Others

ఆంగ్ల ‘జనగణమన’ గీతిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది 1919 ఫిబ్రవరి నెల. బ్రిటిష్ ప్రభుత్వ పాలనా ధోరణులపై యావద్భారతంలో నిరసన జ్వాలలు కమ్మకొంటున్న రోజులవి. మాతృదేశ దాస్య శృంఖలాలను ఛేదించే విప్లవ చైతన్యంతో అఖండ భారతావనిని దేశభక్తి ప్రపూరితంగా సంఘటితం చేసే చారిత్రక అవసరాన్ని జాతి నేతలు గుర్తించిన సమయం అది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలైన కింగ్, క్వీన్‌లను ‘గాడ్ సేవ్ ది కింగ్’, ‘గాడ్ సేవ్ ది క్వీన్’ అంటూ ఆంగ్లంలో అధికారయుతంగా కీర్తించే నాటి రోజులలో జాతిని ఏకోన్ముఖం చేయగల పతాకం, జాతీయ గేయం ఆవశ్యకతలను నాటి మేధావి వర్గం స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ఆహ్వానిస్తోంది. ఆ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో ఒక చారిత్రాత్మక సన్నివేశం రూపుదిద్దుకొంది. బెంగళూరు నుంచి రైలు ప్రయాణంలో నోబెల్ విజేత, విశ్వకవి రవీంద్రనాథ టాగోర్ ఆంధ్ర ప్రాంతంలోని మదనపల్లెలో అడుగుపెట్టడం ఒక అపూర్వ ఘటనను ఆవిష్కరించింది. ఆ పర్యటనలో అలసి సొలసిన రవీంద్రుడు- మదనపల్లెలోని థియోసోఫికల్ కాలేజీలో ఉండడం చారిత్రక ఘట్టం సృష్టించింది.
ప్రముఖ భారతీయ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జన్మస్థలం అయిన మదనపల్లెలో ప్రఖ్యాత జాతీయవాది, దివ్యజ్ఞాన సమాజ తత్త్వశీలి డా.అనిబిసెంట్ 1915లో కళాశాలను స్థాపించారు. ఆ విద్యాలయానికి ప్రముఖ ఆంగ్లకవి డా.జేమ్స్ హెన్రీ కజిన్స్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తుండటంతో రవీంద్రుడు అక్కడకు వెళ్ళటం తటస్థించింది. ప్రిన్సిపల్ కజిన్స్ భార్య మార్గరెట్, ‘రాయల్ యూనివర్సిటీ ఆఫ్ డబ్లిన్’లో మ్యూజిక్‌లో పట్ట్భద్రత పొందిన సంగీతవేత్త. ఆ విద్యాధికులైన దంపతులు రవీంద్ర కవీంద్రుని రాకను అపరిమిత హర్షామోదాలతో స్వాగతించి అతిథిగా గౌరవించారు. ఆ విద్యాలయ ప్రాంగణంలో ప్రతి బుధవారం రాత్రి వినోద విజ్ఞానాత్మకంగా పాటలు పాడే సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తారు. ఆరోజు అక్కడ వున్న రవీంద్ర కవి తనంతటతాను ఆలపించిన గేయం శ్రోతలను ముగ్ధుల్ని చేసింది. అంతవరకు జాతీయోద్యమ గేయాలతో ఏమాత్రం పరిచయం లేని శ్రోతలకు, బాల బాలికలకు ఆ బెంగాలీ గేయంలోని పల్లవి హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రదేశాల పేర్లు, పర్వతాలు, నదులు, భారత భౌగోళిక ప్రకృతి సౌందర్యం, దేశభక్తి కన్నులకు కట్టి వీనుల విందు అయింది. రవీంద్రుని స్వరం నుంచి వెలువడిన ఆ గేయం మంత్రముగ్ధులై వినటం ఆపి ‘జయహే జయ జయ జయ జయహే’ అంటూ అందరు స్వరం కలిపారు.
మర్నాడు సంగీతజ్ఞురాలైన మార్గరేట్, తన విద్యార్థుల సహాయంతో, ఆ పాటకు అద్భుతంగా రవీంద్రుని సమక్షంలో స్వరకల్పన అందించారు. అప్పటివరకు రవీంద్రుని మాతృభాష బెంగాలీలో వున్న జనగణమన ‘మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’గా అతనిచేత ఆంగ్లంలోకి అనువదించబడటం, దానికి ఇక్కడ అద్భుత బాణీతో సంగీతం సమకూర్చబడటం తెలుగు ప్రజలకు నేటికీ చిరస్మరణీయమైన వేడుక. అనువాద ప్రతి ఇప్పటికీ శిథిలావస్థలో అక్కడి కళాశాలలో పదిలపరచబడి వుంది. రవీంద్రుడి స్వదస్తూరీతో వున్న ఆ అమూల్య నిధి పత్రాన్ని మదనపల్లి బీసెంట్ థియొసొఫికల్ కళాశాల ప్రస్తుత యాజమాన్యం వారు ఆరాధ్యనీయంగా సంభావిస్తున్నారు. రవీంద్రుడు ఆ సందర్భంలో ఐదు రోజులు మదనపల్లిలో ఉన్నారట.
1950 జనవరిలో భారత రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతంగా ప్రకటించిన ‘జనగణమన’ను ప్రప్రథమంగా 1911 డిసెంబర్ 27న భారత జాతీయ కాంగ్రెస్ 26వ జాతీయ మహాసభలో రవీంద్రుని మేనకోడలు సరళాదేవి చౌధురాణి విద్యార్థినులతో కలిసి ఆలపించారు. 1912 జనవరిలో టాగోర్ ఎడిటర్‌గా వున్న బ్రహ్మసమాజ్ పత్రిక తత్త్వబోధినిలో ఆ గేయం ‘్భరత విధాత’ శీర్షికన వెలుగుచూసింది. తరువాత రవీంద్రుని ‘జొరసాలకో’ నివాస ఉత్సవ వేడుకలలో ఆలపించారు. 1917లో డా.అనిబిసెంట్ అధ్యక్షతన రవీంద్రుని సమక్షంలో మహారాజా ఆఫ్ సత్తోర్ వాద్య సంగీత సారధ్యంతో సరళాదేవి గానం చేశారు. తొలుత బెంగాలీలో ఉన్న ఆ గేయాన్ని ‘మోర్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’గా ఆంగ్లంలోకి అనువదించబడింది. ఒక మహత్తర చారిత్రక సువర్ణఘట్ట శత జయంతి సందర్భం ఇది.

-జయసూర్య