AADIVAVRAM - Others

రంగుల కవిత్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన చిత్రకారిణి అమిలారెడ్డి తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ముఖ్యంగా మహిళలను తన కాన్వాసుపై వినూత్న రీతిలో చిత్రించడంతో తనదైన శైలిని చిత్రకళా ప్రపంచానికి చాటి చెప్పారు.
మైసూరులోని శ్రీ అల్లమ ప్రభు లలిత కళా అకాడెమీ నుంచి 2011-2012 సంవత్సరంలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్‌ఏ) చేసినప్పుడు ఆమె తన డిసర్టేషన్ (దీర్ఘ వ్యాసం) తెలంగాణ మహిళల పూర్వ - వర్తమాన సంస్కృతిపై తులనాత్మక అధ్యయనం అన్న అంశాన్ని మహిళల ఔన్నత్యం, వారిపై ఆరాధనా భావం ఎలాంటిదో తెలుస్తోంది. తెలంగాణ మహిళలపై ఎందరో చిత్రకారులు బొమ్మలు గీశారు. వారిలో ఒకరిగా కాక తనదైన ప్రత్యేక శైలిలో ‘జామెట్రికల్ కలరింగ్’ విధానంలో ఆ మహిళలను చిత్రిక పట్టి ‘మ్యాజిక్’ చేశారు. ఆ జామెట్రికల్ కలరింగ్ విధానంలో మ్యాజిక్‌తోపాటు మ్యూజిక్ ధ్వనిస్తోంది. పొయెట్రీ పలుకుతోంది. ఇది అపురూపమైన అంశం. రంగుల్లో సంగీతం పలికించడం సాధారణమైన విషయం కాదు. కానీ అమీలా అలవోకగా దాన్ని సాధించారు. కొన్ని అద్భుతాలు అలా జరిగిపోతాయి. అదే అమీలారెడ్డి విషయంలో జరిగింది. ఎంఎఫ్‌ఎ చేస్తున్న రోజుల్లో ప్రముఖ చిత్రకారుడు పికాసో ఫిగరేటివ్‌లో నైరూప్య శైలిని ఆమె ఇష్టపడ్డారు. ఆ ఇష్టం తన ప్రతిభలో కొంత ప్రతిఫలించింది. తాను పుట్టి పెరిగిన తెలంగాణ ప్రాంత గ్రామీణ సౌందర్యాన్ని స్ర్తిల సౌకుమార్యాన్ని, సంయమన వైఖరిని, సమస్త పనుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించే వైనాల్ని చిత్రిక పట్టడం ఆమెకెంతో ఇష్టం. అదే ఆమె వర్ణ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
చిత్రకళ అధ్యయనంలో ఎందరో ప్రపంచ ప్రముఖ చిత్రకారుల చిత్రాలు, శైలి, వారి వస్తువు, రంగుల పోహళింపు పరిశీలనకొస్తాయి. వారిలో ముఖ్యమైన వారిని అనుకరించి మార్కులు కొట్టేయాలనే ప్రయత్నం చాలామంది చేస్తారు. ఇది సర్వసాధారణం కావొచ్చు. కానీ ఒక దశ తరువాత తనదైన మార్క్ చూపని పక్షంలో ఆ అనుకరణ అభాసుపాలవుతుంది.
అమీలారెడ్డి తన ఎంఎఫ్‌ఎకి ముందు బొమ్మలు ‘మిక్స్‌డ్’గా వేశారు. అపరిపక్వత సైతం కనిపించినా, రంగుల ఎంపిక పేలవంగా ఉన్నా, సబ్జెక్ట్‌పై తాదాత్మ్యం కనిపించకపోయినా ‘సాధన’ చేశారు. సాధనమున సమకూరు పనులు అన్న చందంగా ఆమె సాధనతో తనదైన ప్రత్యేక శైలిని రూపొందించుకున్నారు. ఆమె ‘రేఖలు’ బలహీనంగా కనిపించినా అది శైలిలో కప్పడిపోయింది. వస్తువు సైతం ఆ లోపాన్ని కనిపించకుండా చేసింది. అంతిమంగా ఆమె చిత్రాలు ఆలోచింపజేస్తాయి. వీక్షకుల మదిలో ముద్ర వేస్తాయి. అలా జరిగితేనే చిత్రకారుడు / చిత్రకారిణి విజయం సాధించినట్టు.
విచిత్రమేమిటంటే ఇదంతా స్వయంకృషి’తో వెలుగు చూడటం. తనకు తాను బోధించుకునే (సెల్ఫ్‌టాట్) ప్రయాణంలో చిత్రకళ మెలకువలను ఆమె పట్టుకున్నారు. ముంబయిలోని బ్రిటీషు ఇనిస్టిట్యూట్ నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసినా, మైసూరులోని అల్లమ ప్రభు అకాడెమీ నుంచి ఎంఎఫ్‌ఏ చేసినా దూరవిద్య ద్వారా చేశారు. పరీక్షలు మాత్రం ఆయా సంస్థల వద్దకు వెళ్లి రాశారు. దీంతో ఆమెలో చిత్రకళపై దాగున్న తపన, అభినివేశం, ఆలోచనల తీవ్రత తేటతెల్లమవుతోంది.
అమీలారెడ్డికి ప్రాథమిక పాఠశాల సమయంలోనే డ్రాయింగ్ పట్ల ఆసక్తి ఏర్పడింది. పాఠశాల డ్రాయింగ్ తరగతుల్లో గీసిన బొమ్మలు చూసి ఉపాధ్యాయులు మెచ్చుకోవడంతో మరింత ధైర్యం ఒనగూడింది. ఇంటర్మీడియెట్‌లో సైన్స్ సబ్జెక్ట్ బొమ్మలు సజావుగా కనిపించడంతో లెక్చరర్లు ప్రోత్సహించారు. అలా చిత్రకళ పట్ల.. బొమ్మల అనాటమీ పట్ల ఆరోగ్యవంతమైన ప్రేమ ఏర్పడింది. ఆ తరువాత పెళ్లి కావడం భర్తతో రామగుండం ఎన్‌టిపిసిలో మకాం.. ఉద్యోగరీత్యా భర్త రాజస్థాన్‌లోని కోటా నగరానికి బదిలీ కావడం అక్కడే చాలాకాలం ఉండటం వల్ల రాజస్థాన్ గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేస్తూ కొన్ని బొమ్మలు గీయడం అక్కడి ప్రకృతికి పరవశించి చిత్రాలు వేయడం, తనను తాను మలచుకునే ప్రయత్న వేగం పెంచారు. అదే సమయంలో చిత్రకళలో డిప్లొమా కోసం బొంబాయిలోని బ్రిటీష్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటన వెలువడటం దూర విద్య ద్వారా ఆ డిప్లొమా కోర్సు పూర్తి చేయడం జరిగింది.
అనంతరం వైజాగ్‌కు బదిలీ కావడం అక్కడ ఎన్‌టిపిసి బాల్‌భవన్‌లో ఆర్ట్ టీచర్‌గా ఉద్యోగం రావడం తనలోని చైతన్యం ఆరిపోకుండా నిరంతరం మరింత వెలగడానికి దోహదపడింది.
ఎక్కడికెళ్లినా తాను పుట్టి పెరిగిన తెలంగాణ గ్రామీణ ప్రాంతం, మనసులో మదిలేది. ఆలోచనల్లో సజీవంగా కదలాడేది. దాని పర్యవసానమే ఆ సబ్జెక్ట్‌లో అసంఖ్యాక చిత్రాలను గీశారు. ఆ ప్రయాణంలోనే ఆమె కల సాకారమైంది. ఆమె తపన నిజ రూపం దాల్చింది. తన అభిమతం వర్ణరంజితమైంది. రంగులు - రేఖలు - సబ్జెక్టులు ఒకటై పోయాయి. ఆ దశకు చేరడమంటేనే పరిణితి పొందినట్టు లెక్క. ఈ భావనను ఆమె చిత్రాలను చూసిన సీనియర్ చిత్రకారులెందరో చెప్పారు. పొగిడారు.. కొత్త శైలిని పట్టుకున్నావని ప్రశంసించారు. దశాబ్దాల పాటు శ్రమించిన చిత్రకారిణికి ఇంతకు మించిన ‘గౌరవం’ ఇంకేముంటుంది?
అమీలారెడ్డి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ సభ్యురాలై తన చిత్రాలను అనేక చోట్ల ప్రదర్శించారు. అనేక ఆర్ట్ క్యాంపుల్లో పాల్గొన్నారు. 2012 సంవత్సరంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏరాపటు చేసిన ఆర్ట్ క్యాంప్‌లోనూ పాల్గొన్నారు. అమలాపురంలోని చిత్రకళా పరిషత్ వారి పికాసో అవార్డును అందుకున్నారు. ఇంకా అనేక బహుమతులు.. అవార్డులు సొంతం చేసుకున్నారు. తెలంగాణా మహిళా చిత్రకారుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. తెలంగాణ పల్లె జీవితాన్ని మరింత నిష్టతో కాన్వాసుపై తర్జుమా చేసే పనిలో ఇప్పుడామె నిమగ్నమయ్యారు. తెలంగాణ మహిళ మానసిక లోతులను దర్శించి రంగులద్దుతున్నారు. సంప్రదాయాలు - సంస్కృతి కేవలం మహిళల ద్వారానే కొత్త తరాలకు బట్వాడా అవుతాయన్న సత్యాన్ని ఆమె తన మాధ్యమం ద్వారా చాటి చెప్పేందుకు సమాయత్తమవుతున్నారు.

-వుప్పల నరసింహం 99857 81799