Others

నేతలకు పొదుపు వర్తించదా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. ‘ఆర్థిక మాంద్యం’ భయంతో ఆందోళన చెందుతున్నది. ఈ నేపథ్యంలో కొన్ని జాతీయ బ్యాంకులను విలీనం చేయడానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఆర్థిక మాంద్యం ముసుగులో అనేక సంక్షేమ పథకాల్లో కోత విధించారు. ఆర్థిక మాంద్యం ఏర్పడడం మన దేశంలో కొత్తేమీ కాదు. అయితే ఈసారి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు తారుమారు అవుతుండడం ఆందోళన కలిగించే విషయం. గతంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పటికీ, ఈసారి దీని తీవ్రత పెరుగుతున్నది.
స్వాతంత్య్రానికి పూర్వం మన దేశంలో ఇటువంటి ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడి ప్రజల జీవన విధానాలు అగమ్యగోచరంగా మారి దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అనే విధంగా 80% ప్రజలు బలవంతంగా జీవితాలను నెట్టుకొచ్చారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ ఒకవైపు స్వాతంత్య్రోద్యమంలో నిర్విరామంగా తిరుగుతూనే మరోవైపు ప్రజలను ఆర్థిక ఒడిదుడుకుల నుంచి ఒడ్డున చేర్చడానికి పొదుపు విషయమై చైతన్యవంతులను చేశారు. మెజార్టీ ప్రజల ఆహార నియమాలను తన ఆహార్యం ద్వారా వాస్తవిక ప్రపంచానికి దగ్గరగా నిరూపించారు. దేశంలో అనేకమంది ప్రజలకు సరైన కూడు, గూడు, గుడ్డ లేదనీ... ఆ మెజార్టీ ప్రజల జీవన విధానాన్ని తాను అనుసరిస్తేనే, మిగతా వారికి అది ఆదర్శమవుతుందని పూర్తిగా శాఖాహారం,సాత్వికాహారం భుజిస్తూ వచ్చారు. ఆయన రాత్రిపూట భోజనానికి బదులు మేకపాలు తాగి పడుకునేవారు. ఉదయం అల్పాహారానికి బదులుగా వేరుశనగ పలుకులు తినేవారు. అప్పట్లో పేదరికం ఎక్కువగా వుండడంతో చాలా గ్రామాల్లో ప్రజలకు ఒంటినిండా కప్పుకునే బట్టలు వుండేవి కావు. సంవత్సరానికి రెండు మూడు జతల బట్టలు మాత్రమే కొనుక్కునేవారు. వాటిని అపురూపంగా దాచుకొని పండుగల సమయంలోనో.. పట్టణాలకు వెళ్లినప్పుడో.. బంధువుల ఊళ్లకు వెళ్లినప్పుడో మాత్రమే ధరించేవారు. ఆ తరహా జీవన విధానాన్ని తాను కూడా పాటించానని గాంధీ ఆచరణలో చూపించారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ ప్రధానిగా వున్న సమయంలో దేశవ్యాప్తంగా అనావృష్టితో కరువు ముంచుకొచ్చి ఆహార ధాన్యాల కొరత ఏర్పడగా.. అనేకచోట్ల గంజి కేంద్రాలను ఏర్పాటుచేయించారు. ప్రజలు అడవుల్లో వున్న గాదిరి ఆకు, అనాస గడ్డ వంటివి సేకరించి వాటిని ఫ్రై చేసుకొని తిన్నారు. ఉస్తికాయలను ఇతర అటవీ ఫలాలను తెచ్చుకొని భుజిస్తూ కొన్ని రోజులు జీవనం సాగించారు. అటువంటి గంజి కేంద్రాలను, కరువు పీడిత ప్రాంతాలను స్వయంగా నెహ్రూ సందర్శించి ప్రజల బాగోగులను నేరుగా పరిశీలించారు. లాల్‌బహదూర్ శాస్ర్తీ ప్రధానిగా వున్నప్పుడు పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన తరువాత దేశంలో ఆర్థిక పరిస్థితి కుదేలైంది. అంతకుముందు నెహ్రూ జీవించి వున్నప్పుడే చైనాతో జరిగిన యుద్ధం ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద పడింది. అప్పుడు దిగజారిన ఆర్థిక పరిస్థితిలో భాగంగా ఆహార ధాన్యాల కొరత తీవ్ర రూపం దాల్చింది. ఆ సమయంలో లాల్‌బహదూర్ శాస్ర్తీ ‘జై జవాన్- జైకిసాన్’ నినాదాన్ని జాతికి అందించారు. ఆ సందర్భంగానే ఆయన రాత్రిపూట అన్నం కాకుండా చపాతీ తినాలని పొదుపులో భాగంగా ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పట్లో పాలకులు, జాతినేతలు ప్రజలకు ఇచ్చే సందేశాలు ఆచరణాత్మకంగా వుండేవి.
ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకులంతా ప్రజలు పొదుపును పాటించే విధానం గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. మొదటిగా పాలకులలో జవాబుదారీతనం ఏర్పడాలి. రాష్టప్రతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రుల కార్యాలయల్లో పొదుపు కార్యక్రమం ప్రారంభమై రాష్ట్రాల పాలకుల వరకు సాగాలి. ప్రజలేమో పొదుపు పాటించాలి.. నాయకులు సుఖాలు పొందాలి. సామాన్యులు కష్టాలతో త్యాగాలు చేయాలి. పాలకులు, ఉన్నతాధికారులు భోగాలు అనుభవించాలన్నట్టు నేటి పరిస్థితులు దాపురించాయి. కేంద్ర మంత్రులకు, ఎంపీలకు ఇతర ప్రభుత్వ అధినేతలకు, అమాత్యులకు, ప్రముఖులకు వారి గౌరవ వేతనాలలో కోత విధించాలి. ఒక పార్లమెంట్ సభ్యునికి సరాసరిన గౌరవ వేతనం సహా ఇతర సౌకర్యాలకు నెలకు 10 లక్షలు ఖర్చువుతుంది. మంత్రుల పేషీల్లో, అతిథి గృహాల్లో 24 గంటల ఏసీ సౌకర్యం, కార్పెట్ల వైభోగం ఇతరత్రా చిల్లర మర్యాదలకే నెలవారీ ఖర్చులు లక్షల్లో వుంటున్నాయి. గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు సంబంధించిన వేతనాలు సరేసరి. ఈ అధినేతలు పర్యటనలు జరిపినప్పుడు అయ్యే ఖర్చు ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడుతోందో చెప్పవలసిన పనిలేదు. ఒక కేంద్రమంత్రి అతిథి భవనం ఢిల్లీలాంటి మహానగరంలో ఎకరం వైశాల్యంలో వుంటుంది. ప్రధాన గేట్ ముందర, లోపల అడుగడుగునా సెక్యూరిటీ గార్డులు వుంటారు. ఇక పీఏలు, పీఎస్‌లు, ఓఎస్డీలు చేసే హడావుడి సరేసరి. రాష్టప్రతి కార్యాలయ భవనం సుమారు మూడువందల గదులతో వుంటుందని ప్రచారంలో వుంది. గవర్నర్లు నివసించే రాజ్‌భవన్ల ఖర్చు కూడా ఏటా కోట్లలో వుంటుంది. జిల్లాల్లో కలెక్టర్,ఎస్పీ తదితర ఉన్నతాధికారుల అతిథి భవనాలు కూడా విశాల ప్రదేశంలో నాటి రాజరికపు ఛాయలను తలపింప చేస్తున్నాయి. వీటి నిర్వహణ ఖర్చు కూడా యేటా లక్షల్లో వుంటున్నది. రాష్టమ్రంత్రులకు ఒక్కొక్కరికి వేతనం ఇతర ఖర్చుల కింద నెలకు సరాసరిన 10 లక్షల ఖర్చవుతుంది. ఎమ్మెల్యేలకు కూడా సరాసరిన నాలుగైదు లక్షలు ఖర్చవుతుంది. బ్యూరోక్రాట్ల ఖర్చులు కూడా ఇదే తరహాలో వుంటున్నాయి. ముందుగా పాలకులు పొదుపు ఉద్యమంలో భాగస్వామ్యం వహించి, భావితరాలకు ఆదర్శంగా వ్యవహరించడానికి తమ వేతనాలను తగ్గించుకోవాలి. అప్పుడు ప్రజలు కూడా పొదుపు ఉద్యమంలో భాగస్వాములై త్యాగాలకు సిద్ధమవుతారు. బడాబాబుల దగ్గర వున్న బ్లాక్‌మనీని వెలికితీసి, చట్టాలను కఠినంగా అమలు చేసినపుడు ఆర్థిక మాంద్యం కొంతైనా మెరుగుపడే అవకాశం వుంది.

-తిప్పినేని రామదాసప్ప నాయుడు 99898 18212