Others

అమలైకాదశి ప్రాశస్త్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ దేశంలో ఏటా జరుపుకునే పబ్బాలలో, పండగలలో ఒక్కొక్కనాడు ఒక్కో వృక్ష పూజ ఆచరణలో ఉంది. బిల్వపత్రం, శమీ వృక్షం, ఆమ్రపుష్పం, అలాగే అమలక ఫల వినియోగం చేయడం సాంప్రదాయసిద్దంగా వస్తున్నది. కార్తీకం నుండి చైత్రం వరకు ఆరు మాసాలలో అమలకిని పచ్చిదానిని ఏదో విధంగా వాడాలని పెద్దల నిర్దేశం. ఏడాదిలో వచ్చే ఏకాదశులు విష్ణువు చర్యలను బట్టి శయనైకాదశి, పరివర్తనైకాదశి, ప్రబోధినే్యకాదశి, వ్రత నియమాలను బట్టి నిర్జలైకాదశి, ఫలైకాదశి, వీర పూజనాన్ని బట్టి భీష్మైకాదశి, ఇంద్రైకాదశి ఏర్పడగా, ఒక ‘‘పండు’’ (ఉసిరిక)తో సంబంధించి ఏర్పడింది ఒక్క అమలకి ఏకాదశి మాత్రమే.
స్మృతి కౌస్త్భుం, కృత్యసార సముచ్చయం, తిథితత్వం మున్నగు గ్రంథాలు కార్తీక మాసంలో అమలకి వృక్ష మూలాన ఉసిరిక కాయలతో, ఉసిరిక పత్రితో దైవారాధన చేయాలని, తులసితో పాటు కాయతో కూడిన ఉసిరిక కొమ్మను పూజించాలని, ఉసిరిక చెట్టు నీడన అన్నం వండాలని, ఉసిరిక పండ్లు కలిపిన నీటితో స్నానం చేయాలని, పూర్ణిమ నాడు ఉసిరిక ఫల దానం చేయాలని, శిరస్సు, ముఖం, హస్తం, దేహమందు ఉసిరిక పండు ధరించాలని వివరిస్తున్నాయి.
ఉసిరిక చెట్టు నీడ సోకే కొలనులో స్నానం చేయాలని, ఉసిరిక మాని కింద అరుగుమీద ఆవాసం, పూజ, భోజనం చేయాలని పెద్దల ఉవాచ. అలాగే ఫాల్గున మాసంలో మళ్ళీ ఉసిరిక వినియోగం ఉంది. ‘‘అమలకే వృక్షే జనార్ధన: అని అమదేర్ జ్యోతిషి మున్నగు గ్రంథాలు పేర్కొంటున్నాయి. అమలక వృక్షం జనార్ధన స్వరూపమని, దాని కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని శాస్త్ర వచనం. ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు అమలకీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి తెలుపుతున్నది. సంస్కృతంలో అమలకానికి గల పర్యాయ పదాలు...అమలకం - గుణమును ధరించునది; ధాత్రి - దాది వంటిది; వయస్థ - వయస్సున నిలుపునది; ఫలరవ - సారవంతమైనది. అమృత - అమృతం వంటిది. శీతఫలి - శీతవీర్యము కలది. ప్రాణమును నిలుపునది కనుక ఉసురుకాయ అనునది సార్థక నామమని కొందరి భావన.
ఒక పేద ఇల్లాలు ఉసిరికాయలు భిక్ష పెట్టగా, ఆది శంకరులు కనకధారాస్తవం చెప్పి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారని చెపుతారు. ఇక వైద్యోపయోగానికి వస్తే...షడ్రసాల్లో ఉప్పు తప్ప మిగతా అన్ని రసాలు దీనిలో ఉన్నాయి. ఇది మహత్తర ఓషధీగుణం కలది. అమృతా ఫలమనే గ్రంథంలో దాని ఔషధీ గుణాలు, ఫల జాతులు గ్రంథంలో సర్వాంగాల యొక్క వైద్య, పారిశ్రామిక ఉపయోగాలు, వాగ్భటంలో దీని రసాయనిక, కాయకల్పాది చికిత్స ఉపయోగాలు విపులీకృతమై ఉన్నాయి.
‘‘కరతలామలకము’’ అనేసామెత తెలియని వారుండరు. అనగా అరచేతిలోని ఉసిరికాయ. ప్రాచీన ఆర్యజ్యోతిర్విద్వాంసులు ఉసిరికాయను భూగోళమునకు ఉపమగ చూపించారు. అంటే అరచేతి అమలకము వలె గోళ సర్వస్వమును తెలుసుకున్న వారైనట్లు చెప్పారు. విషయ పరిజ్ఞానం సంపూర్ణంగా ఉంటే కరతలామలకమనే సామెతను ఉపయోగిస్తారు. సర్వ ప్రపంచ సదృశమై, భగవత్ స్వరూపమై ఉన్నందనే అమలకము దానమునకు ముఖ్యముగా వ్యవహరించబడుతున్నది.

- సంగనభట్ల రామకిష్టయ్య