Others

చంద్రకళ- అదృశ్యకావ్యం ( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రకళ..
మంచి చదువరి. ఎప్పుడూ చేతిలో ఏదోక ఇంగ్లీషు నవల ఉండటం పరిపాటి. సెట్‌లో సీరియస్‌గా ఉండేది. అనవసరమైన మాటలు మాట్లాడేది కాదు. అలాగని పొగరుగా ఉండేది కాదు. పెద్దలంటే గౌరవం. సెట్‌లో డైరెక్టరు ఒకేసారి చెబితే చాలు.. గుర్తుంచుకొని ఠకఠకా చెప్పేసేది. హేమాంబరధరరావు (గొప్ప దర్శకుడు) డిస్కవరీ చంద్రకళ. విశాఖపట్నం అమ్మాయి. ‘ఆడపడుచు’ చిత్రంలో నటిస్తున్నపుడే మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమాలో యన్‌టి రామారావు, శోభన్‌బాబుల చెల్లిగా నటించింది. ‘అన్నా.. నీ అనురాగం’ పాట ఆంధ్ర దేశమంతా మార్మోగిపోయింది. అయితే ఆ సినిమాలో చంద్రకళ పాత్ర ట్రాజెడీ. ‘చెల్లి’ అనేసరికి చంద్రకళే ముందు గుర్తొస్తుంది. అందుకే యన్‌టిఆర్.. ‘అమ్మా! మానసిక సంఘర్షణవున్న పాత్రలను అద్భుతంగా పోషించగలవు!’ అంటూ కితాబు ఇచ్చారు.
‘తాసిల్దారుగారమ్మాయి’ చిత్రంలో శోభన్ సరసన నటిస్తుంది. అద్భుతంగా వుంటుందా పాత్ర. చిలిపి పాత్ర. అయితే శోభన్ నిరాదరణకి గురవుతుంది. అలాగే ‘కోడెనాగు’ చిత్రంలో శోభన్ (నాగరాజు)ని పొందాలనుకుంటుంది. ఆ మాటని వ్యక్తంచేస్తే... కుమిలి కుమిలి ఏడుస్తుంది. కోడెనాగు సినిమాలో శోభన్‌కీ లక్ష్మికీ ఎంత మంచి పేరొచ్చిందో చంద్రకళకీ అంతే మంచి పేరొచ్చింది. ఆ చిత్రం చూశాక శోభన్ ‘నువు నీ పాత్రలో నటించలేదు. జీవించేశావ్.. నిజజీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురుగాకూడదని కోరుకుంటున్నాను!’ అన్నాడు. చంద్రకళ నవ్వేసింది.
‘దసరాబుల్లోడు’ సినిమాలో వాణిశ్రీ, చంద్రకళ ఇద్దరూ దసరాబుల్లోడ్ని ప్రేమిస్తారు. అయితే చంద్రకళకి కేన్సరు- ఆ విషయం తెలుసుకుని (రాధ, గోపి) అక్కినేని, వాణిశ్రీల ప్రేమను ప్రోత్సహిస్తుంది. ఆ సినిమాలో వాణిశ్రీతోబాటు ఎంత హుషారుగా నటించిందో.. తనకు కేన్సరని తెలిసిన తర్వాత లోలోపల కృంగిపోయే సన్నివేశాల్లోనూ అంత గొప్పగా నటించింది. సినిమా సంవత్సరం పొడుగునా ఆడింది. ఆ సినిమా తొలి కాపీ చూసిన అక్కినేని ‘చంద్రకళ నిజంగా కేన్సర్ పేషెంటేమో.. అన్న భ్రమ కలిగించేలా అంత సహజంగా నటించింది. ఇటువంటి పాత్రలు ఇకముందు వెయ్యకుండా ఉండటం మంచిది. ఇది నిజం కాకూడదని కోరుకుందాం!’ అన్నాడు నర్మగర్భంగా.
చంద్రకళ జీవితం ఊహించని మలుపులు తిరిగింది.
ఎప్పుడూ షూటింగు. షూటింగు లేకపోతే శైవా మాస్టారు దగ్గర డాన్సు ప్రాక్టీసు. ఇదే పని. అనవసర కాలయాపన చేసేది కాదు. తెలుగు- తమిళ భాషల్లో బిజీగా వుంటుండగా ఓ విదేశీయుడి ప్రేమలో పడింది. ఎంతమంది వారించినా ఆయనే్న పెళ్లి చేసుకుంది. చంద్రకళ ఎపుడూ అనవసరమైన ప్రసంగాలుగానీ, ఆర్భాటాలకుగాని పోయేది కాదు. అందుకే గుట్టుచప్పుడు గాకుండా పెళ్లి చేసుకుంది.
ఏమైందో ఏమో-
పదేళ్ల తరువాత చెన్నై కెకె నగర్‌లో ప్రత్యక్షమయ్యింది.
ఒక చిన్న ఇల్లు.. ఆ ఇంట్లో చంద్రకళ ఉంటుందని చెప్పేదానికన్నా తలదాచుకుంటుంది అని చెప్పడమే కరెక్టు.. నలుగురైదుగురు పిల్లలకు డాన్సు క్లాసులు చెబుతోంది. బక్కపలచని ప్రాణం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తోంది. నేను కలిశాను.
‘ఏమిటమ్మా ఇది?’
‘జీవితం! నాకు గుర్తులేదు!’
‘ఏం చేద్దామనుకొంటున్నావ్?’
‘ఆరోజు కోసం ఎదురుచూద్దామనుకొంటున్నాను!’
‘ఏ రోజు?’
‘అందరినీ తనలో కలుపుకునే రోజు... శివసాయుధ్యం పొందే రోజు’
తర్వాత మాట్లాడలేకపోయాను. నేను చూసిన చంద్రకళేనా? అని విస్తుపోయాను.
నేనూ కెకె నగర్, రాణీ అన్నానగర్ ఎల్‌ఐజి ప్లాట్స్‌లో వుంటున్నాను. కాలినడకన వెళ్లిరావచ్చు. ఒకరోజు సాయంత్రం..
స్కూలు పిల్లలు వచ్చేశారు. చంద్రకళ ఇంకా రాలేదు. పిల్లలు డాన్సు ప్రాక్టీసు చేస్తున్నారు.
ఇంతలో హడావుడిగా వచ్చింది. చీరె చెంగు రక్తంతో తడిచిపోయివుంది.
అపుడు తెలిసింది చంద్రకళకి కేన్సరని.
ఎక్కడ చంద్రకళ. ఎంత గొప్ప భవనం.. ఆ ఇల్లేమైంది? అంత సంపదేమైంది?
నృత్య ప్రదర్శనలిస్తే, ఒరిజినల్ జువెలరీ పెట్టుకొనేది. అంతా ఏమైంది? అన్నీ సమాధానం లేని ప్రశ్నలే.. సమాధానం రాని ప్రశ్నలే..
అభిమానులు ఏమైపోయారు? శ్రేయోభిలాషులేమైపోయారు? స్వాభిమానంతో తన బాధని ఎవరితో చెప్పుకోలేక.. తనలోతాను కృంగే పాత్రనే చివరి రోజుల్లో పోషించింది. కేన్సరు పాత్రలకి జీవంపోసిన చంద్రకళని ఆ కేన్సరే ఎత్తుకుపోయింది. దిక్కులేని పక్షిలా అనంత లోకాలకు ఎగిరిపోయింది. అందుకే శ్రీశ్రీ మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి.
నిప్పులు చెరుగుకొంటూ నింగికి నేనెగిరిపోతే.. నిభిడాశ్చర్యంతో వీరే!
నెత్తురు గక్కుకుంటూ నేలకి నేనొరిగిపోతే.. నిభిడాశ్చర్యాలతో వీరే?.. ఆ.!
అందుకే చంద్రకళ జీవితం అదృశ్యకావ్యంలా అంతరించిపోయింది.

-ఇమంది రామారావు 9010133844