Others

రేడియోకి సాటి ఏది..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు ఎన్నో పత్రికలున్నా, ఆ తర్వాత టీవీ, ఇటీవలి కాలంలో వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి పలు సామాజిక మాధ్యమాలు పుట్టుకొచ్చినా- ఇప్పటికీ రేడియోకి వనె్న తగ్గలేదు. ఎన్నో ప్రత్యేకతలతో అసలు సిసలు మాధ్యమంగా దశాబ్దాలుగా రేడియో సమాచార రంగంలో సాటిలేని సేవలందిస్తోంది. ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వినోదాన్ని, విజ్ఞానాన్ని మేళవించి వినూత్న కార్యక్రమాలతో ప్రజ్వరిల్లుతోంది. సంస్కృతి, సంప్రదాయాలను విస్మరించకుండా శ్రోతలను అలరించే కార్యక్రమాలను వినిపించడమే ధ్యేయంగా రేడియో అన్ని వర్గాల వారినీ అలరిస్తోంది.
అచ్చు యంత్రం, టెలిగ్రాఫ్, టెలిఫోన్, టెలివిజన్, కంప్యూటర్, మొబైల్ ఇలా వరుసపెట్టి ఎన్ని ఆవిష్కరణలు వచ్చినా రేడియోకు ఉన్న ఆదరణ వేరు. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా- రేడియోకి నేటి ఆధునిక కాలంలో ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఈ తరానికి రేడియోతో అనుబంధం ఏంటి? అసలు రేడియో ఎవరైనా వింటున్నారా? అని అనుకునే వారికి తెలియని కొన్ని విషయాలను చర్చించవలసిన సందర్భం ఇది.
మిగతా సమాచార సాధనాలతో పోల్చిచూస్తే రేడియో అత్యంత సరళమైంది. చదువుకున్నవారే పత్రికలు చదవగలరు. రేడియోకు ఆ పరిమితి లేదు. చదవడం రాకున్నా వినగలిగిన వారూ, భాష అర్థమయినవారూ రేడియో ప్రసారాలను అర్థం చేసుకోగలరు. పెద్దగా ఖర్చు ఉండదు. భారీ పరికరాలతో పనిలేదు. శ్రమా కాదు. అదే వార్తా పత్రికలు ప్రచురణ కావాలంటే కాగితం కావాలి. అచ్చుపడిన తర్వాత పంపిణీ అనివార్యం. దూరప్రాంతాలకు చేరాలంటే ఎంతో సమయం పడుతుంది కూడా. టెలివిజన్‌లో ఒక సంఘటననో, ఒక విషయాన్నో వీక్షకులకు చూపాలంటే సాధన సంపత్తి అవసరం. దృశ్యం, శ్రవణంతో కలవడానికి పంపిణీ (ట్రాన్స్‌మిషన్) కీలకం. కెమెరాలు, కంప్యూటర్ల వంటి పెద్దపెద్ద పరికరాలు కావాలి. రేడియోకు ఇంత అవసరం లేదు. రేడియోలో అప్పటికప్పుడు వార్తాప్రసారం జరుగుతుంది. దేశ సరిహద్దులు కూడా రేడియోని ఆపలేవు. ఒకసారి రేడియో సెట్టు కొంటే బ్యాటరీలుంటే చాలు. రవిగాంచని చోటున్.. కవి గాంచున్ అన్న మాటను రేడియోకి అన్వయించుకుంటే.. ‘‘ఏమీ వినిపించని చోటున్.. రేడియో వినిపించున్..’’అని చెప్పడం అతిశయోక్తికాదు. పత్రికకు యజమాని ఖర్చుపెట్టాలి. పాఠకుడు నిత్యమూ చెల్లించాలి. ఇక టీవీల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఒక్కో ఛానల్‌కు ఒక్కో రేటునుపెట్టి.. ప్రేక్షకుల జేబులకు చిల్లుపెట్టేందుకు టీవీ చానళ్లు రంగం సిద్ధం చేశాయి. అదే రేడియో అయితే కాలాన్ని, దూరాన్ని, వ్యయభారాన్ని జయించడమేకాదు చౌక అయిన మాధ్యమంగా కూడా చెరగని ముద్ర వేసింది! వార్తలలో, ప్రసంగాలలో, పరిచయ కార్యక్రమాలలో క్రమశిక్షణ కలిగిన అర్థవంతమైన తెలుగుకు ‘ఆకాశవాణి’లో కొదవలేదు. న్యూస్ చానళ్లలో యాంకర్లు, ఎఫ్‌ఎం రేడియో జాకీల రంగప్రవేశంతో ఈ అవసరం బాగా పెరిగింది. చాలా భాషలుగల మన దేశంలో ఇంగ్లీషు ఉచ్చారణ ప్రాంతానికో రకం. ఏది సరైనది అనే విషయం ప్రాధాన్యం కాకున్నా, ఏది అందరికీ అర్థవంతం, ఉపయోగం అనేది మాత్రం ముఖ్యం.
రేడియో అవతరించి దశాబ్దాలు దాటాక గానీ రేడియో దినోత్సవం జరుపుకోవడం ప్రారంభం కాలేదు. టెలివిజన్, ఎఫ్‌ఎం రేడియో(ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్) వచ్చిన తర్వాత 2012లో ప్రపంచ రేడియో ఉత్సవం జరుపుకోవడం మొదలైంది. ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) తన 36వ సాధారణ సమావేశంలో 2011 నవంబర్ 3న రేడియో దినోత్సవం జరుపుకోవాలని మొదట నిర్ణయించింది. అంతకుముందు 2010 సెప్టెంబర్ 20నుంచి చేసిన ప్రయత్నాలు చివరికి ఫలవంతమైనాయి. ఫిబ్రవరి 13నే ఎందుకు రేడియోడే జరుపుకుంటున్నామనే సందేహం కలగవచ్చు. 1946లో యునైటెడ్ నేషన్స్ రేడియో మొదలైన ఫిబ్రవరి 13వ తేదీని ప్రపంచ రేడియో దినోత్సవంగా నిర్ణయించారు. తొలి ఉత్సవం 2012లో జరిగింది. 2013నుంచి ప్రపంచ రేడియో దినోత్సవం ప్రాచుర్యంలోకి వచ్చింది. 2014 నుంచి ఏటా ఒక ప్రత్యేక ఇతివృత్తంతో ఈ దినోత్సవం జరపడం ఆనవాయితీగా మారింది. ఈ దశలోనే అనేక కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి. మరింత సమాచారం కోసం తీతీతీ.త్యీజ్ఘూజూజ్యజ్ఘూక.్య వెభ్‌సైట్‌లో శోధించవచ్చు.
భారతదేశం వంటి సమాజానికి రేడియో అవసరం ఎంతగానో ఉంది. గిరిజన గ్రామాలు, గూడేలు, నేటికీ రహదారులు లేని జనావాసాలు ఎన్నో. లిపి లేని భాషలు, కరెంటు లేని గ్రామాలు ఎనె్నన్నో. ఇటువంటి ప్రత్యేక పరిస్థితులున్న చోట రేడియో ఒక్కటే తగిన సమాచార సాధనం. ప్రజల సమయం వృథా కాకుండా కావల్సినంత వినోదం, విజ్ఞానం అందించే అరుదైన నేస్తం. వందలాది టీవీ చానళ్లున్నా, వందలాది పత్రికలున్నా... నేటికీ తుపానులు, వరదలు, పిడుగులు, భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సంబంధిత ప్రాంతాల్లో ప్రజలకు వాతావరణ పరిస్థితులను, ప్రభుత్వాలకు ప్రజల స్థితిగతులను చేరవేసి త్వరగా విలయాల నుంచి కాపాడుకోవడానికి రేడియోనే మూలాధారం. ప్రాణ, ఆస్తినష్టాలను నివారించేందుకు ఉన్న ఏకైక ద్వారం. ఉదాహరణకు హుద్‌హుద్, తిత్లీ, పెథాయ్ వంటి తుపానులు సంభవించి.. విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో పూర్తిగా స్తంభించినప్పుడు.. రేడియోద్వారానే వాతావరణం గురించి తెలుసుకున్నామని విశాఖ, శ్రీకాకుళం ప్రజలు రేడియో సేవలను కొనియాడారు. ఎందుకంటే వర్షానికి కేబుల్ వ్యవస్థ నాశనమైనపుడు, దినపత్రికలు చేరవేసే మార్గం కరవైనప్పుడు... వారికి అండగాఉన్న ఏకైక మాధ్యమం రేడియో మాత్రమే. ఇక యుద్ధాల్లో పాల్గొనే జవానులు, సరిహద్దుల్లో పహారాకాసే సైన్యానికి ఇప్పటికీ రేడియో మాత్రమే వారిని చేరే ఏకైక సాధనం. ప్రపంచవ్యాప్తంగా కాలపరీక్షకు నిలబడి స్థిరపడిన ప్రసార ప్రణాళిక రేడియో సొంతం. అందుకే ఎంత సులభతరమైన, సౌకర్యవంతమైన మాధ్యమాలొచ్చినా రేడియోకు లేదు అంతం.
విద్య, వినోదం, విజ్ఞానం, సమాచారాలను సమపాళ్లల్లో మేళవించిన వినసొంపైన కార్యక్రమాలు రేడియో ప్రత్యేకం. వార్తాప్రసారం, నాటకం, శాస్ర్తియ సంగీతం, జానపద సంగీతం, రైతాంగం, విద్యార్థిలోకం, గ్రామీణ మహిళలు, పిల్లలు, క్రీడల ఆధారిత కార్యక్రమాలు, శ్రోతలు స్వయంగా పాల్గొనే మనోరంజని, జనవాణి వంటి కార్యక్రమాలు ఏ ఇతర మాధ్యమాల్లోనూ కనపడవు. ఇవి కేవలం రేడియోలోనే నేటికీ వినపడతాయి. ఇంతటి వైవిధ్యానికి మరే ఇతర మాధ్యమాల్లో చోటులేదు. గంటపాటు వచ్చే టీవీ వార్తలకన్నా.. పది నిమిషాల్లో ప్రపంచంలోని విషయాలన్నీ క్లుప్తంగా, క్షుణ్ణంగా చెప్పే అవకాశం ‘ఆకాశవాణి’ వార్తల్లో ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడే ఉద్యోగార్థులు కూడా స్పష్టంగా సూటిగా ప్రభుత్వ విధానాలను తెలుసుకునేందుకు, అవసరమైన విషయాలనే వార్తలుగా చెప్పే రేడియో వినే సమాచారం తెలుసుకుంటుంటారు.
రేడియోకు కాలం చెల్లింది. రేడియోను ఎవరు వింటున్నారు? అసలు రేడియో ఇంకా ఉందా? అని వాదించేవారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. దేశ జనాభా పెరిగిందన్నది ఎంత నిజమో.. రేడియో వినే శ్రోతలు పెరిగారన్నది అంతే నిజం. ఉదాహరణకి మన తాతల సమయంలో లక్ష మంది రేడియో వినుంటారనుకుందాం. నాన్న తరంలో, నవతరంలో ఆ లక్ష కాకుండా.. ఇంకా లక్షలాది మంది వింటున్నారు. అంటే రేడియో వినేవారు తగ్గినట్టా? పెరిగినట్టా? రేడియో మనుగడ ఉన్నట్టా? లేనట్టా? రేడియోనే డీటీహెచ్, ఎఫ్‌ఎం కేంద్రాలను నెలకొల్పి విస్తృతం చేస్తూ రిలే ప్రసారాలను ఇస్తూ శ్రోతల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఆదరణ లేదని, ఆదాయం రావడం లేదని చెప్పే సాకులు అర్థరహిత, అవగాహన లేని వ్యాఖ్యలే తప్ప నిజాలు కావు. ఇలా తరచి చూసేకొద్దీ తారసపడే ప్రత్యేకతలు ఎన్నో? బలాలను ఎంత స్పష్టంగా గుర్తించడం ఎంత అవసరమో.. లోపాలను మరింత గమనించి వ్యూహాలు సిద్ధం చేసుకోవడం కూడా మనుగడకు అంతే ముఖ్యం. చార్లెస్ డార్విన్ చెప్పినట్లు పోటీలో సమర్థులైన వారే మిగులుతారని మనకు తెలుసు. సూటిగా మనసును తాకే.. మస్తిష్కాన్ని మేలుకొలిపే నిత్యనూతన సమాచార మాధ్యమం రేడియో. అందువల్లనే రేడియోకు తరాలు మారినా ఆదరణ తగ్గలేదు. రేడియో అంటే అందరికీ మక్కువ. అంతేకాదు, పుస్తకాన్ని మించిన భావన శక్తిగల సాధనం కూడా రేడియో ఒక్కటే. తక్కువే శ్రమ కలిగిస్తూనే... ఎక్కువ సంతోషాన్ని, సమాచారాన్ని అందించేది రేడియో మాత్రమే! అందుకే రేడియో దినోత్సవం అవసరం!!
(నేడు ప్రపంచ రేడియో దినోత్సవం)

-మంచిపగడం దేవదాస్ 99663 22423