Others

కావాల్సింది రామరాజ్యమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సప్తపురాల్లో అయోధ్య సర్వశ్రేష్ఠం. శ్రీరాముడు దశావతారాలలో విశిష్ఠమైన అవతారం. 84 లక్షల ప్రాణికోటిలో మానవుడు ఒక పరిణితి చెందిన జీవోత్తముడు. సాక్షాత్తు ఆ పరంధాముడే పురుషోత్తముడైన మానవుడుగా అవతరించాడు. ఆదర్శమానవుడై ముల్లోకాల్లోనూ కీర్తిగడించాడు. మూర్త్భీవించిన ధర్మంగా, సాక్షాత్కరించే దైవంగా పేరెన్నిక గన్నాడు.
11వేల సంవత్సరాలు అయోధ్యానగరాన్ని అయోధ్యగా చేసుకొని కోదండరాముడు పరిపాలించాడు. అప్పుడు అక్కడ జారులు, చోరులు, అవిద్యావంతులు లేరు. అందరూ ఆనందచిత్తులు, ధర్మపరాయణులే ఉండేవారు. రాముడిని మించిన రాజుకాని, సీతనుమించిన భార్య కానీ ఈలోకంలో ఎవరూ లేరు. అందుకే కొత్త వధూవరులను సీతారాముల్లాగా కలసిమెలసి జీవించండి అని దీవిస్తారు. హనుమన్నకు మించిన బంటు , లక్ష్మణుని మించిన సోదరుడు కూడా ఎవరూ లేరు. అందుకే సేవకునిగా ఉండాలంటే హనుమంతుని ఆదర్శంగా తీసుకోవాలంటే రామలక్ష్మణుల వంటి భ్రాతు బంధం ఉండాలంటారు.
రాముడి పేరునాలుక మీద, రూపం గుండెల్లో అపురూపంగా దాచుకున్న భక్తసమాజం ఊరూర తిరుగుతూ రామమందిరం నిర్మించి నిత్యపూజ్యలు నిర్వహిస్తూ ఉంటుం ది. రామకథాగానం చేసే హరిదాసులు శ్రవణానందంగా సామాన్యులు వినిపించటం, కవిపండితులు రామాయణ కావ్యానికి అనుసృజనలు చేయడం, వ్యాఖ్యానాలు ఇవ్వడం రామనామం శ్రీకారంగా చుట్టటం మహద్భాగ్యంగా తలుస్తారు.
రాముడే దైవం రామనామమే తారకమై ఈ లోకంలోని జీవులకు దారిచూపిస్తుంది. కేవలం మనుష్యులే కాదు దేవ, దానవ,సర్వప్రాణి కోటి అన్నీ శ్రీరాముని గుణగణాలకుదాసోహమై మెలుగుతున్నాయి. ప్రేమ, దయ, కారుణ్యం , వినయం, విధేయత, మర్యాదపురుషోత్తముడైన శ్రీరామునికి సహజాభరణాలుగా వెలిగొందేవి. వాటిని అందరూ తమవిగా చేసుకోవాలని రాముని బాటలో నడవానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు రాముని బాట పడుతారు. మరికొందరు ప్రయత్న విఫలురై మరికొద్ది కాలంలోనే తిరిగి ‘రామా మమ్ము కరుణించవా’ అంటూ రాముని బాటను వెదుక్కుంటూ ఉంటారు.
రాముని మైత్రీ సౌందర్యం, శరణాగత వాత్సల్యం అనితర సాధ్యం. వనవాసక్లేశాలను అనుభవిస్తూ కాలంగడిపే సమయంలో రావణుడు సీతమ్మను అపహరించుకుపోతే రామునిలో కన్నీట వరద ఏరులై పారింది. అదిగో అపుడే రాముని దుఃఖాన్ని చూచి చెట్టూ పుట్టలు కూడా కన్నీళ్లు కార్చాయి. ఆ దుఃఖాన్ని పోగొట్టడం కోసమే చిన్న ప్రాణి ఉడుత తన చేతనైనంత సాయం చేయడానికి వారథి నిర్మిస్తుంటే వడివడిగా అడుగులు వేసింది. రాముని చరితనంతా లోకాలకు చాటాలని వాల్మీకి కోకిల మధరాతి మధురంగా రామకథాగానం చేసింది. ఆ కోకిల స్వరాన్ని అనుకరిస్తూ బహుభాషల కవిపండిత లోకం అన్నీ భాషల్లోకి రామాయణకథాగానాన్ని వ్యాప్తిచెందించారు.
నవరసాల్లో కరుణ రసం తలమానికమై నిలవడానికి కారణం ‘మానిషాద...’ అన్న శ్లోకావిర్భావమే అని కవులంతా ముక్తకంఠంతో చాటారు. ‘‘కట్టె కొట్టె తెచ్చె’’ అని మూడు ముక్కల్లో రామాయణాన్ని నింపుకున్నారు. ఆరుకాండల్లోను నిక్షిప్తం చేసుకొన్నారు. ఉత్తరకాండఅంటూ ఏడు కాండల్లోను రామాయణాన్ని విస్తరింపచేసుకొన్నారు. కథ, పాట, గేయం నవల అంటూ ఎన్ని సాహితీ రూపాలున్నాయో అన్ని రూపాల్లోకి రామకథను చొప్పించారు.
ఇన్ని ఏళ్లు గడిచినా అయోధ్య ఉనికి చెదరలేదు. పేర్లు మారినా ఊర్లు మారలేదు. అయోధ్యనగరంలో ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. మానస సరోవర జాహ్నవీ తోయమే సరయూరూపంలో అయోధ్యానగరాన్ని పరివేష్ఠించింది. రామతీర్థంలో తీర్థమాడిన సర్పం దివ్యరూపం ధరించి స్వర్గారోహణం చేసినట్టుగా పురాణ గాథలున్నాయి. అయోధ్యలో ఉన్న తీర్థాలన్నీన స్వర్గ ద్వారాలతో సమానంగా సేవించటం అనాదిగా వస్తున్నదే. అక్కడున్న శ్రీరామ చంద్ర సభా, దంతధావన్ సంత్ హనుమాన్ ఘడ్ , కనకభవన్ (సీతారసోయి) స్వర్ణఖాన్ , యజ్ఞవేది , తిలోదకిగంగా, సీతాకుండ్, జానకీఘాట్, విద్యాకుండ్, మణి పర్వతం కౌసల్యా, దశరథ, కుండ్ గుఫ్తార్ వంటి ఎన్నో పుణ్యప్రదేశాలు ఇక్ష్వాకుల రాజధాని శ్రీరామ జన్మభూమిలో ఉన్నాయి. రామాయణం ఆదికావ్యం, రాముడు ఆదిపురుషుడు, సీతమ్మ ఆదిలక్ష్మి, లక్ష్మణుడు ఆదిశేషుడ, హనుమంతుడు జీవోత్తముడునాడు చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రయుక్తకర్కాటక లగ్నంలో గురువార మధ్యాహ్నం దశరథ మహారాజుకు కౌసల్యాదేవికి అందాలబాలుడు శ్రీమన్నారాయణుడు రాముడుగా జన్మించాడు. రాజకుమారుడుగా పుట్టినా సామాన్య పౌరునిగా జీవించాడు. వారు వీరనే తేడాల్లేకుండా రాముడిని సర్వజనులూ రాజుగా ఆమోదించారు. రాముని పాలనలో అందరూ సుఖించారు. అటువంటి రామరాజ్యమే కలియుగంలోను రావాలని నేటి జనులు కలలుకంటున్నారు. బ్రహ్మదేవుడు దిగివచ్చి ‘అయ్యా శ్రీరామా! నీవు పరమాత్మవు’అని చెప్పినా రాముడు మాత్రం నేను దశరథ తనయుడిని కౌసల్యానందనుడిని అని మాత్రమే చెప్పేవాడు. ధర్మాన్ని నీతిని న్యాయాన్ని తన ఊపిరిగా చేసుకొని జీవించాడు.అందరికీ ఆరాధ్యదైవంగా నిలిచాడు.

- నిరామయ