Others

సచివాలయాలతో సంకల్పం నెరవేరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల సందర్భంగా ప్రతి రాజకీయ పార్టీ అనేక హామీలను గుప్పించడం సహజం. అలాగే వైసీపీ కూడా ‘నవ రత్నాలు’ అంటూ ముందుకొచ్చింది. వారి మ్యానిఫెస్టోలో గ్రామ సచివాలయాలు అనే అంశం మిగతావారికంటే భిన్నంగా ఆసక్తికరంగా ఉండటం ఒక ప్రత్యేకత. ఎందుకంటే దేశం మొత్తంమీద మనం పాలనా వ్యవస్థను ఒకసారి పరిశీలిస్తే కొన్ని రాష్ట్రాలు ఇంకా ఆఫ్‌లైన్ దరఖాస్తులు మీదే నడుస్తున్న సమయంలో, ఏపీ ఏకంగా ధృవీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో ఇచ్చేదాకా వెళ్లిన అడ్వాన్స్‌డ్ స్టేట్. సామాజికంగా బీసీలకు దేశంలో రిజర్వేషన్లను కూడా ముందుగా అమలుచేసింది కూడా ఈ రాష్టమ్రే. హైటెక్ సిటీ అనే పేరుతో సాంకేతిక ప్రపంచాన్ని కాసేపు కన్నార్పకుండా చేసింది కూడా ఈ రాష్టమ్రే. ఇక అసలు విషయానికొస్తే గ్రామ సచివాలయాలు అనే ఆలోచన అభినందించాల్సిన విషయం.
ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించిన వారి విధానాలు ఒకసారి పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఆర్‌కు ముందు, ఆయన తరువాత అన్నట్టుగా సాగింది ఎన్టీఆర్ పాలన. అప్పటిదాకా 33 ఏళ్లనుండి ఏలుతున్నవారి పేర్లన్నీ కనీసం గుర్తుకూడా లేకుండా చేసేసారు ఎన్టీఆర్. అంతలా ఆయన పాలనాపరంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. ప్రజలను పట్టిపీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థ, కరణం వ్యవస్థ రద్దు, మండల వ్యవస్థ ఏర్పాటుతో పాలనాపరంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రను వేసుకున్నారు.
73, 74 రాజ్యాంగ సవరణలతో ముడిపడి ఉన్న పంచాయితీరాజ్, నగర పాలికల చట్టాలు ఉండగా మండల వ్యవస్థ మాత్రం కొత్త పాలనా యూనిట్‌గా మారి పంచాయితీలు నగరాల మధ్య ఉన్న దూరాన్ని పాలనా పరంగా మండల స్థాయికి తెచ్చింది. పాలనా వికేంద్రీకరణ నినాదంతో ముందుకు సాగిన ఈ వ్యవస్థ మంచి పేరు సంపాదించుకొంది.
పథకాలు వేరు - పాలనా విధానాలు సంస్కరణలు వేరు. రూపాయికి కిలో బియ్యం పథకం ఎన్టీఆర్ దగ్గరనుండి మొదలుకుంటే నేటివరకు పలు దఫాలుగా అందరూ అమలుచేస్తున్నదే. సాగునీటి ప్రాజెక్టులు పలు ప్రభుత్వాలు నిరంతరం చేపట్టేవే. కానీ ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, మండల వ్యవస్థ ఏర్పాటు ఎప్పటికీ చరిత్రగానే ఉంటుంది.
అత్యంత ప్రజాదరణతో తెలంగాణలో 89 సీట్లు గెలిచిన కేసీఆర్‌కు రైతుబంధు పథకం, ఆయన విజయానికి మేలుచేసింది అంటారు కానీ పాలనా వ్యవస్థపరంగా ఆయన కూడా ఎటువంటి సంస్కరణ చేయలేదు. ప్రభుత్వం మారితే అన్నా క్యాంటీన్ వైఎస్సార్ క్యాంటీన్ అయినట్టు, రైతు రాజీవ్‌బంధుగా మారిపోవచ్చు. ఎందుకంటే అది ఒక పథకమేకానీ పాలనా సంస్కరణ కాదు. వైఎస్సార్ అంటే సంక్షేమం, చంద్రబాబు అంటే సంస్కరణ ఇలా చూస్తారు, మధ్యలో పాలించిన వారికి రాష్ట్ర విభజన అనే అంశం తప్ప తమ ముద్రవేసుకునే అవకాశమే లేదు.
ఎన్టీఆర్ వంటి ముద్ర ఎవరూ ఒక కొత్త వ్యవస్థతో ఈ రాష్ట్రంలో తీసుకురాలేకపోయారు. ఆ పనిచేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోతారు. ఎందుకంటే గ్రామాల్లో, పట్టణాల్లో సచివాలయ వ్యవస్థ ఏర్పాటుచేయడం ద్వారా పాలనలో కొత్త మార్పుకి శ్రీకారం చుట్టారు. ఈ సచివాలయ వ్యవస్థద్వారా మండలాలకి మున్సిపాలిటీలకి తిరిగే పనిలేకుండా ఎవరి నివాస ప్రదేశానికి వారికి కూతవేటు దూరంలో తమకు సంబంధించిన ప్రభుత్వ సేవలు పరిష్కారం కావడం, అవినీతిని, ఆధిపత్యాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. ఆగండాగండి అవినీతి తగ్గుతుంది అనగానే సంబరపడకండి.
ఎందుకంటే అవినీతి తగ్గుతుంది కానీ, సచివాలయాల సంఖ్య పెరిగి, అవినీతిపరుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది. అవినీతి జరగడానికి అవకాశం ఉండటానికి కారణం ప్రతి సచివాలయం ఒక వ్యవస్థ, వ్యవస్థలో లోపాలు సహజం. ఎందుకంటే అందరూ మానవమాత్రులే. రెండు వారి పరిధి 2 లేదా 5వేల జనాభాకే తగ్గడంవల్ల అవినీతికి అవకాశం తక్కువ. పైగా గ్రామీణ ప్రాంతాల్లో జనాభానుబట్టి విభజించే సచివాలయాలు ఆయా సామాజిక వర్గాల నివాస ప్రదేశాలకు పరిమితం అవుతాయేమో అన్న అనుమానమూ లేకపోలేదు. మానవుడు ఆశాజీవి కాబట్టి అవినీతికి తావులేకుండా కొత్తవ్యవస్థ పనిచేయాలని కోరుకుందాం.
మొత్తానికి ఈ వ్యవస్థ ఒక కొత్త చరిత్రగా మారి జగన్‌గారి పేరును ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వతం చేయనుంది. ప్రభుత్వం మారితే నవరత్నాలు పోతాయేమో కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థ మాత్రం రద్దుకాదు, ఒకవేళ రద్దుఅయినా, ఆ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఊరక ఉండరు కదా. అప్పటికే వారు శాశ్వత ఉద్యోగులుగా మారి కొత్త వ్యవస్థలో పాలనా భాగస్వాములుగా ఉంటారు.
నాణెనికి రెండువైపులుంటాయి. ఈ సచివాలయ వ్యవస్థ కూడా అంతే. ప్రభుత్వ హడావుడి నిర్ణయంతో భర్తీప్రక్రియ అనేక ఒడిదుడుకుల మధ్య జరిగింది. పేపర్ లీక్ ఆరోపణలు దగ్గరినుండి మొదలుకుంటే అధిక మార్కులు వచ్చిన వారికి రాని జాబ్, తక్కువ మార్కులు వచ్చిన వారికి రావడం ఒక విచిత్రం. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అభ్యర్థులు ఈ విషయమై గగ్గోలు పెట్టుకుంటూ ఆయా జిల్లాల కలెక్టర్లను కలవడం జరిగింది. చివరికి ఎంపిక జాబితాల సవరణదాకా వెళ్ళింది విషయం. పైగా ప్రభుత్వం చెబుతున్నట్టు లక్షా 34వేల ఉద్యోగాలు పూర్తిగా భర్తీకాలేదు. 14 కేటగిరీల్లో కలిపి వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీకావలసి ఉంది. తమ అనుకూల మీడియాలో ఎంత రాసుకున్నా వాస్తవం మాత్రం ఇదే. రెండవ విడత భర్తీలో ఏమి జరుగుతుందో చూడాలి.
రాష్టస్థ్రాయిలో మొదటి ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ముఖ్యమంత్రి చేతులు మీదుగా నియామకం పత్రం ఇస్తుంటారు. కానీ పేపర్ లీక్ ఆరోపణలు నేపథ్యంలో అటువంటి ప్రయత్నం జరిగినట్టు లేదు. కారణం నిర్వాహకులకే తెలియాలి. అభ్యర్థుల విద్యార్హతల విషయంలో కొందరు అవగాహన లేకుండా ఉన్నారు. పరీక్షలు ముగిసిన రోజు నిర్వహణా అధికారి ఒకరు మాట్లాడుతూ అభ్యర్థులు నిజమైన వివరాలు ఇస్తున్నారు అనుకుంటున్నాం, అబద్ధాలు ఇవ్వరు అని నమ్మి వారిని పరీక్షకు అనుమతించాము. ధ్రువీకరణ పత్రాలు చూసాకే కొలువు అని చెప్పారు.
కానీ కొందరు క్వాలిఫై అయ్యాం కాబట్టి విద్యార్హతలు లేకున్నా జాబ్ ఇవ్వమనడం, అర్హతలు చూడకుండా కాల్‌లెటర్ ఇవ్వడం రెండూ హాస్యాస్పదం. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రెటరీ పోస్టులు, ఏఎన్‌ఎం పోస్టులు ఇందుకు ఉదాహరణ.
మూడేళ్ళ పని నిబంధన, మధ్యలో వెళితే అప్పటిదాకా అందుకున్న వేతనం అంతా తిరిగి ఇవ్వడం వంటి అంశాలు ఈ సచివాలయ వ్యవస్థమీద వ్యతిరేక భావనను కలిగిస్తున్నాయి. మొత్తానికి ఆర్భాటంగా మొదలైన ఈ సచివాలయ వ్యవస్థ చివరికి ప్రభుత్వానికి ఆశించిన ఫలితం కంటే మిశ్రమ స్పందన లభించింది. ఆలోచనాపరంగా ఉన్నతంగా ఉండి, ఆచరణ మాత్రం నిర్లక్ష్యంగా నడిచినట్టు అనిపిస్తుంది. సమయం లేమి కూడా ఈ పొరపాట్లకు ఒక కారణం. గత లోక్‌సభ సమావేశాల్లో వైసీపీ లోక్‌సభ లీడర్ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ 4 నెలల తరువాత జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాం అని లోక్‌సభలో ప్రస్తావించారు. ఏపీ మంత్రి బొత్స నిన్నగాక మొన్న ఇదే మాట అన్నారు. ఉద్యోగుల జీతాలు విషయంలో ఇప్పటికీ కొందరికి జీతం అందలేదని వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే రెండేళ్ల తరువాత పేస్కేల్‌లోకి వెళ్లే ఈ లక్షా 34వేల మంది సచివాలయ ఉద్యోగుల జీత భత్యాల పరిస్థితేంటి అనేది అసలు ప్రశ్న?
రాష్ట్రంలో ఇసుక కొరత, పనుల లేమి, కరెంట్ కోతలతో సతమతమవుతున్న జన జీవనానికి, రాష్ట్రంలోని పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారు అన్న విషయం అసలు ఆలోచనకే రాదేమో కానీ, రాజకీయాలను నిత్యం పరిశీలించే వారికి ఇది ఎబ్బెట్టుగా కనిపించక మానదు. ఏ కొద్దిమందికో నచ్చలేదని లక్షల మంది దృష్టిలేని సొంత ప్రయోజనకర విషయాలు వదులుకోవడానికి ఏ ప్రభుత్వమూ సిద్ధంగా ఉండదు. ఈ ప్రభుత్వమైనా ఇంతే. ప్రభుత్వాల ద్వారా ప్రజలకు అందాల్సిన అవసరాలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ ప్రతీ బాధ్యత ఓట్ల నినాదంగామారి ప్రజల కనీస హక్కులను హరిస్తున్నాయి. ప్రజలను ఏలేవారు ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన వాస్తవం ఒక్కటే. పాలనంటే అధికారం కాదు. ప్రజాసమస్యల పరిష్కారం.

- పచ్చల రాజేష్ 8331823086