Others

నీటి వృథాతో తప్పదు ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోని ప్రాణికోటికి మూలాధారం నీరు. నిజానికి మానవ జాతి మనుగడ, అభివృద్ధి, నాగరికత నీటితోనే ముడివడి ఉంది. పదివేల యేండ్ల క్రితం ఆవిర్భవించిన వ్యవసాయక సమాజాలు, నాగరిక సమాజాలుగా ఆవిర్భవించిన పారిశ్రామిక సమాజాలు నీటి లభ్యతపైనే ఆధారపడి కొనసాగాయి. అందుకే నీటిని పొదుపుగా వాడుకోవాలని శాస్తవ్రేత్తలు చెపుతుంటారు. కానీ నేటి కాలంలో నీటి కొరత సమస్య శరవేగంగా తరుముకొస్తుంది. మన దేశంలో నీటి వనరుల వినియోగంలో వస్తున్న మార్పులపై కేంద్ర జల సంఘం ఇంజనీర్లు అనేకరకాల పరిశీలనలు నిర్వహించారు. ప్రపంచ జనాభాలో 18% మన దేశంలోనే ఉండగా, అందుబాటులో ఉన్న నీటి వనరులు కేవలం 4 శాతమేనని, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటిని పొదుపుగా వాడటంలో ప్రజలు మారకపోతే ముప్పుతప్పదని అంటున్నారు.
జల వనరులకు వర్షమే ఆధారం. వర్షాకాలంలో నాలుగు నెలల్లో కురిసే నీటిమీదనే మిగతా ఎనిమిది నెలల జల సంపద ఆధారపడి ఉంటుంది. జనాభా పెరుగుదల, జల వినియోగం పెరుగుదల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటిని ఎలా వినియోగించుకోవాలో, జలం లేకపోతే కలిగే నష్టాలు తెల్సుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది.
రమారమి 450 నదులు ప్రవహిస్తున్న దేశం మనది. ఏటా వంద రోజుల్లో కురుస్తున్న 70 శాతం వానల వల్ల వరదలు పోటెత్తి అపార జలరాశి వృథాగా ఉప్పు సముద్రం పాలవుతోంది. తలసరి నీటి నిల్వ సామర్థ్యం ప్రాతిపదికన రష్యా (6103 ఘనపు మీటర్లు), ఆస్ట్రేలియా (4733), అమెరికా (1964), చైనా (1111)ల సరసన భారత్ (213) వెలవెలపోతోంది. ఐక్యరాజ్యసమితి అధ్యయనం మేరకు 122 దేశాల జాబితాలో ఇండియాకు కట్టబెట్టిన స్థానం 120. శుద్ధ జలాల కొరతతో దేశంలో ఏటా రెండు లక్షల నిండుప్రాణాలు బలైపోతున్నాయి. తెలంగాణ గ్రామాల్లో 55 శాతం ఆవాసాలకు నీరు అందుతున్నా నాణ్యత కరవేనని నీతి ఆయోగ్ వేలెత్తి చూపింది. దేశవ్యాప్తంగా భూమి లోతుల్లోని నీటి వనరుల వాడకం ఏటా పెరుగుతోంది. అత్యధికంగా రాజస్థాన్‌లో 1800 నుంచి 2వేల అడుగుల వరకు బోర్లు తవ్వి నీరు తీస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రమాణాల ప్రకారం వార్షిక తలసరి నీటి లభ్యత 1,700 ఘన మీటర్ల కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటి ఒత్తిడి ఉన్నట్లు 1000 ఘన మీటర్లకంటే కనిష్ఠంగా ఉన్న ప్రాంతాల్లో నీటి కొరత ఉన్నట్లు పరిగణిస్తారు. ఈ ప్రమాణాల ప్రకారం భారత్ 2018నాటికే నీటి ఒత్తిడి దశకు చేరిపోయింది. 2040 కల్లా మన దేశంలో తాగునీటికి కరవు ఏర్పడుతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 21 శాతం అంటురోగాలు కలుషిత నీటి ద్వారానే వ్యాపిస్తున్నాయి.
భారత్‌లో 60 కోట్ల మంది ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. వీరికి అధునాతన సేద్య పద్ధతులు అలవడక పోవడంతో నీటిని పొదుపుగా వాడుకుని గరిష్ఠ దిగుబడులు సాధించడం తెలియడం లేదు. భూగర్భ జలాలు తరిగిపోవడానికి ఇదే పెద్ద కారణం. నీరు తక్కువగా ఖర్చయ్యే పంటలువేసి జల వనరుల సంరక్షణను అందరూ బాధ్యతగా స్వీకరించాలి. దేశంలో 90% నీటిని వ్యవసాయావసరాలకే వాడుకుంటున్నారు. బిందు సేద్యాన్ని అవలంబిస్తే 90% నీరు సద్వినియోగమవుతుంది.
ప్రపంచంలో తాగునీరు పూర్తిగా అడుగంటిపోయిన నగరంగా కేప్‌టౌన్ చరిత్రకెక్కింది. దక్షిణాఫ్రికాలోని రెండో అతి పెద్ద నగరం కేప్‌టౌన్. 1992లో బ్రెజిల్‌లోని రియోడిజెనిరో నగరంలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ, అభివృద్ధి సమావేశం ముందే హెచ్చరించింది. అందుకే నీటి చుక్క బంగారం కన్నా విలువైనదిగా ప్రతి ఒక్కరూ భావించాలి. నీరు అడుగంటుతున్న నగరాల జాబితాలో చైనా రాజధాని బీజింగ్ 3వ స్థానంలో ఉంది. నీటిని మనం ఉత్పత్తి చేయలేం కాని సంరక్షించుకోవాలి. కిలో బియ్యాన్ని పండించడానికి 5000 లీటర్ల నీరు అవసరమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 844 మిలియన్ల మంది శుభ్రమైన నీరు లభించక అల్లాడిపోతున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరికి సరైన తాగునీరు దొరకడం లేదు. ప్రతిరోజూ మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. రానున్న ఐదేళ్లలో సుమారు 48 దేశాల్లో తీవ్రమైన నీటి కొరత వస్తుందని చికాకోలోని జాన్ హాప్కిన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరించింది. 250 గ్రాముల బరువుండే టీ షర్టులో రెండువేల లీటర్ల నీరు ఇమిడి ఉంటుందట. అందుకే నీటిని పొదుపుగా వాడుకోవాలి లేకుంటే తప్పవు కష్టాలు!
ఈ సంవత్సర ప్రపంచ జలదినోత్సవ నినాదం- ‘లీవింగ్ నో ఒన్ బిహైండ్.’ ఎందుకంటే 2.1 బిలియన్ ప్రజలు సురక్షితం కాని నీటితో జీవిస్తున్నారట. నాలుగింటిలో ఒక ప్రాథమిక పాఠశాలలో మంచినీటి వ్యవస్థ లేదట. ప్రతిరోజు 700మంది చిన్నారులు (అయిదేళ్ల లోపు) డయేరియాతో చనిపోతున్నారు.
చిన్న దేశమైన సింగపూర్ రోజువారీ నీటి వినియోగం 43 కోట్ల గ్యాలన్లు. అందులో 45 శాతాన్ని గృహాలు వాడుకుంటే మిగతాది పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు వినియోగిస్తున్నాయి. సింగపూర్‌కు సొంత నీటి వనరులు లేకపోవడంతో మలేషియా నుంచి నీటిని దిగుమతి చేసుకుంటోంది. వివిధ కారణాల వల్ల 2061 తర్వాత నీటిని ఎగుమతి చేయలేనని మలేషియా స్పష్టీకరించింది. అప్పటికి నీటి విషయంలో స్వయం సమృద్ధం కావటానికి సింగపూర్ పలు మార్గాలు అనే్వషిస్తోంది. అందుకే పౌరులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నీటి సంరక్షణను జాతి సంస్కృతిగా తీర్చిదిద్దితేనే దాహార్తి తీరేది. నీటి అవసరాలు నానాటికీ అధికమవుతున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ నీటి పొదుపును పాటిస్తామని ప్రతిజ్ఞ చేయాలి.
*
(రేపు ప్రపంచ జల దినోత్సవం)

-కె.రామ్మోహన్‌రావు