Others

‘లాసా’లో బౌద్ధం భూస్థాపితం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుద్ధ జయంతి సందర్భంగా 1956 సంవత్సరంలో టిబెట్‌కు చెందిన దలైలామా, పంచన్‌లామా భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో వారికి గొప్ప ఆతిథ్యం లభించింది. బుద్ధగయ తదితర బౌద్ధక్షేత్రాలను వాళ్లు సందర్శించారు. తమ బౌద్ధ మూలాలను తిలకించి వారు ముగ్ధులయ్యారు. కొన్ని వారాల అనంతరం తిరిగి టిబెట్‌కు వెళ్ళారు.
ఆ సమయానికే టిబెట్‌లో చైనా పూర్తిగా పాగావేసింది. మతపరమైన కార్యక్రమాలను నిషేధించింది. బౌద్ధ ఆరామాలు, శిక్షణ, ప్రార్థనా కేంద్రాలను కూల్చివేసింది. సన్యాసుల చేత బలవంతంగా పొలాల్లో, ఇతరచోట్ల పనిచేయించారు. వ్యవసాయ పద్ధతులను మార్చారు. పంటలను మార్చారు. కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రచారాన్ని పెద్దఎత్తున చేశారు. పర్యవసానంగా పెద్ద కరవు ఏర్పడింది.
చైనాలో జరిగే విద్యాబోధనను, పద్ధతులను టిబెట్‌లో ప్రవేశపెట్టారు. బౌద్ధం ఆనవాలు కనిపించకుండా చేశారు. బౌద్ధ విగ్రహాలను ధ్వంసం చేశారు. మందిరాల్లో, ఇతరచోట్ల బౌద్ధచిత్రాలను చెరిపేశారు. పౌరుల స్వేచ్ఛ పూర్తిగా అంతరించింది. ‘‘రెడ్ ఆర్మీ’’ రాజధాని లాసాలో ప్రవేశించింది. మావో ఫొటోలు, ఎర్ర నక్షత్రాలు, ఎర్రజెండాలు, ‘‘రెడ్ బుక్స్’’ను పెద్దఎత్తున తీసుకొచ్చారు. విప్లవ నినాదాల ఘోష- ‘బుద్ధం శరణం గచ్ఛామి’ ఘోష స్థానాన్ని ఆక్రమించింది. అంతా గందరగోళం.. ప్రశాంత పరిస్థితి లేదు.. వ్యవసాయం కుంటుపడింది.. దాంతో వరుసగా మూడేళ్ళు కరవు ఏర్పడింది. రెడ్ ఆర్మీ ఆగడాలు, దౌర్జన్యం, క్షమం, ఇతర కారణాల వల్ల లక్షలాది మంది టిబెట్ పౌరులు కన్నుమూశారు. కమ్యూనిస్టుల నరమేధం కొనసాగిందంటే అతిశయోక్తి కాదు. చివరికి వేలాది మంది బౌద్ధసన్యాసులను సజీవ సమాధి చేశారు.
పరిస్థితులు విషమించడంతో దలైలామా మరికొంతమంది బౌద్ధ సన్యాసులు చైనా అధికారుల కళ్లుగప్పి ఓ రాత్రిపూట ప్రయాణమయ్యారు. దాదాపు మూడువారాల అనంతరం వారు భారతదేశానికి 1959 మార్చి నెలలో చేరుకున్నారు. తరువాత ‘్ధర్మశాల’లో తమ అజ్ఞాత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. 1963లో తమ అజ్ఞాత ప్రభుత్వ రాజ్యాంగాన్ని ప్రకటించారు. అటు టిబెట్‌లో పౌరుల సహనం నశించి వీధిపోరాటాలకు సిద్ధమయ్యారు. బౌద్ధ సన్యాసులు సైతం అసహనంతో రెడ్ ఆర్మీపై రాళ్ళ దాడి చేశారు. దాంతో రెచ్చిపోయిన రెడ్ ఆర్మీ ఊచకోత కోసింది. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. మిగిలిన బౌద్ధ ‘‘మానెస్టరీల’’ను (బౌద్ధాశ్రమాలను) నేలమట్టం చేశారు. బౌద్ధ చిహ్నాలను, గ్రంథాలయాలను పెద్దఎత్తున తగులుబెట్టారు. మొత్తం బౌద్ధ సంస్కృతి ఛాయలు కనిపించకుండా చేశారు.
రాజధాని లాసాలోకి విద్యుత్ వచ్చింది. దాంతోపాటు ఇతర సదుపాయాలొచ్చాయి. కమ్యూనిస్టు విధానాల ప్రచారం పెద్దఎత్తున చేపట్టారు. చైనానుంచి రైల్వేలైన్ వేయడంతో అనేక సరుకుల సరఫరా సులువయింది.
1979 ప్రాంతంలో చైనా ప్రభుత్వం భారతదేశంలోని ఒక టిబెట్ శరణార్థుల బృందాన్ని టిబెట్ సందర్శనకు అనుమతిచ్చింది. ఆ బృందం టిబెట్‌లో పర్యటించినప్పుడు టిబెట్ ప్రజల దుఃఖం, ఆర్తనాదాలు, ఆవేదన వర్ణనాతీతం. తమ పూర్వ పద్ధతిలోనే వారికి నమస్కారాలు, బౌద్ధపరమైన పద్ధతిలో స్వాగతాలు పెద్దఎత్తున చేయడంతో చైనా అధికారులకు చిర్రెత్తుకొచ్చింది. అప్పటికి రెండు దశాబ్దాలుగా వారికి కమ్యూనిస్టు భావజాలం నూరిపోస్తున్నా, విద్యాపరంగా మార్పులు కఠినంగా అమలు చేసినా అక్కడి ప్రజల ‘ఆత్మ’ మారలేదని గ్రహించారు.
కొన్ని నెలల అనంతరం కొత్త ఎత్తుగడను అమలు చేశారు. అదేమిటంటే.. వలస విధానం. ఈ విధానం ప్రకారం రాజధాని లాసాలో ఇతరచోట్ల చైనా పౌరులు స్థిర నివాసం ఏర్పరచుకునేలా ప్రోత్సహించారు. దాంతో లక్షలాది మందిని దింపారు. 1980-90 దశకం నాటికే టిబెటియన్లు మైనార్టీలుగా మారారు. చైనీయులు మెజార్టీ ప్రజలయ్యారు. 1966-76 వరకు కొనసాగిన కల్చరల్ రెవల్యూషన్ (సాంస్కృతిక విప్లవం) సందర్భంగా సమాజంలోని విద్య-వ్యవసాయం- భూపంపకం, పని విధానం అన్నీ సమూలంగా మార్చేశారు. చైనాలో జరిగిన ఘోర కృత్యాలన్నీ టిబెట్‌లోనూ చోటుచేసుకున్నాయి. శ్రమకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరి భరతం పట్టారు. వినకుంటే కాల్చిపారేశారు. హక్కులు... ప్రేమ... జాలి... దయ... కరుణ ఇవేవీ కలికానికైనా కనిపించకుండా చేశారు. మతాధికారులకు మరణ దండన విధించారు.
ఈ మానవ హననానికి వ్యతిరేకంగా భారతదేశంలోని ధర్మశాలలో దలైలామా అనుయాయులు వౌనదీక్షలు జరిపారు. నిశ్శబ్దంగా రోదించారు. తమ బంధువులను తలచుకుని దుఃఖించారు. తమ నేలకు పడిన సంకెళ్ళను గుర్తుచేసుకుని గుండెలవిసేలా శోకించారు.
ఈలోగా బీజింగ్‌లో ఖైదీగా, బందీగా ఉన్న టిబెట్‌కు చెందిన పంచన్‌లామా (దలైలామా తరువాతి స్థానం) మరణించాడు. తమపై ‘‘దుష్టశక్తి’’ పగబట్టిందని, స్వర్గం లాంటి ‘లాసా’శ్మశానంగా మారిందని, అక్కడి లామాల ప్యాలెస్, పెద్దపెద్ద కట్టడాలు బౌద్ధ్ధర్మక్షేత్రాలు ఊసర క్షేత్రాలుగా మారడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
అయినా దలైలామా రేడియోలో తన పౌరులకు శాంతి సందేశాలు పంపారు. బౌద్ధమతానికి వ్యతిరేక పద్ధతులు అనుసరించవద్దని విజ్ఞప్తిచేశారు. సంయమనం పాటించాలని, హింసకు పాల్పడవద్దని కోరాడు. దేవుడితో సమానంగా భావించే దలైలామా మాటను ప్రజలు ఔదలదాల్చారు. కుక్కిన పేనులా పడి ఉన్నారు. చైనా రెడ్ ఆర్మీ డ్రాగన్ బుసలుకొడుతూ ప్రజలను రాచి రంపాన పెట్టింది.
1989 సంవత్సరంలో దలైలామాకు ‘నోబెల్ శాంతి బహుమతి’ లభించింది. ఓస్లోలో ఆయన బంగారు పతకాన్ని అందుకున్నారు. తన సహజశైలిలో ప్రసంగించారు. ఒక చెంప టిబెట్‌లో బీభత్సకాండ, మానవ హక్కుల ఉల్లంఘన, అనాగరిక ప్రవర్తన, నియంతృత్వ పోకడలు, మొత్తం మతాన్ని తుడిచిపెడుతూ ఉంటే.. ఆ బాధితుల ప్రతినిధి దలైలామా శాంతి బహుమతి అందుకోవడం విచిత్రం.. బౌద్ధ్ధర్మం బోధించిన ‘‘జ్ఞానం’’ అనుసరించి, ఆత్మ ప్రబోధానుసారం ఆయన ఓస్లోలో పురస్కారమందుకున్నారు. కాని టిబెట్ ప్రజలు ఈ పురస్కారంతో సంతోషించలేదు. ఉపశమనంగా భావించలేదు, ఇసుమంత సాంత్వన పొందలేదు. ‘దుష్టశక్తి’ తమని వెంటాడుతోందని మరోసారి మననం చేసుకున్నారు. బేలగా మారిపోయారు. బౌద్ధం వారికి అంతకుమించిన ‘‘శక్తి’’ని అందించలేకపోయింది. ఈ బలహీనత కారణంగానే తమ సభ్యత- సంస్కృతిని- తరతరాలుగా వచ్చిన సారస్వత సంపదను సంపూర్ణంగా కోల్పోయారు. రిక్తహస్తాలతో మిగిలారు.
1990 సంవత్సరం ప్రారంభం నుంచి ప్రపంచమంతటా కమ్యూనిజం మసకబారసాగింది. జర్మనీలో ‘బెర్లిన్ గోడ’ కూలింది. దాంతో కమ్యూనిస్టుల ‘ప్రభ’ మసకబారసాగింది. వారి నియంతృత్వ ధోరణి, అణచివేత పోకడలు, ఆక్రమించే వైఖరికి ప్రజలు చరమగీతం పలకసాగారు. మాస్కోలో ‘మెక్‌డొనాల్డ్’ ప్రవేశించింది. అక్కడి వీధుల్లో అనేక దశాబ్దాల అనంతరం పాశ్చాత్య పెట్టుబడిదారీ సంస్కృతి కనిపించింది. చైనాలోనూ ‘కోకాకోలా’ శీతల పానీయం, ‘హాలీడే ఇన్’ సంస్కృతి ప్రారంభమైంది. చైనా తనదైన పద్ధతిలో ఈ సంస్కృతిని ఆలింగనం చేసుకుంది. హాంగ్‌కాంగ్, తైవాన్ లాంటి ప్రాంతాలతోపాటు టిబెట్ రాజధాని ‘‘లాసా’’లోనూ ఆ సంస్కృతిని ప్రవేశపెట్టింది. దాంతో వేల సంవత్సరాల బౌద్ధమత సంస్కృతి అక్కడ భూస్థాపితమైంది.
(దలైలామా భారత్‌కు వచ్చి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా)

-వుప్పల నరసింహం 99857 81799