AADIVAVRAM - Others

కనె్నపిల్లల వేడుక.. ‘తీజ్’ వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ తీజ్ పండుగ బంజారా గిరిజనులలో బలమైన విశ్వాసం వుంది. పూర్వం తండాలలో కాలం కాకపోవడంతో తీవ్ర కరువు వచ్చినప్పుడు లోకం సుభిక్షంగా వుండాలని పెళ్లికాని యువతులతో ఈ తీజ్ పండుగ నిర్వహించే వారని గిరిజన బంజారా పెద్దలు చెబుతున్నారు. తీజ్ పండుగలో కీలకంగా మారిన పెళ్లికాని యువతులకు త్వరగా మంచి లక్షణాలు గల వరుడు లభించి వివాహం అవుతుందని విశ్వాసం. కాలక్రమేణా ప్రతి సంవత్సరం ఈ తీజ్ పండుగ పెళ్లికాని యువతులకు మంచి లక్షణాలు గల భర్త కోసమే చేసే పండుగగా మారిపోయింది. ఒకప్పుడు తండాలలో కరువును పారద్రోలుతుందనే నమ్మకంతో జరుపుకునే తీజ్ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని చూడటం పెళ్లికాని యువతుల వంతైంది.
ప్రత్యేకత...
తీజ్ గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగను ఆషాఢ మాసం చివరి మంగళవారం నుంచి శ్రావణమాసం మొదటి మంగళవారం రోజున ప్రారంభించుకుంటారు. గిరిజన బంజారాలు కుల దేవత అయిన సీత్ల భవానీ మాతలకు గిరిజనులు శుభకరంగా భావించే మంగళవారం రోజున పూజలు చేసి దాటుడూ (గొర్రెలు, పశువులు, జీవాలు) పండుగ ప్రారంభిస్తారు. తీజ్ పండుగ (మొలకల పండుగ) బంజారాల పండుగలకు పవిత్ర స్థానం ఉంది. బంజారాలకు ఏడుగురు స్ర్తి దేవతలు వున్నారు. వారి పేర్లు మేరమ్మ, హింగ్లా, తోల్జ, సీత్ల, ద్వాలంఘర్, కేంకళి, మంత్రాల్, బంజారా ఆడపిల్లలు ప్రధాన పాత్రధారులుగా వుండి, జరిపే పండుగ తీజ్. పెళ్లీడు వచ్చిన అమ్మాయిలు నాయకత్వంలో మిగతా అమ్మాయిలు కలిసి భక్తిశ్రద్ధలతో ఈ పండుగను ఎంతో సంబరం జరుపుకుంటారు. వీరిలో ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ బలంగా వుండేది. దానికి నిదర్శనంగా వీరి పండుగలు నిర్వహిస్తారు. మేరమ్మ, తీజ్, మంత్రల్, సీత్ల అనేవి బంజారాలకు ప్రధానమైన పండుగలు. మేరమ్మ దేవత తండాను రక్షిస్తే, తీజ్ పంటలను కాపాడుతుంది. సీత్ల పశు సంపదను వృద్ధి చేస్తుంది. మంత్రల్ పిల్లలకు ఎటువంటి రోగాలు రాకుండా చేస్తుంది. ఈ దేవతలు నిర్వర్తించే పాత్రలు బంజారా దేవతలు తండాను రక్షించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నవి.
ఏ విధంగా నిర్వహిస్తారు?
తండాలో వున్న పెళ్లికాని యువతులు (కన్యలు) తండా కేంద్రంగా ఉండే చోట గుమికూడి చర్చించుకుంటారు. తదనంతరం తండా పెద్ద కార్ భారీ, నాయక్‌ల దగ్గరకు వెళ్లి వారి అనుమతితో తండాకి డప్పు చాటింపుతో సమయాన్ని ప్రకటిస్తారు.
తరువాత అమ్మాయిలు అందరూ కలిసి తండా నాయకుని ఇంటికి, ప్రతి ఇంటికి వెళ్లి బియ్యం సేకరించి వాటిని విక్రయించి వాటితో శనగలు, నవధాన్యాలు (వేరుశెనగ, పెసర, కంది, గోధుమ మొదలగునవి) తెస్తారు. ఆ నవధాన్యాలలో ఏ ధాన్యపు గింజ బాగా పచ్చగ ఎదిగి వస్తుందో ఆ సంవత్సరం ఆ పంట బాగా వస్తుందని వారి నమ్మకం. వీటిని ఇత్తడి బిందెలో నానబెడతారు. తరువాత ఎర్రమట్టి, చెరువు మట్టి, పుట్ట మట్టి, ఆవు ఎరువు మొత్తం కలిపి మెత్తగా చేస్తారు. తండా కేంద్రమైన చోట ఒక పందిరిని ఏర్పాటు చేస్తారు. తరువాత ప్రతి ఇంటి నుంచి వెదురు కట్టెలతో (వెళ్లోనిర్‌వేల్) చేసిన చిన్న చిన్న బుట్టలలో (ఓల్డి) సగానికి తక్కువగా మట్టిని వేసి, తరువాత గోధుమలు శనగ (నవధాన్యాలు) గింజలను వేసి ఆ పందిరి పైన పెడతారు. ఈ క్రమంలో గిరిజన బంజారా సంస్కృతీ సంప్రదాయాలతో నంగారా వాయిస్తూ ఆట పాటలతో నృత్యాలతో పందిరపై (డాక్లో) బుట్టలను వేస్తారు.
ఈ కార్యక్రమాలన్నింటికి ఒక అమ్మాయి నాయకురాలిగా వ్యవహరిస్తుంది. ఆ నాయకురాలు తొమ్మిది రోజుల పాటు ఆకుకూరలు (శాకాహారం) తింటూ శుద్ధిగా ఉంటుంది. నాయకురాలి సమక్షంలో అందరూ కనె్నపిల్లలు కలిసి బావి దగ్గరికి వెళ్లి పరిశుభ్రమైన ఇత్తడి బిందెలలో నీళ్లు తెచ్చి ఉదయం సాయంత్రం పాటలు పాడుతూ ఆ బుట్టలపై నీళ్లు చల్లుతారు. తరువాత రాత్రి సమయంలో తండాలో ఉన్న చిన్న పెద్ద స్ర్తిలు, పురుషులు కలిసి పందిరి వేదికగా బంజారా సంస్కృతితో ఆటపాటలు నంగార డప్పు చప్పుళ్లు వాయిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.
తీజ్ పండుగను సేవాలాల్ మహరాజ్ దండి యాడి (మేరమ్మ) జరిపిస్తుందని ఆ దేవత ఈ పండుగతో రాజీ పడిందని తీజ్ బుట్టలను పెట్టింది. దేవతనే స్వయంగా ఈ పండుగను జరిపిస్తుందని విశ్వసిస్తారు. ఏడవరోజు ‘్ఢమోళి’ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి ఇంట్లో బియ్యం పిండితో రొట్టెలు (చుర్మో) చేసి వాటిని బెల్లంతో కలిపి ముద్దలు చేస్తారు. మరోవైపు తీజ్ ఉన్న ఇంటి ఆవరణలో సేవాలాల్ మహరాజ్ మేరమ్మ పూజలు నిర్వహిస్తారు. ఇంటి ముందు జొన్నలు నింపిన గోనె సంచులు దాని ముందు పెట్టి ఒక చిన్న కడవలో నీళ్లు పోసి అందులో ‘లింబేర్ పాన్’ (వేప మండలు) చేసి పెడతారు. ఆ కడవకు మూడు పసుపు కుంకుమ బొట్లు పెడతారు. మేకపోతుని తెచ్చి గోనె సంచులకు ఎదురుగా నిలబెట్టి దాని తలకు, కాళ్లకు పసుపు, కుంకుమ రాస్తారు. నోటిలో నీళ్లు పోస్తారు. మేరమ్మ తల్లికి బలి ఇవ్వడం ఆచారం. వెండితో చేసిన మేరమ్మ భవానీ విగ్రహాన్ని కానీ లేదా ‘ఏక్ప్రియా’ (ఒక రూపాయి బిళ్లను) పెట్టి మేకపోతును బలి ఇస్తారు.
మేరమ్మ పూజ జరిగిన కొంచెం దూరంలో సేవాలాల్ మహరాజ్ పూజ చేస్తారు. ఈ పూజను ‘కడావ్’ అని అంటారు. సేవాలాల్ శాకాహారి. అందుకే అతన్ని శాకాహార పదార్థాన్ని బియ్యం పిండితో ఆవునెయ్యితో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా ఇస్తారు. దీర్ఘ చతురస్రాకారంలో గొయ్యి తీసి అందులో కట్టెలు పెట్టి మంట వేసి ఒక పెద్ద గినె్నలో ‘కడావ్’ వండుతారు. కడావ్‌లో సిద్ధమైన తరువాత బెల్లం, రొట్టెలు కలిపిన సాత్ (7) చుర్మో ముద్దలను మహిళలు ఒక పళ్లెంలో పెట్టుకొని పందిరి వేదికగా పెడతారు. అప్పుడు సేవభాయ్ కడావ్ నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదవ రోజు ‘ఘణ్-గోర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తండాలో ఉన్న చెరువు దగ్గరికి కనె్నపిల్లలు వెళ్లి నల్లరేగడి మట్టిని తీసుకొని, ఒక అనుభవజ్ఞురాలు దగ్గరికి వెళ్లి ఒక ఆడ, మగ బొమ్మను తయారుచేస్తారు. ఆడ బొమ్మను బంజారా వివాహిత వేసుకునే సంప్రదాయ వస్త్రాల వంటి (ఫెట్యా, చాంక్లి, టూక్రి) వస్త్రాలను చిన్నవిగా చేసి ఆ బొమ్మను తయారుచేస్తుంది.
ఆడ బొమ్మ పేరు ‘ఘణ్’ అంటే మేరమ్మ దేవత. మగ బొమ్మ పేరు ‘గోర్’ అంటే సేవాభాయ. అదే రోజు హాస్యభరితమైన గేయాలను పాడుతూ ఆడుతూ పెళ్లికాని యువతుల చేతిలో ఉన్న డోనా (చెట్టు ఆకు) దండియాడి సేవభాయ బుట్టలో నుంచి తీసిన తీజ్‌నారును ఇవ్వమని కనె్నలు పాటలు పాడుతూ బ్రతిమాలుతారు. యువకులు ఇవ్వరు. అలా కాసేపు ఆటపాటలతో గడిపిన తరువాత ఆ ఆకును తొమ్మిది రోజులు దీక్షలో ఉన్న అమ్మాయికి ఇచ్చేస్తారు.
ఉయ్యాల ఆట పాటలు
తొమ్మిదవ రోజు కనె్న పిల్లలు ఉదయం అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఉయ్యాలకు సంబంధించిన పరికరాలను పందిరి దగ్గర సిద్ధం చేసుకొని ఉయ్యాల (హింజ్లో) ఆటను ఆడుతారు. అమ్మాయి ‘ఘణ్-గోర్’ (డోక్రి-డోక్రా)ను పట్టుకొని ఉయ్యాలలో పెట్టి ఆడిస్తారు. పాటలు పాడుతారు.
బోరడి మస్కెరో
బోరడి అంటే రేగి ముళ్లని, మస్కెరో అంటే గుచ్చడం అని అర్థం. కనె్నలు రేగుముళ్లను నానబెట్టిన శనగలని గుచ్చడం యువకులు కర్రలతో రాల్చేటప్పుడు కనె్నలు ‘మా ఆశలు రేకలు విప్పి ఓ శనగల్లారా భయపడక ధైర్యంతో యువకులు కొట్టినా మీరు రాలవద్దని’ హితవు చెబుతారు. దీక్షతో రేగు ముళ్లకు గుచ్చిన శనగలని యువకులు రాల్చడంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. కన్యలతో నాయకురాలు ఈ రోజు మొత్తం కూడా ఉపవాసం ఉంటుంది. తొమ్మిదవ రోజు సాయంత్రం సమయంలో తీజ్ ఉన్నచోట అందరూ అన్నలు, తమ్ముళ్లు తలపాగాలు కట్టుకొని వరుసగా కూర్చుంటారు. తాము పెంచిన బుట్టల నుంచి గోధుమ నారును తుంచి, తాతలు అన్నదమ్ములు తలపాగాలో పెడతారు.
నిమజ్జనం
తీజ్ బుట్టలను నీళ్లలో వదిలే ఆచారం ప్రకారం బంజారా సాంస్కృతిక పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఊరేగింపుగా బయలుదేరుతారు. కొంతమంది యువకులు తీజ్ తెంచిన బుట్టలను జల్ల (పెద్ద గంప) తీసుకువస్తారు. చెరువును సమీపిస్తున్న కొద్దీ కన్యల ముఖాలు కాంతిహీనం అవుతాయి. తమ ఆప్తులు దూరం అవుతున్న విధంగా బాధ, విచారం వారి ముఖాలలో కనిపిస్తుంది. ప్రాణంకన్నా మిన్నగా తొమ్మిది రోజులు పెంచి పోషించిన వాటిని నీళ్లలో వదిలేందుకు విచారం వ్యక్తం చేస్తూ శోకిస్తారు. శిల్పాల వలె నిల్చున్న వీరి పాదాలను సోదరులు కడుగుతారు. తోచిన విధంగా డబ్బులు చేతిలో పెట్టి ఓదారుస్తారు. ఆ తరువాత మళ్లీ డప్పులు వా యిస్తూ ఆట పాటలు పాడుతూ తీజ్ వేదిక దగ్గరికి వెళ్లి అక్కడి నుండి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోతారు. దీంతో తీజ్ పండుగ ముగుస్తుంది.

-తేజావత్ నందకుమార్ నాయక్ నంగారాభేరి గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 90002 22550