Others

అవినీతి అంతానికి ‘అన్నా’ ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా స్థితిగతులు, దైనందిన జీవనంలో అధికారులు, పౌరులు వ్యవహరిస్తున్న తీరుతెన్నులు పరిశీలిస్తే అవినీతి మహమ్మారి ఎంత స్వేచ్ఛగా జడలు విప్పుకొని నర్తిస్తోందో తెలుస్తుంది. మన వ్యవస్థలను అవినీతి ఎంతగా పీడించి పిప్పిచేస్తోందో అర్థమవుతుంది. పొగడ్తలు, ప్రశంసలు, వేడుకోళ్లు, అభ్యర్థనలు, కానుకల స్థాయి నుంచి లంచగొండి తనంగా అడ్డగోలు ధనార్జన నిస్సిగ్గుగా రాజ్యం చేస్తోంది. అన్ని రంగాలలో ధన ప్రలోభం అవినీతి వేరు పురుగులా మారిపోయి జాతిని నిర్జీవం చేస్తోంది. అధికారమే పరమావధిగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు నిష్పక్షపాత, నిస్వార్థ, నైతిక విధానాలకు తిలోదకాలు ఇచ్చాయి. రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకొని ప్రజాధనాన్ని దండుకోవటం నాయకులకు అలవాటైంది. వోటర్లను ప్రలోభపెట్టడం, వోట్లను కొనుగోలు చేయడంతో ఎన్నికల రంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. అధికారులు, మంత్రులు కుమ్మక్కై అవినీతికి కొమ్ముకాస్తూ పబ్బం గడుపుకొంటున్నారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఎన్నికల పండగ వచ్చినప్పుడల్లా ఓటు రేటు పెరుగుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ధన స్వామ్యం రాజకీయాన్ని శాసిస్తోంది.
గాంధీజీని జాతిపితగా గౌరవించటం మినహా నాడూ, నేడూ పార్టీల నేతలు కోట్లకు పడగెత్తి అవినీతి ఊబిలో కూరుకుపోతున్నారు. గాంధీజీని విగ్రహాలకు, తమ ఉపన్యాసాలకు పరిమితం చేసారు. 1947లో బాపూజీ, 1977లో జయప్రకాశ్ నారాయణ్, 2011 నుంచి అన్నహజారే వంటి త్యాగధనులు కొందరు ప్రభుత్వాల కళ్ళు తెరిపించటానికి శాంతియుత పోరాటాలు సాగించటం చారిత్రక వాస్తవం. శాంతి, అహింసలను బోధించిన మహాత్మా గాంధీ ఈ ప్రపంచానికి ప్రసాదించిన సత్యాగ్రహోద్యమంలో ఆఖరి ఆయుధం అయిన ఆమరణ నిరాహారదీక్షలు నేటికీ ప్రభుత్వాల తలలు వంచటానికి కొనసాగుతున్నాయి. భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యంలోని ఉపవాస నిరాహార విధానాన్ని గాంధీజీ ప్రాయశ్చిత్త ఆత్మప్రక్షాళనకు సంబంధించిన తపోదీక్షగా స్వీకరించి ఆచరించారు. సత్యాగ్రహికి శాంతియుత ప్రజాపోరాటంలో అదే ఆయుధం. స్వాతంత్య్రానంతరం కూడా ఇటీవల సంవత్సరాలలో మేధా పాట్కర్, ఐరమ్ చాను షర్మిల, పొట్టి శ్రీరాములు, పర్యావరణ శాస్తవ్రేత్త అగర్వాల్ వంటి వారు ఎందరో ఆమరణ దీక్షలు చేపట్టారు. అటువంటి ఆమరణ దీక్షలను భగ్నం చేయటానికి, వారిని నేరస్థులుగా అరెస్టు చేయడానికి పోలీసులు విధులు నిర్వహించడం ప్రభుత్వ కార్యాచరణగా సాగుతోంది.
కేంద్రానికి ముచ్చెమటలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతలు ఏ పార్టీకి, ఏ కూటమికి చెందిన వారైనా ‘జన లోక్‌పాల్’ మాట వారి గుండెలలో రైళ్లు పరుగెత్తిస్తోంది. ‘సర్కారీ లోక్‌పాల్’ కాకుండా ‘జన లోక్‌పాల్’ ద్వారా అత్యున్నత స్థాయిలో ఎంతవారయినా అతీతులు కాకుండా అవినీతికి పాల్పడితే శిక్షార్హులుగా తల వంచటం అత్యున్నత పాలనాధికారానికి తప్పించుకోలేని పిడుగుపాటుగా పరిణమిస్తోంది. అందువల్లనే లోక్‌పాల్ నియామకం అంశంలో నాటి యూపీఏ, నేటి ఎన్‌డీఏ ప్రభుత్వాలు మడత పేచీలతో ముందుకు సాగనివ్వకపోగా ఆటంకాలు, అవరోధాలు సృష్టిస్తున్నాయి. గత చరిత్ర పరిశీలిస్తే 1968 నుంచి 8సార్లు లోక్‌సభలో ప్రవేశపెట్టబడిన ఈ అవినీతి నిరోధక చట్టం ఆమోదం కాకుండా వైఫల్యం చెందింది. 2011 ఏప్రిల్ 5న గాంధేయవాది అన్నాహజారే న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సమగ్ర అవినీతి బిల్లు కోరుతూ నిరవధిక నిరాహారదీక్ష ఆరంభించారు. అవినీతిపై ఆయన ఆరంభించిన సత్యాగ్రహోద్యమం నాడు యావద్భారత దేశాన్ని కదిలించింది. ఆనాటి భారతీయ జనతాపార్టీ- ‘అన్నా హజారే మా నాయకుడు. మేం ఆయన వెన్నంటి వున్నాం’ అంటూ సమర్థించింది.
నాటి యుపిఎ ప్రభుత్వం, పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు డ్రాప్ట్ తయారుచేయటానికి జాయింట్ ప్యానల్ నియామకాల్ని ఆమోదిస్తూ గెజిట్ ప్రకటన జారీచేయటంతో అయిదు రోజుల నిరాహారదీక్ష అనంతరం అన్నా తన ఆందోళనను విరమించారు. ప్రణబ్ ముఖర్జీ చైర్మన్‌గా పి.చిదంబరం, కపిల్ సిబల్, వీరప్ప మొయిలీ, సల్మాన్ ఖుర్షీద్, పౌర సమాజ ప్రతినిధులుగా అన్నా హజారే, శాంతిభూషణ్, సంతోష్ హెగ్డే, ప్రశాంత భూషణ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖులతో 10 మంది సభ్యుల కమిటీ ఏర్పడింది. కాని ఆగస్టు 4న లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు అన్నాకు తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఢిల్లీ పోలీసులు ఆగస్టు 16న అన్నాను అరెస్టు చేశాక, జాతీయ స్థాయి ప్రజాందోళనకు ప్రభుత్వం భయపడటంతో ఆయనను విడుదల చేయక తప్పలేదు. ఢిల్లీలోని తిహార్ జైలులో ఉంటూ అన్నా విడుదలయ్యేందుకు అంగీకరించకుండా దీక్ష కొనసాగించారు. తర్వాత ఆగస్టు 19న రామలీలా మైదానంలో ఆయన చేసిన 12 రోజుల నిరాహారదీక్ష దేశమంతటా సంచలనం కలిగించింది. ఆగస్టు 21నాటికి ముంబయిలోని బాంద్రా నుంచి జుహూ వరకు డబ్బావాలాలు లక్షలాదిగా నిరసనోద్యమం నిర్వహించారు. ఆగస్టు 27న పార్లమెంటులో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో దేశం అంతా కదిలింది.
సుప్రీం కొరడా...
ఆగస్టు 28న అన్నా హజారే దీక్ష విరమించారు. ఎట్టకేలకు డిసెంబర్ 28న లోక్‌సభ మరొకసారి బిల్లు పాస్ చేసింది. బిల్లు మరింత పటిష్టంగా ఉండాలని అన్నా ముంబయిలో మళ్లీ దీక్ష చేపట్టారు. డిసెంబరు 29న లోక్‌సభలో బిల్లుపై ఓటింగ్ చేపట్టలేదు. 2012 ఆగస్టు 6న అన్నా టీమ్ విడిపోయింది. 2012 అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంలో ‘ఇండియా ఎగైనస్ట్ కరప్షన్’ టీమ్ ఏర్పడింది. నవంబర్ 24న అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ అవతరించి జాతీయ కౌన్సిల్ ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న లోక్‌పాల్ బిల్లు ఐదు శాతం ప్రభుత్వ సేవకులు, 10 శాతం రాజకీయవేత్తలు, ఎన్.జి.ఓలు, ఆలయాలు, క్లబ్‌లు, స్కూళ్లపై దృష్టిసారిస్తోందని, అవినీతిపరులకు ఉచిత న్యాయ సహాయం అందించటం తప్ప దేశంలో ఈ బిల్లు అవినీతిని ఏ విధంగానూ అరికట్టలేదని అరవింద్, మయాంక్, మనీష్, గోపాల్ తదితరులు జాతీయ స్థాయి ఉద్యమం మరింత ఉద్ధృతం చేసారు. 2013 డిసెంబర్ 17న రాజ్యసభలో, 18న లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లు గట్టెక్కింది. డిసెంబర్ 28న ఢిల్లీ అసెంబ్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ బాధ్యతలు చేపట్టారు. అన్నా ఆరోగ్యం నిరాహార దీక్షల కారణంగా దెబ్బతింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆ బిల్లును జోక్‌పాల్‌గా విమర్శించింది.
17నెలలు అన్నాహజారే, అరవింద్ కేజ్రీవాల్ సంయుక్త ఆందోళన విద్యాధిక పౌర సమాజాన్ని ఆకర్షించింది. గాంధీజీ, జయప్రకాశ్ నారాయణ్‌ల జీవితాదర్శంతో, అన్నా రాజకీయ అధికారం పట్ల వైముఖ్యంతో ఆమ్‌ఆద్మీ పార్టీకి దూరంగా వున్నారు. 2013 జనవరి 1న యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్‌పాల్, లోకాయుక్త బిల్లులకు రాష్టప్రతి ఆమోదముద్ర లభించింది. 2014 ఫిబ్రవరి 14న తమ పార్టీ ఆశయమైన జనలోక్‌పాల్ బిల్లు ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టలేనందుకు నిరసనగా అరవింద్ రాజీనామా ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్రంలో రాష్టప్రతి పాలన తరువాత, 2015 ఫిబ్రవరి 10న జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ ఘన విజయం సాధించారు. అవినీతిపై ఆమ్ ఆద్మీ పార్టీ ‘చీపురు’ ప్రయోగించిన అస్త్రం అది.
ప్రస్తుతం అధికారంలో వున్న ఎన్.డి.ఎ. ప్రభుత్వం లోక్‌పాల్ ఊసెత్తలేదు. లోక్‌పాల్ ఛైర్మన్, సభ్యుల జాబితా యివ్వాలని సుప్రీం ఆదేశం చేసింది. మళ్ళీ మహాత్ముని వర్ధంతి సందర్భం వచ్చింది. ఎనభై ఏళ్ళ అన్నాహజారే ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఇదీ మన భారతం.

-జయసూర్య 94406 64630