Others

అక్రమార్కులకు రక్షణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటికీ నేటికీ దళితుల్లో పేదవారి సంఖ్య అధికంగానే ఉంది. ఐతే, దళితుల పేరుతో కొందరు రాజకీయ నేతలు వేల కోట్ల రూపాయలు దోచుకోవటం న్యాయమేనా? ఉత్తరప్రదేశ్‌లో బిఎస్పీ అధినేత్రి, మా జీ ముఖ్యమంత్రి మాయావతి వంటి నేతలు దళితుల పేరు చెప్పుకొని సంపదను భారీగా పోగుచేసుకున్నారు. ప్రస్తుతం మాయావతి రకరకాల కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్నది. ఇవి యూపీఏ పాలన నాటివి. కాబట్టి ప్రస్తుత ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని నిందించి లాభం లేదు. కాకుంటే ఒక దశలో- ‘నీ కేసులను నీరు కారుస్తాము.. మాకు మద్దతు ప్రకటించు..’ అని కొందరు కాంగ్రెస్ అగ్రనేతలు మాయావతిని బెదిరించారట! తన విగ్రహాలను, పార్టీ గుర్తు అయిన ఏనుగు విగ్రహాలను, కాన్షీరామ్ విగ్రహాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేయడంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ప్రజాభీష్టం మేరకే అంతా జరిగిందని మాయావతి సుప్రీం కోర్టుకు నివేదించారు.
***
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈయన కేంద్రమంత్రిగా పనిచేశారు. సుజనా సహా మరికొందరు తెదేపా నాయకులు చంద్రబాబుకు బినామీలన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కోణంలో సిబిఐ విచారణ జరుగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ సుజనా చౌదరికి చెందిన రూ. 315 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. 364 కోట్ల రూపాయల మేరకు వివిధ బ్యాంకులకు డొల్ల కంపెనీల పేరిట ఆయన మోసం చేశారన్నది ఆరోపణ. తన ఖాతాల నుంచి వైస్రాయ్ హోటల్‌కు అక్రమంగా నిధులు తరలించినట్లు ఈడీ అభియోగం నమోదు చేసింది. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం ఈ కేసుల విచారణ జరుగుతోంది. నకిలీ ఇన్‌వాయిస్‌లతో ప్రభుత్వాన్ని మోసగించినట్లు అభియోగం. చెన్నైలోని కొన్ని బ్యాంకుల నుండి తీసుకున్న మొత్తాలను డొల్ల కంపెనీలకు తరలించారట! మహల్ హోటల్ అనే డొల్ల కంపెనీని సృష్టించారు. 24 నకిలీ రబ్బరు స్టాంపులు ఇన్‌వాయిస్ బోగస్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో వైస్రాయ్ ఆస్తులు తాత్కాలికంగా జప్తు చేయబడ్డాయి. ఇప్పుడు ఈ మొత్తం ఉదంతానికి తెలుగుదేశం పార్టీ సంజాయిషీ చెప్పవలసి ఉంది.
* * *
మన రాజ్యాంగ నిర్మాతలు మొదటి ఐదు సంవత్సరాలకు రిజర్వేషన్లు నిర్దేశించారు. తర్వాత మరొక ఐదు సంవత్సరాలు పెంచారు. ఆ తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రిజర్వేషన్లు శాశ్వతం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను రాజ్యాంగం ఒప్పుకోదు. ఐనా ముస్లిములకు తెలంగాణ ప్రభుత్వం 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. తమిళనాడులో 60 శాతం మొత్తం రిజర్వేషన్లు దాటాయి. ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ వర్గాలు అన్ని పార్టీలకూ ఓటు బ్యాంకులుగా ఉపయోగపడుతున్నాయి. మల్కాజ్‌గిరి ఇండియాలో అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడ ఐదు లక్షల మంది బ్రాహ్మణులు ఓట్లు ఉన్నాయి. ఐనా సరే ఎప్పుడూ బ్రాహ్మణ అభ్యర్థి గెలువలేదు. ఎందుకని?
సీమాంధ్రలో కమ్మ-రెడ్డి- కాపు అనే మూడు సామాజిక వర్గాల మధ్యనే రాజకీయ సంగ్రామం జరుగుతున్నది. తక్కిన బ్రాహ్మణ- వైశ్య- క్షత్రియ సామాజిక వర్గాలు ఏదో ఒక ఉన్నత కులం పంచన చేరుతున్నాయి. ఈ కుల రాజకీయాలు రాజ్యాంగ విరుద్ధం. ఎమర్జెన్సీ రోజుల్లో కమ్యూనిస్టులు రాజ్యాంగాన్ని మార్పించి బలవంతంగా ‘సెక్యులర్’ అనే పదాన్ని ఇందిరాగాంధీ చేత రాజ్యాంగంలో ప్రవేశపెట్టించారు. రాజస్థాన్‌లో గుజ్జర్ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వారు రెచ్చగొడితే వాళ్లు రైల్వేస్టేషన్లను పరుశురామ ప్రీతి చేశారు. ఇలా రాజకీయ లబ్ధికోసం కులాల కుమ్ములాటలను ప్రేరేపించి ఎన్నికలలో ఓట్లు సంపాదించుకొని ప్రజల నెత్తిమీద సవారీ చేస్తున్నారు. ఆనాటి చండ్ర, మాకినేని కాలం నుండి ఈనాటి తమ్మినేని వీరభద్రం వరకు ఒక కులం వారే సీపీఎం రాజకీయాలను శాసించటం గమనార్హం.
***
పత్రికలకు, సోషల్ మీడియాకు కొన్ని పరిమితులున్నాయి. అందులో సభ్యత కలిగిన భాషను వాడుతారు. రాజకీయవేత్తలకు ఇది వర్తించదా? ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవటం సభ్యత అనిపించుకుంటుందా? ప్రధాని నరేంద్ర మోదీని నపుంసకుడు అని తిట్టినవారిని ఎందుకు జైలులో పెట్టలేదు? ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? మోదీని నూటొక్కసార్లు తుపాకీతో కాల్చి చంపండి అని సీపీఐ నేత కె.నారాయణ అన్నప్పుడు గతంలో ఏపీ ప్రభుత్వం ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు? రాహుల్ గాంధీ అయితే మోదీని మృత్యు బేహారి అన్నాడు. మరో కాంగ్రెస్ నేత వేణీప్రసాద్ వర్మ మోదీని ‘నర రక్తం రుచి మరిగిన పెద్దపులి’ అన్నాడు. మొఘల్ సరాయ్‌లో దీనదయాళ్ ఉపాధ్యాయను చంపింది ఎవరు? శ్రీనగర్‌లో శ్యాంప్రసాద్ ముఖర్జీని హత్య చేసింది ఎవరు? రాయలసీమలో పరిటాల రవిని చంపింది ఎవరు? న్యూఢిల్లీలో 1984లో 4000 మంది సిక్కులను నరమేధం చేసిందెవరు? ఎవరు నర రక్తం రుచిమరిగిన పులులు?? తిలక్ తల్వార్ ఔర్ తరాజూకోమారో’ అన్నది మాయావతి నినాదం. తిలక్ అంటే బ్రాహ్మణుడు, తల్వార్ అంటే క్షత్రియుడు, తరాజూ అంటే వైశ్యుడు, మారో అంటే చంపండి అని అర్థం. ఈ నినాదం ఇచ్చిన మాయావతిపై కేసు ఎందుకు పెట్టలేదు? సోనియా గాంధీని భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి ‘బ్రహ్మరాక్షసి’ అని తిట్టాడు. ఇలా నిందారోపణలు, తిట్ల దండకాలు రాజకీయాల్లో ఉండాలా?
***
మోత్కుపల్లి నరసింహులు తెలంగాణలో అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. తెదేపాలో పదవిని ఆశించి భంగపడ్డాడు. విజయవాడలో ఇటీవల నిరశన దీక్ష చేశాడు. ఆ సందర్భంగా ఆయన లేవనెత్తిన అంశాలు గమనార్హాలు. రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం హైదరాబాదు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. అలాంటప్పుడు తెలంగాణలోని ఆంధ్రుల నోట్లో మట్టి కొట్టి చంద్రబాబు ఎందుకు ఏడాదిలోనే రాజధానిని అమరావతికి తరలించాడు? పార్టీ కోసం పనిచేసిన సీనియర్ కార్యకర్తలను పక్కనపెట్టి తన కుటుంబ సభ్యులకే చంద్రబాబు ఎందుకు పదవులు కట్టబెట్టాడు? నాలుగేండ్లు భాజపాతో అంటకాగి, ఆ తర్వాత తెలంగాణలో తెదేపాకి అడ్రసు కూడా లేకుండా చేశారు. ఎన్‌టిఆర్ స్థాపించిన తెలుగుదేశాన్ని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తాకట్టు పెట్టాడు? కుల రాజకీయాలు నడిపి, అట్టడుగు వర్గాలను ఎందుకు పట్టించుకోలేదు? ఈ ప్రశ్నలకు నారా వారు సమాధానం చెప్పవలసిందే?! ప్రతి ఉద్యమానికి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంటుంది. 1947కు ముందున్న కాంగ్రెసు ఒక జాతీయ మహోద్యమం. నేడు అందులో సోనియా, రాహుల్ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యాలయాలకు తాళాలు పడటం ఆ పార్టీ స్వయంకృతాపరాధమే.
***
అన్నా హజారే గాంధేయవాది. ఆయనకు కొందరు శిష్యులున్నారు. అందులో అరవింద్ కేజ్రీవాలా ఒకడు. ఇతడు ‘గురువును ముంచిన శిష్యుడు’. ‘ఇతడు నా శిష్యుడని చెప్పకోవడానికి సిగ్గుపడుతున్నాను’ అని స్వయంగా అన్నా అన్నాడు. అరవింద్ ఏ దేశం కోసం పనిచేస్తున్నాడు? ఇతడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటూ అప్రతిష్ట మూటకట్టుకున్నాడు. ‘మోదీ గెలిస్తే ఇక దేశంలో ఎన్నికలు ఉండవు’ అని ప్రజలను భయపెడుతున్నాడు. మరి ఇతని మీద ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? భారత్‌ను ముక్కలు ముక్కలు చేసి, పాకిస్తాన్‌కు కశ్మీరును ధారాదత్తం చేయండని పిలుపునిచ్చిన విద్యార్థి ఉద్యమ నాయకుడు కన్హయ్యకుమార్‌కు సీతారాం ఏచూరి, రాహుల్ గాంధీ, కేజ్రవాలా ఎందుకు మద్దతు ఇస్తున్నారు?
***
ఎన్నికలకు ముందు వివిధ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలు విడుదల చేశాయి. కాంగ్రెస్ పార్టీ తన ఘోషణాపత్రంలో ‘గరీబీ హఠావో’ నినాదాన్ని ప్రస్తావించింది. ఇది 1950వ దశకంలో ఇందిరా గాంధీ ఇచ్చిన పిలుపే. ఐనా గరీబీ పారిపోలేదు. ఎందుకని? కాంగ్రెసు మరొక ప్రమాదకరమైన హామీని ఇచ్చింది భారత శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 124ఎ- 499 సెక్షన్లను రద్దుచేస్తానంటోంది. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు, పాక్ ప్రేరేదిత జిహాదీలు ఎవరూ ఇక మీద అరెస్టు చేయబడరు. వారిని కోర్టులు శిక్షించలేవు. ఆ మేరకు రాజ్యాంగాన్ని సవరిస్తారు. ఈ హామీలను కశ్మీరు నాయకులు ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ స్వాగతించారు. దీనినిబట్టి ఏం తెలుస్తున్నది?? కొందరు రాజకీయ లబ్ధికోసం ఎంతటి దుర్మార్గాన్నికైనా సిద్ధంగా ఉన్నారని తేలటం లేదా? అంబి, జయచంద్‌మీర్ జాఫర్‌లు ఎప్పుడో చరిత్ర యుగంలోని వ్యక్తులు. ఇవాళ మన కళ్లముందు ఇంత దారుణాలు జరుగుతుంటే ప్రజలు ఎందుకు స్పందించటం లేదు?

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్