Others

ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే రెండు మాసాలలో విడతలవారీగా జరిగే లోక్‌సభ ఎన్నికల్లో సోషల్ నెట్‌వర్క్స్ కీలక పాత్ర పోషించబోతున్నాయనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు సాంకేతిక రంగంలో వస్తున్న పలు విప్లవాత్మకమైన మార్పులను వివిధ రాజకీయ పక్షాలు, ప్రభుత్వాలు తమ మనుగడకై ఉపయోగించుకుంటూ సామాన్య మానవునికి అందుబాటులోకి వెళ్తున్నాయి.
2014 పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారిగా నరేంద్ర మోడీ ట్విటర్‌తో ప్రారంభించి, వాట్సాప్, ఫేస్‌బుక్, తమ పార్టీ సభ్యత్వాలకై ప్రత్యేక యాప్‌లను ఉపయోగించుకుంటూ, అప్పటికే 8 సంవత్సరాలకు పైగా ప్రభుత్వాన్ని నడుపుతున్న యు.పి.ఏ పార్టీయొక్క అధికారంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, అవినీతికి పాల్పడ్డారని, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని మరొకప్రక్క ఎన్డీయేకు అధికార పగ్గాలను చేపట్టడానికి సహకరిస్తే నల్లధనాన్ని వెలికితీస్తానని, అవినీతి రహిత పాలన అందిస్తానని, పలు అభివృద్ధికార్యక్రమాలు చేపడతామని, తమ మ్యానిఫెస్టోను రూపొందించి, సామాజిక మాధ్యమాలను సైతం ఉపయోగించుకుంటూ ప్రచారాలను కొనసాగించినది.
నేడు దేశంలో ఒక్కొక్క ఇంట్లో రెండుకుపైగా స్మార్ట్ఫోన్ల వాడకం కొనసాగుతున్నది. ధనిక, పేద, అక్షరాస్యుడు, నిరక్షరాస్యుడనే భేదాలు లేకుండా వ్యవసాయ కూలీలు, జంతువుల కాపలాదారులు సైతం స్మార్ట్ ఫోన్లు కలిగి ఉండి వివిధ సామాజిక మాధ్యమాల్లో అకౌంట్స్ తెరిచి ఉపయోగిస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అలాగే నేడు ఉన్నతమైన విద్యనభ్యసించి వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్నవారు ఎక్కువగా పట్టణాలు, నగరాల్లో నివసించేవారు యాంత్రికపరమైన జీవనాన్ని గడుపుతున్నారు. ప్రభుత్వాల పనితీరును, రాజకీయ పక్షాల వాగ్దానాలను సైతం గమనించలేని పరిస్థితుల్లో వున్నారు. వీరందరూ కూడా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవడంలో మాత్రం ముందుంటారు. అలాంటి సందర్భాల్లో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కాస్తా నరేంద్ర మోడీకి అధికారం చేపట్టడానికి దోహదపడిందని చెప్పవచ్చు.
అప్పట్లో యు.పి.ఏ. ప్రభుత్వం సోషల్ నెట్‌వర్క్స్ చాలా తేలికగా తీసుకొని ఒకింత నష్టానికి దారితీసిందని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు యు.పి.ఏ. కూటమి నుండి రాహుల్‌గాంధీ సైతం ట్విట్టర్‌లో ఖాతాతెరిచి నెటిజన్లకు దగ్గరికయ్యే కార్యకలాపాలు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సైతం కల్వకుంట్ల తారక రామారావు సైతం ట్విట్టర్ వేదికగా పలు సమస్యలకు స్పందిస్తూ, వెంటనే పరిష్కారానికై చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గం నుండి ప్రతి ఎమ్మెల్యే సైతం ఫేస్‌బుక్ ద్వారా ఖాతాలు తెరిచి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి, అనుక్షణం కార్యకర్తలకు అందుబాటులో వుంటూ తమ ప్రచార కార్యకలాపాలను గావించుకొని విజయం సాధించడానికి ఉపకరించాయి. అలాగే రాష్ట్రప్రభుత్వం సైతం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను సైతం, వాటి ఉపయోగాన్ని తెలియజేసేందుకు సామాజిక మాధ్యమాలనే ఉపయోగించుకొని విజయవంతమయ్యాయని చెప్పవచ్చు.
గతంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను వివరించాలన్నా, తమ కార్యకలాపాలను కార్యకర్తలకు తెలియజేయాలనుకున్నా, ప్రజల మన్ననలు పొందటాన్ని ఏ పనిని చేసినా కేవలం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాపైననే ఆధారపడేవారు. కానీ నేడు ఆ పరిస్థితులు మారి, ఏ విషయాన్నైనా క్షణాల్లో ప్రజలకు అందజేస్తున్నారంటే కారణం సామాజిక మాధ్యమాలే అని చెప్పక తప్పదు. ప్రతి విషయం, ప్రతి కార్యక్రమాన్ని అప్‌లోడ్ చేయడానికి, స్పందించడానికంటూ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసుకునే స్థాయికి ఎదిగాయి.
సామాజికాలలో ఎక్కువగా ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్‌లను ఎక్కువగా వాడుతూ ప్రతి సంఘటనను, ప్రతి విషయాన్నీ కార్యకర్తలకు చేరువ చేస్తున్నారు. ఎంతగానంటే న్యూస్ ఛానల్స్, పేపర్లు సైతం వాటినిబట్టి వార్తలు వ్రాసుకునే స్థాయికి ఎదిగాయన్నా అతిశయోక్తిలేదన్నా ఆశ్చర్యంలేదు. ఈ మధ్య ప్రజలు సైతం పలురకాల సమస్యలను డ్రాఫ్ట్స్‌ద్వారానో, ఫొటోల ద్వారానో అప్లోడ్‌చేసి, పరిష్కరించుకునే పనులను చేస్తున్నారు. ప్రజల్లో రోజురోజుకు ఆదరణను పెంచుకుంటున్న సామాజిక మాధ్యమాల ప్రభావం ఎన్నికల్లో ఎక్కువగా ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అందుకే ఈ దఫా జరిగే లోక్‌సభ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు ఎవ్వరికి టికెట్స్ ఇస్తున్నారు. వారియొక్క మ్యానిఫెస్టో ఏంటి? గెలిస్తే ఏంచేయబోతున్నారు? ఇతరులపై వారు చేసే కామెంట్స్ ఏంటి? సర్వేలు ఏం చెబుతున్నాయి? అనే పలు విషయాలను సులభంగా తెలుసుకోవడానికి ఈ మాధ్యమాలు ఉపకరిస్తున్నాయనడంలో నిజం లేకపోలేదు.
గత లోక్‌సభ ఎన్నికల్లో రుచిచూసిన మోడీ ఒక ప్రణాళిక ప్రకారం ఈ మాధ్యమాలను ఉపయోగించుకుంటుంటే, గతంలో దెబ్బతిన్న ప్రస్తుత ప్రతిపక్షపార్టీ సైతం ఈ ఎన్నికల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తుందనడంలో అనుమానం లేదు. ఎప్పుడైతే ఈ సామాజిక మాధ్యమాలు మానవ మనుగడలోకి వచ్చాయో! దేశంలో మనుషుల మధ్య దూరాన్ని పెంచాయి. మానవ సంబంధాలను మంటగల్పుతున్నాయి. పొద్దున లేచినప్పటినుండి రాత్రి పడుకునేవరకు రోజులో అత్యధిక సమయం తమ ఫోన్లలోని సామాజిక మాధ్యమాలతో గడుపుతున్నారు. ఒకవేళ రెండు మూడు రోజులు కరెంట్ లేకుండా పోతే, ఫోనులలో ఛార్జింగ్ లేక మూగబోతే ఏవౌతారోనన్న భయంకూడా లేకపోలేదు. ఇంతగా అలవాటుచేసుకున్న ప్రజానీకాన్ని ఆకర్షించాలంటే వారు వెళ్లిన దారిలో వెళ్తేనే సులభమవుతుంది. అందుకే వివిధ ఆన్‌లైన్ వ్యాపారాలు చేసేవారు సైతం ఆర్థికంగా బలపడుతున్నపుడు రాజకీయ పక్షాలు సైతం ప్రచారం చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదేమో! ఏదైతేనేమి దేశ అభివృద్ధి, భవిష్యత్ అంతా కేంద్రప్రభుత్వం పైననే ఆధారపడి ఉంటుంది. కావున యావత్తు దేశవ్యాప్తంగా ఓటర్లందరూ ఒకటికి పలుమార్లు ఆలోచించి, వారిచ్చే ఎలాంటి తాయిలాలకు ఆకర్షితులుగాకుండా, అవినీతికి పాల్పడనివారు, నిష్పక్షపాతంగా వ్యవహరించేవారు, ప్రజల క్షేమం, సంక్షేమానికి పాటుపడేవారు, దేశ అభివృద్ధియే ధ్యేయంగా తలచి పని చేసేవారిని ఏరికోరి ఎన్నుకోవాల్సిన అవసరం యావత్తు దేశ ఓటర్లందరిపై ఉన్నది. కావున మరో ఐదేళ్లపాటు బాధపడకుండా ఉండాలంటే మంచి నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం ఏర్పడాలని ఆశిద్దాం.. దానికై ప్రయత్నిద్దాం..

- డా. పోలం సైదులు