Others

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందులకామనుజుడు, ‘‘అయ్యా! ఈమాట నాకు నిన్ననే చెప్పలేకపోయితిరా?’’ అనగా సాధువు ఇట్లనెను. ‘‘ఔను, చెప్పెడివాడనే; కాని నిన్న నా యెదుటనే చక్కెర యుండెను. అది చూచి నీ బిడ్డడు, ‘ఈ సాధువు తాను పంచదార మెక్కుచు, ఇతరులను తినవద్దనును. దొడ్డసాధువే!’ అని తలచియుండును.’’
304. తల్లితోడనో, తండ్రి తోడనో, లేక భార్య తోడనో, తగవులాడి సన్న్యసించువానిని ‘ఆతురసన్న్యాసి’’యనవచ్చును. వాని వైరాగ్యము పురాణ వైరాగ్యము వంటిది, క్షణికము. ఏ ధనికుని యింటనో మంచి డబ్బు సంపాదించుకొను పని దొరికినయెడల ఆ వైరాగ్యము ఎగిరిపోవును, ఆ సన్న్యాసము అంతరించును.
305. ఒక శిష్యుడు: నిజమైన సాధువును గుర్తించుటెట్లు?
శ్రీ గురుదేవుడు: ఎవని హృదయమును ఆత్మయు పూర్తిగ భగవదర్పితములైయుండునో ఆతడు నిజమైన సాధువు. కామినీ కాంచనములను త్యజించినవాడే నిజమైన సాధువు. ఆతడు స్ర్తిని లౌకిక దృష్టితో- మోహదృష్టితో- జూడడు. స్ర్తికాతడు దూరముగానుండును. ఒకవేళ తన సమీపమునకు వచ్చుట తటస్థించిన యెడల ఆమెను తన తల్లిగా భావించి గౌరవముచేయును. నిజమైన సాధువు నిరంతరము దైవచింతన చేయుచుండును. సర్వమునందును దైవముకలడని గ్రహించి సర్వభూతములను అర్చించును. నిజమైన సాధువులకివి సామాన్య లక్షణములు.
306. వైద్యముచేయు సన్న్యాసిని నమ్మకుడు. అట్లే మంత్రోచ్ఛాటనములను సాగించుచు, కానుకలను స్వీకరించుచు, విశేషమైన బాహ్యచిహ్నములచే తమ సాధుత్వమును బ్రకటించుకొను సన్న్యాసులను నమ్మకుడు.
307. క్షమయే సన్న్యాసికి నిజమైన లక్షణము.
పారమార్థిక జీవమునకు కొన్ని సదుపాయములు జాతి ధర్మములు: ఆచారములు- విగ్రహారాధన- యాత్రలవలని ప్రయోజనము- సత్సాంగత్యము- నామస్మరణ, నామజపము.
జాతి ధర్మములు: ఆచారములు
308. లోపలి భావనయు పై రూపమును రెండును మాన్యములే, రెంటిని పాటింపుడు.
309. వరిగింజ మొలకెత్తి పెరుగుటకు అందుండు అంకురమే ప్రధానమనియు, పైనున్న ఊక అప్రధానమనియు సామాన్యముగా తలంతురు. ఐనను ఊకలేని బియ్యపుగింజను నాటిన యెడల అది మొలకెత్తి మొక్కయై పంటనీయజాలదుకదా? పంట కావలసిన యెడల ఊక గలిగి చెక్కు చెదరకయున్న విత్తనములనే నాటవలయును. మతధర్మములు నిలుచుటకేమి, అభివృద్ధిపొందుటకేమి, కర్మములును ఆచారములును ఆవశ్యకములైయున్నవి. అవి తత్త్వాంకురములను తమలో భద్రపఱచుకొనిన విత్తనములు. పరమార్థమును- పరతత్త్వమును- స్వానుభవముచే దెలిసికొనువఱకు ప్రతి మానవుడును కర్మములను ఆచరించుచుండవలసినదే.
310. మంచిముత్యమును గర్భమునందు దాల్చు ముత్తెపు జిప్పకు అంతగా విలువలేదు, కాని లోపలి ముత్యమును వృద్ధిపొందించుటకై చిప్పచాల ముఖ్యమైనది. ముత్యము చేచెక్కినవానికి చిప్ప నిరుపయోగము కావచ్చును. అట్లే(సాధనచేసి) బ్రహ్మసాక్షాత్కారము పొందినవానికి కర్మకాండము ఆచారములును ఆవశ్యకములు కాకపోవచ్చును.
311. ఆచారములను, విధులను విధిగా అవలంబింపవలయును. కాని ఆత్మమార్గమున ఆరూఢుడైనవాడు వానినంతగా పాటింపనక్కఱలేదు. అపుడు మనస్సు భగవంతునియందు లగ్నమగుటచే భగవచ్చింతన ప్రాప్తమగును.
312. పుండుమానిపోయిన తర్వాత పక్కు దానంతట అదియే రాలిపోవును. కాని అంతవఱకు ఆగక పక్కను బలాత్కారముగా లాగివేసితిమా, పుండునుండి నెత్తురు కాఱనారంభించును. బ్రహ్మసాక్షాత్కారము కలిగిన వానినుండి జాతిభేదములు వానియంతనవియే వీడిపోవును; కాని పామరులైయుండియు (జనులు) అట్టి భేదములను అతిక్రమించుట తప్పు. దానివలన అనేకమైన అనర్థములు వాటిల్లును.
313. చెట్టున పక్వమై రాలిన పండు మధురముగానుండును; కాని కోసి పండవేసిన కాయ అంత తియ్యగానుండదు. మఱియు శీఘ్రముగా వాడిపోవును. ఆ రీతినే ముక్తుడై సర్వభూతములందునుగల ఏకత్వమును గాంచిన మహనీయునుండి జాతి భేదములు, కులాచారములును తమంత తామే రాలిపోవును.
ఇంకావుంది...

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి