Others

విద్యతో జాతి సమగ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్యత్ భారత నిర్మాణానికి పునాదిరాళ్ళు నేటి బాలలు. అందుకే ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అంటారు. మన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే మంత్రదండం విద్య అని అభివర్ణించవచ్చు. ‘అశేష ప్రజానీకంలో విద్య, విజ్ఞానం పెరిగిన మేరకే దేశం ముందుకు సాగుతుంది. మన దేశం ఇప్పటికీ వెనుకబడడానికి కారణం విద్య, విజ్ఞానం కొద్దిమంది గుత్త సొమ్ము కావడమే’ అన్నారు స్వామి వివేకానంద. ఉత్తమ పౌర సమాజ నిర్మాణం విద్య ముఖ్య లక్ష్యం. సామాజిక, ఆర్థిక ప్రగతికి తొలిమెట్టు విద్య. స్వతంత్ర భారతదేశంలో తొలి విద్యా శాఖామంత్రిగా పనిచేసిన వౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజైన నవంబర్ 11న ‘జాతీయ విద్యా దినోత్సవా’న్ని 2008 నుంచి పాటిస్తున్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే భావనతో ఏఐసిటిఈ, యుజిసి వంటి అత్యున్నత సంస్థలను ఏర్పాటు చేయడానికి ఆజాద్ ఎంతో కృషి చేశారు. 14 సంవత్సరాల వయస్సు వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలుచేయడాన్ని ఆయన గట్టిగా సమర్థించారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు. కామన్ స్కూల్ సిస్టం, 10+2+3 విద్యా విధాన సూ త్రాన్ని నిర్థారించారు. 1948లో ప్రాథమిక, ఉన్నత విద్యకు, 1952లో సెకండరీ విద్యకు ప్రత్యేక కమిషన్‌లు నియమించారు. దేశం గర్వించే విద్యాశాఖ మంత్రిగానే గాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సుప్రసిద్ధ రాజనీతిజ్ఞుడిగా, హిందూ, ముస్లింల సమైక్యతా సారధిగా చరిత్రలో ఆజాద్ నిలిచిపోయారు. ఆయనకు మరణానంతరం ‘భారతరత్న’ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది.
ప్రాథమిక విద్య ద్వారా సంస్కృతి, సాహిత్యాలను ప్రోత్సహించడంలో ఆజాద్ కృషి మరువలేనిది. లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ వంటి అనేక సాంస్కృతిక సాహిత్య అకాడమీల స్థాపనకు ఆయన కృషిచేశారు. 1947-52 వరకు విద్యా శాఖ మంత్రిగా, 1952-58 వరకు విద్య, ప్రకృతి వనరుల శాస్త్ర సాంకేతిక మంత్రిగా, 1956లో యునెస్కో అధ్యక్షునిగా పనిచేసిన ఆజాద్ అసమానమైన రీతిలో విద్యాభివృద్ధికి కృషిచేశారు. బి.జి.ఖేర్ కమిటీ (1947) సిఫారసుల మేరకు విద్యారంగానికి కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్‌లలో 30 శాతం కేటాయింపులను అమలు చేయించారు. విద్యార్థులకు విజ్ఞాన విహార యాత్రలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆజాద్ సూచించారు. సామాజిక ఆర్థిక వ్యవస్థను పునర్‌నిర్మించానే రాజ్యాంగ లక్ష్యాల వెలుగులో ఆజాద్ రూపొందించి అమలు చేసిన విద్యా వ్యవస్థ మార్గదర్శక సూత్రాలను అమలు చేయించుకోవాల్సిన బాధ్యత పౌర సమాజం స్వీకరించాలి. అప్పుడే విద్యలో సమానావకాశాలు ఉంటాయి. విద్యారంగానికి చిరస్మరణీయ సేవలందించిన ఆజాద్ 1958 పిబ్రరి 22న మరణించారు.
విద్యాపరమైన వికాసం వల్లనే సామాజిక పురోగమనం సాధ్యమవుతుంది. కానీ మన దేశంలో నేటికీ విద్యా విధానం ఇంకా అసమగ్రంగా ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జాతీయ సగటు అక్షరాస్యత 73.9 శాతంగానే ఉంది. ప్రపంచంలోని మొత్తం నిరక్షరాస్యుల్లో 37 శాతం మంది మన దేశంలో ఉండడం గమనార్హం. దేశంలోని 28 రాష్ట్రాల్లో అట్టడుగున బిహార్ ఉంటే ఆ తర్వాత స్థానంలో తెలంగాణ దక్కించుకోవడం గమనార్హం. విద్యాహక్కు చట్టం ప్రకారం అందరూ చదువుకోవాలి. అందుకు తల్లిదండ్రులకు కూడా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి.
గతంలో దేశవ్యాప్తంగా 610 జిల్లాల్లోని 44 వేలకుపైగా పాఠశాలలకు చెందిన సుమారు 15 లక్షల విద్యార్థుల చదువు సంధ్యల గతి రీతులపై నిర్వహించిన విద్యా విషయక కార్యసిద్ధి అధ్యయన ఫలితాలు ఆందోళనను కలిగించాయట. దేశంలో పరీక్షల వ్యవస్థ సమస్యాత్మకమని నిర్థారించిన కొఠారి కమిషన్, 1986 నాటి జాతీయ విద్యా విధానం, యశ్‌పాల్ కమిటీ- బాలలపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్బోధించాయి. కేవలం మార్కులు, ర్యాంకులనే ప్రతిభకు చిహ్నాలుగా పరిగణించే విధానాలు విద్యార్థులను చాకిరీ యంత్రాలుగా మార్చేస్తున్నాయి. నేటికీ పుస్తకాల బట్టీయానికే ప్రాధాన్యత వుంది. తరగతి గదిలో పిల్లల గ్రహణశక్తి పరంగా స్థారుూ భేదాలకు తగ్గట్లు బోధన, అభ్యసన సామర్థ్యాల మదింపు భిన్నంగా ఉండాలి. ఒత్తిడి లేని చదువులకు బాటలు పరచాలి. ప్రధాని మోదీ చెప్పినట్లు ‘వ్యక్తిని విశ్వమానవుడిగా తీర్చిదిద్దగలిగేది విద్యే’. అట్టడుగు స్థాయినుంచే విద్యాబోధన పరిపుష్టమైతే ఉన్నత చదువుల్లోనూ మెరుగుదల సాకారమవుతుంది. బాలలందరికీ ప్రాథమిక విద్య సక్రమంగా సమకూరితేనే ఆర్థికాభ్యున్నతి ఒనగూడుతుందని, గతంలో ప్రపంచ బ్యాంకు, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు ఉద్బోధించాయి. పిల్లల ప్రవేశాల శాతం, పాఠశాలలో పెరుగుతున్న ప్రమాణాల పతనం ఆందోళన కలిగిస్తున్నాయి. శక్తివంతమైన సమాజాన్ని నిర్మించటంలో విద్యార్థుల పాత్ర చాలా కీలకం. ప్రైవేట్ పాఠశాలల్లో ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ కోర్సుల పేరుతో ఒత్తిడితోకూడిన విద్యా విధానం వల్లే నేటి విద్యార్థులు మనోధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. విద్యార్థులకు చిన్నప్పటినుంచే క్రమశిక్షణ, నైతిక విలువలు, దేశభక్తి, పెద్దల పట్ల గౌరవం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, సమయం విలువ వంటివి నేర్పించాలి. అప్పుడే విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.
ఇటీవల జాతీయ విద్యా విధానంపై కస్తూరి రంగన్ కమిటీ సమర్పించిన నివేదిక ప్రభావం దేశంలో 50 శాతం ప్రజలపై వుంటుందని అంచనా. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సులు చేసింది. విద్యా రంగంపై పెట్టుబడులను లాభాల దృష్టితో చూడరాదని కూడా కమిటీ సూచించిందది. విద్యా రంగంలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముసాయిదాలో పేర్కొనడం విశేషం. విద్యారంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు పదేళ్ళ వ్యవధిలో 10 నుంచి 20 శాతం పెరిగిందని కమిటీ వివరించింది. గడచిన ఐదేళ్లలో విద్యారంగంలో పెట్టుబడులు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 3 శాతమే. కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సులు అమలు జరిగితే విద్యా శాఖకు నూతనోత్తేజం ఖాయం. చదువంటే పిల్లవాడికి గుదిబండగా మారకుండా, నైతిక విలువలు, జీవన నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఉండాలి. అప్పుడే ఆజాద్ కలలు సాకారం అవుతాయి.
*
(నేడు జాతీయ విద్యా దినోత్సవం)

-కె.రామ్మోహన్‌రావు