Others

హాస్య గీతాల స్వర్ణలత (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా సంగీతంలో యుగళ గీతాలతోపాటు హాస్య గీతాలూ స్వర్ణయుగ కాలంలో
అత్యధికంగా జనరంజకమయ్యాయి. సామాన్య జన జీవనంలో భాగమై ప్రజాదరణ పొందాయి.
ఒక్కసారి వెనక్కి వెళదాం.
కాశీకి పోయాను రామాహరి (అప్పుచేసి పప్పుకూడు- 1959). అంచెలంచెలు లేని మోక్షం (శ్రీకృష్ణార్జునయుద్ధం- 1960). విన్నావా నూకాలమ్మా (రాణీరత్నప్రభ- 1960). ఏమిటి ఈ అవతారం (చదువుకున్న అమ్మాయిలు- 1960). రత్తమ్మో రత్తమ్మో (అన్నపూర్ణ). చక్కనిదానా చిక్కనిదానా (శాంతినివాసం- 1960). ఇలా రాసుకుంటూ పోతే ఇంకా ఎన్నో అలనాటి హాస్య గీతాలు సామాన్య జనాదరణ చూరగొన్నవి గుర్తుకొస్తాయి. గమ్మత్తేమిటంటే ఈ పాటలన్నిటినీ ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, జి గోపాలం మొదలగు గాయకులతో కలసి ఆలపించిన ఏకైక గాయని స్వర్ణలత. ఈ గాయని అసలు పేరు మహాలక్ష్మి. హాస్యనటుడు కస్తూరి శివరావు సిటెడాల్ ప్రొడక్షన్ పేరిట నిర్మించి, దర్శకత్వం వహించిన పరమానందయ్య శిష్యులు చిత్రం ద్వారా మహాలక్ష్మిని గాయనిగా తెలుగు సినిమా రంగానికి పరిచయం చేస్తూ మహాలక్ష్మి పేరును స్వర్ణలతగా మార్చాడు. ఆ చిత్రం తర్వాత అదే ఏడాది (1950) విడుదలైన మాయారంభ చిత్రంలోనూ శివరావు అవకాశం ఇచ్చాడు. శివరావు ఏ శుభముహూర్తాన స్వర్ణలతగా నామకరణం చేసాడోగాని స్వర్ణలత మెడ నిండా బంగారు నగలతో అలంకరించుకొని రికార్డింగ్స్‌లో కనపడేది. రెండు చేతులకు నలభై బంగారు గాజులు ధరించటం ఆమెకు చాలా ఇష్టం.
స్వర్ణలత పెద్దకుమార్తె విజయ చాముండేశ్వరికి చిన్నతనంలో మాటలు రాకపోవటం వలన సంగీత దర్శకుడు మాస్టర్ వేణు సతీమణి శకుంతల ఏసు ప్రభువును ప్రార్ధించమని స్వర్ణలతకు సలహా ఇచ్చింది. ఏసు దయతో తన కుమార్తెకు మాటలు వచ్చాయనే నమ్మకంతో బ్రాహ్మణ వంశంలో జన్మించిన స్వర్ణలత క్రైస్తవం స్వీకరించి ఏసు భక్తురాలిగా మారింది.
మీకు ఎంతమంది పిల్లలని ఎవరైనా ప్రశ్నిస్తే -19మంది అంటూ తడుముకోకుండా సమాధానం చెప్పేది స్వర్ణలత. తర్వాత నవ్వుతూ 10 కుక్కపిల్లలతో కలిపి అనేది. కుక్కపిల్లలంటే స్వర్ణలతకు చాలా ఇష్టం. స్వర్ణలత చనిపోయిన తర్వాత మనోవ్యాధితో ఐదు కుక్కలు మరణించాయి. స్వర్ణలత భర్త డాక్టరు అమర్‌నాథ్‌వలే ఆమె సంతానంలో ఐదుగురు డాక్టరు విద్యను అభ్యసించి అమెరికాలో స్థిరపడ్డారు. ఆఖరు కుమారుడు అనిల్‌రాజ్ స్వర్ణలత పేరిట మద్రాస్ నగరంలోనూ నెల్లూరు జిల్లా ఉదయగిరిలోనూ అనాథ ఆశ్రమాలు స్థాపించి పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తూ సినిమా పరిశ్రమలోని అనేకమంది నటీనటులకు తల్లి పేరిట సన్మానిస్తూ నగదు బహుమతితో సత్కరించటమే కాకుండా స్వర్ణలత ఆలపించిన సూపర్‌హిట్ గీతాలతో ఒక క్యాసెట్‌ను తయారుచేసి స్వర్ణలత అభిమానించే వారికి నేటికీ ఉచితంగా అందిస్తున్నాడు.
స్వర్ణలత మాధవపెద్ది సత్యం, ఏపి కోమలగార్లతో కలిసి అమెరికా, లండన్ మొదలగు దేశాల్లో కచేరిల్లో పాల్గొంది. 1997లో అమెరికాలో కచేరి ముగించుకొని మన దేశం చేరుకొన్నాక తమ పెద్ద కుమార్తెను చూడాలనే కోరికతో కుమారుడు అనిల్‌రాజ్‌తో కలిసి కారు ప్రయాణంలో కడప బయలుదేరింది. మార్గమధ్యంలో దొంగలు కాపువేసి కారును అడ్డగించి స్వర్ణలత వంటిపైవున్న బంగారు నగలతోపాటు పర్స్‌లోవున్న నాలుగు లక్షల రూపాయలను దోచుకోవటమే కాకుండా స్వర్ణలతతోపాటు ప్రయాణిస్తున్న కుమారుడు అనిల్‌రాజ్‌ను, డ్రైవర్‌ను కూడా దెబ్బలతో గాయపరచారు. ప్రథమ చికిత్సకొరకు కడప హాస్పటల్‌కు తరలించి, తర్వాత మెరుగైన చికిత్స కోసం మద్రాస్ హాస్పటల్‌కు మార్చారు. ఈ విషయం తెలుసుకున్న నేపథ్య గాయని పి సుశీల, యస్ జానకితో కలిసి రోజూ హాస్పటల్‌కు వచ్చి పరామర్శించేవారు. మార్చి 9 సాయంత్రం యస్ జానకి టెలిఫోన్‌లో స్వర్ణలతతో కాసేపు మాట్లాడిన తర్వాత రేపు ఉదయం (మార్చి 10న) జన్మదినం కదా స్వయంగా వచ్చి కలుస్తానని సెలవు తీసుకొంది. మరుసటి రోజు ఉదయం స్వర్ణలతకు జన్మదిన శుభాకాంక్షలతో స్వయంగా అభినందించాలని పూల బొకేలతో హాస్పటల్‌కు చేరింది గాయని జానకి. కానీ అప్పటికే స్వర్ణలత ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. స్వర్ణలత కన్నుమూసింది. జానకిని ఓదార్చటం హాస్పటల్‌లో ఎవరి తరం కాలేదు.
అనిల్‌రాజ్ తన తల్లి స్వర్ణలత జన్మదినం, వర్ధంతిని పురస్కరించుకొని రాబోయే మార్చి 10న హైదరాబాద్‌లో స్వర్ణలత ఆలపించిన గీతాలతో స్వరాంజలి సమర్పిస్తూ కొందరు ప్రముఖులను నగదు బహుమతులతో సత్కరించాలని ప్రయత్నం చేస్తున్నాడు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717