Others

అభిజిత్ సూత్రమా? మార్క్స్ మంత్రమా??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో పేదరికాన్ని తొలగించేందుకు చేసిన ప్రతిపాదనలకు గాను ప్రవాస భారతీయుడైన అభిజిత్ బెనర్జీకి, ఆయన భార్య ఎస్తేర్ డుప్లో, మరో ఆర్థికవేత్త మైఖేల్ క్రెమర్‌లకు సంయుక్తంగా ఈ ఏడాది ఆర్థిక నోబెల్ బహుమతిని స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైనె్సస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ ‘మేధ’కు మరోసారి నోబెల్ దక్కడం గర్వకారణం. అందులోనూ కీలకమైన సంక్లిష్ట ఆర్థిక రంగంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందడం అపురూపం. నోబెల్ బహుమతికి ఎంపికైన వీరు పేదరిక నిర్మూలనకు జరిపిన క్షేత్రస్థాయి ప్రయోగాలు, పరిశోధనలు, విధానాలు ‘ఆర్థిక శాస్త్రం’ స్వరూపానే్న మార్చేశాయని, అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని నోబెల్ న్యాయ నిర్ణేతలు పేర్కొన్నారు.
ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా నేడు పేదరికం వికృతంగా దర్శనమిస్తోంది. ఎన్నో, ఎనె్నన్నో పథకాల్ని ప్రభుత్వాలు ప్రవేశపెట్టినా అంతగా ఫలితం కనిపించని పరిస్థితుల్లో అభిజిత్ బెనర్జీ అనేక ప్రయోగాలు చేసి సరికొత్త అంశాలను ప్రతిపాదించారు. అవి ఆచరణాత్మకంగా, అభివృద్ధికి దోహదపడేవిగా ఉండటంతో వాటికి ఆదరణ, గౌరవం దక్కాయి. పేదపిల్లలు బడికి వెళుతున్నా వారికి ఎందుకు విద్య అబ్బడం లేదు? కొందరికి తినడానికి తిండి ఎందుకు దొరకడం లేదు? కొందరు ఎందుకు టీవీలను కొనుక్కోలేక పోతున్నారు? అధిక సంతానం పేదరికానికి కారణమా? ..ఇత్యాది ప్రశ్నలకు సమాధానాల సమాహారం, వారి పరిశీలనలో- పరిశోధనలో- ప్రయోగంలో తేలిన సారాంశం. అదే వారి ‘సిద్ధాంతం’. ఈ దృష్టికోణంలో జరిపిన విస్తృత మేధోమథనం, కార్యక్షేత్ర నివేదికల సారాంశం సరికొత్త వెలుగులకు తావిచ్చింది.
అభిజిత్ బెనర్జీ ఆయన అర్ధాంగి ఎస్తేర్ రచించిన ‘పూర్ ఎకనామిక్స్’(పేదల ఆర్థిక శాస్త్రం) పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు లభించింది. ఇది 17 భాషల్లోకి అనువాదమయింది. దీంతో వారి ఆర్థిక శాస్త్ర ప్రావీణ్యం ఎంత సమకాలీనమైనదో తేటతెల్లమవుతోంది. ప్రతిష్టాత్మకమైన మసాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి)లో వారు ‘పావర్టీ యాక్షన్ ల్యాబ్’ను నెలకొల్పి ఆర్థిక రంగంలో విస్తృత పరిశోధనలు జరిపారు. భారతదేశంలోనూ అనేక ప్రయోగాలు నిర్వహించారు. దాని ఫలితమే నోబెల్ పురస్కారం.
‘ప్రథమ్ సేవామందిర్’వంటి స్వచ్ఛంద సంస్థల కృషి ద్వారా తానెంతో నేర్చుకున్నానని భారత మూలాలున్న అభిజిత్ వినమ్రంగా చెబుతున్నారు. అలాగే తర్కం, హేతువులపైనే గాక క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనం కీలకమని ఆయన బలంగా నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికం నిర్మూలనకు ఎందరో పనిచేస్తున్నారని, ఎందరినుంచో ఎన్నో విషయాలు నేర్చుకునేందుకు అవకాశముందని ఆయన అంటున్నారు. ఈ పరిశోధనల ఆధారంగా ప్రతిపాదించిన సూచనల వల్ల ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు దశాబ్దాల్లోనే గణనీయమైన ‘మార్పు’కనిపించిందని నిపుణులు-న్యాయ నిర్ణేతలు పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధికి అభిజిత్ వర్తమాన సూచనలు విలువైనవిగా రుజువయ్యాయి.
పేదరికానికి కారకాలైన మూలకణాలకు ‘మందు’వేయడం వల్ల సమాజం ముందడుగు వేస్తుందని నిరూపించడంతో ఆయన సూచనలకు-సిద్ధాంతానికి ‘మాన్యత’ లభించింది. ‘సుస్థిరాభివృద్ధి’కి అవసరమైన ‘ఔషధాన్ని’వారు ఆవిష్కరించి అందించారు. విధానకర్తలు (పాలకులు) పేదరికాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోకపోవడం వల్లనే ఆయా పథకాలు విఫలమవుతున్నాయని వారి నిశ్చితాభిప్రాయం. వారి మరో కీలక పరిశీలనాంశం ఏమిటంటే- సిద్ధాంత ప్రాతిపదికనో, అజ్ఞానంతోనో పథకాలు ప్రవేశపెడితే ప్రయోజనం శూన్యమని కరాఖండిగా చెబుతున్నారు. వాస్తవికత, వాస్తవ గణాంకాలు ఆధారంగా మాత్రమే పథకాల రూపకల్పన చేసినట్టయితే పేదరిక నిర్మూలనకు అవి ఉపకరిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.
‘ప్రపంచ పేదరికంపై పోరాట పంథా’ విషయమై అభిజిత్ బెనర్జీ చేసిన రచన విప్లవాత్మకమైనది. వర్తమాన కాలానికి సరితూగే ఆర్థిక దివిటీగా గుర్తింపు పొందింది. పేదరికం, అవిద్య, అనారోగ్యం లాంటి రుగ్మతలకు, సిద్ధాంతాల్లో పరిష్కారాలు లభించవని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ భావనలతో ఎంతోమంది కమ్యూనిస్టుల, నక్సలైట్ల, మావోయిస్టుల కళ్లు తెరిపించాడు. (కళ్లుతెరిచేది లేదని వారు భావిస్తే అది వారి ఖర్మ). పశ్చిమ బెంగాల్ మూలాలున్న అభిజిత్ అభిప్రాయాలతోనైనా భారతదేశ వామపక్షీయుల- మావోయిస్టుల మనోనేత్రాలు విప్పారుతాయా? ప్రపంచ పేదరిక నిర్మూలన అన్నది ‘మార్క్సిజం-లెనినిజం, మావో ఆలోచనా విధానం’లోనే ఉందని దశాబ్దాలుగా దబాయిస్తున్న ఆ సిద్ధాంత ‘అంధుల’కు సమకాలీన ‘సత్యం’ ఎప్పటికి బోధపడుతుందో?...
ఆడమ్ స్మిత్ తదితరుల ఆర్థిక అభిప్రాయాలపై ఆధారపడి కారల్ మార్క్స్ ప్రయోగానికి, వాస్తవ పరిస్థితికి సంబంధం లేకుండా తనదైన ఊహాలోకంలో విహరించి రూపొందించిన ఆర్థిక సూత్రాలు ‘నభూతో...నభవిష్యతి’అని వామపక్షీయులు, మావోయిస్టులు ఈ 21వ శతాబ్ద ప్రథమార్థంలోనూ కలవరించడం ఎంతటి అజ్ఞానమో అభిజిత్ బెనర్జీ పరిశోధనలు, ప్రయోగాలు, ఆర్థిక ప్రతిపాదనలు రుజువుచేస్తున్నాయి.
పేదరిక నిర్మూలన సిద్ధాంత రూపకర్తగా ప్రపంచం కీర్తిస్తున్న అభిజిత్ బెనర్జీ దృష్టికోణానికి, ప్రయోగశాలలో సృజనాత్మక పరిశోధనలకు, అసంఖ్యాక నివేదికల ఆధారంగా రూపొందించిన సారాంశానికి మార్క్స్ ఆర్థిక సూత్రీకరణలకు హస్తమశకాంతరముంది. కారల్ మార్క్స్ గాని ఆయన సహచరుడు ఫ్రెడరిక్ ఏంగిల్స్ గాని పరిశోధనలు, ప్రయోగాలు, నివేదికలు, క్షేత్రస్థాయి అధ్యయనాలు, ఆచరణ-అనంతర ఫలితాల జోలికెళ్ళకుండా లండన్‌లోని ఓ పెద్ద గ్రంథాలయంలో కూర్చొని సిద్ధాంతాన్ని దాదాపు శతాబ్దం క్రితం రూపొందిస్తే అది అమోఘం- అద్భుతం... అనిర్వచనీయం...ఆహాఁ...ఓహోఁ అని తరతరాలుగా మూర్చనలు పోతే పేదరికం అంతమైందా? పేద ప్రజలకు సాధికారత సమకూరిందా? విద్య-విజ్ఞానం వారి దరిజేరిందా? మహోన్నత లక్ష్యం నెరవేరిందా? లేదు.. మార్క్స్ ఆర్థిక సూత్రాలు అవలంబించిన దేశాలు ఆర్థికంగా కుప్పకూలాయి, మరింత పేదరికంలోకి జారుకున్నాయి. తాజాగా వెనిజులాలో ప్రజలు విపరీత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ‘అన్నమో రామచంద్రా..’ అంటూ వీధుల్లో తిరుగుతున్నారు. అత్యవసర మందులు సైతం దొరక్క అల్లాడుతున్నారు. కనీసం మంచినీళ్లు అందక దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఆ నరకాన్ని సహించలేక వలసపోతున్నారు. మార్క్స్ ఆర్థిక సూత్రాల ‘అద్భుత అందం’ వెనిజులాలో అలా దర్శనమవుతోంది. ఆ వికృత మానవ విధ్వంసం కళ్ళముందు కనిపిస్తున్నా భారతదేశంలో అలాంటి వాతావరణానే్న ప్రవేశపెట్టేందుకు మావోయిస్టులు దండకారణ్యంలో ‘జనతన సర్కార్’ను ’స్టార్ట్’చేశారు. ఈ పరిణామాన్ని చూసి అభిజిత్ బెనర్జీ లాంటి ఆర్థిక నిపుణులు ముక్కున వేలేసుకోవడం ఖాయం. మావోలు మాత్రం మర తుపాకులతో, మందు పాతరలతో విధ్వంసం సృష్టించి, సహకరించని పేదసాదలను సైతం సంహరించి ‘సమ సమాజం’ ఏర్పాటుచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. పైశాచిక దాడులకు తెగబడుతున్నారు.
21వ శతాబ్దపు సాంకేతిక విప్లవం విప్పారుతున్న తరుణంలో అభిజిత్ ఆర్థిక సూచనలు-సిద్ధాంతాలు సవ్యమైనవా? మావోలు వల్లిస్తున్న ఆర్థిక సూత్రీకరణ సబబైనవా?? ఎవరికివారే సమాధానం చెప్పుకోవలసిన తరుణమిది.

-వుప్పల నరసింహం 99857 81799