Others

అడుగు జాడలు (ఫ్లాష్‌బ్యాక్@ 50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ: నవజ్యోతి యూనిట్
రచన: సముద్రాల (జూనియర్)
కెమెరా: అన్నయ్య
నృత్యం: వేణుగోపాల్
ఎడిటింగ్: మార్తాండ్
కళ: కృష్ణారావు
సంగీతం: మాస్టర్ వేణు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
తాపీ చాణుక్య

నవజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎన్టీ రామారావు, జమునల కాంబినేషన్‌లో నిర్మాతలు యం సాంబశివరావు, వందనంలు రూపొందించిన చిత్రం ‘అడుగుజాడలు’ 1966 సెప్టెంబర్ 28న విడుదలైంది.
పిన్న వయస్సులో తల్లితండ్రులు గతించగా తాతగారు జమీందారు ప్రసాద్‌రావు (రేలంగి) వద్ద గారాబంగా పెరిగిన వ్యక్తి విజయ్ (ఎన్.టి. రామారావు). మెడిసన్ పూర్తి చేశాడు. డాక్టరు కృష్ణ (ఎస్‌వి రంగారావు) ఏకైక పుత్రిక పార్వతి (జమున). ఆత్మాభిమానం, ఆవేశం కాస్త ఎక్కువ. మానవసేవే మాధవసేవ అని భావించే డాక్టర్ కృష్ణ, కృష్ణా నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేసి వైద్య సేవ చేస్తుంటాడు. దీంతోపాటు గుప్తదానాలు చేస్తూ వ్యక్తులలో పరివర్తన కలిగిస్తుంటాడు. గజదొంగ సింగన్న (ముక్కామల) కుమారుడిని ప్రాణాపాయం నుంచి కాపాడి, తన ఫీజుగా అతన్ని మర్యాదస్తునిగా మారమని కోరతాడు. దేవదాసిగావున్న శారద (బాలసరస్వతి)ని తమ నర్సింగ్ హోమ్‌లో నర్సుగా పెట్టుకుని సేవాతత్పరతతో జీవించమంటాడు. యాక్సిడెంటుకు గురైన రైల్వే కూలీ ఖాసిం (సీతారాం)కు వైద్యం చేసి, సొంత కాళ్లపై బ్రతకమని టీకొట్టు పెట్టిస్తాడు. ఒకసారి మోటారు సైకిలు రేసులో విజయ్‌ను చూసి పార్వతి ముచ్చటపడుతుంది. మరోసారి వారిరువురు ఆడిన టేబిల్ టెన్నిస్‌లో విజయ్ ఓడిపోయి, పైగా పార్వతిని తేలికగా కామెంట్ చేయడంతో ఆమె అతనిపై కోపం పెంచుకుంటుంది. విశ్రాంతికోసం డాక్టరు కృష్ణ సొంత వూరు వెళ్ళటం, అక్కడ ఒక బోట్ రేస్‌లో గాయపడిన విజయ్‌ను రక్షించటానికి డాక్టరు కృష్ణగారింటిలోని ఆక్సిజన్ సిలెండరు వాడటం, అదే సమయానికి డాక్టరు కృష్ణకు ఆక్సిజన్ అవసరపడి అది అందక కృష్ణ మరణిస్తాడు. తన తండ్రి చావుకు విజయే కారణమని పార్వతి అతన్ని నిందిస్తుంది. డాక్టరు కృష్ణ తలపెట్టిన పోలియో వ్యాధి మందుకోసం విజయ్ ప్రయత్నిస్తాడు. డాక్టరు కృష్ణ డైరీకోసం పార్వతిని కోరగా, ఆమె తిరస్కరించి దాన్ని హాస్పిటల్ పెద్ద (నాగయ్య)కు అందచేస్తుంది. దాన్ని అర్ధం చేసుకోలేని డాక్టర్లు చెత్తబుట్టలో వేయగా, విజయ్ దాన్ని తీసికొని అందులోని సూక్ష్మం గ్రహించి పరిశోధన సాగిస్తాడు. ఆవేశంతో యాక్సిడెంటు చేసుకొని దృష్టి కోల్పోయిన పార్వతివద్దకు శేఖర్ పేరుతో చేరువై సపర్యలు చేస్తాడు. విజయ్ పరిశోధన ఫలించిందని ప్రభుత్వం బహుమతి ప్రకటించే తరుణంలో, ఆ వార్తవిన్న పార్వతి అతనిపై కేసువేయటం, ఆ డైరీకి పోలియో మందుకు ఏమీ సంబంధంలేదన్న నిజాలను జ్యూరీ డాక్టర్ల ముందు విజయ్ నిరూపించటం, విజయే శేఖర్‌గా ఆమెకు అండగా ఉన్నాడని తాతగారు చెప్పటం, పార్వతి పశ్చాత్తాపంతో విజయ్‌ను క్షమాపణ కోరటం, ఆమె కంటికి ఆపరేషన్ జరిగి చూపురావటం, విజయ్, పార్వతిల వివాహం జరగటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఒక ఆదర్శనీయుడైన వ్యక్తి అడుగుజాడల్లో నడిచి, పదిమందికి స్ఫూర్తి ప్రదాతలుగా, గౌరవనీయులుగా, మంచివారుగా ఎలా మారవచ్చు అనే అంశం ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో డాక్టర్ విజయ్‌గా ఎన్‌టి రామారావు మొదట అల్లరిగా, తమాషాగా కనిపిస్తారు. తరువాత డాక్టర్ కృష్ణ వ్యక్తిత్వం పట్ల గౌరవం, తన వృత్తిపట్ల శ్రద్ధ, డాక్టరు డైరీ గూర్చిన నిజాలు వెల్లడించటంలో హుందాతనంతో కూడిన స్పష్టత, శేఖర్‌గా పార్వతికి సాయపడటంలో సహనం, శాంతం ఇలా సన్నివేశానుగుణమైన భావాలతో ఉన్నతమైన నటన ప్రదర్శించారు ఎన్‌టి రామారావు. పార్వతిగా జమున పాత్రోచితంగా కోపం, ప్రేమ, విచారం, తండ్రిపట్ల వాత్సల్యం... పలు వైవిధ్యాలను ఆకట్టుకునేలా మెప్పించారు. ఈ చిత్రంలో నర్సింగ్ హోమ్‌లో పనిచేసే యువతిగా రమాప్రభ, రైల్వే ఉద్యోగి విజయ్ స్నేహితుడిగా చలం నటించారు. హాస్పిటల్ డాక్టర్లుగా మిక్కిలినేని, కాకరాల కనిపిస్తారు.
తెలుగు సాహితీ సినీ రంగాలలో రచయితగా రాణించిన తాపీ ధర్మారావు తనయుడు తాపీ చాణుక్య తొలుత ‘పల్లెటూరి పిల్ల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశారు. తరువాత ‘అంతా మనవాళ్ళే’ సారథీ వారి చిత్రానికి 1954లో దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతిభ, అభిరుచిగల ఈ దర్శకుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించిన రాముడు- భీముడు, ఎంగవీట్టుపిళ్ళై, రామ్‌ఔర్ శ్యామ్ చిత్రాలకు సారథ్యం వహించి సక్సెస్ సాధించారు. అలాంటి చాణుక్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎక్కువ భాగం మానసిక కల్లోలాలు, విశే్లషణలు, భావోద్వేగాలతో నాయికా నాయకుల మధ్య సన్నివేశాలు చిత్రీకరించారు. ఒక డాక్టరుగా తన సత్తా చూపించుకోవటం కోసం హీరో పడే శ్రమ, అతన్ని తోటి వైద్యులు హేళన చేయటం, జ్యూరీ విచారణలో ఎంతో చురుకుగా హీరో తన సమర్ధత నిరూపించుకోవటంలాంటి సన్నివేశాలను గంభీరంగా ఆకట్టుకునేలా చిత్రీకరించారు. చిత్ర గీతాల్లో తన శైలిని చూపారు.
సముద్రాల (జూ.) పట్టుతో కూడిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. హీరోను ద్వేషించే హీరోయిన్ ఊహలో వచ్చే గీతం చల్లని వెనె్నల, చక్కని పూల తోట, శే్వత వస్త్రాలు, మల్లెపూల వర్షంలో పూల పాన్పుపై ఎన్టీఆర్, జమునల అభినయంతో అలరిస్తుంది. అది -మల్లెలు కురిసిన చల్లని వేళలో (ఘంటసాల, సుశీల; రచన- సినారె). ఎన్టీఆర్, జమునలపై చిత్రీకరించిన మరో తమాషా యుగళగీతం -అంతకోపమైతే నేనెంత బాధపడతానో తెలుసా (ఘంటసాల, సుశీల; సినారె). ఎన్టీఆర్ రియాక్షన్స్ చూపిస్తుంటే, చూపుకోల్పోయి వేదనలో జమున వీణపై పాడే గీతం -మూగవోయిన హృదయ వీణ మరల పాడెదవేలనే (పి.సుశీల- రచన శ్రీశ్రీ). మరో అలరించే గీతం -తూలి సోలెను తూరుపు గాలి/ గాలి వాటులో సాగెను నావ (ఘంటసాల, వసంత బృందం- రచన శ్రీశ్రీ). రమాప్రభ, చలంపై గీతం -్భయము వదిలెనులే (పిబి శ్రీనివాస్, ఎల్‌ఆర్ ఈశ్వరి; రచన-కొసరాజు). గీతాలన్నీ మాస్టర్ వేణు స్వరాలలో ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి.
డాక్టర్ కృష్ణ సూక్తులు -అజ్ఞాన తిమిరంలో కొట్టుకులాడే జీవితాలకు వెలుగు చూపగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది, -నీకోపం నీకు శత్రువు, -ఆత్మహత్యా భావాన్ని దరికి రానివ్వకు, జీవితాన్ని ప్రేమించు. మానవత్వానికి, హృదయ ఔన్నత్యానికి దోహదం చేసే ఈ సూక్తులు ఆధారంగా ఓ సందేశాన్నిచ్చే చిత్రం ‘అడుగు జాడలు’. చిత్రం ఆర్థికంగా విజయం సాధించలేకపోయినా, ప్రతిభావంతులైన నటీనటుల అభినయం, సంగీతం, సందేశం ఆకట్టుకుంటాయి.

-సివిఆర్ మాణిక్యేశ్వరి