Others

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకులు ఏమనుకుందురో యను భీతిచే, డంబముకొఱకు కర్మకలాపములను నిర్వహించువాడుగాని, దానధర్మములను జేయువాడు గాని పారమార్థికుడనదగడు. నిశ్శబ్దముగను ఏకాంతముగను ఆచరింపబడు ధర్మమే ధర్మము. అదియే పరమార్థము. డంబము, ఆడంబరము సాగుచోట నున్నదంతయు బూటకమే.
ఒండొరులతో సాధకుల చుట్టఱికము
254. పారమార్థికులగువారు సమస్త సంఘాచారములకును అతీతమగు జాతిలోనివారు, అదియే వారికి స్వీయమైన జాతి.
255. అనుదినము తన భర్తతో జరుపు సంభాషణలను ముచ్చటలను స్ర్తి అందఱితోడను జెప్పుటకు సిగ్గుపడును. ఆ రహస్యములనామె యెవ్వరికిని తెలుపదు, తెలుపవలయుననియు కోరదు. కర్మముచాలక అవి బయటపడెనా, ఎంతయో ఆవేదన పడును. ఐనను తన ప్రాణసఖితో మాత్రము దాపరికము ఇసుమంతయు లేక సర్వమును జెప్పును; చెప్పుటకై ఆరాటపడును. ప్రాణసఖితో జెప్పుటామెకు ఆనందదాయకము. అటులనే భగవద్భక్తుడు దైవసన్నిధిని తాననుభవించిన బ్రహ్మానందమును గూర్చి నిజమగు భక్తునికిదప్ప మఱెవ్వరికిని దెలుపనిచ్చగింపడు; మఱియు అట్టి భక్తునికి తన యనుభవములను దెలుపుటకై ఆత్రపడును, అయ్యది సమకూడెనా, బ్రహ్మానందపడును.
256. ఆలమందలోనికి అన్యజంతు వేదియైనను జొరబడినయెడల ఆవులన్నియు గలిసి దానిని కుమ్మి తఱిమివేయును. కాని మఱియొక ఆవే ప్రవేశించెనా, ఆవులన్నియు దానియెడ నెయ్యము జూపి యొకదానినొకటి నాకుకొనును. అటులనే భక్తుడు మఱియొకనిని గలిసికొనునప్పుడు ఇరువురును మహానందమునుబొంది యెడబాటున కోర్వకుందురు. కాని నాస్తికుడు తమ సంఘములోనికి వచ్చెనా, పూనికతో వానిని సాగనంపుదురు.
257. భగవద్భక్తుడు ఏకాంత వాసమన నిష్టపడకుండుటేల? గంజాయి త్రాగువాడు తోడివారు లేకుండ పొగత్రాగి యానందింపజాలడు. భక్తుడు భాగవత సాంగత్యమునకు వెలియై యెచ్చటనో భగవానుని పావన నామకీర్తనముచేసి యానందింపజాలడు.
సాంసారికుడగు సాధకుని యాదర్శములు
258. తాంత్రికుడు మృతుని ఆత్మయొక్క సాయమున దేవతనావాహన చేయునపుడు క్రొత్త శవముమీద గూర్చుండి దావును అన్నమును కల్లును ఉంచును. ఆవాహన సమయమున ఆ శవము తాత్కాలికముగా ప్రాణవంతమై ఎప్పుడైనను నోరు తెఱచిన యెడల, నిర్భయుడైన ఆ సాధకుడు పీనుగునావహించిన భూతమును తృప్తిపఱుచుటకై కల్లును దాని నోట బోసి అన్నమును కూరును. ఆతడటుల చేయని యెడల ఆ భూతము వాని ఆవాహనను భంగపఱుచును. అందువలన దేవత ప్రత్యక్షముకాదు. అట్లే ఈ సంసారమను శవముయొక్క ఎడదపై నివసించుచు బ్రహ్మానందమును బొందగోరెదవేని ఐహిక విషయముల గందరగోళము నణచుటకై ఆవశ్యకమగు వస్తువులను ముందుగ సంపాదించి పెట్టుకొనుము; లేకున్న నీ భక్తిసాధనల కడ్డుతగిలి సంసార తాపత్రయము నిన్ను వేధించును.
259. సంసార యాత్రకు ధనము ఆవశ్యకమనుమాట నిజమే; కాని సిరిసంపదలనుగూర్చి కాని, ఇతరైహిక లాభములను గూర్చికాని అదేపనిగా చింతింపకుము. ప్రాప్తమగు దానితో తృప్తిపడుట శ్రేష్ఠము. ధనము కూడబెట్టవలయునని ఆందోళన పడకుము. ఎవరు తనుమనఃప్రాణములను భగవానునకర్పింతురో, ఎవరు భగవద్భక్తులై భగవంతునే శరణు పొందుదురో, అట్టివారు తుచ్ఛమగు నైహిక విషయములను గూర్చి చింతింపజాలరు. అటువంటివారి వ్యయము ఆదాయముననుసరించి సాగుచుండును. ఒకవైపున చేతిలోనికి ధనము వచ్చుచుండ, మఱియొక వైపున వ్యయమగుచుండును.
260. ఒక గృహస్థుడు: అయ్యా! ఇప్పటికంటె ఎక్కువ ధనము సంపాదించుటకునే బ్రయత్నింపవచ్చునా?
శ్రీ గురుదేవుడు: మంచిది, వివేకముతో దానిని నీ కుటుంబ యాత్రకు వినియోగించుకొనుట నీ అభిప్రాయమైన పక్షమున ప్రయత్నింపుము. కాని న్యాయమార్గమున ఆర్జింపవలయునుజుమీ. ఏలన నీ ఆశయము భగవంతుని సేవ కాని ధనార్జన కాదు. భగవానుని సేవకై వినియోగింపబడు ధనము నిరాక్షేపణీయము.
శిష్యుడు: అయ్యా! కుటుంబ విషయమున నా బాధ్యత యెంతవఱకు?శ్రీగురుదేవుడు: కుటుంబ పోషణ తనంతటది జరుగుటకు వలయు సౌకర్యమును నీవు కల్పింపకుండునంతవఱకు. కాని నీ బిడ్డలు తమ్ము తాము పోషించుకొను స్థితికి వచ్చినంతనే వారి విషయమై ఇక నీకెట్టి బాధ్యతయు నుండదు.
261. కొందఱు గృహస్థ శిష్యులకు శ్రీగురుదేవుడిట్లుపదేశించెను; ‘‘ఇంటిని అన్న వస్తమ్రులను సంపాదించుకొనుటకును, దైవము నారాధించుటకును, సాధువులను, భక్తులను సేవించుటకును ధనము కేవలము సాధనభూతమని భావింపుడు.

ఇంకావుంది..

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి