Others

రాజ్యాంగ స్ఫూర్తికి భంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన భారత రాజ్యాంగం పార్లమెంటులో ఆమోదం పొంది నేటికి సరిగ్గా డెబ్బయి ఏళ్ళు పూర్తయ్యాయి. దేశానికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్న రాజ్యాంగం ఇప్పుడు వృద్ధమూర్తి. ఇంట్లో వృద్ధుల్ని ఆశ్రమంలో చేర్పించి, వారి పుట్టినరోజు నాడు కేక్ కోసి గౌరవం తెలిపే తీరులోనే రాజ్యాంగం ప్రస్తుతం పాలకవర్గాలతో గౌరవం పొందడం బాధాకరం. అంటే అసలు స్ఫూర్తిని వెనక్కినెట్టి మాటల్లోమాత్రం గౌరవం చూపిస్తున్నారు. కారణంగా ఆ పవిత్ర గ్రంథానికి రావాల్సిన భక్తి, దానివల్ల కలగాల్సిన ఫలం వాస్తవానికి దూరవౌతున్నాయి. పుస్తకాన్ని చదివి ఆచరించకుండా గూట్లోపెట్టి పూజిస్తే వచ్చే ఫలితం లాంటిదే ఇది. అలనాటి రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష.. రాజ్యాంగం గూర్చి జనులందరిలో విస్తృత చైతన్యం రావాలని, అప్పుడు వారే దాన్ని కాపాడుకోగలరని. ప్రజల హక్కులేమిటి, బాధ్యతలేమిటి, వారికి ఏ రకమైన పాలన అందించాలి, వాటి నియమాలేమిటి, నియమాల్ని దాటితే శిక్షలేమిటి అన్న విషయాలను అందరికీ తెలియాలి. ఎందుకంటే మన దేశంలో సామాన్యుడే ప్రభువు. ప్రభువైన ప్రజలకు సేవకులుగా ప్రభుత్వమూ, రాజ్యమూ, సకల యంత్రాంగమూ ఉండాలి. చట్టాల్ని ప్రజల తరఫున ప్రజా ప్రతినిధులు తయారుచేస్తే, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదే. రాజ్యాంగం దఖలుపర్చిన హక్కుల్ని రాజ్యం హరించకుండా కాపాడాల్సింది స్వతంత్ర న్యాయవ్యవస్థ. ప్రజల గొంతుగా ఉండాలి మీడియా. తాము ప్రజాసంక్షేమం కోసం పనిచేసి ఐదేళ్లకోసారి ప్రజల మద్దతు పొందాలి రాజకీయ పక్షాలు. అంతిమంగా పాలనలో అన్నీ తెలుసుకొని నిర్ణయం తీసుకోగలిగే శక్తితో ప్రజలుండాలి.
జరుగుతున్నదేమిటి...?
ముఖ్యమైన ఎన్నికల వ్యవస్థ ధనప్రభావితమైపోయింది. కోటీశ్వరులు తప్ప సామాన్యులు ఎన్నికల సమరంలో నిలవలేని పరిస్థితి నెలకొంది. రాజకీయ పార్టీలకు వేల కోట్ల రూపాయల ఎన్నికల నిధులు వివిధ కార్పొరేట్ సంస్థలు అందిస్తున్నాయి. ఎన్నికల బాండ్ల ద్వారా ఎవరికి, ఎవరు ఎంత ఇస్తున్నారో అంతా రహస్యమే. మరి నిధులు పొందినవారు ఇచ్చినవారికి మేలుచేస్తారు గానీ సామాన్యులకా? వాటి వివరాలు ప్రజలకు తెలిసే అవకాశాల్లేవు.
ఇక ఆర్థిక సమానత్వం. దేశ సంపదలో 70శాతం కేవలం ఒక్క శాతం వద్ద కేంద్రీకృతమైంది. దేశంలో సగం మందికి కనీసం తిండి లేక రోజు గడవదు. అంతరాలు పెరుగుతూ పోతున్నాయి. మరింత అంతరాలు పెంచే విధానాలే తప్ప తగ్గించే విధానాలు దూరవౌతున్నాయి. బడుగు, బలహీన వర్గాలకు చేయూత బలహీనం. ఏ గణాంకాలు చూసినా అదే వాస్తవం. పార్లమెంట్‌లో రాజకీయాలకతీతంగా చర్చలు జరగడం అసంభవం. న్యాయస్థానాల్లో లక్షల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. బ్యాంకుల్లో లక్షల కోట్లు ప్రజాధనం పక్కదారి పడుతోంది. ఇక రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం గురించి చెప్పనలవి కాదు. ఎమర్జెన్సీ రోజుల నుండి నేటివరకూ ఎనె్నన్నో ఉదంతాలు ఇందుకు నిదర్శనం. మహారాష్టల్రో తాజా పరిణామం రాజకీయ వ్యవస్థకే సిగ్గుచేటు. అర్ధరాత్రి గవర్నర్‌కు నచ్చినట్లు పాలనా మార్పులు జరిపేలా అంతులేని విచక్షణాధికారాలు ఉన్నాయి. భారతదేశం సుస్థిరతతో, శాంతితో సాగేందుకు ఇదే రాజ్యాంగం ఎంతో తోడ్పడుతోంది. కాబట్టి ఇది అందరూ కాపాడుకోవాల్సిన పవిత్ర గ్రంథం. పాలకులు రాజ్యాంగ ధర్మం ఆచరించేలా పౌరులే అప్రమత్తంగా ఉండాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భయపడినట్టు ఇది చెడ్డవారి చేతిలోపడి నిర్వీర్యం కాకూడదు.

-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం