Others

బెట్టింగ్ రాయుళ్లకు నిత్యం పండగే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో తెలుగు రాష్ట్రాలలో ‘బెట్టింగ్’ అంటే గుర్తుకొచ్చేది ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పర్వదినాలలో జరిగే కోడి పందేలు మాత్రమే. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాల్లో ఎక్కడ వున్నా ఆరోజు సొంత గ్రామాలకు చేరుకోవడం, బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ ఇలాంటి పందేలలో సరదాగా పాల్గొనడం ఆనవాయితీ. కాలక్రమేణా ఎన్నో మార్పులు జరిగాయి. పట్టణాలలో నివసించేవారిలో కొందరు వివిధ ఆటలలో పందెం కట్టేవారు. అదికాస్తా నేడు కుగ్రామాలకు సైతం చేరుకొని సాధారణ మానవునికి చరవాణి రూపంలో అరచేతిలో నిల్చింది. స్థానిక సంస్థలు మొదలుకొని పార్లమెంటు ఎన్నికల వరకు బెట్టింగ్‌లు జరిగాయి, ఇపుడూ జరుగుతూనే ఉన్నాయి.
క్రికెట్ ఆటలో ఐపీఎల్ ‘ట్వంటీ 20’ మ్యాచ్‌లొచ్చాక ప్రతి సంవత్సరం దాదాపు రెండు నెలల దాకా బెట్టింగ్ రాయుళ్ళకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇపుడు ఐపీఎల్ కోలాహలం సద్దుమణిగింది. ఇక మిగిలింది దేశానికి ప్రధాని ఎవరు? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది? ఎవరి ఎత్తులేంటి? వాటికి ప్రత్యర్థుల పైఎత్తులేంటి? మొదలైన అన్ని అంశాలపైనా బెట్టింగ్ వీరుల వద్ద తగిన విశే్లషణలు, అంచనాలు ఉంటాయి.
ఈనెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అందరిలో ఎడతెగని ఆసక్తి నెలకొనడం ఒక కోణమైతే, ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్ళది మరొక ఎత్తు. అంతటితో ముగిసేది లేదు. అసలైనది ఆంధ్రప్రదేశ్‌లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఎవరికెన్ని సీట్లు వస్తాయి? ఎక్కడెక్కడ ఎన్ని గెలుస్తారు? ఎవరెవరు గెలుస్తారు? ఎంత మెజారిటీతో గెలుస్తారు? ఇలా ప్రతి చిన్నదానికి బెట్టింగ్‌లు జరుగుతూనే ఉంటాయి. ఒకటి ముగిసిపోతే మరొకటి.. ఇలా బెట్టింగ్ వీరులు విసుగు, విరామం లేకుండా గడుపుతారంటే ఆశ్చర్యపోనక్కరలేదు.
బెట్టింగ్ అనేది చట్టరీత్యా నేరమన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు పట్టణాలు, నగరాలలో జరిగే ఈ తంతు కాస్తా పల్లెలలోకి వచ్చి పడింది. చిన్న చిన్న పట్టణాల్లో సైతం ఏజెంట్లు, బ్రోకర్లు ప్రత్యక్షమవుతున్నారు. లక్షలు, కోట్ల రూపాయలలో బెట్టింగ్‌లు మహాజోరుగా, గుట్టుగా జరుగుతున్నాయి. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా అత్యంత పకడ్బందీగా వీటిని నిర్వహిస్తున్నారు. ఈమధ్య జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో, ‘పొట్టి క్రికెట్’ పోటీలలో చాలా బెట్టింగ్‌లు జరిగాయి. ఒకరి మొహం ఒకరికి తెలియదు, అంతా ఫోన్ సంభాషణతో, బ్యాంకు అకౌంట్లతో జరిగాయి. బెట్టింగ్ ఓడిపోతే అకౌంట్‌లో డబ్బులు తగ్గుతాయి, గెలిస్తే జమ కావడం జరుగుతుంది. అంతా రహస్యంగా నడుస్తుంది. ఇందులో తెలివిగలవారు మరొక రకమైన వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. వారి స్నేహితులను ఉసిగొల్పి అందరితో వసూలుచేయడం, గెలిస్తే ఇంత.. ఒడిపోతే ఇంత.. అనే సాకుతో కమీషన్ల కోసం లక్షలు సంపాదించే వారున్నారు. వేలకు వేలు పోగొట్టుకున్న వారున్నారు. పోలీసులకు పట్టించడానికి ప్రయత్నించినప్పటికీ సరైన ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడుతున్నారంటే- వీరు ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుకుంటున్నారో అర్థమవుతుంది.
లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే బెట్టింగ్ భారీ స్థాయిలో జరిగే ఉంటుంది. ఈ వారం రోజుల్లో అది కాస్తా శిఖర స్థాయికి ఎదుగుతుందని అంచనా వేయవచ్చు. వీటిని నిలుపుదల వేయడానికి ప్రభుత్వం సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనికోప్రత్యేక యంత్రాంగాన్నీ ఏర్పాటుచేసి నిలుపుదల చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇలాంటి కార్యకలాపాలలో ధనవంతులు, డబ్బున్నవాళ్ళు ఏదో కాలక్షేపం కోసమో, సరదా కోసమో పాల్గొనవచ్చు. కానీ పేదవాళ్ళు సైతం వారి దగ్గరున్న ఆస్తులను తాకట్టుపెట్టి ఇందులో పాల్గొనడం, వారి కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతినడానికి దారితీస్తుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన వున్నది.
ఎక్కడైనా ఇలాంటి బెట్టింగ్‌ల గురించి తెలిస్తే గనుక- వెంటనే పోలీసులకు సమాచారానిచ్చి, పేదల కుటుంబాలను ఆదుకునేందుకు అందరూ సహకరించాలి. ఇలాంటి సరదాలకు పాల్పడకుండా కష్టించి పనిచేసుకొని, నాలుగు డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. కష్టపడకుండానే ఎకాఎకిన డబ్బు సంపాదించాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. కానీ దానివల్ల లాభంకంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. డబ్బు సంపాదించినవారు సంబరాలలో మునిగితేలుతుంటే, నష్టపోయిన వారి కుటుంబాలలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కావున ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటిని బహిష్కరించడంలో ఎవరికివారు కృషి చేయాలి.

-డా. పోలం సైదులు 94419 30361