Others

మూగనోము (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత చిత్రాలలో ఓ అద్భుత సినీకావ్యం -మూగనోము. సంగీత సాహిత్యాలు, హాస్య, కరుణ రసాలు మిళితమైన ఒక విశిష్టమైన దృశ్యకావ్యం. ఆనాటి సామాజిక సమస్య అయిన ధనికుల పేదలమధ్య పెరుగుతున్న అగాధం, రగులుతున్న ద్వేషం కళ్లకు కట్టేలా చిత్రీకరించాడు దర్శకుడు డి యోగానంద్. సంగీత సాహిత్యాలతోపాటుగా కథ కథనం చక్కగా సాగి చివరికి సుఖాంతమయ్యే -ప్రాచీన నాటక లక్షణాన్ని పుణికిపుచ్చుకున్న ఈ చిత్రం ఈనాటికీ జనరంజకం.
ఏయన్నాఆర్, జమున, యస్వీ రంగారావు ప్రధాన పాతల్లో నటించగా ఏవీయం సంస్థ 1969లో నిర్మించింది. కథ మొత్తం గోపి అనే పిల్లాడి చుట్టూ తిరగటంతో ప్రతి సన్నివేశంలో భావోద్వేగం కనిపిస్తుంది. దివాన్ బహద్దూర్ రాజగోపాలరావు జమిలో పని చేసే రైతు సోమయ్య కూతురు గౌరి. ఇంగ్లండ్‌లో చదివి ఇండియాకు వస్తూ -గౌరిని రైలులో కలుస్తాడు వేణు. తానొక ఎలక్ట్రిక్ ఉద్యోగిగా పరిచయం చేసుకుంటాడు. తరువాత అతను జమీందారు కొడుకని తెలియడంతో దూరం పెడుతుంది గౌరి. కాని, మనసారా ప్రేమించానని చెప్పి గుళ్లో తాళికట్టి భార్యను చేసుకుంటాడు వేణు. విషయం తెలుసుకున్న జమీందారు, కొడుకు సింగపూర్ వెళ్లినపుడు గర్భవతి అయిన గౌరిని ఊరొదిలి వెళ్లమని, వేణుకు ఈ విషయం చెప్పొద్దని ప్రమాణం తీసుకుంటాడు. అప్పటినుంచి ఆమె మూగనోము పడుతుంది. చివరికి వారికి పుట్టిన బిడ్డ ఎన్ని కష్టాలు పడింది? చివరికి అగ్నిపరీక్ష లాంటి జీవితాన్ని ఎలా నెగ్గింది అనే అంశంతో ఈ సినిమా అందరికీ ఆనందాన్నిస్తుంది. ‘నిజమైనా కలయైనా నిరాశలలో ఒకటేలే.. పగలైనా రేయి అయినా ఎడారిలో ఒకటేలే’ అన్న చరణాలు హృదయాన్ని పిండేస్తాయి. అనాథగా పెరుగుతున్న జమిందారు మనవడు రాబోయే తరాలకు ఆదర్శ మానవుడు అని చెప్పడం దర్శకుడి ఉద్దేశం చాలా గొప్పగా వుంటుంది. పెద్దలను, పిల్లలను ఆకట్టుకున్న ఓ కళాత్మక సాంఘిక చిత్రంగా మూగనోము ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచి ఉంటుంది.

-సుందర నారాయణ, కనిగిరి