Others

‘బయోమెట్రిక్’తో బడులు బాగుపడ్డాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈఒక్క విద్యాసంవత్సరమే వందలకొద్ది పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉండి మరికొన్ని వందల పాఠశాలలు మూసివేత అంచున ఉన్నాయి. సంఖ్య పడిపోవడానికి, మూసివేతకు చేరుకోవడానికి ప్రభుత్వ విధానాలు ఎంత కారణమో, ఉపాధ్యాయులలోని వృత్తి బాధ్యతా రాహిత్యం, నిబద్ధత లోపించడమూ అంతే కారణం. ఉపాధ్యాయులు చాలామంది విద్యాధికారులతో కుమ్మక్కై బడులకు ఎగనాం పెడుతున్నారని, కొంతమంది సంఘ నాయకులు పాఠశాలలో సంతకాలు పెట్టి డైరీలు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని పలు ఆరోపణలు రావడంతో గత విద్యా సంవత్సరం నుండి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, మహబూబ్‌నగర్ జిల్లాలలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 12 జిల్లాల్లోని పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలులోకి తెచ్చారు. ఎందుకంటే ఒక ఉద్యోగి తాను పనిచేసే కార్యాలయానికి ఎప్పుడు వస్తున్నాడో, వెళుతున్నాడో పైఅధికారులకు, ప్రజలకు తెలియాల్సి వుంటుంది. కాని కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం ‘మేము దొంగలమా, మాకెందుకు బయోమెట్రిక్ పెడుతున్నారు’ అంటూ నిందిస్తున్నారు. వాస్తవానికి ఇది ఒక మంచి విధానం. కార్పొరేట్ సెక్టార్లో ఇది విజయవంతంగా అమలవుతున్నది. వేలల్లో ప్రజల సొమ్మును వేతనాలుగా తీసుకుంటున్నవారి బాధ్యతను గుర్తుచేయడంతోపాటు, భద్రతను కూడా కల్పిస్తుంది. దీని అమలుకు ముందు పాఠశాలలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరు రిజిష్టరులో కేవలం సంతకంతో సరిపుచ్చేవారు. బయోమెట్రిక్ విధానంలో ఉపాధ్యాయుని యొక్క వేలి ముద్రలను నమోదు చేసుకొన్న అనంతరం ప్రతిరోజు పంచింగ్ ద్వారా తన యొక్క హాజరును ధృవీకరించవలసి వుంటుంది. పాఠశాల ఉపాధ్యాయులు విధులకు ఆలస్యంగా హాజరవుతున్నారని, అధికారులతో కుమ్మక్కై ఎగనామం పెట్టి వ్యాపారాలు చేసుకుంటూ జీతభత్యాలు పొందుతున్నారని వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రయోగాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లోల్లో ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.
ఈ విధానంలో హాజరు రిజిష్టరులో సంతకంతోపాటుగా పాఠశాలకు హాజరైన పనిదినాలలో మొత్తం నాలుగుసార్లు అనగా ఉదయం పాఠశాలలోకి ప్రవేశించిన అనంతరం ఒకసారి, లంచ్ అవర్ ప్రారంభంలో రెండోసారి, లంచ్ అవర్ ముగిసి మధ్యాహ్నం పాఠశాల ప్రారంభంలో మూడోసారి, చివరగా సాయంత్రం పాఠశాలను వదిలిన తర్వాత.. ఈ విధంగా మొత్తం నాలుగుసార్లు వేలిముద్రలను పంచింగ్ చేయాల్సి వుంటుంది. దీనిపై ప్రత్యేక శిక్షణను జిల్లాలోని ప్రతి మండలంలోగల అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటుగా, మండల విద్యా శాఖాధికారులకు ఇచ్చి జిల్లాల్లోని అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ మిషన్లు బిగించడం కూడా జరిగింది. కాని ఆ తదనంతరం మండల, జిల్లా, రాష్ట్ర విద్యా శాఖాధికారుల పర్యవేక్షణ లేకపోవడంవల్ల ఈ విధానం మొత్తం పక్కదారి పట్టిందనే ఆరోపణలు వున్నాయి. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ వేలిముద్రలను నమోదు చేసుకోగా, కొన్ని పాఠశాలల్లో ఇప్పటివరకూ కూడా బయోమెట్రిక్‌లో తమయొక్క వేలిముద్రలను నమోదు చేసుకోకపోయినా చూసీ చూడనట్టు ప్రధానోపాధ్యాయులు, అధికారులు వ్యవహరిస్తున్నారు. విద్యా శాఖ ఎంత మొద్దునిద్రలో ఉందో, ఎంత పర్యవేక్షణ లోపం వుందో అర్థమవుతుంది. ఈ నమోదు చేసుకొనని జాబితాలో కొంతమంది సంఘ నాయకులు కూడా ఉండడం గమనార్హం. నమోదు చేసకొన్న ఉపాధ్యాయులలో 99 శాతం మంది నాలుగుసార్లు పంచింగ్ చేయడానికి బదులుగా బడి ప్రారంభంలో, ముగిసే సమయాల్లో మొత్తం రెండుసార్లు మాత్రమే పంచింగ్ చేస్తున్నారని, సగం పూట లీవ్ పెట్టి పాఠశాల విధులనుండి బయటకు వచ్చేటప్పుడు ఉపాధ్యాయులెవరూ పంచింగ్ చేయడంలేదని పరిశీలనలో తేలింది.
బయోమెట్రిక్ వచ్చిన తర్వాత కూడా విధులకు ఎగనాం పెట్టే ఉపాధ్యాయులలో ఎటువంటి మార్పులేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. బయోమెట్రిక్‌లో వరుసగా ఆబ్‌సెంట్ అని ఉన్నప్పటికి అట్టి ఉపాధ్యాయుల జీత భత్యాలు ఆయా పాఠశాలల అధికారులు చెల్లిస్తున్నారు అనే ఆరోపణలు వచ్చిన సందర్భంలో పాఠశాల విద్య ఆర్‌జెడి అనేక పాఠశాలలను సందర్శించినా ఎలాంటి మార్పు కానరావడంలేదు. పై అన్ని జిల్లాల్లోని 80 శాతం పాఠశాలల్లో లేట్ రిజిష్టర్ కాని, సిఎల్ రిజిష్టర్స్ కాని లేవు. అవి వున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటిని నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు దీనికి అదనంగా ములుగు జిల్లా కలెక్టర్ జి.పి.ఎస్ ఆధారిత హాజరు మొబైల్ ఆప్‌ను, స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మొబైల్ హాజరు ఆప్‌ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాంటి ఏన్ని ఆప్‌లు, బయోమెట్రిక్‌లు వచ్చినా వీటిపై అధికారుల మానిటరింగ్ లేకపోవడం, విధులకు ఎగనామం పెడుతున్న వారికి శిక్షలు లేకపోవడంవల్ల పరిస్థితులలో ఎటువంటి మార్పు లేదు. డిప్యూటేషన్ పెట్టిన ఉపాధ్యాయులను వారు పనిచేస్తున్న పాఠశాలలోనే బయోమెట్రిక్ పరిధిలోకి తీసుకురావాలని ఉత్తర్వులు ఉన్నప్పటికి అమలుకాని దుస్థితి నెలకొని ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా, రాష్ట్ర స్థాయి విద్యా శాఖాధికారులు తమ యొక్క అలసత్వాన్ని ఆన్‌లైన్‌లో నమోదవుతున్న బయోమెట్రిక్ విధానంపై ప్రతిరోజూ సమీక్ష చేయవలసిన అవసరమున్నది. ఇప్పటివరకు నమోదుచేసుకోకుండా వున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడంతోపాటుగా ప్రతి రోజు నాలుగుసార్లు బయోమెట్రిక్ అయ్యే విధంగా చర్యలు తీసుకోనంతకాలం విధులకు ఎగనామం పెట్టే ఉపాధ్యాయులలో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం లేదని విశే్లషకులు భావిస్తున్నారు. వరుసగా ఆబ్‌సెంట్ వుంటున్న ఉపాధ్యాయులు ఏ లీవులో వున్నారు, వారికి ఏ విధంగా ఆ నెలకు సంబంధించిన జీత భత్యాలు చెల్లించబడుతున్నాయి అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరమున్నది. కార్యాలయ నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగి ఒక నెలలో మూడు రోజులు అధికారుల ముందస్తు అనుమతితో కొద్దిపాటి ఆలస్యంగా రావడానికి అవకాశం వున్నది. కాని కొంతమంది ఉపాధ్యాయులు మూడురోజులకు మించి వరుసగా విధులకు ఆలస్యంగా వస్తున్నట్లు నమోదవుతున్నా వారిపై చర్యలు తీసుకొన్న నాధుడే లేడు. బయోమెట్రిక్‌కు సంబంధించిన అస్తవ్యస్త విధానాలపై ఇటీవల ఓ ఉపాధ్యాయ సంఘం వరంగల్ రూరల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటుగా విచారణ చేపట్టాలని, ఈ నిర్లక్ష్యం వెనుక జిల్లా విద్యా శాఖాధికారుల హస్తం కూడా వున్నదని ఆరోపించడం కొసమెరుపు. కాబట్టి ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి బయోమెట్రిక్‌ను పకడ్బందీగా అమలు చేసినపుడే హాజరు ఉపస్థితి మరింత మెరుగుపడుతుంది.
అయితే ప్రస్తుతం అమలవుతున్న బయోమెట్రిక్ విధానంలో కొన్ని సాధక బాధకాలు ఉన్నాయి. ప్రస్తుతం అమలవుతున్న జిల్లాల్లో చాలా రూరల్ ప్రాంతాలతోపాటుగా, అటవీ ప్రాంతాలు కూడా ఉండడంవల్ల సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేక తంబ్ పంచింగ్ సరిగా కావడంలేదు. విజన్ టెక్ సంస్థ యొక్క నాసిరకం సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ మిషినరీవలన పంచింగ్ కాకుండా కొన్ని సందర్భాల్లో ఆబ్‌సెంట్ లేదా అవుట్ అని రిపోర్టు చూపిస్తున్న ఫిర్యాదులు కూడా వున్నాయి. ఫిర్యాదు చేస్తే మూడు నాలుగు రోజులకు కూడా సరిచేయని పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు కూడా బయోమెట్రిక్‌లో వుండడంవలన 100 మందికి ఒక మిషన్ అనేది ఒక అసంబద్ధ విధానం. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఐడి కోడ్ నమోదు చేసి పంచింగ్ చేయవలసి రావడంవలన చాలా సమయం వృథా అవుతున్నది. కాబట్టి ఐడి నెంబర్‌తో సంబంధం లేకుండా పంచింగ్ ద్వారా బయోమెక్ అయ్యే విధంగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధిపరచాలి. విద్యా శాఖాధికారి కార్యాలయాల్లో కాకుండా దీనికోసం ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ఒక ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేసి ముందస్తు అనుమతి లేకుండా విధులకు ఆబ్‌సెంట్ అయిన, ఆలస్యంగా విధులకు హాజరవుతున్నవారి లిస్ట్‌ను ప్రతిరోజూ రూపొందించి, సంబంధిత కార్యాలయాలకు పంపి విచారణ జరిపి, ఉద్యోగుల జీత భత్యాల్లో కోత విధించడంతోపాటుగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. క్రమశిక్షణ నేర్పే ఉపాధ్యాయులకు కూడా సమయపాలన, వృత్తి బాధ్యతలకు సంబంధించి క్రమశిక్షణ నేర్పాల్సి రావడం దురదృష్టకరం!

- ఎ. హేమ, దొడ్డి కొమురయ్య ఫౌండేషన్