Others

చంద్రబాబు ఓటమికి కారణం- ‘నేను’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తాజాగా ఇచ్చిన తీర్పు- నారా చంద్రబాబు నాయుడికి బహుశా ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలిసారి ఎదురైన అతి పెద్ద పరాజయం అనుకోవచ్చు. అందుకు దారి తీసిన అనేక కారణాల్లో ఈ ‘నేను’ కూడా ఒకటి. ఇది తెలియాలంటే డేల్ కార్నీ అనే పెద్దమనిషి రాసిన పుస్తకం చదవాలి. చంద్రబాబు కానీ ఆయన సలహాదారులు కానీ ఈ పుస్తకం చదివి ఉండరు. దాన్ని గురించి వినివుండక పోవచ్చు కూడా.
తాను రాసిన ఓ పుస్తకంలో కార్నీ ఇలా అంటారు....
‘‘నాయకుడు అనేవాడు తన కింద పనిచేసే వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టడానికి కొన్ని పద్ధతులు పాటించాలి. వారిని అప్పుడప్పుడూ మెచ్చుకుంటూ ఉండాలి. ప్రతి మనిషికి తన పేరుపై అంతర్లీనంగా తగని మమకారం ఉంటుంది. ఎప్పుడైనా ఓ ఉద్యోగిని లేదా ఓ అధికారిని మెచ్చుకునే సందర్భం వచ్చినప్పుడు, ‘అతడు, ఆమె’ అని ఏదో పొడి పొడిగా కాకుండా వారి పేరుతో సహా ప్రస్తావిస్తే, పేరు పెట్టి మరీ ప్రశంసిస్తే అందులోని కిక్కే వేరుగా ఉంటుంది. అది కూడా నలుగురి నడుమా తమ నాయకుడు పేరు పెట్టి పొగిడితే ఇక వారి ఆనందానికి అంతే ఉండదు’’.
డేల్ కార్నీ బోధించిన విషయం ఏమిటంటే...
‘‘బాగా పని చేసేవారిని బాగా ప్రశంసించండి. ఆ పొగడ్తలు పెదవి నుంచి కాకుండా గుండె నుంచి రావాలి. అప్పుడే వాటికి నిబద్ధత చేకూరి విలువ పెరుగుతుంది’’
‘మా మంత్రులు, అధికారులు బాగా పనిచేశారు, బాగా కష్టపడుతున్నారు, అందుకే మంచి ఫలితాలు వచ్చాయి’ అనడానికీ- ‘నేను కష్టపడి పనిచేశాను, నేనే కష్టపడుతున్నాను..’ అనడానికి చాలా తేడా ఉంది. ప్రతిదానికీ ‘నేను’... ‘నేనే’ అని అనుకోవడం కూడా ప్రజల్లో చాలామందికి నచ్చలేదు. అందుకే చంద్రబాబు ఓటమికి ప్రోద్బలం చేసిన హేతువుల్లో ఈ ‘నేను’ కూడా వుంది.
అలాగే, తెలుగుదేశం పార్టీ ఓటమికి మరో కారణం ఎన్డీయే నుంచి విడిపోవడం. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ 2019 ఎన్నికల నాటికి బలహీనపడతారనే తప్పుడు అంచనాలతో, రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో అప్పటికే నిర్విరామ పోరాటం చేస్తున్న వైసీపీకి ఆ రాజకీయ ప్రయోజనం లభించకుండా చేయాలనే దురుద్దేశంతో ఎన్డీయేతో బాబు తెగతెంపులు చేసుకోవడం కూడా పొరబాటే. ‘వైసీపీ అధినేత జగన్ మోహ నరెడ్డి ట్రాప్‌లో పడకండి..’ అంటూ చంద్రబాబును హెచ్చరిస్తూ ఆ రోజుల్లో బీజేపీ అగ్రనాయకులు చేసిన ప్రకటనలు ఇక్కడ గమనార్హం. మోదీ ప్రభృతుల హితవచనాలను పెడచెవిన పెట్టడం ఒకరకంగా తెదేపాకి చేటు చేసిందన్నది నిర్వివాదాంశం.
ప్రాంతీయ పార్టీల అధినేతలను కట్టడి చేయడానికి అతులిత అధికారాలు, దేశ వ్యాప్తంగా క్షేత్ర స్థాయి కార్యకర్తల బలం, ప్రత్యర్ధులను నిలువరించడానికి తగిన ఎదురులేని వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నగల నైపుణ్యం పుష్కలంగా కలిగిన బీజేపీ అధినాయకత్వాన్ని ఎదిరించే క్రమంలో రాష్ట్రంలోని వాస్తవ రాజకీయ స్థితిగతులను విస్మరించడం తెదే పా మరో వైఫల్యంగా పరిగ ణించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత బలీయమైన శక్తిగా ఉన్న వైసీపీని పక్కన బెట్టి చాలా బలహీనమైన స్థితిలో ఉన్న బీజేపేని లక్ష్యంగా చేసుకుని యావత్ శక్తియుక్తులను కేంద్రీకరించడం రాజకీయంగా చేసిన వ్యూహాత్మక తప్పిదం. మోదీపై చంద్రబాబు నిర్విరామంగా సాగించిన పోరాటం యావత్ భారత దృష్టిని ఆకర్షించిందని అనడంలో సందేహం లేదు. మీడియా మిత్రుడిగా పేరున్న చంద్రబాబుకు ఈ ప్రచారం విస్తృతంగా లభించడంలో ఆశ్చర్యం లేదు. అయితే, ఈ క్రమంలో తెదేపాకి బద్దశత్రువుగా.. ఆ పార్టీ సంస్థాపకుడు ఎన్టీఆర్ ఆదినుంచీ భావించిన కాంగ్రెస్ పార్టీతో చెలిమి చేయడం ఆ పార్టీలోనే చాలా మందికి నచ్చలేదు. అయినా అధినాయకుడి నిర్ణయాన్ని శిరసా వహించారు. ఈ ప్రయోగం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలం అయినా చంద్రబాబు తన వైఖరి, విధానం మార్చుకోలేదు. మోదీ వ్యతిరేక కూటమిని దేశ వ్యాప్తంగా కూడగట్టేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఇది సహజంగానే బీజేపీ అగ్రనాయకులకు రుచించలేదు. ఎన్డీయేలో చంద్రబాబు మోదీని వ్యతిరేకిస్తున్నారా? లేక మోదీ లేని బీజేపీని సమర్ధిస్తున్నా రా?? అనే విషయంలో తీవ్రమైన అయోమయం నెలకొన్న మాట నిజం.
ప్రభుత్వ స్థాయిలో అంటే బడా బడా కాంట్రాక్టర్ల నుంచి బడా నాయకులకు అందే ముడుపులు కంటే ప్రభుత్వ కార్యాలయాలలో తాము చెల్లించు కోవాల్సిన ఆమ్యామ్యాల గురించే ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతారు. అలాగే, ఇన్నాళ్లుగా తమ మధ్యనే ఉంటూ ఏదో ఒక పార్టీ కార్యకర్తగా కాలినడకన తిరుగుతూ, హఠాత్తుగా ఓ రోజు కారు కొనుక్కుని తిరిగే వారిని చూసినప్పుడే సామాన్యులకు అసంతృప్తి కలుగుతుంది. అది ప్రభుత్వాలపై అసహనంగా మారుతుంది.
చంద్రబాబు ఓటమి స్వయంకృతం అయితే, జగన్ మోహన రెడ్డి సాధించిన అపూర్వ విజయం ఆయన స్వయం కృషి. పదేళ్ళ కష్టానికి ప్రజలిచ్చిన ప్రతిఫలం. గత అయిదేళ్ళ కాలంలో చంద్రబాబు చేసిన పొరబాట్లు, తప్పిదాలు చేయకుండా ఉన్నా, లేదా వాటిని జాగ్రత్తగా సరిచేయగలిగినా, తాను వాగ్దానం చేసినట్టుగా- జగన్ మోహన రెడ్డి ఆరు మాసాలలోపే మంచి ముఖ్యమంత్రి అని ప్రజలచేత అనిపించుకుంటారు. సీపీఐ నాయకుడు నారాయణ అన్నట్టు జగన్ నేలమీద, ప్రజల మధ్యన నిలబడి పోరాటం సాగిస్తే- చంద్రబాబు నేలవిడిచి సాము చేశారు. ఫలితాల్లో ఇది ప్రస్ఫుటమైంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వై.ఎస్. జగన్ మోహన రెడ్డి- తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ పదికాలాల పాటు జనం గుర్తు పెట్టుకునే విధంగా పరిపాలన సాగిస్తారని ఆశిద్దాం.

-్భండారు శ్రీనివాసరావు 98491 30595 http://bhandarusrinivasarao.blogspot.com