Others

మనసే మూల కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవరాశులన్నింటిలో మానవుడు అధికుడిగా పరిగణింపబడడానికి కారణం కేవలం అతని మానసిక వికాసమే! బుద్ధిజీవి కాబట్టి తాను మనసులో ఇష్టపడినవన్నీ అతను సాధించుకోగలుగుతున్నాడు. తన చంచలమైన మనస్సును కూడా స్వాధీనం చేసుకోగలిగి, అపార భూతదయ కూడా కలిగి ఉంటే ‘మనీషి’ కూడా అవుతాడు.
‘మానసము’ అనే పదానికి ‘మనస్సు’, ‘సరస్సు’అనే రెండు అర్థాలున్నాయి. రెండింటికీ పోలికలున్నాయి. రెండూ చంచలమైనవే! సరస్సులో బురద, పాచి, క్రిమికీటకాలున్నట్లే, మనస్సులో కూడా చెడు భావనలు, దురాలోచనలు, రాక్షస భావాలు, అనే కాలుష్యాలుంటాయి. సరస్సులో నీళ్ళు ఎక్కువైతే హద్దు దాటి పైకి వస్తుంది. అలాగే సుఖ సంతోషాలు, దుఃఖ విషాదాలతో మనస్సు పరవళ్ళు తొక్కుతుంది. గ్రీష్మంలో సరస్సు ఎండిపోయినట్లే, దుఃఖ పరితాపంతో మనస్సు కూడా శోకాకులతకు లోనై శూన్యమవుతుంది. సరస్సును ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటే ఆహ్లాదకరంగా, అందంగా కళకళలాడినట్లే, మనస్సు కూడా సద్భావనలతో శుద్ధిచేసుకొంటూంటే నిర్మలమై ప్రకాశిస్తుంది. నీటిలోని పడవను ప్రతికూలమైన గాలిలాగా, విషయాసక్తమైన మనస్సును నియంత్రించుకోకపోతే అది మనిషి వివేకాన్ని పెడదారి పట్టిస్తుంది. ‘‘కృష్ణా! చంచలమైనమనస్సును నిగ్రహించడం, గాలిని బంధించడం లాగా చాలా కష్టం కదా?’’ అని అర్జునుడు గీతాచార్యునితో అంటాడు. అందుకు కృష్ణుడు ‘‘మనో నిగ్రహానికి అభ్యాస, వైరాగ్యాలే సాధనాలు’’ అని చెబుతాడు. అభ్యాసమంటే నిరంతర సాధన. బహుకాల నిరంతరాభ్యాసం వలన మనోనిగ్రహం అలవడి తీరుతుందంటాడు పతంజలి మహర్షి. నెమ్మదిగా, ఓర్పు, నేర్పులతో, పట్టుదలతో మనస్సును స్వాధీనపరచుకోవాలి.
మనస్సు యొక్క చంచల స్వభావాన్ని గురించి ఆదిశంకరాచార్యులు ఇలా అన్నారు: ‘‘సదా మోహాటవ్యం చరతి, యువతీనాం కుచగిరౌనటర్యారౌ శాఖాస్వటతి, ఝడితిస్వైర మభిం కపాలిన్! భిక్షో! మే హృదయ కపి మత్యంత చపలం దృఢం భక్త్యా బధ్వాశివ, భవదధీనం కురు విభో’’- ఓ ఈశ్వరా! సంసార మోహమనే అడవిలో, స్ర్తిల వక్షోజములనే కొండలలో, ఆశలనే కొమ్మలలో, స్వేచ్ఛగా, విశృంఖలంగా, చపలతతో విహరించే, నా మనసనే కోతిని నీ భక్తి పాశంతో దృఢంగా బంధించి, నీ ఆధీనంలో ఉంచుకొనుము. అలాగే, తమ లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్రంలో శంకరాచార్యులు మనసునిలా మందలిస్తారు:‘‘చేతో భృంగ భ్రమసి వృథా భవ మరుభూవౌ విరసాయామ్‌ భజభజ లక్ష్మీ నరసింహా, నఘపద సరసిజ మకరందం’’- ఓ మానస మనెడి భృంగమా, ఈ ప్రాపంచికపు టెడారిలో చిక్కుపడి వృథాగా ఎందుకు పరిభ్రమిస్తున్నావు? శ్రీ లక్ష్మీనరసింహుని పాద పద్మములందలి మకరందమును గ్రోలి నీ జీవితాన్ని ధన్యం చేసుకో!’’
ఇలా కోతి లాగా, తుమ్మెదలాగా చపలము, చంచలమైన మనసులోని కల్మషాలను నిర్మూలించుకోగలిగితే, పరిశుద్ధముగావింపబడిన విషపు ప్రాణరక్షకమైన ఔషధంగా మారినట్లు మనసు మన పురోభివృద్ధికి తోడ్పడుతుంది. త్యాగరాజస్వామి, ‘‘మనసు నిల్పశక్తి లేకపోతే, మధుర ఘంటావిరుల పూజేమి చేయును?’’ అని,‘‘మనసు స్వాధీనమైన యా ఘనునకు మరి మంత్ర తంత్రములేల?’’ అని ప్రశ్నించారు. చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది. నాలుక దైవ నామాన్ని పలుకుతూ ఉంటుంది. కానీ, మనస్సు నాల్గుదిక్కుల భ్రమిస్తూ ఉంటే అది సరియైన ప్రార్థనే కాదంటాడు తులసీదాసు.‘‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః’’ బంధానికి గానీ, మోక్షానికి గానీ మూలం మన మనస్సే. బంధకారణమైతే అది మనకు శత్రువు. ముక్తి కారణమైనప్పుడది మన బంధువు. మనసు సంతోషంగా ఉంటే అది స్వర్గం. దుఃఖ వివశమైతే ఆ మనసే ఒక నరకం.
అతి చంచలమైన మనస్సుని నిగ్రహించడం మనవంటి సాధారణ మానవులకు సాధ్యమా? భర్తుృహరి కవికి కూడా ఈ సందేహమే కలిగింది.
విశ్వామిత్రుడు, పరాశరుడు వంటి సంయమవరులు ఎవరైతే కందమూలాలు తింటూ, గాలిని స్వీకరిస్తూ, తపోనిష్ఠలో ఉండేవారో, అట్టివారే సుందరీ మణుల పొందుకై మనసు చెడగొట్టుకొన్నారు కదా! మరి సన్నబియ్యం, పాలు, పెరుగు, ఉప్పు, కారం, తినే మామూలు మనుష్యులకు ఇంద్రియ నిగ్రహం అలవడడం వింధ్య పర్వతం సముద్రంలో తేలడం మాదిరిగ అసాధ్యమైన విషయం కాదా?
అందుకే సాత్విక, మితాహారం భుజిస్తూ, శరీర కష్టం కొంచెమైనా చేస్తూ, మనస్సులో ఎప్పుడూ దైవ నామస్మరణ చేస్తూ, సాటి వారికి సంతోషం కలిగేలా ప్రవర్తిస్తూ, మంచి గ్రంథాలు చదువుతూ, విరాగ భావనతో, అభ్యాసం చేస్తూ, క్రమక్రమంగా మనస్సును నియంత్రించుకోవాలి.
మనసును జయించలేనివాడు ఎంత గొప్పవాడైనా, వాని గొప్పదనము వ్యర్థమని ప్రహ్లాదునితో హిరణ్యకశిపునికి చెప్పిస్తాడు బమ్మెరపోతన కవి: ‘‘లోకములన్నియున్ గడియలోన జయించిన వాడ వింద్రియా/ నీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయునీ/ భీకర శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణకోటిలో/ నీకు విరోధిలేడొకడు నేర్పున చూడుము దానవేశ్వరా!’’-బయట రాజాధిరాజులను, రాజ్యాలను గెలిచినవాడు, తనలోనే ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరుగురు శత్రువులను గెలువలేడు. ఈ అరిషడ్వర్గాలను విచ్ఛిన్నం చేసుకొనిన వాడికి శత్రువులే ఉండరు. మనసుకు ప్రశాంతత లభించి అది వశమవుతుంది.

- గొల్లాపిన్ని సీతారామశాస్ర్తీ 9440781236