Others

మహదానందాన్నిచ్చే ఉమామహేశ్వరస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదో దట్టమైన అరణ్య ప్రాంతం. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలలో విస్తరించి ఉన్నా నల్లమల్ల అటవీప్రాంతం. అందులో నాగర్ కర్నూల్ జిల్లాల్లోని అచ్చంపేటకు అతిచేరువులో ఉన్న కొండ ప్రాంతం ఉమామహేశ్వరం. అక్కడి ప్రకృతి లోని రమణీయత. ఆహ్లాదకరమైన వాతావరణం చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి నడక మార్గంతోపాటుగా వాహనాలు వెళ్లటానికి రహదారికూడా ఉంది.
దేవాలయం చుట్టుపక్కలా, కొండపైన అద్భుతమైన జలధారలున్నాయి. ఈ జలధారల్లోని నీరు మండువేసవిలోకూడా మంచుముక్కల్లాగా చల్లగా ఉంటుంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటకు 14.కి.మీ. దూరంలో నల్లమల అటవీప్రాంతంలో కొలువైన శివపార్వతుల ఆలయమే ఉమామహేశ్వరాలయంగా దర్శనీయ స్థలాల్లో ప్రముఖమైందిగా ప్రసిద్ధిచెందింది.
ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించినట్లు చారిత్రకాధారాలు చెబుతున్నాయి. క్రీ.శ. 14వ శతాబ్దంలో మాదానాయుడు కొండపైకి వెళ్లేందుకు 600మెట్లు నిర్మించారట. వేల సంఖ్యలో సందర్శకులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తారని ఇక్కడి నివాసితులు చెప్తారు. ఇక విశేషమైన రోజుల్లో, పర్వదినాల్లో ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చి ఉమామహేశ్వరులను దర్శించుకుంటారు.
ఈ ఉమామహేశ్వరాలయాన్ని రెండవ శ్రీశైలంగా కొనియాడుతారు. ఈ శివుడిని పరిణయమాడడానికి పార్వతీదేవి ఇక్కడే తపస్సు చేసిందని పురాణ కథనం. ఈకొండ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఈ కొండ పక్కనే పాపనాశిని అనే ఐదు ధారలతో నీరు కొండపైనుంచి జారి ఒక్క చోట చేరి అక్కడ నుంచి కిందకు పారుతూ ఉంటుంది. ఈ ఐదుధారల నీటిలో స్నానం చేసిన వారికి రోగవిముక్తి కలుగుతుంది. అంత్యమున శివసాయుజ్యం ప్రాప్తవౌతుంది అని శాస్త్ర వచనం. కొండ కిందిభాగాన్ని భోగ మహేశ్వరం అని పిలుస్తారు. ఇక్కడున్న ఐదు దేవాలయాల్లో ఐదు శివలింగాలున్నాయి. పంచలింగాలు, జంట లింగాలున్న గుడులు కూడా ఇక్కడ లెక్కకు మించి ఉన్నాయి.
కొండపైన ఉమామహేశ్వరుని దర్శనానికి ముందుగా ఉన్న విఘ్నేశ్వరుని దర్శించుకుని తమకు శుభాలు కలుగాలని యాత్రీకులు కోరుకుంటారు. ఆలయ గోడలపైన శిల్పాలతోపాటు శాసనాలు కూడా చెక్కిఉండడం ఇక్కడి ప్రత్యేకత.
హైదరాబాదు, శ్రీశైలం, మహబూబ్‌నగర్ ల నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న ఈ ఉమామహేశ్వరానికి వెళ్లడానికి నిరంతరం వాహనసౌకర్యం ఉంది. ఇక్కడున్న గుహల్లో ఎందరో మునులు ఇప్పటికీ తపస్సు చేసుకొంటూ ఉంటారని అంటారు. ఇక్కడ నుంచి శ్రీశైలానికి సొరంగమార్గం ఉండేదని ఆ మార్గం ఇంకా ఉందని దానిని పరిశోధించడానికి వెళ్లిన వారు తిరిగి రాలేదని అంటారు. ఇక్కడున్న అటవీప్రాంతంలో ఎన్నో వైద్యానికి పనికివచ్చే మూలికలున్నాయని వీటిని సేకరించడానికి ఆయుర్వేద పరిశోధకులు వస్తుంటారని ఇక్కడి వారు చెబుతుంటారు.
ఈ ఉమామహేశ్వరాన్ని పర్యాటక ప్రదేశంగా మారిస్తే ఎంతో బాగుంటుంది. విదేశీయులు సైతం ఇక్కడి రమణీయతకు పరవశులై వస్తారని భక్తులంతా ఉమామహేశ్వరుని దర్శనం కోరి వేలలక్షల సంఖ్యలో వస్తారని వారికోసం సౌకర్యాలను కల్పిస్తే అటు దేవాలయం ఇటు పర్యాటకమూ రెండూ దిన దినప్రవర్థమానం అవుతాయని దీనికోసం భక్తులు, ప్రభుత్వమూ ప్రయత్నాలు చేయాలని ఇక్కడి నివాసితులు కోరుకుంటున్నారు.

- డా. పోలం సైదులు 9441930361