Others

శ్రీశైలంకు గోదావరి.. ‘సీమ’లో అనుమానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అం తర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం న్యాయస్థానాల తీర్పులతో సాధ్యం కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని చర్చల ద్వారా ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో ప్రయత్నిస్తే తప్ప బలవంతంగానైనా పరిష్కారం చూపడం ఎవరికీ సాధ్యం కాదు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణల మధ్య జల వివాదాలకు పరిష్కారం కనుగొనడం పట్ల రెండు ప్రభుత్వాలు గాని, చట్టబద్ధంగా బాధ్యత గల కేంద్రం గాని చెప్పుకోదగిన కృషి చేయలేక పోయాయి. ఇటువంటి సమయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్- జలవివాదాలతో పాటు విభజన సమస్యలను కూడా సామరస్యంగా పరిష్కరించుకొంటామని ప్రకటించడాన్ని అంతా హర్షించారు. అయితే, గోదావరి నీటిని శ్రీశైలంకు తరలించే ప్రతిపాదనను కేసీఆర్ చేయడం, దానికి జగన్ సుముఖత చూపడంతో పలు వర్గాలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు రాయలసీమకు నీరివ్వడానికే ఈ ప్రతిపాదన అని కేసీఆర్ చెబుతున్నా, రాయలసీమ వాసులలో నమ్మకం కుదరడం లేదు. ఈ ప్రతిపాదనపై ప్రధాన రాజకీయ పార్టీలు వౌనం వహించడం, ఎన్నికల ముందు రాయలసీమ ప్రయో జనాలకు కట్టుబడి ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిన బీజేపీ సైతం ప్రేక్షక పాత్ర వహించడంతో మరోమారు మోసానికి గురయ్యే అవకాశం ఉందని సీమ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మీడియాలో వస్తున్న వార్తలను బట్టి గోదావరి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా దిండి ప్రాజెక్టు నుంచి శ్రీశైలంలో కలుపుతారు. దీంతో ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు నీటి సరఫరాకు అవకాశం ఏర్పడుతుంది. శ్రీశైలంలో నీటిని నిల్వ ఉంచడం వల్ల రాయలసీమ ప్రాజెక్టుల కోసం వాడుకోవచ్చు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి, కృష్ణా డెల్టాలకు నీరు ఇవ్వవచ్చు. ఈ ప్రతిపాదనలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా ఆచరణలో అనేక సమస్యలు తప్పవనే హెచ్చరికలు వెల్లడవుతున్నాయి.
కృష్ణలో నీటి లభ్యత తగ్గడం వల్ల గోదావరి నుంచి శ్రీశైలంకు నీరు తరలించాలని రాయలసీమ నేతలు అంటున్నారు. ఈ వాదనలో నిజం లేదని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఏటా శ్రీశైలం నుంచి వందల టీఎంసీల నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి వదులుతున్నారు. తుంగభద్ర పుష్కలంగా నీటిని తీసుకొస్తున్నా, సీమకు నీరు అందడం లేదు. ఇందుకు కారణం శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం నిర్వహణ చేయకపోవడమే అన్న వాస్తవాన్ని మరచిపోతున్నారు.
కృష్ణ నీరు అయినా, గోదావరి నీరు అయినా కీలక నిర్ణయం జరగడమే ప్రధానం. హక్కుగా ఉన్న తుంగభద్ర నీటి నిల్వకు గుండ్రేవుల , అనంతపురం జిల్లా అవసరాల కోసం సమాంతర కాలువ, సిద్దేశ్వరం నిర్మాణం జరగాలి. గాలేరు నగరి, హంద్రీ నీవాను పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడు తూముల వెడల్పు జరగాలి. పోలవరం , పట్టిసీమ , గోదావరి జలాలు అని ఎన్ని గొప్పలు చెప్పినా సీమలో ఈ నిర్మాణాలు చేయకుండా నీరురాదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా వైఎస్ జగన్... కేసీఆర్ మాయలో పడుతున్నారా? అనే అనుమానాలను వైకాపా మద్దతుదారులు కూడా వ్యక్తం చేస్తున్నారు.
రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి ఉద్దేశించిన పోతిరెడ్డిపాడు తూముల వెడల్పు , గుండ్రేవుల , సిద్దేశ్వరం అలుగు నిర్మాణంపై వైఎస్ రాజశేఖరరెడ్డి హయం నుండి కేసీఆర్ వ్యతిరేకత వైఖరి అవలంబిస్తున్నారు. గాలేరు నగరి, హంద్రీ నీవాకు నీటి హక్కు లేదని ఆయన వాదించిన సందర్భాలున్నాయి. సీమకు కీలకం అనుకున్న దుమ్ముగూడెం నాగార్జున సాగర్ పథకాలను నీరుగార్చి, తెలంగాణ అవసరాలకు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేశారు. అలాంటి కేసీఆర్ నేడు సీమ విషయంలో సానుకూలంగా స్పందించారంటే సహజంగానే సీమ ఉద్యమ నేతలలో అనుమానం కలుగుతోంది. దిండి, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి తెలంగాణ రాష్ట్రం పూనుకుంది. దానికి 90 టీఎంసీల నీరు అవసరం. కృష్ణలో వీటి అవసరాలకు సరిపడ నీటి లభ్యత అనుమానమే. అందుకే గోదావరి నీటిని భారీ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ పథకానికి నీటిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం కార్యరూపం దాల్చడానికి- సీమ అవసరాల పేరుతో జగన్‌ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు రాయలసీమ నేతలు అనుమానిస్తున్నారు. ప్రతి రాష్ట్రం తన అవసరాలకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకొన్నట్టే- కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జగన్ వ్యవహరించని పక్షంలో ఆయనకు ప్రతికూల ఫలితాలు తప్పవు. కేసీఆర్ ప్రతిపాదనలు పరిశీలించే ముందు- సీమలో నీటి సమస్య పరిష్కారానికి కీలకమైన ఏ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని సీమ నేతలు కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమ నేతలు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిని నిర్వహించినా, ఆ ప్రాంత నీటి పథకాల పట్ల క్రియాశీలకంగా వ్యవహరించలేదని విమర్శలు ఉన్నాయి. సీమలో నీటి అవసరాలు తీర్చేందుకు తెలుగు గంగ ప్రాజెక్ట్ పేరుతో ఎన్టీ రామారావు శ్రీకారం చుట్టగా, తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు శాశ్వత నీటి వనరులు లభించేలా జగన్ వ్యవహరించవలసి ఉంది. లేని పక్షంలో రాజకీయంగా ప్రతికూలతను ఎదుర్కోవలసి రావచ్చు.
సీమలో నీటికష్టాలను తీర్చేందుకు పురుషోత్తమ రెడ్డి కొన్ని పరిష్కారాలను చర్చించారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా మారడంతో ఎవరి సహకారం లేకపోయినా కేంద్రం సహకరిస్తే పూర్తి అవుతుంది. కృష్ణా డెల్టాకు, ఉత్తరాంధ్ర అవసరాలకు సరిపడా గోదావరి నీరు అందుబాటులోకి వస్తుంది. ఇక మిగిలింది రాయలసీమ. పోలవరం అందుబాటులోకి వస్తే కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుంచి సాగర్‌కు విడుదల చేసే నీటిని పూర్తిగా నిలుపుదల చేయవచ్చు. తుంగభద్ర నీటిని పూర్తి స్థాయిలో రాయలసీమకు వినియోగించడానికి సమాంతర కాలువ, గుండ్రేవుల, జోలదరాసి, ఆదినిమ్మాయని బ్యారేజి నిర్మాణం చేయడంతో కుందూ నది నీటిని వాడుకోవచ్చు. మిగిలిన సీమ, వెలుగొండ ప్రాజెక్టుల కోసం పోతిరెడ్డిపాడును వెడల్పు చేసి గాలేరు నగరి, హంద్రీనీవా నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం నిర్వహణకు చర్యలు చేపడితే రాయలసీమ, ప్రకాశం జిల్లాలోని వెలుగొండలో నీటి సమస్యకు పరిష్కారం దొరుకు తుంది.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాకు దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయాలి. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న విధంగా గోదావరి జలాలను పూర్తి స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించే ఆలోచనలు మంచివే. కానీ గత అనుభవాలను మరిచిపోకూడదు. గోదావరి నీటిని ఉపయోగించుకునే విషయంలో- కేంద్రంలో మారిన రాజకీయ సమీకరణాల కారణంగా కేసీఆర్ ఏపీతో స్నేహంగా ఉండాల నుకుంటున్నారు. రాజకీయ సమీకరణాలలో ఇకముందు మార్పు సంభవిస్తే పరిస్థితి ఏమిటి? అందుకే తెలంగాణ ప్రభుత్వంతో చేసుకునే ప్రతి ఒప్పందాన్ని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమిళనాడులో ప్రచారం చేస్తూ గోదావరి జలాలను కావేరి జలాలతో అనుసంధానం చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని రాయలసీమలో బీజేపీ నేత హేమలతారెడ్డి గుర్తు చేస్తున్నారు. దీనిని కూడా కేంద్రం జాతీయ ప్రాజెక్ట్ గా చేబడితే రాయలసీమ సహా ఏపీకి ప్రయోజనకారిగా ఉంటుంది. అటువంటి ప్రతిపాదనను కేసీఆర్ వ్యతిరే కించే అవకాశం ఉంది. అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల మధ్య వైరుధ్యం ఏర్పడే అవకాశం ఉంటుందని ఆమె హెచ్చరించారు.
రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను సానుకూలంగా పరిష్క రించుకొంటామని ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రకటించినా ఇప్పటి వరకు కేసీఆర్ ఏపీ ప్రయోజనాలకు భరోసా ఇచ్చే లా కార్యాచరణకు పూనుకొనక పోవడం గమనార్హం. పోలవరానికి వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదులను ఉపసంహరించుకునే ప్రయత్నమే ఆయన చేయడం లేదు. అందుకనే గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించే ప్రతిపాదన తమ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని సీమలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పారదర్శకంగా, నిర్దుష్టంగా రెండు ప్రభుత్వాలు సమాలోచనలు జరపడం ద్వారా- సీమ ప్రయోజనాలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది.

-చలసాని నరేంద్ర