AADIVAVRAM - Others

ఆమె చిత్రాలు ఆకుపచ్చ తివాచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ముద్దుల మనవరాలు, ప్రముఖ చిత్రకారిణి సురభి వాణిదేవీ కూతురు, స్వతహాగా నృత్యకారిణి, చిత్రకారిణి అయిన సురభి అజిత నైరూప్య చిత్రాలు గీయడంలో, సెమీ రియలిస్టిక్ పద్ధతిలో బొమ్మలు వేయడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇంప్రెషనిజం అంటే ఇష్టపడతారు. ప్రధానంగా ఆమె ప్రకృతి ప్రేమికురాలు. ప్రకృతిని కాపాడటం, ప్రకృతికి ప్రతిరూపంగా భావించే ఆడపిల్లలను కాపాడుకోవాలని తపన పడే తత్వం ఆమెది. అందుకే ఆమె చిత్రాలు ఎక్కువగా ఆకుపచ్చటి ప్రకృతితో పరిమళిస్తుంటాయి. వస్తువుతోపాటు ‘శైలి’ చిత్రకళలో కీలకమని ఆమె భావిస్తారు. ‘టెక్చర్’కు అధిక ప్రాధాన్యమిస్తూ అనేక బొమ్మలు గీశారు. ముఖ్యంగా ఆమె గీసిన ‘పూలు’ ఈ శైలికి అద్దం పడతాయి. సౌందర్యవంతమైన, రసాత్మకమైన (ఈస్థటిక్స్) వాటిని ఆమె ఎక్కువగా ఇష్టపడతారు. ఆమె వేసిన అనేక ‘ప్రకృతి’ చిత్రాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తాయి. అందుకే ఆ బొమ్మలు ‘క్యాలెండర్ ఆర్ట్’గా కొందరు భావిస్తారు. అలాగని వాటిని చిన్నచూపు చూడటం కానేకాదు. ఆకుపచ్చని తివాచీ లాంటి పొలాలు, చెట్లు, దూరంగా కొండలు, బండరాళ్లు, నీలిరంగు ఆకాశం.. పొడవైన తాటిచెట్లు, ఎగిరే పక్షులు ఇట్లా మనసుకు ఆహ్లాదపరిచే ‘దృశ్యాల’ను ఆమె కుంచె కాన్వాసుపై చిత్రించింది. మరికొన్ని బొమ్మల్లో పారే సెలయేరు, ఒడ్డున కొంగలు, ఇతర పక్షులు, దూరంగా దట్టమైన పొదలతో గుట్టలు, ఆ చెట్ల మధ్యలో అక్కడక్కడ ‘ఆకాశం ముక్కలు’గా కనిపించడం.. ఇంకో చిత్రంలో సూర్యోదయ వేళ భారీ వృక్షాల మధ్య నుంచి వెలుతురు ప్రవాహంలా కనిపించడం, ఎగుడు దిగుడు నేల, చెట్ల కాండం ఆ వెలుతురులో విభిన్నంగా, రకరకాల రంగులు నింపుకుని నిల్చున్నట్టు చూపడమంటే ప్రకృతి పట్ల ఆమెకున్న ప్రేమ - పారవశ్యం, మమేకం, తాదాత్మ్యాన్ని తెలియజేస్తోంది.
ఒకప్పుడు ఇంప్రెషనిజం బహుళ ప్రాచుర్యంలో ఉన్న సందర్భంలో ఇలాంటి చిత్ర రచనకు, సృజనకు ఎక్కువ మంది చిత్రకారులు ఆసక్తిని కనబరిచేవారు. క్రమక్రమంగా చిత్రకళా జగత్తులో చోటు చేసుకున్న వివిధ ధోరణుల కారణంగా ఈ రకమైన ‘ఆర్ట్’ కొంత వెనుకబడింది. అయితే అజిత లాంటి కొందరు చిత్రకారిణులు/ చిత్రకారులు మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. సున్నిత మనస్కులు, రసాస్వాదన, సౌందర్య భావన, రంగుల రస రమ్యత, లేలేత సూర్యకిరణాలు.. వాటిని ఆహ్వానించే గడ్డిపూలు, జల తరంగాలు, కొంగలు, గట్టు మీది నెమళ్లు, కొమ్మలపై కువకువలాడే పక్షులు, నేలపై గంతులేసే ఆవు దూడలు, గోధూళి.. ఈ రసాత్మకత (ఈస్థటిక్స్) అధిక పాళ్లలో జీవితంలోకి ఒంపుకున్న చిత్రకారులు.. ఇంప్రెషనిస్టులు ఆర్ట్ లవర్స్‌ను ఈ విధమైన చిత్రాలతో అలరిస్తారు. ప్రకృతి తమ మనసులపై వేసిన ముద్రను కాన్వాసుపై - కాగితంపైకి తర్జుమా చేసి వీక్షకుల ముందుకు తీసుకొస్తారు. అలా చిత్రకళా ప్రేమికుల ముందుకు ప్రకృతి దృశ్యాలను తనదైన ‘శైలి’లో తీసుకొస్తున్న అజిత ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఇంప్రెషనిస్టు బొమ్మలను మనసు పెట్టి ఎంత నిష్టగా చిత్రిస్తారో అంతే నిష్టతో నైరూప్య చిత్రాలను ఆమె గీస్తారు. సహజంగా చాలామంది చిత్రకారులు ఒకే సబ్జెక్టుకు - శైలికి - ఇజానికి - ఆకర్షితులై తమ ‘కెరీర్’ను కొనసాగిస్తారు. చిత్రకారిణి అజిత మాత్రం అందుకు మినహాయింపుగా రెండు పరస్పర భిన్నమైన ధోరణులకు ప్రాతినిధ్యం వహించే బొమ్మల సృజన చేస్తున్నారు.
నైరూప్యంలో చిత్రకారుల మానసిక స్థితికి సంకేతంగా రంగుల కేళీ కాన్వాసుపై కనిపిస్తుంది. దీనికో ‘రూపం’ లేకపోయినా అందులో గుంభనంగా సంకేతం.. సందేశం.. స్ఫూర్తి.. ఉద్దీపన.. రంగుల విద్వత్ ఉందని వారు చెబుతారు. అజిత నైరూప్య చిత్రాల్లో కొన్నిచోట్ల రంగుల మేఘాలను, రంగుల జలపాతాలను, రంగుల మంచు ముద్దలను స్ఫురింపజేసే నైరూప్య రంగుల విస్ఫోటనం కనిపిస్తుంది.
ఇలాంటి చిత్రాల్లో ఎక్కువగా టెక్చర్, ఫ్రేమ్, రంగుల ప్రాధాన్యత, ప్రహేళిక లాంటి రేఖలు పరిణితిని పట్టి చూపుతాయి. అజిత సృష్టించిన ఇలాంటి చిత్రాల్లో చూపరులు కొన్ని రూపాలను ఏరుకోవచ్చు. ముఖ్యంగా మనిషి తల, ఆ తలకు మరో తల (బ్రహ్మదేవుడి మాదిరి) అతుక్కుని కనిపించడం ఈ రెండు తలల అంతటా రంగుల నైవేద్యమే కనిపిస్తుంది. చూపరుల మెదడుకు మేత దండిగా లభిస్తుంది. మరో చిత్రంలో పక్షి ముక్కు ఓ వైపు, దాని ఈకెల వైపు మనిషి తల.. ఆకారం కనిపిస్తుంది. ఇదంతా ఒకే ఫ్రేమ్‌లో ‘టెక్చర్’ ప్రాధాన్యతతో రంగుల రంగోళిలా దర్శనమిస్తుంది.
భారతదేశ గొప్ప తొలి మహిళా చిత్రకారిణి అమృత షేర్‌గిల్ (1913-41) చిత్రాలన్నా రవివర్మ బొమ్మలన్నా తనకెంతో ఇష్టమని అజిత అంటున్నారు. అమృత షేర్‌గిల్ జీవిత చరిత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, ఆమె వేసిన బొమ్మలు చైతన్యాన్ని రగిలిస్తాయని ఆమె అంటున్నారు.
భారతదేశ ఫ్రిదాకహ్లోగా పిలుచుకునే ఆమె హంగరీలోని బుడాపెస్ట్‌లో జన్మించినా భారత మూలాలున్న ఆమె బాల్యంలోనే భారత్‌కు తిరిగొచ్చి చిత్రకళలో గొప్ప ప్రజ్ఞను, ప్రతిభను కనబరిచారు. అప్పటి నుంచి ఆమె భారతీయ చిత్రకళలో ఓ మైలురాయిగా నిలిచారు. ఆమె జీవిత చరిత్ర అజిత లాంటి చిత్రకారిణులకు ఉత్తేజం కలిగిస్తోంది. అదే విషయాన్ని ఆమె ఎలాంటి శషబిషలు లేకుండా చెబుతున్నారు. అలాగే ‘మోనాలిసా’ చిత్రాన్ని అజరామరంగా నిలిపిన ఇటాలియన్ చిత్రకారుడు లియోనార్డో డావిన్‌స్కీ జీవితం.. చిత్రకళ అన్నా అమితమైన ఇష్టం అని ఆమె అంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఉదహరించిన పేర్లు, ఇజాలు, ‘రినైజాన్స్’ సంగతులు, చిత్రకళా జగత్తులోని మెలకువలు తదితర లోతైన అంశాలను స్పృశిస్తుంటే ఆమెకున్న చిత్రకళా జ్ఞానం వెల కట్టలేనిదనిపిస్తుంది. పాశ్చాత్య పాత తరం చిత్రకారుల (ఓల్డ్ మాస్టర్స్) గూర్చి చెబుతుంటే ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే!
ఎంతో రంగుల జ్ఞాన సంపద గల అజిత హైదరాబాద్‌లో 1974లో జన్మించారు. తాత... తల్లి ప్రత్యేక ప్రేమాప్యాయతలతో పెరిగింది. బాల్యం నుంచి తల్లి చిత్రరచనతో ఆకర్షితురాలైనప్పటికీ మాసాబ్ ట్యాంక్ దగ్గర గల జెఎన్‌ఎఫ్‌ఎయులో 1995లో చేరి బిఎఫ్‌ఏను పూర్తి చేశారు. అక్కడ రంగుల ప్రపంచం తలుపులు బార్లా తెరుచుకున్నాయి. బాల్యం నుంచి చూస్తున్న రంగుల వెనుక గల మర్మం మరింత వివరంగా తెలిసింది. అంతేగాక ‘ఆర్ట్ హిస్టరీ’ కొత్త ఉత్తేజాన్ని కల్పించింది. బాల్యంలో తల్లి (వాణీదేవి) ప్రథమ గురువైనప్పటికీ అనంతరం ఎందరో గురువులు పరిచయమయ్యారు.
ఆ తరువాత కొన్నాళ్లకు పెళ్లయ్యాక అమెరికా వెళ్లాక అక్కడ అనేక పాఠశాలల్లో, కమ్యూనిటీ సెంటర్లలో, వివిధ గ్రూపులకు చిత్రరచన తరగతులు తీసుకున్నారు. కమర్షియల్ వర్క్ బోధించడంలో గడిపారు. మూగ - చెవిటి విద్యార్థులను చేరదీసి రంగుల ప్రపంచాన్ని పరిచయం చేశారు. విజిటింగ్ ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తించారు. తానా, ఆటా సంస్థలతో కలిసి కార్యక్రమాలు చేశారు. కూచిపూడి నృత్యకారిణిగా, చిత్రకారిణిగా అమెరికాలో ఆమె చాలా సంవత్సరాలు తన సేవలను అందించారు. 2010 సంవత్సరంలో భారత్‌కు తిరిగి వచ్చి తన తల్లి నడుపుతున్న శ్రీ వేంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో తన సేవలు అందిస్తున్నారు.
అలాగే కర్నాటకలోని గుల్బర్గా ఎంఎంకె కాలేజీ నుంచి 2015 సంవత్సరంలో ఎంఎఫ్‌ఏ పూర్తి చేశారు. అలా మాస్టర్స్ చేస్తూనే హైదరాబాద్‌లో రెండు సోలో షోలలో తన చిత్రాలను ప్రదర్శించారు. బెంగుళూరు తదితర ప్రముఖ నగరాలలో గ్రూపు షోలలో పాల్గొన్నారు. చందనాఖాన్ లాంటి ప్రముఖుల మన్ననలు పొందారు.
వర్తమానంలో అజిత చిత్రరచన, ప్రకృతి పరిరక్షణ రెండూ రెండు కళ్లుగా భావిస్తోన్నారు. ప్రకృతి లేకపోతే మనం లేం.. చెట్లను నరకకండి.. పచ్చదనాన్ని కాపాడండి! అని పిలుపునిస్తున్నారు. పచ్చని చెట్టును కాపాడుకున్నట్టుగానే ఆడపిల్లను అక్కున చేర్చుకుని అన్ని రకాలుగా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.
అటు పర్యావరణ పరిరక్షణ స్పృహ, చిత్రరచన, శాస్ర్తియ నృత్యం, ఆపదలో ఆడపిల్లలను ఆదుకోవడం.. ఇవన్నీ ఒకరిలో ఉండటం అరుదు. అందుకే సురభి అజిత అరుదైన చిత్రకారిణిగా, తల్లికి తగ్గ తనయగా చిత్రకళా రంగంలో, రంగుల లోకంలో తనదైన ‘ముద్ర’ను వేశారు. తనదైన సిగ్నేచర్ చిత్రాలను గీస్తున్నారు.
*
*చిత్రకారిణి సురభి అజిత 96662 77873
*

-వుప్పల నరసింహం 99857 81799