Others

నైతిక విలువలు నేర్పేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు కార్పొరేట్ చదువుల పుణ్యమాని ఎనలేని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఉపాధ్యాయుల అత్యుత్సాహం, మరోవైపు పిల్లల తల్లిదండ్రుల అత్యాశ వెరశి వారు పెట్టే లక్ష్యాలను చేరుకోవడానికి విద్యార్థులు నానా యాతనలు పడుతున్నారు. ర్యాంకుల పేరిట కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను రాచి రంపాన పెడుతుంటాయి. తల్లిదండ్రులు సైతం తామేమి తక్కువ కాదన్నట్లుగా చీటికీ మాటికీ ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి, తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచమని వారిపై ఒత్తిడి తేవడమే పనిగా పెట్టుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నేటి చదువులలో నైతిక విలువలు కొరవడి కేవలం చదువే ధ్యేయంగా మారేలా కార్పొరేట్ కళాశాలల వారు విద్యార్థులను మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు చదువులు మోయలేని భారంగా గుదిబండలా మారాయి అనడంలో సందేహం ఏలేదు. మరికొన్నిచోట్ల కార్పొరేట్ యాజమాన్యాల వారు క్రమశిక్షణతో కూడిన చదువుపేరిట వారు పెట్టే బాధలను తట్టుకోలేక విద్యార్థులు కళాశాలల నుంచి పారిపోవడమో లేక చదువుల పట్ల విరక్తిచెందో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇవి పిల్లల తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదనను, గర్భకోశాన్ని కలిగించే విషయాలు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు విద్యార్థుల ఆత్మహత్యలకు, వారు చదువుల ఒత్తిడికి చిత్తవుతున్న తీరుతెన్నులకు ఇలా చాలా కారణాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. తమ తోటి విద్యార్థులతోవున్న అనారోగ్యకర పోటీ వాతావరణం, ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు వారికి సర్దిచెప్పి మళ్ళీ ప్రయత్నించాలని చెప్పాల్సింది పోయి విద్యార్థులపై విమర్శల జడివాన కురిపించడం కచ్చితంగా విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మరోవైపు తోటి విద్యార్థులతో పోల్చి, తమ పిల్లలకు మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులే సూటిపోటి మాటలు అనడం వారిని తీవ్రంగా కుంగదీసి ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు నైతిక విలువలు ఎప్పుడు నేర్చుకుంటారు? దారుణ పరిస్థితుల్లో విద్యారంగం పడి కొట్టుమిట్టాడుతుంటే, ఈ విషయంపై మేధావులు, పాలకులు ఒక్కసారి ఆలోచించాలి.
ఎలాచూసినా విద్యార్థులకు కార్పొరేట్ చదువులు కత్తిమీద సాములా తయారయి, ఉన్నత చదువులు అంటేనే ఒక విధమైన భయాందోళనలు వారికి ఎదురవ్వడం సర్వసాధారణమైంది. తల్లిదండ్రులు తాము పెట్టుకున్న ఆశలను పిల్లలు నెరవేరుస్తారో లేదో అనే మీమాంస విద్యార్థులను అనుక్షణం వెంటాడుతుంది. కొన్ని సందర్భాలలో ఈ పెడ ధోరణి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణభూతమవుతున్నాయి. గుండె నిబ్బరం, ఆత్మవిశ్వాసం మెండుగాగల విద్యార్థులు మాత్రమే ఎలాంటి ప్రతికూల పరిస్థితులను అయినా ఎదిరించి విజయఢంకా మోగిస్తున్నారు. సున్నితంగా మనస్కులు, మెతక స్వభావం కలవారు, ఆత్మవిశ్వాసం తక్కువగా వున్నవారు ఈ విపరీత ఒత్తిడికి తట్టుకోలేక చతికిలపడుతున్నారు. కాబట్టి విద్యారంగంలో ఈలాంటి అనారోగ్య ధోరణులకు చరమగీతం పాడాలంటే, ఎంతసేపూ చదువే కాకుండా వారి మానసిక వికాసానికి అవసరం అయిన ఆటపాటలను కూడా నేర్పేందుకు ఏర్పాట్లుచేస్తే ఇలాంటి ప్రతికూల పరిస్థితులు విద్యార్థులకు ఎదురుకావు. ఈ విషయంలో కార్పొరేట్ కళాశాల యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు ఆలోచించాల్సిన అవసరం వుంది. అప్పుడే విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్టవేయవచ్చు. విద్యార్థులకు మంచి ఆరోగ్యకరమైన, నైతిక విలువలతో కూడిన విద్యను అందించవచ్చు.

-బుగ్గన మధుసూదన్‌రెడ్డి, బేతంచర్ల