల శక్తిసామర్థ్యాలను దేశం కోసం వినియోగించి ప్రతిఫలాన్ని జాతి కోసం సాధించటంలో అర్థముంటుంది. కాని మన దేశం ఈ విషయంలో దారుణంగా విఫలమైంది.
దేశంలో బహుళ పార్టీల వ్యవస్థ కొంతమంది నాయకులకు, వారి సంస్థలకు ప్రయోజనాలు కలిగించేందుకు దోహదం చేస్తోంది. చాలా రాజకీయ పార్టీలు కులాలు, మతాల ప్రాతిపదికపై పెట్రేగిపోతున్నాయి. దేశంలో ‘ఏకరూప’ పాలనా విధానం దెబ్బతిని, పాలనావిధానాలు రాష్ట్రానికొక విధంగా మారాయి. ఒకే గడ్డపై ఏకరూప సైద్ధాంతికత లోపించింది. జాతీయ భావం కనుమరుగు కావడంతో వివిధ ప్రాంతాల ప్రజలు అయోమయంలో పడుతున్నారు. రాజ్యాంగ వౌలికసూత్రాలు దెబ్బతింటున్నాయి. ఈ కారణంగా రాజ్యాంగ సవరణ వైపు పాలకులు ఇకనైనా దృష్టిసారించవలసిన అవసరం వుంది.
ఇక, దేశంలో ఎన్నికలు కడు నీచస్థాయికి దిగజారి పోయాయి. ఓటర్లు, నేతలు సహా అన్ని వర్గాలవారూ ఎన్నికలను స్వప్రయోజనాలకు ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేశాన్ని గూర్చి ఆలోచించటం లేదు. శాసనకర్తలుగా వ్యాపారులే వస్తున్నారు. ఎగువ సభలూ వ్యాపారులకే దక్కుతున్నాయి. ఎన్నికైన వారిని ‘రీకాల్’ చేసే అవకాశం మన రాజ్యాంగంలో లేదు. ఈమధ్య మరొక వ్యాధి ప్రబలింది. ఒక పార్టీ తరఫున గెలిచి అధికార పార్టీలోకి మారటమేకాక అక్కడ మంత్రులవటం, ఇతర పదవులు పొందడం చూస్తున్నాము. ఈ అనైతికతను ప్రశ్నించే చట్టం లేదు.
ప్రతి ఓటుకు ఆ నియోజకవర్గ జనాభాను బట్టి, ఓటింగు శాతాన్ని బట్టి, వచ్చిన ఓట్లను బట్టి డిజిటల్ విలువలు కట్టి దాని ఆధారంగా గెలుపోటములు నిర్ధారించటం సత్ఫలితాలనివ్వవచ్చు. ప్రిఫరెన్షియల్ ఓటు విధానం గాని, మరే ఇతర విధానం గాని ప్రవేశపెట్టవచ్చు. ఎన్నికలు ప్రతి రెండేళ్ళకొకసారి నిర్వహించవచ్చు. చట్టసభల్లో ఘర్షణలు, గొడవలు దేశప్రతిష్టకు తలవంపులుగా ఉన్నాయి. ఇలాంటి పనులు నాగరికులు చేసే పనికాదు. లోక్‌సభలో రాజ్యసభలో, అసెంబ్లీలలో, శాసనమండళ్లలో ప్రవర్తనా నియమావళి కఠినతరం చేయటం అవసరం.
మన దేశ ఆర్థికవ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. చెలామణిలోవున్న డబ్బు ధనవంతుని వద్దకే చేరుతోంది. ధనం లేనివాళ్ళు ఇంకా మరింత పేదలుగా మారుతున్నారు. సంపాదన ఉన్నవారివద్దకు చేరిన డబ్బైనా దేశ సంపదను పెంచడానికి వినియోగ పడడం లేదు. దేశం దాటి వెళ్ళిన డబ్బు తిరిగి రావడం లేదు. డబ్బుతో పరారైన ఘరానా వ్యక్తులూ తిరిగిరాలేదు. దేశ విదేశాల చట్టాలు వారిని తిరిగి రప్పించేందుకు పనికిరావటం లేదు. రిజర్వు బ్యాంకు, సి.బి.ఐ, సి.వి.సి. ఐ.టి., జిఎస్టీ విధింపు-తగ్గింపు, పెద్ద నోట్లరద్దు లాంటివి అల్లరిపాలై సామాన్య ప్రజానీకం కూడ చలించిపోయింది. దేశంలో ఈ అలజడిని మాన్పటానికి రాజకీయ నాయకులను, మేధోవంతులను, ఆర్థిక సిద్ధాంతకర్తలను, సామాజిక శాస్తవ్రేత్తలను ఒకచోటకు ఆహ్వానించి సంప్రదింపులు జరిపి నిర్మాణాత్మకంగా ముందుకుసాగే ప్రయత్నం చేయాల్సి ఉంది. కాని దీనికి నేతల అహం అడ్డువచ్చింది. నిపుణుల, అనుభవజుల సలహాలు తీసుకొని దేశ పరిస్థితులను చక్కదిద్దటం చిన్నతనంగా భావించబడుతోంది.
కుటుంబ వ్యవస్థ, వివాహవ్యవస్థ కొత్తరూపం ధరిస్తున్నాయి. ‘కుల నిర్మూలన’ సిద్ధాంతం మరుగునపడి ‘కుల నిర్మాణ’ సిద్ధాంతం ప్రబలింది. దేశం కులపీలికలైంది. అస్పృశ్యత పూర్తిగా అదృశ్యమైపోయిందని గట్టిగా చెప్పలేకున్నాము. పైగా అది కొన్ని చోట్ల శాశ్వతమైంది. అస్పృశ్యత నివారణకు చేసిన చట్టాలు తప్పుదారి పట్టాయి. అవినీతికి హద్దులు, ఆటంకాలు ఏమీ లేవు. ప్రభుత్వాలే అవినీతి సామ్రాజ్యాలైనాయి. ప్రజల డబ్బు ప్రభుత్వాల నుండే వాడుకలోకి పోవాలి కనుక అక్కడే నొక్కేయటం జరుగుతోంది. రాజకీయ పార్టీల మధ్య అసహనం, ఘర్షణ పెరిగింది. దేశ నిర్మాణం వైపు రాజకీయ రంగం సాగటం లేదు. ఈ పరిణామాలను పరిశీలిస్తే- దేశం విధ్వంసానికి చేరువలో వుందన్న భయం ఎవరికైనా కలుగుతుంది. దేశంలో అతి ముఖ్యమైన న్యాయవ్యవస్థ సంస్కరణలు కోరుతున్నది. ప్రధానమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు, ప్రజలు న్యాయవ్యవస్థపై అసంతృప్తి వెల్లడిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశం ఏటుపోతోంది? దాని మార్గమేమిటి? ఈ ప్రశ్నలకు జవాబు ప్రభుత్వాల వద్ద లేదు. దేశ సుస్థిర ప్రయాణం కోసం దేశంలోని వివిధ రంగాల మేధావివర్గం చర్చలు జరిపి ఆరోగ్యకరమైన ప్రగతి మార్గాలను అనే్వషించి ప్రకటించవలసిన అవసరం ఎంతైనావుంది. అందుకు నిజాయితీ గల పాలకులు తగు చర్యలు చేపట్టడం తక్షణ అవసరం.

-బి.హనుమారెడ్డి 94402 88080