Others

రూపాయి.. ఓ భేతాళ ప్రశ్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన రూపాయి విలువ నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అనే విధంగా పాతాళానికి పడిపోతుంది. దీనికి కారణం ఏమిటి అనేది భేతాళ ప్రశ్నలా తయారయింది. సాధారణంగా ఏ దేశమైనా తమ దేశం ద్రవ్యరాశి విలువకు సమానమైన బంగారపు నిల్వలు ఉండే విధంగా జాగ్రత్తపడతారు. ఒకవేళ దేశ ద్రవ్యరాశి ఎక్కువగా ముద్రించి ప్రచారంలోకి తెస్తే వినియోగదారుల కొనుగోలుశక్తి ఎక్కువై మార్కెట్‌లో లభ్యమయ్యే వస్తువులు, వారి వస్తుసేవలు తక్కువై ద్రవ్యోల్బణం ఎక్కువై ధరలు పెరిగే అవకాశం ఉన్నది. ఇక మరొక విషయం అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ పతనం కావడం. మనలాంటి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి ఒడిదుడుకులు తప్పవు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అభివృద్ధిచెందిన దేశాలనుంచి సహాయ సహకారాలు తీసుకొనే సందర్భాలలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం సర్వసాధారణం. కాని వీటిని అధిగమించి దేశానికి ఆర్థికపుష్ఠి చేకూర్చి అభివృద్ధిపథంలోకి పయనించాలి అంటే ప్రభుత్వ ప్రయత్నాలకు దేశ ప్రజల సహకారం ఎంతో అవసరం.
ఉత్పాదక రంగాలకే సొమ్మును ఖర్చుచేయాలి కాని అనుత్పాదక లేదా ఇతర ప్రజా ఆకర్షణ పథకాలకు ఖర్చు చెయ్యకూడదు. రాజకీయ నాయకులు చాలామంది ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ సంతుష్ఠీకరణ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజాధనాన్ని వృథాచేస్తున్నారు. ఇలాంటి చర్యలవల్ల కొన్ని వర్గాలకు వెంటనే ప్రయోజనాలు సిద్ధిస్తాయి, మరియు రాజకీయ నాయకులకు పదవీయోగాలు కలుగుతాయి. కాని దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలిగి ఒక్కోసారి ప్రభుత్వాలు కుప్పకూలిపోయి అంతర్గత కలహాలువచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా నష్టపోయిన దేశాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఇది ప్రపంచం ఆర్థికవ్యవస్థ చెప్పే నగ్నసత్యం. అందుకని ప్రణాళికాబద్ధంగా ద్రవ్యరాశిని ఖర్చుచేస్తూ దేశాలకు అభివృద్ధిపథంలోకి నడిపించవచ్చును. ఇందుకొరకు ఈ క్రింద ఉదహరించిన విధంగా చర్యలు చేపట్టడం ముఖ్యం.
1) దేశంలో వస్తుసంపద ఉత్పత్తి ఎక్కువగా చెయ్యాలి. దీనికొరకు పరిశ్రమలు స్థాపించి, నూతన పారిశ్రామిక విధానాలను, యంత్రాలను ఉపయోగించి అంతర్జాతీయ నాణ్యత కలిగిన వస్తువులను తయారుచెయ్యాలి.
2) ప్రపంచంలోని అన్ని దేశాలలోకన్నా మన దేశంలో 60% మంది యువకులు ఉన్నారు. వీరికి కావలసిన ఉద్యోగావకాశాలను కల్పించి వారి శారీరక, మేధోశక్తులను ఉపయోగించుకొని మంచి ఉత్పత్తులను సాధించవచ్చు.
3) దీనివలన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి సేవలను మాతృదేశ అభివృద్ధికి దోహదం చేయవీలవుతుంది. విదేశీ వలసలను అరికట్టుటకు వీలవుతుంది.
4) స్వదేశీ తయారు వస్తువులనే వాడే విధంగా ప్రజలు అలవాటుపడాలి. అప్పుడే మన దేశ ద్రవ్యనిధి ఇతర దేశాలకుపోకుండా ఉండుటకు వీలవుతుంది. మంచి పరిణామాలతో విలువలతో తయారైన వస్తువులను ప్రజలు వినియోగించుటకు ముందుకు వస్తారు. ప్రపంచ మార్కెట్లో కూడా మన ఉత్పత్తులు విదేశీ వస్తువుల పోటీకి తట్టుకొని నిలబడగలుగుతాయి. దీనివలన మనకు విదేశీ ద్రవ్యనిధులు ఎక్కువగా సమకూరుతాయి. మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి పథకాలు ఈ కోవకు చెందినవే.
5) విదేశీ తయారీ వస్తువుల వినియోగాన్ని సాధ్యమయినంతవరకు మన వినియోగ వస్తువులనుంచి తగ్గించాలి. మనము ఉదయం లేచి దంతధావన చెయ్యడం దగ్గరనుంచి రాత్రి నిద్రపోవువరకు ఎన్నో రకాల విదేశీ వస్తువులను వాడుతున్నాము. వీటిని అన్నింటినీ మనం జాగ్రత్తగా పరిశీలించి వివేకంతో వస్తువినియోగం చెయ్యాలి. దీనికొరకు ప్రభుత్వంవారు ప్రతినెల ప్రజల ఉపయోగార్థము స్వదేశీ కంపెనీ ఉత్పత్తులను విదేశీ కంపెనీ ఉత్పత్తుల శే్వతపత్రాన్ని ప్రముఖముగా ప్రకటించాలి. దీనివలన ప్రజలు తమ దేశప్రయోజనాలకు అనుగుణమైన వస్తువులనే వినియోగించుటకు ఆస్కారము లభిస్తుంది.
6) దొంగ కరెన్సీని అక్రమ బంగారం దిగుమతులను అరికట్టుటకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.
7) దేశ ప్రజలు ఆడంబరమైన ఖర్చులు చెయ్యకుండా పొదుపుగా వస్తువులను వాడాలి. మన దేశంయొక్క సగం విదేశీమారక ద్రవ్యం ఇంధనాల అవసరాలకే సరిపోతోంది. కనుక డీజిల్, పెట్రోల్ మొదలగు ఇంధన వనరులను క్రమశిక్షణతో వినియోగించుట అలవాటు చేసుకొని దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠముగా ఉండుటకు ప్రజలు సహకరించాలి.
8) విదేశాలలో మన దేశవాసులు చాలామంది నివసిస్తున్నారు. అక్కడి సమాజంలో గొప్ప పదవులలోను ముఖ్య పరిశ్రమలను స్థాపించి ఆర్థికంగా సంపన్నులుగా ఉన్నారు. అలాంటి ఎన్.ఆర్.ఐలు తమ సంపాదనలను తమ మాతృదేశంలో పెట్టుబడులు పెట్టుటవలన మన దేశానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. దానివలన మన దేశం ఆర్థికంగా పటిష్ఠంగా తయారై అభివృద్ధిచెందిన దేశాలతో సమానంగా ఎదుగుతుంది. ఈ విధంగా వారు తమ మాతృదేశంయొక్క ఋణాన్ని తీర్చుకున్నవారు అవుతారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ విదేశం వెళ్ళినా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అక్కడి ప్రవాస భారతీయులను జాగృతపరుస్తూ మన దేశ అభివృద్ధికి అహరహం కృషిచేస్తున్నారు. రాబోయే అయిదు సంవత్సరాలలో మోదీ నాయకత్వంలో మన దేశం ప్రగతిపథంలో ముందడుగు వేస్తుంది అని ఆశించడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.
ఇక ఆఖరుగా చిన్నమాట. ఇప్పుడు ప్రతి చిన్న మారుమూల పల్లెల్లో కూడా విదేశీ ద్రవ్య పదార్థాలైన కోకాకోలా, పెప్సీ, స్ప్రైట్ లాంటి రకరకాల వస్తువులు దొరుకుతున్నాయి. ప్రతి రోజు సాయంత్రం అయ్యేటప్పటికి కొన్ని కోట్ల లీటర్ల ఈ పానీయాలు వేలకొలది భారతీయులు కడుపులలోకి కడవలకొద్ది రహస్యంగాపోయి వారి ఆరోగ్యాలు పాడుచేయటమే కాకుండా వేల రూపాయల మన దేశ సంపద విదేశాలకు పోతున్నది. సగటు భారతీయుడు ఒక్కసారి ఇక్కడ ఆలోచించాలి. ఆ విష పూరితమైన ద్రవ పదార్థాలు త్రాగేకన్నా మన దేశీయ శీతల పానీయాలు త్రాగితే అటు మీ ఆరోగ్యాలకు ఇటు దేశ అభివృద్ధికి ఎంతో మంచిది. ఇలాంటి విదేశీ తయారీ వస్తువులను మానివేస్తే మన రూపాయి విలువ డాలర్ లాంటి విదేశీ కరెన్సీలకు సమంగా రావటం ఖాయం. ఒక్క ఆరునెలలు మాని చూడండి. దేశంయొక్క అభివృద్ధిని గమనించండి.
మన దేశంయొక్క బంగారు భవిష్యత్తు మన చేతులలోనే ఉన్నది. శ్రమించి కష్టపడి ఉత్పత్తుల సామర్థ్యాన్ని, సంపదను పెంచి, దేశీయ వస్తువులను మాత్రమే వినియోగించి, ప్రేమించిన నాడు రూపాయి యొక్క విలువ ప్రపంచ విపణి వీధిలో అగ్రభాగాన నిలుస్తుంది అనుటలో సందేహం ఇసుమంతైనా ఉండదు.

- జన్నాభట్ల నరసింహప్రసాద్