Others

భూ వివాదాలకు రాజకీయాల ఆజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య ఒక చిన్న గ్రామం నుండి ఓ యువకుడు తన భూ సమస్యను వీడియో రూపంలో చిత్రీకరించి, సామాజిక మాధ్యమంలో పెడితే- అది కాస్తా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లడం, ఆయన వెంటనే స్పందించడంతో ఆగమేఘాలపై రైతు సమస్య పరిష్కారం కావడం సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే ఎలాంటి తనిఖీలు చేయకుండానే అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకుని కొందరిని మోసం చేశారనే విమర్శలు కూడా వినిపించాయి. ఇక్కడ ఎవరిది తప్పు? ఎవరిది సమస్య? అనే విషయాలను పక్కన పెడితే- భూ వివాదాలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయన్న వాస్తవం తేటతెల్లమవుతుంది.
ఏ చిన్న గ్రామానికెళ్లినా ఇలాంటి భూ సమస్యలు కోకొల్లలుగా కన్పిస్తాయి. గత దశాబ్దకాలంగా భూముల ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఇలాంటి సమస్యలు మరింత ఎక్కువయ్యాయనడంలో ఎలాంటి అవాస్తవం లేదు. గతంలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినా కేవలం పెద్దమనుషుల సమక్షంలో మామూలు పత్రాలపై రాసుకొని, ఆ భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకునేవారు. ఎవరో కొందరు డబ్బున్నవారు, బాగా తెలివైనవారే మండల కేంద్రాలకు వెళ్లి భూముల రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు.
ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల కంటే ఎక్కువ భూమిగలవారికి, బాగా డబ్బున్నవారికే భూపట్టాలన్నీ సక్రమంగా ఉంటాయి. చిన్న, సన్నకారు రైతులకు వారసత్వంగా వస్తున్న భూములు, ఒక్కొక్కచోట ఒక సర్వే నెంబర్‌తో తక్కువ భూమి ఉంటుంది. అది కూడా ఎన్నో చిక్కులతో ముడిపడి ఉంటుంది. ఎంతో డబ్బు పోసి కొనుగోలు చేసిన భూమిని సైతం తమ సంతకాలు లేవనే కారణంతో లాక్కుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పట్టణాలు, నగర శివారు ప్రాంతాల్లో భూకబ్జాలు చేస్తూ, రైతులను బెదిరించో, దాడులు చేసో భూములను బలవంతంగా ఆక్రమించడం నిత్యకృత్యంగా మారింది. భూ వివాదాలపై పోలీస్ స్టేషన్లలో లెక్కలేనన్ని కేసులు నమోదవుతున్నాయి.
చాలా గ్రామాలలో రాజకీయాలు నేడు ఫ్యాక్షనిజాన్ని తలపిస్తున్నాయి. ఇద్దరు అన్నదమ్ముల మధ్య వారసత్వంగా పంచుకున్న భూమిలో ఏమైనా సమస్యలు వస్తే ముందుగా వారు వెళ్ళేది గ్రామ సర్పంచ్ దగ్గరికే కదా! ఆ ఇద్దరు వ్యక్తులు తమ పార్టీకి సంబంధించిన వారైతే ఆ సమస్యను పరిష్కరించరు, ఎందుకంటే ఒకరి పక్షానే్న పెద్దలు నిలవాల్సి వస్తుంది. మరొక వర్గం విడిపోతుందనే అనుమానంతో ఆ సమస్యను అలాగే ఉంచడం ఆనవాయితీ. ధైర్యం చేసి న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరించుకున్న పక్షంలో కేసులు, కోర్టులు అంటూ ప్రధాన రాజకీయ వర్గాలు బలప్రదర్శనను చేయించుకోవడానికి ఫిర్యాదుదారులను వాడుకోవడం సర్వసాధారణం.
గ్రామ రాజకీయాలను, అక్కడి పరిస్థితులను ఆసరాగా చేసుకొని రెవెన్యూ వ్యవస్థ సైతం అవినీతికి పాల్పడుతోంది. ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా, సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధి చెందినా, అధికారులు కొత్త మార్గాలను అనే్వషించుకొని లంచాలు తీసుకోవడం పరిపాటిగా మారింది. ఏదైనా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే నేరుగా వీఆర్వో, ఎమ్మార్వోలను కలిస్తే పని జరగదు. మధ్యలో వుండే దళారులను కలుసుకొని, సమస్య వారికి చెబితే ఎంత డబ్బు చెల్లించుకోవాలో, ఎలా చెల్లించుకోవాలో చెబుతుంటారు. దళారులు చెప్పిన మార్గంలో వెళితేనే పని సులభంగా అవుతుంది. అన్ని పత్రాలూ సక్రమంగా వున్నా ముడుపులు చెల్లించనిదే పని జరగని పరిస్థితిని మనం చూడవచ్చు.
భూ సమస్యల విషయంలోనే కాదు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సైతం అవినీతికి, అక్రమాలకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా అర్హులకు డబ్బులు చేతికి రావాలంటే, అన్ని పనులూ సజావుగా సాగాలన్నా ముందుగా లంచాలు సమర్పించుకుంటే ఆ పథకాలు, ప్రభుత్వ రాయితీలు వీలైనంత త్వరగా అందుతాయి. లంచాలు ఎందుకివ్వాలి? నిజాయితీగా ఎందుకు మంజూరు చేయరో చూద్దామనుకుంటే- వివిధ స్థాయిల్లో అధికారులకు మన పత్రాలలో ఎన్నో అడ్డంకులు కన్పిస్తాయి. అందుకే లంచం ఇవ్వని పనులను పెండింగ్‌లో పెడుతుంటారు. అధికారులకు లంచాలు తీసుకోవడం నేర్పిందే గ్రామాలలోని రాజకీయ నాయకులే. పనిని త్వరగా పూర్తిచేసుకోవడానికి లంచాలివ్వడం, దాన్ని రుచి చూసినవారు కూడా అదే మార్గంలో నడవడం, మధ్యలో కమీషన్ల కోసం పనిచేసే దళారులు ఈ తప్పుడు వ్యవహారాలకు కారణం అవుతారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామాలలో భూమిని సాగుచేసేదొకడు, దానిపై పట్టా పాసుబుక్ ఉండేది మరొకరికి. ఇలాంటి ఉదాహరణలు ఎక్కడికి వెళ్లినా చూడొచ్చు. తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక్క రోజులో చేపట్టిన బృహత్తర కార్యక్రమం- భూవివరాలపై సమగ్ర సర్వే. ఇది పూర్తయ్యాక రైతుబంధు ప్రవేశపెట్టడంతో నేరుగా రైతుల బ్యాంకుఖాతాల్లోకి డబ్బులు జమకావడం మొదలైంది. రైతుబంధు కింద డబ్బు దక్కని వారి దృష్టి భూముల రిజిస్ట్రేషన్‌పై పడింది. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకుందామనుకుంటే ఎన్నో చిక్కుముళ్ళు, రాజకీయ పార్టీల గొడవుల కారణంగా సమస్యలు అంత సులభంగా తొలగవు. కిందిస్థాయి నాయకులు సైతం భూ వివాదాల్లో తలదూర్చి వాటిని పెద్దవి చేస్తున్నారు. అధికారుల అండతో, దళారుల జోక్యంతో ఎక్కడ చూసినా ఉన్న సమస్యలను పెద్దవి చేసేవారు ఎక్కువవుతున్నారు. నిజాయితీగా పేద రైతుల సమస్యలను పరిష్కరించేవారు కరవవుతున్నారు. అందుకే భూ వివాదాలు ఉన్నవారు వీలైనంతవరకు ఇతరుల ప్రమేయం లేకుండా సమస్యల పరిష్కారానికి పూనుకోవాలి. రాజకీయ నాయకులను, లంచగొండులైన అధికారులను నమ్ముకుంటే సమస్య ఇంకా జటిలమై తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. బంధువులు, కుటుంబ పెద్దల సమక్షంలో ఈ సమస్యలను చర్చించడం మంచిది. అంతేగాని కేసులంటూ కోర్టులంటూ తిరిగితే సమయం, ధనం వృథా అవుతుంది.
భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్క రాత్రిలోనే ధనవంతులవ్వాలి, ఒక తల్లి కడుపులో ఒకే రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములమధ్య డబ్బు విషయానికొచ్చేసరికి ఎలాంటి ప్రేమలు, ఆప్యాయతలు కన్పించని పరిస్థితి. ముఖ్యంగా భూముల విషయంలో ఎలాంటి మనస్పర్థలు వచ్చినా అవి ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరగడానికి కారణం అవుతున్నాయి. ఇతరులకు సాయం చేయాలనుకుంటే నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా చేయడానికి ప్రయత్నించండి. కుదిరితే సహాయం చేయండి లేకపోతే ఊరుకోండి గానీ పేదలకు నష్టం చేయకండి. ఏదో పలుకుబడి ఉందని, నాయకులు తెలుసునని లేని అధికారాన్ని అమాయక ప్రజలపై రుద్దకండి. కష్టపడితేగానీ కడుపు నిండని సామాన్య జనానికి కొత్త సమస్యలు సృష్టించవద్దు.
కాగా, వందల ఎకరాల భూములున్నోళ్ళు, ధనవంతుల కుటుంబాలలో ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఆ కుటుంబాల్లో అందరి మధ్య అన్యోన్య సంబంధాలను చూడవచ్చు. మరి పేద, మధ్య తరగతి కుటుంబాలలో ఇలాంటి సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయో అర్థం చేసుకోవాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. అధికారులు సైతం వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో పనిచేయాలే తప్ప పేద ప్రజల నుంచి లంచాలు ఆశించరాదు. పేదవారి పట్ల జాలి, దయ కరుణ చూపకపోయినా ఫర్వాలేదు గానీ వారిని వివిధ ఇబ్బందులకు గురిచేస్తూ, వారిపట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడకూడదు. ప్రభుత్వం కూడా సహృదయంతో పేద, సన్నకారు రైతుల భూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. క్షేత్రస్థాయిలోకి అధికారులను పంపి, భూ సమస్యలను పరిష్కరిస్తూ, నూతన పాసు పుస్తకాలను ఇవ్వడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అధికారులు పారదర్శకంగా పనిచేసేలా చూడాలి.

-డా పోలం సైదులు 94419 30361