Others

కృష్ణమాయ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్ని కృష్ణుడు చిద్విలాసుడు చిన్మయుడు చిన్ననాడు చేయనికొంటె పనులులేవు. ప్రతిదానిలోను అంతో ఇంతో మర్మం ఉండేది. మర్మజ్ఞులు మర్మం తెలుసుకొని ఆనంద పరవశులయ్యేవారు. పామర జనం కృష్ణలీలలన్నిటినీ ఏకరువు పెట్టుకుని తన్మయత్వం చెంది తమఇంట నడిచే చిన్నారులే శ్రీకృష్ణులని తాద్యాత్మం చెందేవారు. అట్లాంటి వాటిల్లో .. నాకన్న వేల్పులెవరైనా ఉన్నారా వెలదుల్లారా అంటూ గోపికల ఇండ్లల్లో వెన్నతిని వారి ఇంటివేల్పులకు పూసి పోయేవాడట. అత్తకోడళ్ల మూతికి పూసి వారిమధ్య తగవు పెట్టేవాడట. తాను ఒక్కడే దొంగలించడానికి పోకుండా తన తోడి సంగడీలనంతా తీసుకొని వెళ్లేవాడట. వారికంతా కూడా దొంగలించిన వెన్నముద్దలను పెట్టి ఆ పై అక్కడే తిరుగుతున్న కోతులను ప్రియమారా పిలుస్తూ వాటికి ఇండ్లల్లోని పాలు పెరుగులను, వెన్నమీగడను అందించేవాడు.
కాస్త పెరిగి పెద్ద వాడైన తరువాత గోవులను మేపడానికి అడవికి వెళ్లి తన స్నేహితులతో కలసి చల్దులను ఆరగించేవాడు. దాన్ని చూసి పరతత్వం మనిషిగా పుట్టి చద్ది అన్నం తింటోంది అని దేవతలు అనుకొన్నారట. ఆ సంగతి బ్రహ్మ విన్నాడు. నారదుడినీ అడిగాడు. ఆయన అదే చెపితే తనకు నిజమనిపించక తానే చూద్దామని వెళ్లాడు. అక్కడ
తామర పూవులోని రేకుల చందంగా గోపబాలురంతా కూర్చున్నారు. వారంతా కలసి కృష్ణుడిని తామరలో దుడ్డువలె కూర్చోబెట్టుకున్నారు. వారి చేతుల్లో చల్దులు నిండి ఉన్నాయి. ఒకరి చేతిలో మాగాయ మంచి రుచిగా ఉన్నట్లు మంచి వాసన వస్తోంది. మరొకరి చేతిలో నిమ్మకాయ ఊరగాయ ఊరిస్తోంది. అందుకే వారందరూ ‘కృష్ణా! కృష్ణా ఇదిగో ఈ నిమ్మకాయ అందుకో అంటూ కృష్ణుని నోట్లో పెట్టేస్తున్నారు. మరికొందరు ఈ ఊరుగాయ తిను కృష్ణా అంటూ ఇస్తున్నారు. ఏమేమో సంగతులు చెబుకుంటూ మహదానందంలో ఉన్నారు. ఒకడు కృష్ణుడు పిలుస్తున్నాడంటూ చెప్పి వాడు అలా చూడగానే వీనిచేతిలో అన్నం ముద్దను లాగేసుకుని నవ్వుతున్నాడు.
కృష్ణుడు తినబోతూ ఉంటే మరొకడు కృష్ణా కృష్ణా అంటూ అరిచి కృష్ణుడు అటు తిరగగానే ఆయన చేతిలోది లాగేసుకుంటున్నాడు. నవ్వుతున్నారు. నవ్విస్తున్నారు. కృష్ణుడు కూడా వారితో పాటు నవ్వుతున్నాడు. వారిచేతిలోవి లాక్కుకుంటున్నాడు. తింటున్నాడు. తినిపిస్తున్నాడు.
బ్రహ్మకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి.. ఇతడు పరబ్రహ్మమా.. ఎంగిలి తింటున్నాడు. గోపాలుడులా ఉన్నాడు. నెత్తిన నెమలి పింఛమేమిటి? నడుము చుట్టిన ఆ గుడ్డ ఏమిటి? అందులోజొనిపిన ఆ పిల్లనగ్రోవి ఏమిటి? వీళ్లు లాక్కుని పూసుకొని అబ్బే ఏమిటిదంతా అనుకొన్నాడు.
‘బహ్మ్రదేవా! ఇటుచూడండి. వారినే తన్మయత్వంతో చూస్తున్నట్లు ఆ గోవులు చూడండి. చక్కగా కూర్చుని నెమరేసుకుంటూ కనుల్లో ఆనందాన్ని వర్షిస్తున్నట్లు ఉన్నాయి. వాటి చుట్టూరా ఈ గిరి గీసినట్లున్న గీత ఏమిటి’ అన్నాడు నారదుడు.
బ్రహ్మదేవుడు దానిని చూశాడు.. అబ్బో ఇది ఈ పరమాత్మ మాయ యేమో.. చూస్తాను. ఈ మాయ ఏమి చేస్తుందో అనుకొన్నాడు. తన మాయాప్రభావంతో గోవులను, గోపాలురను, వారితో ఆడుతున్న కృష్ణయ్య అందరినీ మాయ చేసేశాడు. దాచేసాడు. ఆహా ఇపుడు చూడాలి అసలు తత్వం అనుకుంటూ బ్రహ్మలోకం వెళ్లాడు.
మానవలోకంలో సాయం సంధ్య అయింది. గోపభామలంతా తమ తమ పిల్లలు గోవులను మళ్లించుకుని వస్తుంటారని వారికోసం గబగబా తినుబండారాలు చేస్తున్నారు... వాకిట్లోకి చూస్తున్నారు..
ఈ సంగతి కృష్ణయ్య చూశాడు. నారద బ్రహ్మలను చూశాడు.
చిన్న చిరునవ్వు నవ్వుకున్నాడు. అంతే కృష్ణుడే గోవులుగా మారాడు. కృష్ణుడే గోపాలురుగా మారాడు. కృష్ణుడే యశోదాతనయుడుగాను మారాడు. గోవులను తీసుకొని అందరూ ఇంటికి వచ్చారు.
వారు తల్లులు వారికి అభ్యంగన స్నానాలు చేయించారు. శుభ్రమైన బట్టలు కట్టబెట్టారు. ఇక ఆహారాన్ని అందిస్తున్నారు.
బ్రహ్మకు భూలోక పరమాత్మను చూడాలనిపించింది. చిరునవ్వు నవ్వుకున్నాడు. వాళ్లంతా అతలాకుతలం అయిపోతుంటారు.అపుడు నా సంగతి చెబుతా అనుకొన్నాడు.
ఉన్నది ఒకటే పరమాత్మ కదా. ఆ పరమాత్మ సృష్టిలోని బ్రహ్మయే కదా. బ్రహ్మకూడా కృష్ణమాయలో ఇరుక్కుపోయాడన్నమాటేగా.
కిందికి చూశాడు. గోకులమంతా దివ్యానందంతో ఉంది. అందరి తల్లుల చెంతా వారి పిల్లలు.. గోశాలల్లో గోవులు హాయిగా పచ్చగడ్డి మేస్తున్నాయి. పాలిస్తున్నాయి. దూడలతో గారాలుకుడుస్తున్నాయి... అంతా అయోమయంగా అనిపించింది. వీళ్లు ఎక్కడ నుంచి వచ్చారు? వీళ్లంతా నా మాయనుంచి తప్పించుకుని వచ్చారా అనుకొని గబగబా వెళ్లాడు. బ్రహ్మదాచి ఉంచిన చోట ఎక్కడి వారక్కడే ఉన్నారు.
కృష్ణా ! కృష్ణా! ఎంత మాయలో చిక్కుకున్నాను. ఎంతటి చిక్కుల్లో చిక్కాను అనుకొంటూ బిరబిరా నడుచుకుంటూ వచ్చి కృష్ణుని కాళ్లపై బడి పరమాత్మ నీ మాయ మహత్తరమైందయ్యా. దానినుంచి నన్ను రక్షించు రక్షించు అంటూ కృష్ణుడికి శరణాగతి పొందాడు. నారదుడు కృష్ణనామాన్ని తన మహతిపై మోగించాడు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు