Others

భక్తుల కల్పతరువు( కొమరవెల్లి మల్లికార్జున స్వామి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకతీయుల కాలంలో వీరశైవం దేదీప్యమానంగా వెలుగొందినది. వారు ఎన్నో శివాలయాలు కట్టించారు. శివభక్తిపరులై పరమశివుని ఆరాధించి కొన్ని వందల సంవత్సరాలు అజేయులై పరిపాలించారు. ఈ కొమరవెల్లి గ్రామం వరంగల్ పరిధిలోనే ఉన్నందున అక్కడ శివారాధన ఆలయాలు ఎన్నో వెలిశాయి. వాటిలో ఇంద్రకీలాద్రిపై వెలసిన మల్లికార్జునస్వామి ఆలయం ప్రసిద్ధమైనది.
కొమరవెల్లి అని ఆ గ్రామానికి పేరు రావటానికి శ్రీ కుమారస్వామి ఆ ప్రాంతంలో కొంతకాలం నివసించినందువలన ఆ పేరు వచ్చిందని శివ మహాపురాణంలోని ఒక అంశం వివరిస్తోంది.
పౌరాణికాంశము
పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామిలలో ఎవరికి ముందుగా వివాహం చేయవలెననే విషయంపై సంశయమైంది. ఎవరు ముందుగా భూప్రదక్షిణం చేసి వస్తారో వారికి వివాహం చేస్తామని చెప్పిరి. కుమారస్వామి వెనువెంటనే నెమలి వాహనమును ఎక్కి వేగముగా బయలుదేరి వెడెలను.
శ్లో పిత్రోశ్చ పూజా సంకృత్యా! ప్రకాంతించ కరోతియః
తస్యవై పృథివీ జన్యం ఫలం భవ అ నిశ్చితం
పుత్రుడు, మాతా పితరులను పూజించి ప్రదక్షిణ చేసినట్లయితే భూప్రదక్షిణ చేసిన ఫలితమును పొందును. ఈ ఆర్యోక్తి ప్రకారం తన బుద్ధి కౌశలాన్ని వినియోగించి పార్వతీ పరమేశ్వరులను పూజించి, ప్రదక్షిణ చేసెను. దానికి వారు సంతోషించి విశ్వరూప ప్రజాపతి కుమార్తెలైన సిద్ధి, బుద్ధిలనిచ్చి వివాహము జరిపించారు. కుమారస్వామి భూప్రదక్షిణ పూర్తిచేసుకొని కైలాసము చేరి జరిగిన విషయము తెలుసుకొని క్రోధాగ్ని జ్వలిత మనస్కుడై జననీ జనకులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ‘మీ వద్ద క్షణకాలమైనను నిలువజాలను’ అని వచించి వారెంత వారిస్తున్ననూ కైలాసమును వీడి భూలోకమునకు వచ్చి ఇందలి క్రౌంచ పర్వతమున నివసించెను. ‘వేల్వి’ అనగా నివాసము అని అర్థం. కుమారవేల్వి కనుక కుమారస్వామి నివాసము. ఈ కుమార వేల్వి కాలక్రమములో ‘కొమరవెల్లి’గా రూపాంతరం చెందింది.
కుమారస్వామి కొంతకాలము నివసించిన ప్రాంతమైన ఇంద్రకీలాద్రి పర్వతము వద్ద కొందరు రాక్షసులు సత్పరుషులను, ఋషులను, శివభక్తులను అకారణంగా బాధించుచుండిరి. నారద మహర్షి కోరికపై శిష్యులను రక్షించటమే కాక దుష్టులను శిక్షించుటకు ఇంద్రకీలాద్రిపై గంగా, గౌరీ సమేతంగా అవతరిస్తాను అని అభయమిచ్చెను పరమేశ్వరుడు. దానితో నారద మహర్షి సంతోషించి కైలాసమునుండి వెడలిపోయెను.
మల్లికార్జునస్వామి అవతరణ
కొల్హాపురి అను గ్రామంలో మాదిరాజు, మాదాంబ అను పుణ్య దంపతులు కలరు. వారు అత్యంత శివభక్తులు. సదాచార సంపన్నులై షట్కాలములలో శివపూజలు చేస్తూ జీవించసాగిరి. సంతానము కొరకు వారు చేయని నోములు, వ్రతాలు లేవు. ఒకసారి వారి గృహమునకు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడైన ఒక జంగమయ్య విచ్చేయగా అతనిని పూజించి తమ సంతాన కోరికను తెలిపిరి. పుణ్యదంపతులారా పదకొండు దినములు శివాలయమునకు వెళ్లి భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకము చేసి పదకొండవ రోజున జంగమార్చన చేసినయెడల మీ కోరికనెరవేరి ఆ పరమశివుడే మీకు కుమారుగా జన్మించును అని సెలవిచ్చి వెడెలను.
ఆ విధముగా శివుని సేవించిన అనంతరం మాదాంబ గర్భందాల్చి నవమాసములు నిండగా శుభలగ్నమందు సర్వశుభలక్ష లక్షితుడైన మగ శిశువుకు జన్మనిచ్చును. తల్లిదండ్రులు బాలునికి మల్లికార్జునుడు అని పేరు పెట్టి మల్లన్న అని ప్రేమతో అల్లారుముద్దుగా పెంచసాగిరి.
మల్లన్న దినదినాభివృద్ధిగా పెరిగి పెద్దవాడై మహాభక్తి ప్రపత్తులతో ఇష్టలింగ పూజ చేయనిదే పచ్చి మంచినీళ్ళైనా ముట్టకుండా శ్రద్ధగా పరమశివుని పూజిస్తూ శివభక్తిని ప్రజలలో పెంపొందింపజేశాడు. అతనికి యుక్తవయస్సు రాగానే కళ్యాణ పట్టణాన్ని పరిపాలిస్తున్న నాగమదేవర అతని ధర్మపత్ని నాగాంబల కుమార్తె మేడలమ్మను వివాహమాడెను. మల్లికార్జునుని గొప్పతనమునును గ్రహించి మామయగు నాగమదేవర తన రాజ్యాన్ని అల్లునికి అప్పగించెను. మల్లికార్జునుని రాజ్య పరిపాలనలో కరువు కాటకాలు లేక ప్రజలందరూ శాంతికాముకులై సుఖ సంతోషాలతో జీవించుచుండిరి.
ఒక దినమున మల్లికార్జునుడు, మేడలాదేవితో కొలువు తీరివుండగా ఒక భక్తుడు వచ్చి బంగారు (పసుపు) కావలెనని కోరెను. అపుడు మల్లన్న ఒక్క క్షణము కనులు మూసి తెరువగా ఎదురుగా పసుపు కుప్ప పడి ఉండెను. అంత ఆ భక్తుడు మల్లన్న మహిమ స్వయంగా తిలకించి నీవు సాక్షాత్తు కైలాస పర్వతమునుండి దిగివచ్చిన పరమశివుడవు అని స్తుతించి వెళ్లిపోయెను. దశపర్ణ దేశములో గౌలీపురము అనే ప్రసిద్ధ నగరము కలదు. అందు శివాచారపరాయణుడైన కేతయ్య అనే భక్తుడు నివసించుచుండెను. అతని భార్య నిమ్మవ్వ. వారి కూతురు కేతమ్మ. ఆ చిన్నారి చిన్నప్పటినుంచి శివభక్తి కలిగి పరమేశ్వరునే సదా ధ్యానించుచుండెను. ఒకనాటి రాత్రి ఆమెకు కలలో పరమశివుడు దర్శనమిచ్చి కేతమ్మా, నీవు ఇంద్రకీలాద్రిపై వెలసిన శివలింగమును అర్చించి నీ జన్మ ధన్యము చేసికొనుము అని తెలిపెను.
కేతమ్మ మాఘ శుద్ధ చతుర్థశి నాడు శివుని అర్చించి ధ్యానంలో నిమగ్నమై వుండగా ఆకాశవాణి ఇట్లు పలికెను. ‘‘ఓ కేతన్నా! నీ కూతురు కేతమ్మ సామాన్యురాలు కాదు. గంగాదేవియే నీ కూతురుగా జన్మించింది. శివస్వరూపుడైన మల్లనకు అర్థాంగియై సమస్త యాదవ కులమునకు కీర్తి తెచ్చిపెడుతుంది’’ అని పలుకగా కేతయ్య, నిమ్మవ్వ దంపతుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
ఇట్లుండగా ఒకనాడు నాగమదేవర వనవిహారము చేసి అలసి స్పృహ తప్పిపోయెను. శివపూజకు పూలు తేవటానికి వెళ్లిన కేతమ్మ నాగమదేవరకు సపర్యలు చేసి రక్షించినది. కేతమ్మ తల్లి నీవు నా స్వంత కూతురువలె నా ప్రాణాలు రక్షించావు అని చెప్పి తన వెంట తీసుకుని వెళ్లి తన కూతురైన మేడలమ్మకు పరిచయం చేశాడు. అంత మేడలమ్మ, కేతమ్మను స్వంత చెల్లెలుగా భావించి ‘‘నా తండ్రికి పునర్జన్మ నిచ్చిన నీకు ఏమి కావలయునో కోరుకో’’ అని అడుగగా ‘‘మీ నాధుడైన మల్లికార్జునునకు నేను అర్థాంగిని కావలెనని నా కోరిక’’ అని కేతమ్మ తన మనోరథము తెలుపుగా మేడలమ్మ ఏ మాత్రం సంకోచించక అందుకు అంగీకరించి అత్యంత వైభవముగా మల్లికార్జునునకు కేతమ్మకు వివాహం జరిపించెను.
మల్లన్న ఇరువురు భార్యలతో కూడి రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలను కన్నబిడ్డలవలె చూచుకొనుచుండెను. ఇంద్రాదిదేవతలు రాజైన మల్లన్నను పరీక్షించదలచి కరువు కాటకములు వచ్చునట్లు చేసిరి. దివ్యదృష్టితో మల్లన్న ఈ విషయాన్ని గ్రహించి ఇంద్రకీలాద్రి చేరుకొని అచ్చటి శివలింగమును అర్చించగా కరువు కాటకములు పోయి రాజ్యము మరలా సుభిక్షముగా మారెను. రాజ్యములోని ప్రజలందరూ సంతోషించి ఇంద్రకీలాద్రి పర్వతమునకు విచ్చేసిరి. వారందరూ చూచుచుండగా రాజైన మల్లన్న మేడలాదేవి, కేతమ్మలతో సహా అదృశ్యమైనారు. మల్లికార్జునుడే పరమశివుడని, గంగా గౌరీదేవిలే కేతమ్మ, మేడలమ్మలని తెలుసుకొని స్వామివారికి మ్రొక్కి అక్కడ ఉన్న పసుపును ఆధారముగా (బండారుగా) గ్రహించి నుదుటిపై పెట్టుకొని అందరూ పండుగ చేసుకొనిరి.
మూలవిరాట్టు పుట్టుక
11వ శతాబ్దమునందు మల్లికార్జునుని మహిమలను విన్న యాదవ కులస్థుడైన ‘కొమరన్న’ అనే పేరుగల శివభక్తుడు ఇంద్రకీలాద్రిపై కఠోరమైన తపస్సు చేయగా అక్కడ వున్న శివలింగము చుట్టూ పెద్ద పుట్ట ఏర్పడినది. ఆ పుట్టలోంచి మల్లికార్జునస్వామి, మేడలమ్మ, కేతమ్మలతో ప్రత్యక్షమై, భక్తా! ఏమి నీ కోరిక అని ప్రశ్నించగా, అయ్యా! మీరు ఎల్లవేళలా భక్తులకు నిజరూపములో కొలువుతీరవలెనని కోరెను. అందుకు మల్లికార్జునస్వామి సంతోషించి ‘‘వత్సా! పుట్టమట్టిచే నాభియందు లింగమునుంచి నా ప్రతిరూపమును, అమ్మవారల ప్రతిరూపములను ఆగమశిల్పి చేత తయారుచేయించమని తెలిపి అంతర్థానమయ్యెను. అంత కొమరన్న మల్లన్నస్వామి, మేడలమ్మ, కేతమ్మల విగ్రహాలు తయారుచేయించి ప్రతిష్ఠించి కృతార్థుడయ్యెను.
నేడు ఇంద్రకీలాద్రి కొలువుతీరిన మూలవిరాట్ స్వరూపములు ఆనాటి విగ్రహాలు. తెల్లని తేజస్సు, ఫాలభాగముపై విభూతి రేకలు, విశాలమైన బాహువులు, నాలుగు చేతులు కల్గి, ఒక చేతితోలో దుష్టులను శిక్షించుటకు సిద్ధముగా కత్తి, మరొక చేతిలో భక్తులను రక్షించుటకు అందించే పసుపు (బంగారు) కిరీటము, హారములుగా ధరించిన సర్పములు, చెవులకు మకర కుండలాలు, త్రిశూలము, ఢమరుకము ధరించి హస్తములు, కోరమీసములు, శిరస్సుపై గంగా ప్రవాహము- ఇలా స్వామివారి రూపము బహు సుందరముగా ప్రకాశించును. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన మల్లన్న భక్తులను కరుణా సముద్రుడుగా కాపాడుతున్నాడు. శ్రీ స్వామివారిని పూజించే అర్చకులు వీరశైవులైన లింగ బలిజలు. మేడలమ్మను స్వామివారికిఇచ్చి అల్లునిగా చేసుకొన్నారు. అందువలన అనువంశికముగా స్వామివారిని తరతరాలుగా సేవిస్తున్నారు. యాదవకులస్తులు కేతమ్మను ఇచ్చి మల్లన్నను అల్లునిగా చేసుకొన్నారు. అందువలన వారు డోలు వాయిస్తూ ఒగ్గు మంత్రాలు చదువుతూ ఒగ్గుపాడుతూ పట్నం వేసి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిదినమూ ప్రాతఃకాలమున ఒగ్గు డోలు వాయిస్తూ స్వామివారిని మేలుకొలుపుతారు.
కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి జాతర ఉత్సవాలు ప్రతి సంవత్సరం మార్గశిరమాసంలో వచ్చే ఆఖరి ఆదివారం తరువాత వచ్చే సోమవారం కూడా మార్గశిర మాసంలోనే ప్రారంభం అవుతాయి. ప్రతి ఆదివారం జరుగుతాయి. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే ఫాల్గుణమాసంలో చివరి ఆదివారం నాడు అగ్నిగుండం, బలిహరణ అనంతరం సోమవారం నాడు శ్రీ స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం జంగమార్చనతో సమాప్తమవుతాయి.
కొమరవల్లికి దారి
ఈ పవిత్రమైన క్షేత్రం హైదరాబాద్ నుండి సిద్ధిపేటకు వెళ్ళే మార్గంలో జాతీయ రహదారికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో వున్నది. ఇక్కడ జరిగే జాతరలకు తప్పనిరిగా వెళితే మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు అందరకూ తెలిసిరాగలవు. మన జీవితంలో ఒక్కసారైనా శ్రీ కొమురవెల్లి మల్లన్నస్వామిని దర్శించి సేవిస్తే మన జీవితాలు ధన్యమవుతాయి.

-జన్నాభట్ల నరసింహప్రసాద్ 7995900497