Others

జాతి జీవన వికాస కేంద్రం ఆధ్యాత్మికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయుల జీవనానికి ఆధ్యాత్మికత ఆలంబన. మన సమాజ అస్థిత్వానికి ఆధారం వేదాలు. వేద నిర్దేశానుసారం మన సమాజ జీవనం వికసించింది. వేదం అంటే తెలియబడినది అని అర్థం. విద్య అంటే తెలుసుకోదగినది అని అర్థం. భారతీయ వాంజ్ఞయంలో మొదటిసారిగా ఉపనిషత్తులు విద్య గురించి చెప్పాయి. ఈ ఉపనిషత్తులలో 34 రకాల విద్యలను గురించిన చర్చ ఉంది. చాందోగ్యోపనిషత్తులో ప్రాణవిద్య గురించి ప్రస్తావన ఉంది. మరణించిన దానిని మంత్రశక్తితో తిరిగి బతికించడం ఎలా అన్నది ఇది వివరిస్తుంది. ముండకోపనిషత్తులో బ్రహ్మవిద్య లేదా పరావిద్య గురించి వివరంగా ఉంది.
విద్య గురించి ప్రస్తావిస్తూ ముండకోపనిషత్తు ఒక శక్తివంతమైన పదప్రయోగం చేసింది. అది ‘వేద్ధవ్యం’’ అన్న పదం. అనగా ‘చొచ్చుకొని పోవడం’ లేదా ‘లోతుగా పరిశీలించడం’ అని అర్థం. ‘ఏది తెలుసుకోవాలి? దేనిని లోతుగా తెలుసుకోవడం వల్ల మనిషి ఆనందాన్ని పొందుతాడు? ఏది మానవుని శోక విముక్తుని చేస్తుంది?’ అన్నదే విద్య పరమార్థం. ముండకోపనిషత్తులో శౌనకుడు అంగీరస మహామునిని- ‘‘ఏది తెలుసుకుంటే నాకు సమస్తం తెలుస్తుంది?’’ అని అడుగుతాడు. అందుకు అంగీరసుడు బదులిస్తూ- ‘‘అటువంటి విద్యలు రెండున్నాయి. మొదటిది అవర విద్య. ఇది దిగువస్థాయి విద్య. రెండోది వర విద్య (అక్షర విద్య). ఇది ఎగువస్థాయి విద్య’’ అంటాడు.
చాందోగ్యోపనిషత్తులో నారద మహర్షి సనత్కుమారుని- ‘‘నేను ఎన్నో తెలుసుకున్నాను. ఎన్నింటినో అధ్యయనం చేసాను. వేదాలు, వేదాంగాలు, వివిధ శాస్త్రాలన్నింటినీ నేర్చుకున్నాను. కానీ శోకం నుండి నేను విముక్తుడిని కావడం లేదు. ఎందుకని?’’ అని ప్రశ్నిస్తాడు. సనత్కుమారుడు నారదునితో- ‘‘నువ్వు మంత్రవేత్తవు కాగలిగావు కానీ ఆత్మవేత్తవు కాలేకపోయావు. మంత్రవేత్తవు అయినంత మాత్రాన నీకు జీవ రహస్యం తెలియదు’’ అని చెబుతాడు. దీనినే వివరిస్తూ ‘్భరతరత్న’ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్- ‘మంత్రవేత్త అంటే ఆధునిక పరిభాషలో ‘టెక్నోక్రాట్’ అని చెప్పవచ్చు. ‘టెక్నిక్’వేరు, ‘ఆత్మ’వేరు. మంత్రవేత్త అయినంత మాత్రాన నీకు జీవ రహస్యం తెలియదు. టెక్నాలజీ తెలిసినంత మాత్రాన అంతరిక సహజ ప్రకృతి తెలియాలని లేదు’’ అని అంటారు.
1907లో గాంధీజీ రాసిన ‘‘హింద్ స్వరాజ్’’ గ్రంథంలో ‘విద్య’ అనే అధ్యాయంలో ఇలా అంటారు. ‘‘విద్య అర్థం ఏమిటి? లౌకికంగా చూస్తే అక్షరాలు, పదాలను గురించిన పరిజ్ఞానాన్ని కలిగి ఉండడమే విద్య అనుకోవచ్చు. అటువంటి విద్య ఒక సాధనం మాత్రమే. ఆ సాధనం ఎవరిచేతనైనా సద్వినియోగం కావచ్చు లేదా దుర్వినియోగం కావచ్చు. ఇప్పుడు మనం ఉన్నతస్థాయి విద్యను గురించి ఆలోచిద్దాం. నేను భౌగోళిక శాస్త్రం, రేఖాగణితాన్ని, బీజ గణితాన్ని, ఖగోళ శాస్త్రం మొదలైన వాటిని అభ్యసించాను. వీటి ద్వారా మరెన్నో విషయాలను తెలుసుకున్నాను. నేను ఇవన్నీ చదువుకున్నాను కానీ నా జిహ్వను ఎలా అదుపులో పెట్టుకోవాలన్న ప్రశ్నకు వీటిలో సమాధానం లేదు. నన్ను నేను తెలుసుకోడానికి, ఇంద్రియాలను నియంత్రించడానికి ఈ ఆధునిక విద్యలు ఉపకరించవు.’’
మధుమేహం వచ్చినవారు తీపి పదార్థాలు తినకూడదని, షుగర్ లెవెల్స్ పెరగకుండా ఆహారం తీసుకునే విషయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి వైద్యశాస్త్రం చెప్తుంది. కానీ ముందు నుంచీ ఆహారం పట్ల స్వీయ నియంత్రణ పాటించడం వల్ల రోగాలకు దూరంగా ఉంచవచ్చని ఈ ఆధునిక వైద్యశాస్త్రాలు చెప్పవు. లైంగిక సంపర్కం గురించి సెక్స్ ఎడ్యుకేషన్ చాలా శాస్ర్తియంగా వివరిస్తుంది. కానీ మనుషుల మధ్య గల వావివరసల గురించి, వాటికి విలువనివ్వడం గురించి చెప్పదు. లాభాలు గడించడానికి రకరకాల పద్ధతులను గురించి వ్యాపార శాస్త్రాలు గొప్పగా వివరిస్తాయి. కానీ మనిషి దానగుణం అలవరచుకోవాలని గానీ, దయాదాక్షిణ్యాల గురించి గానీ వాటిలో ప్రస్తావన ఉండదు. మన దేశంలో మద్యం అమ్మడం చట్టసమ్మతమే. రాజ్యాంగమే దానికి చట్టబద్ధత కల్పించింది. కానీ మద్యం అమ్మడం అనేది నైతికమైనది కాదు. ఆ విషయం గురించి ఏ న్యాయశాస్త్రం, న్యాయస్థానం కూడా నోరు విప్పలేదు.
1907లో భారతదేశంలో ఆధునిక విద్యలు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు, ఉద్యమాలు జరిగాయి. విశ్వవిద్యాలయాల స్థాపనకు ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో ‘‘ఈ విద్యలు నాకేం చేస్తాయి? నా చుట్టుపక్కల వారికి ఏం చేస్తాయి?’’ అని గాంధీజీ ప్రశ్నించారు. ‘‘నన్ను నేను తెలుసుకోవడానికి, ఇంద్రియాలను నియంత్రించడానికి ఈ ఆధునిక విద్యలు ఉపకరించవు’’అని ఆయన అన్నారు. 20వ శతాబ్దం చివర్లో యునెస్కో వారు ఏర్పాటుచేసిన ఒక కమిషన్ ఓ నివేదికను సమర్పించింది. మన దేశం నుండి డాక్టర్ కరణ్‌సింగ్ కూడా ఆ బృందంలో పాల్గొన్నారు. ఆ నివేదిక పేరు ‘‘లెర్నింగ్ ది ట్రెజర్ విథిన్’’ (అనగా ఆత్మ సంపద అని అర్థం). ఆ నివేదిక ప్రధానంగా ఏం చెప్తోందంటే- 21వ వతాబ్దంలో నేర్చుకోవడం అనేది నాలుగు సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అవి- 1. తెలుసుకోవడం కోసం నేర్చుకోవడం 2. చెయ్యగడానికి నేర్చుకోవడం 3. నువ్వు నువ్వుగా ఉండడానికి నేర్చుకోవడం 4. కలిసిమెలసి బతకడం నేర్చుకోవడం. వీటిలో ‘కలిసి మెలసి బతకడం నేర్చుకోవడం’ ఎంతో ముఖ్యమైనది. తైత్తరీయోపనిషత్తు ఇలా చెప్తోంది- ‘సహనా వవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్వాషావహై’’. అంటే ‘‘కలిసి జీవిద్దాం, కలిసి భుజిద్దాం, కలిసి బలం సంపాదిద్దాం, కలిసి తేజస్సును సంపాదిద్దాం, ఒకరినొకరు ద్వేషించుకోకుండా కలిసి జీవిద్దాం’’ అని అర్థం. వేల యేండ్ల క్రితమే మన ఉపనిషత్తులు కలిసి మెలసి జీవించండని ప్రబోధించాయి.
మరి నేడు పరిస్థితి ఎలా ఉంది? ‘సోషల్ మీడియా’ మనిషిని సమాజం నుంచి వేరు చేస్తోంది. ఎక్కడెక్కడి వారితోనో గంటలకొద్దీ చాట్ చేస్తాం. మన పొరుగునే ఉన్న వారి గురించి మనకు అసలు పట్టదు. మన భావోద్వేగాలను మరొకరితో పంచుకునే అవకాశాన్ని కోల్పోతున్నాం. సోషల్ మీడియా వల్ల మనిషి పరిపూర్ణుడు కాలేడు. ఆధునిక అర్థశాస్త్ర పితామహునిగా చెప్పబడే ఆడమ్ స్మిత్ మనిషిని ఒక ఆర్థిక జీవిగా అభివర్ణించాడు. పాశ్చాత్య భౌతికవాదులు మనిషిని ఒక సోషల్ యానిమల్ (సాంఘిక జంతువు)గా పేర్కొన్నారు. కానీ నేడు మనిషి ‘‘సోషల్ యానిమల్’’ నుంచి ‘‘సోషల్ మీడియా యానిమల్’’ దశకు ప్రయాణిస్తున్నాడు. అతడి చేతిలోని సెల్‌ఫోన్‌లో యావత్ ప్రపంచం ఉంది. అతడు మాత్రం ప్రపంచంలో జీవించడం మరిచిపోయాడు.
ముండకోపనిషత్తు- ‘‘నువ్వు ఎంత చదివినా, ఎన్ని యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు చేసినా ప్రయోజనం లేదు. నీ లోపల, బయట ఉన్నది ఒకటే అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నీకు ప్రయోజనం చేకూరుతుంది’’ అని స్పష్టంగా చెప్తోంది.
ఈ ఆధునిక కాలపు విద్య మనల్ని కూలివాళ్ళుగా అంటే ‘‘నాలెడ్జి వర్కర్స్’’గా చేస్తోంది. జ్ఞానాన్ని ఒక పదార్థంగానే ఆధునిక విద్య భావించింది. కానీ జ్ఞానాన్ని నిరంతర చైతన్యంగల ఒక శక్తిగా మన ఉపనిషత్తులు ప్రకటించాయి. దానిని నిరంతరం సాధన చెయ్యాలి. అంటే నీ లోపల, బయట ఉన్నది ఒకే శక్తి చైతన్యం అన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఈ గ్రహించడం అనేది మాటల వల్ల, కొన్ని పుస్తకాలు చదవడంవల్ల కాకుండా సాధన వల్ల జరగాలి. అటువంటి సత్యమే చివరికి విజయాన్ని పొందుతుంది. అందుకే ముండకోపనిషత్తు- ‘‘సత్యమేవ జయతే... నానృతం’’ అని ఘోషించింది. ఋతం అంటే ధర్మం. సత్యాన్ని అనుసరించి ఒక క్రమంలో సాగేదే ధర్మం. అటువంటి సత్యధర్మముల ఆధారంగా మహానీయులైన మన మహర్షులు అందించిన ఆచరణాత్మక విలువలతో కూడిన విద్యను నేటి తరానికి అందించాలి. అప్పుడే ప్రతి మనిషి, ‘‘వసుదైవ కుటుంబకం’’ భావనతో విశ్వశ్రేయస్సుకు ఒక సాధనంగా తయారుకాగలడు.

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690