Others

కనబడని మహమ్మారి మైక్రో ప్లాస్టిక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక యుగంలో ప్లాస్టిక్ ఉత్పత్తులు, వాటి వినియోగం పెరగడంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా పెరుగుతున్నాయి. వీటి దుష్పరిణామాలు అందరికీ ఆందోళన కలిగించేవే. చాలావరకు ప్లాస్టిక్ వస్తువులు ఒక్కసారి మాత్రమే వినియోగించేలా తయారుచేస్తున్నారు. ఫలితంగా స ముద్ర తీరాలలోను, బహిరంగ ప్రదేశాల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఇవి మనుషులకే కాదు, జంతువులకు కూడా హానికరంగా తయారవుతున్నాయి. ఇదంతా గత కొనే్నళ్లుగా మన కళ్ళకు కనిపిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించిన విషయం. ఇది కాకుండా కంటికి కనిపించని, ప్రపంచాన్ని భయపెడుతున్న విషయం మరొకటి ఉంది. అదే- ‘మైక్రో ప్లాస్టిక్!’
ఇంతకీ ‘మైక్రో ప్లాస్టిక్’ అంటే ఏమిటి? 5 మిల్లీమీటర్ల కంటే కంటికి కనిపించకుండా ఉండే సూక్ష్మప్లాస్టిక్ వ్యర్థాలను ‘మైక్రో ప్లాస్టిక్’అని వ్యవహరిస్తారు. అవి అంత సూక్ష్మ పరిమాణంలో ఉన్నాయి కాబట్టి వాటిని నిర్లక్ష్యం చేసి ఉపేక్షించడానికి వీలులేదు. ‘మైక్రో ప్లాస్టిక్’ వ్యర్థాల వల్ల కూడా మనుషులకు, జంతువులకు, పక్షులకు, జలచరాలకు ఎంతో హాని కలుగుతోంది. సముద్రంలో ‘డంప్’ అవుతున్న చెత్తలో 30 శాతం మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలే.
మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలను రెండు వర్గాలుగా విభజించారు. మొదటిది ప్రాథమిక శ్రేణి, రెండవది ద్వితీయ శ్రేణి. ప్లాస్టిక్ వ్యర్థాలను భూమిపై డంప్ చేయకుండా లేదా భూమిలో పాతి పెట్టకుండా కంటికి కనిపించని సూక్ష్మభాగాలుగా చేస్తారు. ఇవి ప్రాథమిక శ్రేణికి చెందినవి. భూమిపై డంప్ చేసిన లేదా భూమిలో పాతి పెట్టిన ప్లాస్టిక్ వ్యర్థాలు కాలక్రమేణా చీలికలు పీలికలై సూక్ష్మపదార్థాలుగా మారిపోతాయి. ఇవి ద్వితీయ శ్రేణికి సంబంధించినవి. ఇవికాకుండా మూడవ రకం మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు సైతం ఉన్నాయి. అవి మనుషులు ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నప్పుడు వాటి అరుగుదల కారణంగా ఉత్పన్నమైన సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు. వీటిని ఈమధ్యనే గుర్తిస్తున్నారు.
ప్రాథమిక శ్రేణికి చెందినవి..
ప్రాథమిక శ్రేణికి చెందిన మైక్రో ప్లాస్టిక్ పదార్థాలు ఉత్పత్తిదారులచే తయారుచేయబడినవి. మనం తరచుగా వాడే మైక్రోబీడ్స్ ఈ కోవకు చెందినవే. ముఖాన్ని శుభ్రం చేసుకునే ఫేస్‌వాష్, కాస్మోటిక్స్ వంటి సౌందర్య సాధనాల్లో మైక్రోబీడ్స్ వాడతారు. మన పళ్ళమధ్య ఇరుక్కున్న పదార్థాలను సులువుగా తొలగించేందుకు టూత్ పేస్టులలో కూడా ఈ మైక్రోబీడ్స్ వాడతారు. అసలు ‘మైక్రోబీడ్స్’ అంటే కంటికి కనిపించని అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ గోళాలు అన్నమాట. వీటిని సాధారణంగా పాలిథీన్ నుండి తయారుచేస్తారు. గతంలో సౌందర్య సాధనాల్లో బాదం వాడేవారు. అలాగే దంతాలు శుభ్రం చేసుకోవడానికి ఉప్పు వాడేవారు. కానీ ఇప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా మైక్రోబీడ్స్ చేరుస్తున్నారు. ఇలా సౌందర్య సాధనాలలో మైక్రోబీడ్స్ చేర్చడం గత 50 ఏళ్లుగా సాగుతోంది. వీటి దుష్ఫరిణామాలను ఇటీవలి సంవత్సరాలలోనే మనం గుర్తిస్తున్నాము. ఇప్పటికే చాలా దేశాలు మైక్రోబీడ్స్‌పై నిషేధం విధించాయి. అమెరికా అయితే మైక్రోబీడ్స్ లేని జలసంపద కోసం ఒక చట్టాన్ని చేసింది (మైక్రోబీడ్-ఫ్రీవాటర్ యాక్ట్ ఆఫ్ 2015).
పెద్దపెద్ద యంత్రాలు, నౌకలకు గల పాత పెయింట్ వదల్చడానికి లేదా వాటికి పట్టిన తుప్పును వదల్చడానికి ‘‘ఎయిర్ బ్లాస్టిక్ టెక్నాలజీ’’ని ఉపయోగిస్తారు. చాలా వత్తిడి, వేగంతో కూడిన గాలిని వదలడం ద్వారా పాత పెయింట్ లేదా తుప్పును వదలగొడతారు. ఈ ఎయిర్ బ్లాస్టింగ్ టెక్నాలజీలో మైక్రో ప్లాస్టిక్స్ వాడతారు. అందువల్ల చాలా త్వరగా పెయింట్ లేదా తుప్పును వదలగొట్టవచ్చు. అలా ఉపయోగించిన మైక్రో ప్లాస్టిక్ భూమిలో లేదా నదులు, సముద్రాలలో వ్యర్థాలుగా కలిసిపోతాయి. మైక్రో ప్లాస్టిక్ పదార్థాలను బయో మెడికల్ పరిశోధనలకు సంబంధించిన వివిధ ప్రక్రియలలో ఉపయోగిస్తారు.
ద్వితీయ శ్రేణికి చెందినవి..
మనం బయట పారేసే ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్థ పదార్థాలు కాలక్రమేణా ముక్కలై చిన్న చిన్న పీలికలుగా భూమిలో పేరుకుపోతాయి. ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో సరైన నిర్వహణ లేకపోవడంతో ఇలా జరుగుతుంటుంది. భూమి లోపల పొరల్లోను, నదీ, సముద్ర జలాల్లోనూ మైక్రో ప్లాస్టిక్ పేరుకుపోవడానికి ఇదొక కారణం. చేపల వేటకు వెళ్ళేవారు ఉపయోగించే పెద్దపెద్ద వలల నుండి కూడా చిన్న చిన్న పీలికలు సముద్రంలో కలిసిపోతుంటాయి.
తృతీయ శ్రేణిలో..
మూడవ శ్రేణి మైక్రో ప్లాస్టిక్‌లు- మనం ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు. ఉదాహరణకు ప్లాస్టిక్ బక్కెట్లు, డ్రమ్ములు కుర్చీలు జరుపుతున్నప్పుడు వాటి అడుగు భాగం అరగడం వల్ల వచ్చే ప్లాస్టిక్ పొడి వ్యర్థాలుగా భూమి పొరల్లోకి వెళ్ళిపోతుంది. ఇది మనం గుర్తించగలిగే పరిమాణంలో ఉండదు. వీటిని నియంత్రించడం, నివారించడం దాదాపు అసాధ్యం. సింథటిక్ ఫైబర్ వస్త్రాలను శుభ్రపరిచేటప్పుడు, సింథటిక్ రబ్బరు టైర్లు గల వాహనాలు తిరిగేటప్పుడు వాటి టైర్లు అరగడం వల్ల ఎక్కువ మోతాదులో మైక్రో ప్లాస్టిక్ ఏర్పడుతుంది.
నదులలోను, సముద్రాలలోను కలుస్తున్న మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలలో అధిక శాతం సింథటిక్ ఫైబర్ వస్త్రాలను శుభ్రం చేసేటప్పుడు ఉత్పన్నమైన వ్యర్థాలే ఉంటున్నాయి. ఇవి ఆ బట్టలు ఉతికిన నీళ్ళలో కాలువల ద్వారా నదులలో, సముద్రాల్లోను కలుస్తున్నాయి. కెనడాలోని ఒక్క ఒట్టావా నదిలో పేరుకున్న మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలలో 95 శాతం సింథటిక్ ఫైబర్ వస్త్రాలను శుభ్రం చెయ్యడం వల్ల ఉత్పన్నమైనవే ఉన్నాయి.
ఉత్పన్నమయ్యే సమస్యలు..
మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు కంటికి కనిపించని సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. వీటిని వడపోత ద్వారా నీటి నుంచి వేరుచేయడం అసాధ్యం. ఈ వ్యర్థాలు చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే చేపలు మొదలైన జలచరాలు వీటిని తిని అనారోగ్యం పాలు కావడమో, మృత్యువాత పడడమో జరుగుతోంది. మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు జల చరాలనే కాదు, భూమి పొరల్లోను, సముద్ర నదీ జలాల్లోనూ గల క్రిమికీటకాలు, సముద్ర, నదీజలాలలో తేలియాడుతూ కదలాడే నాచువంటి పదార్థాల ఉనికిని కూడా దెబ్బతీస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు పొట్టలలోకి చేరిన చేపలకు ఎప్పుడూ కడుపు నిండుగా ఉన్నట్లే ఉంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్ అరగదు గనుక వాటికి ఆకలి వెయ్యదు. ఏమీ తినకపోవడంవల్ల చేపలు చిక్కిపోవడమో, వాటి పొట్టలలోకి చేరిన ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావం వల్ల అవి చనిపోవడమో జరుగుతుంది. మైక్రోప్లాస్టిక్, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల చేపలే కాదు, సాగర జలాలు కూడా కలుషితవౌతున్నాయి. మరి ఆ చేపలనే వేటాడి తేగా తింటున్నారు అందరూ. కలుషిత సాగర జలాల నుండి తయారుచేసిన ఉప్పునే అందరూ తాము తినే వంటలలో వినియోగిస్తున్నారు. అంటే- మనం వ్యర్థాలుగా ఆవల పారేసిన ప్లాస్టిక్ తిరిగి మన శరీరాలలోకే చేరుతోందన్నమాట!
మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జలాలలో కలిసిపోతాయనుకోడానికి వీల్లేదు. ప్లాస్టిక్ అనేది ‘బయో డిగ్రేడబుల్’ కాదు. అంటే భూమిలో కాని, సాగర జలాలలో కాని ప్లాస్టిక్ కలిసిపోదు- ఎన్ని సంవత్సరాలైనా సరే. ప్లాస్టిక్‌ను తినే బాక్టీరియా ప్రకృతిలో ఇంకా ఉద్భవించలేదు. ప్లాస్టిక్ అనేది ప్రకృతి సిద్ధంగా ఉత్పత్తి చేయబడినది కాదు. మరి ప్లాస్టిక్ వ్యర్థాలను తినడానికి ప్రకృతి సిద్ధమైన బాక్టీరియా ఉత్పన్నం కావాలని ఆశించడంలో అర్థం లేదు. ఆ బాక్టీరియా కోసం ఎంతకాలం ఎదురుచూస్తాం? అందుకు బదులుగా మన వస్తు వినియోగ వైఖరిలోనే మార్పు రావాలి. అడ్డూ అదుపూ లేకుండా ప్లాస్టిక్ వస్తువులను ఉత్పత్తిచేసే పరిశ్రమలు తమ ఉత్పత్తి విధానాలను మార్చుకోవాలి. ఆ దిశగా వివిధ దేశాల ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి. చట్టాలు చెయ్యాలి. సముద్ర, నదీ జలాల ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలి.

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690