Others

పిల్లలకు పెద్దలే మార్గదర్శకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దలు లేని ఇల్లు మంత్రులు లేని రాజ్యంలాంటిదంటారు. పెద్దవారిని గౌరవించే సంస్కృతి మనది. వెనుకటితరం వారి అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిపోవాలనుకునేవారు గతంలో. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. పెద్దవారిని గౌరవించడం తగ్గిపోయింది. పిల్లలు తమ ఇంట్లోని తాతయ్య, బామ్మలాంటి పెద్దవాళ్లను అసలు లెక్కచేయడంలేదు. ఈ పరిణామం హర్షించదగ్గది కాదు.
పెద్దవారు తమ అనుభవాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుని ఉంటారు. అలాంటి అనుభవాలను తర్వాతి తరంవారు తెలుసుకోవాల్సిన అవసరం వుంది. అంతేగాకుండా పెద్దవారు పిల్లలకు ఎన్నో మంచి విషయాలు చెబుతూ వారిని గైడ్ చేయగలరు. అంతరించిపోతున్న అనేక సంప్రదాయాల గురించి, వెనుకటితరంవారు ఈ తరం పిల్లలకు చెప్పడంవల్ల పిల్లలు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు.
ప్రస్తుత స్పీడ్ యుగంలో తల్లిదండ్రులకు పిల్లలతో తీరికగా గడిపేందుకుగాని, వారితో కబుర్లు చెబుతూ వారిని ఉల్లాసపరిచేందుకుగాని టైము దొరకడంలేదు. అయితే ఇంటి దగ్గర ఖాళీగా వుండే తాతయ్యలు, బామ్మలు వంటివారికి ఆ సమస్య ఉండదు. అటువంటివారు పిల్లలను కనిపెట్టుకుని వుంటూ వారికి ఎన్నో విషయాలు తెలియజెబుతూ ఉంటారు. ఈ సాన్నిహిత్యం పిల్లలకు ఇష్టంగా ఉండటమేగాక వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందింపజేస్తుంది.
భార్యాభర్తలిద్దరూ ఉద్యగాలకు వెళ్లే ఈ రోజుల్లో ఇంటి దగ్గరుండి
పిల్లల్ని చూసుకునేది ఎవరనే సమస్య ఉత్పన్నమవుతుంది. డే కేర్ సెంటర్లలో పిల్లల్ని అప్పగించడం లేదా పనిమనుషుల్ని పెట్టుకుని వారి పర్యవేక్షణలో పిల్లల్ని ఉంచటం తప్పనిసరి అవుతుంది. వీరికంటే తాతయ్య, బామ్మలు వంటి ఆత్మీయుల పర్యవేక్షణలో పిల్లల్ని పెంచడంవల్ల ఎంతో మేలు జరుగుతుంది.
అసలుకంటే వడ్డీ ముద్దని తాతయ్యలకు, బామ్మలకు మనుమలు, మనుమరాండ్రు అంటే ఆపేక్ష ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారు తమ మనుమలు, మనవరాండ్రను జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలే అనే భావజాలం ప్రబలిన ఈ రోజుల్లో వృద్ధులైన తల్లిదండ్రులను తమతోపాటు ఉంచుకోవటానికి ఎక్కువమంది కొడుకులు, కూతుళ్ళు ఇష్టపడటంలేదు. పెద్దవారు కూడా తమ సంతానం దగ్గర ఇమడలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలు పగలంతా డే కేర్ సెంటర్స్‌లో పెరగాల్సి వస్తుంది. ఇంటికి తెచ్చినకొద్దీ సమయం కూడా తల్లిదండ్రులు తమ తమ పనులు చూసుకుంటూ, వారితో ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. ఇలాంటి కారణాలవల్ల ఒక విధంగా రోజంతా ఆత్మీయుల సాహచర్యంలో కాకుండా పిల్లలకు ఒంటరిగా వున్నట్లు అవుతుంది.
పెద్దవారిని తమకు మర్గదర్శకులుగా కాక కేవలం ముసలివాళ్ళుగా భావించి చిన్నచూపు చూస్తుండటంవల్ల కూడా పెద్దవారు మారిన పరిస్థితుల్లో సర్దుకుపోతూ తమ సంతానం దగ్గర ఉండి మనుమలు, మనుమరాళ్లను చూసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితి మారాలి. పెద్దవారిని ముసలివారుగా, చాదస్తులుగా భావిస్తూ తేలిగ్గా చూడటం మానుకుని, వారిని గౌరవించటం, వారి సలహాలకు విలువనివ్వడం మొదలుపెడితే కుటుంబ పరిస్థితులు మారిపోతాయి.
పిల్లలు కూడా తమ గ్రాండ్ పేరెంట్స్‌ను గౌరవించటం నేర్చుకుంటారు. వారిపట్ల ఆత్మీయ భావాల్ని పెంపొందించుకుంటారు. ఈ మార్పు పిల్లల్లో మానసిక బలాన్ని పెంపొందింపజేసుకోవడానికి తోడ్పడుతుంది. అండ వుంటే కొండలుదాటవచ్చన్న సామెత తల్లిదండ్రులే కాక తమకు ఆత్మీయులైన పెద్దవారు ఇంకా వున్నారన్న భరోసా పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. కొంతమంది మానసిక వైద్య నిపుణులు తాతయ్య, బామ్మల దగ్గర పెరిగే పిల్లలు ధైర్యంగా, అనవసరమైన అల్లరి పనులు చేయకుండా ఉంటున్నారని, బేబీ కేర్ సెంటర్లలో పెరిగే పిల్లలకంటే ఆత్మవిశ్వాసం అధికంగా వుంటుందని చెబుతున్నారు.
తాత ఒకప్పటి మనుమడే అన్న విషయాన్ని గుర్తుంచుకుని పెద్దవారిని తాము గౌరవించటమే కాక పిల్లలకు కూడా పెద్దవారిని గౌరవించటం, వారి మాటలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వడం నేర్పినట్లయితే కుటుంబ జీవనం ప్రశాంతంగా సాగిపోతుంది. అంతేకాకుండా వెనుకటి తరాల వారి అనుభవాలనుండి తాము నేర్చుకున్న పాఠాలతో ఈ తరంవారు తమ జీవితాలను మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోగలుగుతారు.

- పి.ఎం. సుందరరావు 9490657416