Others

మావోయిస్టుల మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడిపై దేశమంతటా ప్రజాగ్రహం పెల్లుబికింది. పెద్దఎత్తున పేలుడు పదార్థాలను నింపిన వాహనంతో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొట్టగా 40కి పైగా మరణించడం పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో మరెందరో జవాన్లు గాయపడ్డారు. ఈ దుశ్చర్యకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని వ్యక్తంచేశారు. జవాన్లను బలితీసుకున్న ఉగ్రముఠాకు గుణపాఠం చెప్పాలని యువత ఊగిపోయింది. ముష్కర మూకలను అణచివేయాలని ముక్తకంఠంతో నినదించింది. ‘రక్తం మరుగుతోంది’ అని ప్రధాని మోదీ అన్నారంటే ఆ ఘటన తీవ్రత ఎలాంటిదో తేటతెల్లమవుతోంది. అమరులైన జవాన్లకు ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమర జవాను శవపేటికను మోశారు. పుల్వామా దాడికి ప్రతీకార చర్య తప్పదని ప్రభుత్వం ప్రకటించింది. భద్రతా బలగాలకు ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు స్వయంగా ప్రధాని పేర్కొన్నారు. ముష్కర మూకలు భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్ని వర్గాలు అంటున్నాయి. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఎస్) సమావేశమైంది. మళ్లీ సర్జికల్ దాడులు జరగవచ్చని చాలామంది ఊహిస్తున్నారు. ఈసారి మరింత భీకరంగా ఆ దాడులు ఉండగలవని భావిస్తున్నారు. మొత్తం మీద మతోన్మాద ఉగ్రవాదుల దాడి దేశాన్ని కుదిపేసింది.
మరి మావోయిస్టు దాడుల మాటేమిటి? అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తుంది. 2010 సంవత్సరంలో మావోయిస్టులు ఒకే దాడిలో 76 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను బలిగొన్నారు. మరో సందర్భంలో 35 మందిని, ఇంకో సందర్భంలో 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఉగ్రవాదులు కశ్మీర్‌లో దాడులు చేస్తూ పదుల సంఖ్యలో జవాన్లను బలితీసుకుంటుంటే వామపక్ష తీవ్రవాదులైన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో అంతకన్నా పెద్దసంఖ్యలో జవాన్లను పొట్టనపెట్టుకుంటున్నారు. అంతేగాక అమాయక ఆదివాసీలను ఇన్‌ఫార్మర్ల పేర కాల్చి చంపుతున్నారు. విచిత్రమేమిటంటే కశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యకు పెల్లుబికినంత ఆగ్రహం, ఆక్రోశం మావోయిస్టులు 76 మంది జవాన్లను, పదుల సంఖ్యలో పోలీసులను బలిగొన్నప్పుడు కనిపించలేదు.
జమ్మూ-కశ్మీర్ వేర్పాటువాదులకు, మావోయిస్టులకు మధ్య సఖ్యత ఉంది. ఆదాన ప్రదానాలున్నాయి. దేశాన్ని అస్థిరపరిచి తమ ‘లక్ష్యం’ నెరవేర్చుకోవాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. పైకి వీరు వేర్వేరుగా కనిపించినా లోలోపల ఒకటేనన్న విషయం చాలా సందర్భాల్లో తేటతెల్లమైంది. మావోయిస్టుల అనుబంధ సంస్థలు, వారి మేధావులు, పౌరహక్కుల పేర ఉద్యమించే నాయకులు వేర్పాటువాదులతో అనేక సందర్భాల్లో బహిరంగంగా చర్చలు జరిపారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణతో ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరుడు గౌతమ్ నవలఖా పలు సందర్భాల్లో ఇరుపక్షాల మధ్య వారధిగా పనిచేశారు. ఇంకా అనేకమంది వివిధ స్థాయిల్లో పనిచేస్తూ ఉన్నారు. అటు ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటువాదులతో, ఇటు జమ్మూ కశ్మీర్ ఉగ్రవాదులతో మావోయిస్టులు సత్సంబంధాలు నెలకొల్పుకుని సహాయ సహకారాలు అందిస్తున్నారు, అందుకుంటున్నారు. ఇది జగమెరిగిన సత్యం.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, సుక్మా, బీజాపూర్ తదితర జిల్లాల్లో భారీ స్థావరాలు ఏర్పాటు చేసుకుని గెరిల్లాలకు ఆయుధ శిక్షణ ఇస్తూ గెరిల్లా సైన్యాన్ని రూపొందిస్తున్నారు. గెరాల్లా దళాల్లోని సైనికులు కవాతు చేసి ఢిల్లీలోని ఎర్రకోటను స్వాధీనం చేసుకుంటామని ఘంటాపథంగా చెబుతూ హింసకు పాల్పడుతున్నారు. శత్రువుకు శత్రువు తనకు మిత్రుడన్న చందంగా మావోయిస్టులు దేశంలోని అనేక అరాచక శక్తులతో, ఉగ్రవాద సంస్థలతో, వేర్పాటువాదులతో జతకడుతున్నారు. ఓ సమాఖ్యగా ఏర్పడాలనే ఆలోచనలో వీరు తలమునకలై ఉన్నారు. ఇతరులను బలపరుస్తూ తాము బలపడాలన్న సూత్రంతో సాయుధంగా కదం తొక్కుతున్నారు. ఇది ప్రమాదకరమైన పోకడ. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యంతో కదులుతున్న మావోయిస్టుల దుశ్చర్యలపై కూడా ప్రజాగ్రహం ఇదే స్థాయిలో కనిపించినప్పుడే సమాజంలో అలాంటి భావనల వ్యాప్తికి అడ్డుకట్టపడుతుంది. మేధావుల ముసుగులో, కవులు-కళాకారుల పేర, పౌర హక్కుల నెపంతో మావోయిస్టులకు నైతిక మద్దతు లభిస్తోంది. అలా మద్దతు ఇస్తున్న క్రమంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చివరికి ప్రధాని మోదీని హత్యచేయాలన్న సూచన -సలహా ఇచ్చే దశకు చేరుకున్న కొందరు మేధావులిప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. కొందరు తెలివిగా తప్పించుకుంటున్నారు.
పుల్వామా సంఘటన ఎంత నిందనీయమో, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన - జరుగుతున్న సంఘటనలు సైతం అంతే నిందనీయం! అలాంటి సందర్భాల్లోనూ ప్రజాగ్రహం కనిపించాలి. వారి స్వరం వినిపించాలి. మావోయిస్టు పార్టీలో అరాచకం కొనసాగుతోందని ఆ పార్టీ కేంద్ర కమిటి సభ్యులే బహిరంగంగా విమర్శిస్తున్నారంటే పరిస్థితి ఏ మేరకు దిగజారిందో అర్థమవుతోంది. భేషజానికిపోయి కొత్తకొత్త పద్ధతుల్లో దాడులు జరపడానికి మావోలు సిద్ధమవుతున్నారని వినికిడి. బీహార్-ఝార్ఖండ్ రాష్ట్రాల్లో డబ్బులు వసూలు చేయడమే మావోల కార్యక్రమంగా మారిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. విలువలు, సిద్ధాంతాలు అన్నీ గాలికి కొట్టుకుపోయాయి. తిరోగమన వాదంతో ఉద్యమించేవారిని గట్టిగానే వ్యతిరేకించాలి.
‘ఎస్టీమ్’ ప్రపంచమిది!
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌ను కలిపి ‘స్టెమ్’గా పిలుస్తున్నారు. వీటికి ఆర్ట్స్‌ను జతపరిచి ‘స్టీమ్’గా పిలుస్తున్నారు. అంతటితో సరిపోదు, ఎథిక్స్‌ను సైతం జతకలిపి ‘ఎస్టీమ్’గా సంబోధిస్తున్నారు. ఇలా సృజనాత్మకత (ఆర్ట్స్), నైతిక విలువలు (ఎథిక్స్) జోడించి సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాలను ముందుకు తీసుకుపోవాలని వర్తమాన సమాజం ఆలోచిస్తోంది. ఈ ప్రపంచాన్ని సమగ్రంగా మార్చేందుకు ‘ఎస్టీమ్’ ఉపకరణంలా ఉపయోగపడుతుందని అనేక దేశాల్లో రుజువైంది. నైతిక విలువలు, ఉన్నతాశయాలు, సదుద్దేశంతోపాటు వ్యవస్థాపక సామర్థ్యం (ఎంటర్ ప్రెనూర్‌షిప్) అవసరమని తాజాగా చైనా, భారత్ పారిశ్రామిక రంగంలో వినబడుతున్న ఆధునిక మాట.
నేడు వ్యాపారం, వాణిజ్యం కేవలం ఆదాయం కోసం, లాభాల కోసమే గాకుండా వ్యవస్థను మార్చే క్రమం అందులో నిబిడీకృతమై ఉంది. ఈ కీలక అంశాన్ని సనాతన- సంప్రదాయ కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, మావోయిస్టులు గ్రహించలేకపోతున్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సమాజంలో నేరాలు జరగకుండా ముందుగానే పసిగట్టే ప్రిడిక్టివ్ పోలీసింగ్ పద్ధతిని అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ప్రవేశపెట్టారు. ఇది వినడానికి కొంత అసంబద్ధంగా అనిపించినా ఆధునిక, శాస్తస్రాంకేతిక రంగాల పురోభివృద్ధి, ఆల్గరిథమ్స్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాలకన్నా ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విషయంలో మరింత ముందుకు కదిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకుగాను వివిధ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ ఈ విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. అవసరమైన నిపుణులను తయారుచేసుకునే పనిలో పడింది. ప్రైవేట్ రంగ సంస్థలు మరింత ఆతృతను ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల, మావోయిస్టుల చర్యలు, చేష్టలు అత్యంత నిందనీయంగా కనిపించడం లేదా? సమాజాన్ని నష్టపరిచే ఇ లాంటి శక్తుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.

-వుప్పల నరసింహం 99857 81799