Others

అంపశయ్యపై భూగోళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా వాడుతున్నందున భూమి కాలుష్యం కాటుకు బలైపోతోంది.. అడవుల నరికివేత, ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీసేలా గుట్టల విధ్వంసం, భారీగా ఇసుక తవ్వివేత, పాతాళం లోతుల్లోకి భూగర్భ జలాలు. చెరువులు, కుంటలు, నదులు, చివరకు సముద్రం కూడా విషపూరిత డ్రైనేజీ కాలుష్యంతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో మురికి కూపంలా మారడం.. ఇదంతా నేడు మానవుడు చేస్తున్న ప్రకృతి హననం.. గుక్కెడు స్వచ్ఛమైన మంచి నీళ్ళు దొరకని దుస్థితి. మరోవైపు ఆహార పదార్థాలు, పండ్లు, కూరలు అన్నీ కల్తీమయం. కాలుష్యం లేని పదార్థం ధరణి అంతా వెదికినా దొరకదనే పరిస్థితి.. విపరీతంగా ఇంధనం కాల్చివేత.. ఫలితంగా వాతావరణం నిండా విష వాయువులు. స్వచ్ఛమైన గాలిని కూడా పీల్చుకోలేని పరిస్థితి. త్వరలో ఆక్సిజన్ మాస్క్‌లు వేసుకోకుండా బతుకలేని స్థితి. పరిశ్రమల నుండి వేలాది టన్నుల విష వాయువులు వాతావరణంలోకి యథేచ్ఛగా చేరుకుంటున్న స్థితి. ఈ నేపథ్యంలో భావితరాల జీవితాలు ప్రశ్నార్థకం.
కాలుష్యాల వల్ల ఓజోన్ పొరకు పెద్ద పెద్ద బిలాలు. భూమి ఉష్ణోగ్రత పెరగడం, మంచు కరిగి సముద్ర మట్టాలు ఉప్పొంగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అనేక జీవరాశులు భూగోళం నుండి మాయం, మరికొన్ని సంవత్సరాల్లో భూగోళంపై ఏ ఒక్క జీవరాశీ మనలేని దుస్థితి. అంటే ఇతర గ్రహాల్లా భూమి కూడా జీవరాశులు లేని మరుభూమిగా మారడం, భూగోళం నుండి మానవజాతి మాయం కావడం తప్పదా? మనుషులు, జీవరాశులు నివసించడానికి అనువైన ప్రదేశంగా ఉన్న ఒకానొక భూగోళగ్రహం కూడా నిర్జీవగోళంగా మారడం.. ఇదంతా ఎవరో జ్యోతిష్యులో, బాబాలో, మత ప్రవక్తలో చెప్పింది కాదు. అన్ని శాస్ర్తియ ఆవిష్కరణలను కనుగొన్న మేధావులు, శాస్తవ్రేత్తలు, నోబుల్ బహుమతి విజేతలు చెప్పింది. ఈ ఏడాది ఎండలను చూసినా ఇంతవరకు జరిగిన ప్రకృతి వైపరీత్య సంఘటనలను చూసినా- ఇవన్నీ నగ్నసత్యాలని రుజువవుతుంది. ఇలాంటి పరిస్థితి ఎలా సంభవించింది? మనిషి ధనకాంక్ష వల్ల- అధికార దాహం వల్ల- సుఖవాంఛ వల్ల- భూగోళంపైనున్న వివిధత్వాన్ని నాశనం చేయడం వల్ల- ప్రకృతి సమతుల్యతను విధ్వంసం చేయడం వల్ల ఈ దుస్థితి దాపురించింది.
రూపాయితనం, రాజ్యం, స్వంత ఆస్తి భావన, అధికార కాంక్ష, మతం, దేవుడు, యుద్ధాలు, రాజ్య విస్తరణ కాంక్ష వంటివి మొదలయ్యాక ప్రారంభమైన ఈ విధ్వంసం గత రెండు వందలేండ్లుగా వేగవంతమై ఈ శతాబ్ధిలో పరాకాష్ఠకు చేరుకుంది. సృష్టికి ప్రతి సృష్టి చేయగల ఆవిష్కరణలు, నిమిషాల్లో భూగోళాన్ని బుగ్గిచేయగల మారణాయుధాలు, అణుసామగ్రిని సృష్టించిన మనిషికి ఇది అసాధ్యమేం కాదు. కాని సత్వర చర్యలు, దీర్ఘకాలిక విధ్వంస నిరోధక చర్యలు చేయాల్సింది ఆయా దేశాల పాలకులు. పాలకులకు ఎన్నికల్లో గెలవడం, అధికారంపై ధ్యాస తప్ప భూగోళ పరిరక్షణ అనే ఆలోచనే రాదు. ప్రపంచ గ్రీనరీని రక్షించడానికి పారిస్‌లో జరిగిన ఒప్పందాలను కూడా అమలుచేయలేని పాలకులు ప్రపంచ దేశాలనేలుతున్నారు. ఈ పాలకులు, వారి అనుచర పెట్టుబడిదారులు- మానవజాతి ఏమైనాసరే, భూగోళం బుగ్గయినా సరే- తాము సుఖంగా ఉంటే చాలనుకుంటున్నారు.
ఈ విధ్వంసాన్ని ఆపాల్సిన అవసరాన్ని గురించి సైన్స్ విత్ హ్యూమన్ టచ్ సైంటిస్టులు, మేధావులు, మానవతవాదులు మొత్తుకుంటున్నారు. సూచనలిస్తున్నారు. ప్రఖ్యాత శాస్తవ్రేత్త స్ట్ఫీన్ హాంకింగ్ ఈ విధ్వంసాన్ని ఆపకుంటే- అయిదారు వందల ఏళ్లలో భూగోళం ఖాళీ అవుతుందని, మనిషి వేరే గ్రహాన్ని వెతుక్కోవాలన్నాడు. వేరే గ్రహాన్ని వెతుక్కొని మానవజాతిని అక్కడికి పంపించడం అసాధ్యమని మరికొందరు శాస్తవ్రేత్తలు అభిప్రాయపడ్డారు. జీవరాశులు నివసించడానికి అనువైన దైన ఒకే ఒక గ్రహం భూమిని రక్షించుకోవడమే సరైన చర్య. అది చేయకుంటే పాలకులను చరిత్ర క్షమించదు. కోట్ల ఏండ్లు మండుతున్న అగ్నిగోళంగా ఉండి క్రమక్రమంగా జీవరాశులకు నివాసయోగ్యంగా మారిన భూగోళాన్ని స్వల్పకాలంలోనే మనిషి విధ్వంసం చేయడం క్షమించరాని నేరం. ఈ నేరాన్ని నిర్భయంగా, నిర్లజ్జగా, ఏ పాపభీతి లేకుండా చేయడానికి పాలకులు ఇష్టపడతారో లేక సత్వర నివారణ చర్యలు చేపడుతారో నిర్ణయించుకోవాలి.
భూగోళాన్ని రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అమెరికన్ శాస్తవ్రేత్తలు గుర్తుచేసారు. ఈ చర్యలు తీసుకోకుంటే దశాబ్దకాలంలోనే మానవ సమూహం పెనుప్రమాదాన్ని ఎదుర్కోనున్నదని వాతావరణ శాస్తవ్రేత్త గ్రెస్ ఆన్నిర్ హెచ్చరించారు. దీన్ని ఒక దేశమో, ఒక ప్రాంతమో, ఒక ఖండమో, ప్రపంచంలోని కొంత భాగమో అనుసరిస్తే సరిపోదు. అన్ని దేశాలూ పరస్పర అవగాహనతో సామూహికంగా అనుసరించాలి. దీన్ని దిజ్జఱజ ఉజ జ్గ శ్రీ్గఉ (ప్రాపంచిక ప్రకృతి సంరక్షణ ఒప్పందం) అంటారు. పూర్తిగా కానున్న ఇలాంటి ఒప్పందం ఇంతకుముందు ప్యారిస్ ఒప్పందంగా జరిగింది. ఈ ప్యారిస్ ఒప్పందం మాత్రమే పూర్తి ఫలితాలను సాధంచలేదని, అది సగం ఫలితాలను మాత్రమే ఇస్తుందని ఎరిక్ డ్రైనర్ స్టెన్ అనే శాస్తవ్రేత్త చెప్పారు. భూగోళంపై జీవరాశుల వివిధాత్వాన్ని, జీవన వైవిధ్యాన్ని, వాతావరణ సమతుల్యతను కాపాడటానికి తద్వారా మానవ జాతి రక్షణకోసం ప్యారిస్ ఒప్పందం మాత్రమే సరిపోదని తాము సూచించిన ‘గ్లోబల్ డీల్ ఫర్ నేచర్’ను విధిగా అమలుచేయాల్సి ఉందని ఆ శాస్తవ్రేత్తలు సోదాహరణగా వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్టుకోసం అయ్యే ఖర్చు ప్రతి సంవత్సరం వంద బిలియన్ డాలర్లుగా నిర్దేశించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు రెండువందల దేశాలు కలిసి మొత్తంగా ఇంత ఖర్చుచేసి ఓ నిబద్ధతతో వాతావరణ పరిరక్షణ చర్యలు తీసుకుంటే పెను ప్రమాదాన్ని నివారించవచ్చు. అన్ని దేశాలకు ఇలిపి ఇదేమంత పెద్ద ఖర్చేంకాదు. ఓ చిన్న రాష్ట్రం తెలంగాణ లక్షా యాభైవేల కోట్ల బడ్జెట్‌ను, ఆంధ్రప్రదేశ్ రెండు వందల లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టే స్థితిలో ఉన్నాయంటే భారతదేశం సహా 200 దేశాలు తమ బడ్జెట్‌లలో ప్రకృతి విధ్వంసాన్ని నివారించేందుకు బడ్జెట్‌లో ప్రథమస్థానం ఇస్తే సరిపోతుంది. అత్యంత సంపన్నులు అక్రమంగా కూడబెట్టుకున్న డబ్బునంతా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని మానవజాతిని కాపాడే ప్రకృతి సంరక్షణకు ఉపయోగించవచ్చు కదా! ధనవంతులే స్వచ్ఛందంగా ఓ మంచి కార్యానికి తమ సంపదను వినియోగిస్తే మరీ మంచిది.
ప్రకృతి విధ్వంసంతో మానవజాతే మాటుమాయం కాబోతుంటే ఆ డబ్బునంతా ఏం చేసుకొంటారు? అసలు ఏ వస్తువుకైనా విలువ కట్టడానికి ‘మెదడు’ అనే ఆలోచించే అపురూప అవయవం ఉన్న మనిషి ఉండాలి కదా! ఆ మనిషి ఈ భూగోళంపై ఉండాలంటే ప్రకృతి విధ్వంసాన్ని ఆపడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. అందుకయ్యే సంవత్సర ఖర్చు రెండువందల బిలియన్ డాలర్లు మాత్రమే. అది ఏమంత పెద్ద మొత్తం కాదు. సంపన్న దేశాలు, సంపన్నులు ఈ సత్యార్యానికి పూనుకొని ప్రకృతి విధ్వంసానికి తాము చేసిన పాపాలకు కొంతయినా ప్రాయశ్చిత్తం చేసుకుంటే మంచిది. మరణశయ్యపై ఉన్న భూమాతకు ఆక్సిజన్ ఇచ్చి సజీవురాలిని చేయడం నేటి ప్రాపంచికావసరం.
(నేడు ప్రపంచ పర్యావరణ దినం)

-డా. కాలువ మల్లయ్య 91829 18567