Others

ఏడుపదుల గృహప్రవేశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔను, నిజమే! ఎల్వీ ప్రసాద్ వంటి ఒక మహామనీషి సినీ నిర్దేశికత్వం; రచనపరంగా నవ్యపంథాలో సంచలనాన్ని సృష్టించిన గోపీచంద్; నటనలో ఆరితేరిన శతమతుల భానుమతి; వారిని సమన్వయపర్చి సెల్యులయిడ్‌పై అద్భుతానికి శంఖారావంవూది తెర వెనుక చక్రం తిప్పిన వైతాళికుడు కోవెలమూడి సూర్య ప్రకాశరావు (కెఎస్ ప్రకాశరావు)... వీరి మేధోమథనంతో రూపుదిద్దుకొన్న సారథివారి ‘గృప్రవేశం’ చిత్రం 1946 అక్టోబర్ 4న విడుదలైంది. అంటే ఈ వారంలో సప్తతి పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా సినిమా అభిమానులకోసం కొన్ని ముచ్చట్లు.

మాజిక చైతన్యం కోసం ఆవిర్భవించిన సంస్థ సారథి. దాని సారథి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా గూడవల్లి రామబ్రహ్మం. నిర్మాతలుగా ప్రోత్సాహం అందించినవారు చల్లపల్లి రాజా వంశీయులు. తొలి ప్రయత్నం ‘మాలపిల్ల’. మలి చిత్రం ‘రైతుబిడ్డ’ అనుకున్న లక్ష్యాన్ని, విజయాన్ని సాధించాయి. తరువాత ఆజానుబాహు, స్ఫురద్రూపి అయిన కెఎస్ ప్రకాశరావును హీరోని చేసి రూపొందించిన ‘పత్ని’ చిత్రం ప్రశంసలు అందుకొంది.
అప్పట్లో రామబ్రహ్మం నిర్వహణలోని ‘ప్రజామిత్ర’కు వ్యాసాలు, కథలు అందించి గుర్తింపుపొందారు త్రిపురనేని గోపీచంద్. ఆయన వ్రాసిన ‘గృహప్రవేశం’ కథ అందరికీ నచ్చింది. దర్శకులు రామబ్రహ్మం అనారోగ్యంతో ఉండటంతో ఆ అవకాశం గోపీచంద్‌కు వస్తుందని అనుకున్నారు. అయితే దూరదృష్టితోపాటు వ్యాపారదక్షత గల కెఎస్ ప్రకాశరావు అంతకుముందు సినీ రంగంలో ఇరవయ్యేళ్ల అనుభవం కలిగిన ఎల్‌వి ప్రసాద్‌ను బొంబాయి నుంచి పిలిపించి, నిర్మాతలను వొప్పించి దర్శకత్వపగ్గాలు ప్రసాద్‌కు వొప్పజెప్పారు. ప్రసాద్ దూరదృష్టి చాలా గొప్పది. అంతకుముందు ఆయన హెచ్‌ఎం రెడ్డి ‘సత్యమే జయం’లో హీరో పాత్ర పోషించారు. ఆయన స్వతహాగా నటించి చూపగల దార్శనికుడు. అందుకని ‘గృహప్రవేశం’లో తానే కథానాయకుని పాత్ర పోషించాలని షరతు విధించారు. సాంఘిక చిత్రంకావడంతో అయితే నటుడిగానో లేకపోతే దర్శకునిగానో రాణించవచ్చు అనేది ప్రసాద్ ఆంతర్యం. ప్రసాద్ షరతుకు నిర్మాతలు అంగీకరించారు. గోపీచంద్ స్క్రిప్ట్‌తో, ప్రసాద్ దర్శకత్వంలో రూపొందింది ‘గృహప్రవేశం’. ఈ చిత్రానికి బాలాంత్రపు రజనీకాంతరావు పాటలు వ్రాసి, సంగీతాన్ని అందించగా పెండ్యాల నాగేశ్వరరావు సహాయ సంగీత దర్శకులుగా వ్యవహరించారు.
సూక్ష్మంగా కథ:
సోమలింగం (ఎల్‌వి ప్రసాద్) మహిళా ద్వేషి. తన ఇంటికి ‘బ్రహ్మచారి సాధనా నిలయం’ పేరు పెట్టుకుని బ్రహ్మచర్యం పాటించమని తన మిత్రులకు, ప్రజలకు సందేశాలు ఇస్తుంటాడు. జానకి (్భనుమతి) ఉన్నత భావాలు కలిగిన విద్యావంతురాలైన ఆధునిక యువతి. సోమలింగం సిద్ధంతాలు తప్పు అని అతనితో విభేదిస్తుంటుంది. జానకి తండ్రి రంగస్వామి, సవతి తల్లి తులసమ్మ (సి హేమలత). ఆమె జానకిని ఆరళ్లు పెట్టడమేకాక, తన తమ్ముడు ఫారిన్ రిటర్న్ రమణారావు (సిఎస్‌ఆర్)కి పెళ్ళి చేయాలని అనుకుంటుంది. జానకి ఆ పెళ్లి తప్పించుకోవాలి కనుక, వ్యూహాత్మకంగా వచ్చి సోమలింగం ఇంట్లో ఆశ్రయం పొందుతుంది. ఆ కారణంగా వారిరువురూ అల్లరి పడటం జరుగుతుంది. తరువాత ఒక ఆశ్రమంలో చేరడం, అక్కడినుండి తిరిగి ఇల్లుచేరిన జానకి, రమణారావుచే అంతకుముందే ప్రేమింపబడి భంగపడిన లలిత (శ్రీరంజని)ని కలుసుకుంటుంది. పెళ్లిపీటల మీద తన బదులు లలితతో రమణారావుకి పెళ్లి జరిపిస్తుంది. అక్కడకు వచ్చిన కథానాయకుడు సోమలింగం, జానకి ధైర్యాన్ని, సంస్కారాన్ని మెచ్చుకుని ఆమెను పాణిగ్రహణం చేస్తాడు. వారిరువురూ సమాజ సంస్కరణ దిశగా చేతులు కలిపి దంపతులుగా గృహప్రవేశం చేయడంతో చిత్రం ముగుస్తుంది.
తీవ్రమైన సమస్యను హాస్యంతో రంగరించి విజయం సాధించడం ప్రసాద్ శైలి. ఈ విషయాన్ని వారి తదుపరి చిత్రాలు ద్రోహి, సంసారం, పెళ్ళిచేసి చూడు, మిస్సమ్మ నిరూపించాయి. విలక్షణమైన సోమలింగం పాత్రను సలక్షణంగా పోషించారు ప్రసాద్.
అంతకుముందు వచ్చిన ‘స్వర్గసీమ’లో హీరోయిన్‌గా హౌయలొలికించిన భానుమతి, ఈ చిత్రంలోని జానకి పాత్రను మరో కోణంలో ఆవిష్కరించారు. గిరీశం తరహా ఆషాఢభూతి రమణారావు పాత్రను సిఎస్‌ఆర్ పోషించటం ఓ వెరైటీ. ఈ పాత్ర స్ఫూర్తితోనే ‘నిండు సంసారం’ చిత్రంలో పద్మనాభం పాత్రకు రూపకల్పన చేశారు. ఈ చిత్రంలో ఘంటసాల ‘మారుతుందోయి ధర్మము’ అనే నేపథ్య గీతం పాడటం మరో విశేషం. గోపీచంద్ సంభాషణలు సహజంగా, సరళంగా, సరసంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి.
సహాయ సంగీత దర్శకుడు పెండ్యాల ప్రతిభను గమనించిన నిర్మాత కెఎస్ ప్రకాశరావు, ప్రసాద్ దర్శకత్వంలో తాను హీరోగా నటించిన ‘ద్రోహి’ చిత్రానికి సంగీత దర్శకునిగా అవకాశం ఇచ్చారు.
ఈ చిత్ర దర్శకులు ప్రసాద్ తరువాతి కాలంలో ‘ద్రోహి’ చిత్రంలో రౌడీగాను, చాలాకాలం తరువాత కమల్‌హాసన్ కోరికపై ‘అమావాస్య చంద్రుడు’ చిత్రంలో ఇంటి పెద్దగాను నటించారు. మద్రాసు, బాంబే, హైదరాబాద్ కేంద్రాల్లో ప్రసాద్ ల్యాబ్ నిర్మించారు. ప్రసాద్ కంటి ఆసుపత్రిని స్థాపించారు. హిందీ చిత్రరంగంలో ప్రవేశించి విజయఢంకా మ్రోగించి దాదాఫాల్కే అవార్డు అందుకున్నారు. రచయిత గోపీచంద్ ‘లక్ష్మమ్మ’, ‘పేరంటాలు’, ‘ప్రియురాలు’ చిత్రాలకు రచన చేసి దర్శకత్వం వహించారు. వారు రచన చేసిన చివరి చిత్రం అన్నపూర్ణావారి ‘చదువుకున్న అమ్మాయిలు’. రచయితగా గోపీచంద్‌ను చిరస్మరణీయుని చేసిన నవల ‘అసమర్ధుని జీవనయాత్ర’. ఇక కెఎస్ ప్రకాశ్‌రావు స్టూడియో నిర్మించి ‘దీక్ష’, ‘మొదటిరాత్రి’, ‘కన్నతల్లి’, ‘బాలానందం’ వంటి చిత్రాలు స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. వారి చిరస్మరణీయమైన చిత్రం ‘ప్రేమ్‌నగర్’. గృహప్రవేశం నాయిక భానుమతి భర్త రామకృష్ణారావుతో కలిసి భరణీ పతాకంపై ‘లైలా మజ్నూ’, ‘విప్రనారాయణ’, ‘బాటసారి’ వంటి ఆణిముత్యాలను నిర్మించారు.
ఈ ప్రముఖులంతా పనిచేసిన ‘గృహప్రవేశం’ చిత్ర వైభవాన్ని సంస్మరిస్తూ 2016 అక్టోబర్ 4న ప్రసాద్ లాబ్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఎల్‌వి ప్రసాద్ తనయుడు రమేష్‌ప్రసాద్, కెఎస్ ప్రకాశరావు తనయులు నిర్మాత కృష్ణమోహనరావు, దర్శకులు రాఘవేంద్రరావు, గోపీచంద్ తనయుడు, నటుడు సాయిచంద్‌లను అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని చాటే ‘గృహప్రవేశం’లాంటి ఆణిముత్యాన్ని అందించిన గొప్పవాళ్లందరికీ నివాళి అర్పిద్దాం.

చిత్రాలు.. భానుమతి, ఎల్వీ ప్రసాద్, కెఎస్ ప్రకాశరావు

-ఎస్‌వి రామారావు