Others

ప్లాస్టిక్ కాలుష్యానికి పూర్తి బాధ్యత మనదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక మానవుడు సాధించిన అత్యద్భుత ప్రగతికి ప్రధాన కారణం, ఆధారం ప్లాస్టిక్ అన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే ఈ ప్లాస్టిక్ వల్లే నేటి ప్రపంచం పరిష్కరించ సాధ్యంకాని సమస్యల వలయంలో చిక్కుకున్నదన్నది కూడా కాదనలేని వాస్తవం. ఒకప్పుడు పారిశ్రామిక ప్రపంచంలో అద్భుత మాయాజాలంగా నిలచిన ప్లాస్టిక్ నేడు భూమీద సకల జీవకోటి అస్తిత్వానికే ముప్పుగా పరిణమించింది.
మానవ జాతి నాగరికత వికాస క్రమాన్ని పరిశీలించినట్లయితే మానవులు తమకు అవసరమైన వస్తువులను, పరికరాలను ప్రకృతిసిద్ధంగా లభ్యమైన వనరులతోనే తయారుచేసుకునేవారు. అయితే 60 ఏళ్ళ క్రితం ఆవిష్కృతమైన ప్లాస్టిక్ మన ప్రపంచ స్వరూపాన్ని, గతిని పూర్తిగా మార్చివేసింది. ప్లాస్టిక్ పాలిమర్స్‌నుండి ఉత్పన్నమైన అణువుల కలయికతో రూపొందుతుంది. ఈ పాలిమర్స్ అనేది ప్రకృతిలో అన్నిచోట్ల లభ్యమవుతుంది. కొన్ని కీటకాలకు రక్షణ కవచంలా పైన ఉండే డిప్పలో, మన తల వెంట్రుకలలో, సిల్క్‌లో, మన కణాలలో, డి.ఎన్.ఏ.లో కూడా పాలిమర్స్ ఉంటుంది. కొన్ని రసాయనిక పద్ధతులను ఉపయోగించి పాలిమర్స్ ఉత్పత్తిచేయడం కూడా సాధ్యమే. భూగర్భంనుండి వెలికితీసిన ముడి చమురును కొంత ప్రాసెస్ చేసి కృత్రిమ పాలిమర్స్ తయారుచేయవచ్చు. ఈ కృత్రిమ పాలిమర్స్ దీర్ఘకాలం మన్నుతుంది. చాలా తేలికైనది కూడా. అంతేకాదు దీన్ని ఏ ఆకారంలోకి కావాలంటే ఆ ఆకారంలోకి మలచుకోవచ్చు. అందువల్ల ఈ పాలిమర్స్‌నుంచి తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో ప్లాస్టిక్‌ని ఉత్పత్తి చేయవచ్చు. ప్లాస్టిక్ ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు చాలాతక్కువ ఖరీదుకే విస్తారంగా లభ్యమవుతుంది. ఈ కారణం చేతనే ఆధునిక మానవ జీవితం ప్లాస్టిక్ యుగంలోకి అడుగుపెట్టింది.
‘అక్రిలిక్’అనేది థెర్మోప్లాస్టిక్ హోమోపాలిమర్ పదార్థం. ఇది పారదర్శకంగా ఉంటుంది. దీనిని వ్యాపారపరంగా ‘‘ఫ్లెక్సీగ్లాస్’’అని వ్యవహరిస్తారు. ఇది చూడడానికి గాజులాగే ఉంటుంది. కాని గాజులా పగలదు. అందువల్ల ఒకప్పటి గాజుసామాను స్థానాన్ని ఇది ఆక్రమించింది. ఆహార పదార్థాలు నిలవ ఉంచే కంటెయినర్ల దగ్గర్నుంచి అన్ని అవసరాలకు ఈ ఫ్లెక్సీగ్లాస్‌నే ఉపయోగిస్తున్నారు.
మన జీవితాలలో ప్లాస్టిక్ ఎంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చినప్పటికీ చివరికి అది ప్రకృతిలో ఏ విధంగానూ కలిసిపోని వ్యర్థ పదార్థంగానే మిగిలిపోతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తిలో 40 శాతం వివిధ వస్తువుల ప్యాకింగ్‌కే ఉపయోగిస్తున్నారు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా డంప్ చేయబడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో మూడోవంతు ప్యాకింగ్‌కోసం ఉపయోగించిన ప్లాస్టిక్ సామాగ్రి. ఈ వ్యర్థాలను మనం ఏం చేస్తున్నాం? 12 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చివేస్తున్నాం. 9 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రమే రీసైక్లింగ్ చేయబడుతున్నాయి. మిగతా 79 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు అలాగే ఉండిపోతున్నాయి ప్రకృతిలో కలిసిపోకుండా.
ప్రతియేటా పెద్దమొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో డంప్ చేయబడటం మనకు తెలిసిందే. ఇవి మెత్తగా ఉండటంవల్ల ఆహారం అనుకుని సాగర జీవాలు వీటిని తింటున్నాయి. ఒక్క 2015లోనే 90 శాతం సముద్ర పక్షులు ప్లాస్టిక్ వ్యర్థాలను మింగేయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తినడంవల్ల అవి అరగక ఎన్నో జంతువులు మృత్యువాత పడుతున్నాయి. 2018లో స్పెయిన్ సముద్ర తీరంలో కొట్టుకువచ్చి పడ్డ ఒక తిమింగలం పొట్టలోంచి 32 కిలోల బరువున్న ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ వలలు, ఒక డ్రమ్ము బయటికి తీశారు.
ప్లాస్టిక్ వస్తువుల తయారీలో వాడే రసాయనాలు మన ఆరోగ్యానికి చేటుచేస్తాయని శాస్తవ్రేత్తలు అంటున్నారు. ఉదాహరణకు ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు పారదర్శకంగా ఉండడానికి వాటి తయారీలో ‘బిష్పెనాల్ ఎ’ (బిపిఎ) అనే రసాయనాన్ని వాడతారు. ఈ రసాయనం మన హార్మోన్ల వ్యవస్థపై తీవ్రప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్ వస్తువులు పెళుసుగా కాకుండా మృదువుగా ఉండడానికి డై-2-ఈథైలెక్సిల్ ఫ్తాలేట్ అనే రసాయనాన్ని వాడతారు. ఇది క్యాన్సర్ కారకం.
ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడంవల్ల ఈరోజు ప్రతి పది మందిలో ఎనిమిది మంది పిల్లల్లో, అలాగే పెద్దలలో ప్రతిఒక్కరి శరీరాలలో ఫ్తాలేట్ రసాయనం ప్రవేశించింది. శరీరాలు ప్లాస్టిక్ కలుషితం అవడంవల్ల 93 శాతం మంది మూత్రంలో బిపిఎ రసాయనాన్ని గుర్తించారు.
ప్లాస్టిక్ వ్యర్థాలలో 90 శాతం ఆసియా, ఆఫ్రికాలలోని నదుల ద్వారా సముద్రాలలో కలుస్తున్నాయి. చైనాలోని ఒక్క ‘యాంగ్ ట్జే’ నది ద్వారా ప్రతియేటా ఒక కోటి ఏభై లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. చైనా, భారత్, అల్జీరియా, ఇండోనేషియా వంటి దేశాల ప్రజల జీవితాలలో గత కొన్ని దశాబ్దాలలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. అతి తక్కువ కాలంలో చాలా వేగంగా సంభవించిన ఈ మార్పులు ఆ దేశాలలో ప్లాస్టిక్ వినియోగాన్ని పెంచడంతోపాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా ఊహించలేనంతగా పెంచాయి.
అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాలలో లక్షల టన్నులలో ప్లాస్టిక్ వ్యర్థాలు డంప్ చేయబడ్డాయి. ఏళ్ళ తరబడి ఇలా డంపింగ్ జరుగుతున్న వ్యర్థాలు ఇప్పుడు పెద్దపెద్ద ప్లాస్టిక్ ద్వీపాలుగా తయారయ్యాయి. ‘‘సీ ఎడ్యుకేషన్ సొసైటీ’’కి చెందిన శాస్తవ్రేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఒక్క అట్లాంటిక్ మహాసముద్రంలోనే సగటున ప్రతి చదరపు కిలోమీటరుకు 5 లక్షల 80వేల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు.
సముద్రాలలో పేరుకుంటున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో 20 శాతం నౌకల నుండే డంప్ అవుతున్నాయి. మిగతావాటిలో తీర ప్రాంతాల్లో పోగైన వ్యర్థాలలో కెరటాలవల్ల సముద్రంలోకి కొట్టుకు వచ్చేవి కూడా ఉన్నాయి. ఈ వ్యర్థాలన్నీ మనిషి ఉద్దేశ్య పూరితంగా డంప్ చేసినవే. ఇవన్నీ సముద్ర గర్భంలో ఏళ్ళతరబడి నిలవ ఉంటాయి. వీటివల్ల సాగర జీవాలకు ఎంతో ముప్పువాటిల్లుతోంది. ఈ వ్యర్థాలు పొట్టలలోకి చేరడంవల్ల, ఆ వ్యర్థాలలో చిక్కుకొని పోవడంవల్ల ప్రతియేటా లక్షవరకు సముద్ర తాబేళ్లు, సముద్ర పక్షులు మృత్యువాత పడుతున్నాయి. అంతేకాదు ప్లాస్టిక్ వ్యర్థాలనుండి వెలువడే విష రసాయనాలు సాగర జలాలను, అక్కడి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.
పెద్ద మొత్తంలో డంప్ అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు కాలక్రమేణా శిథిలమై మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలుగా సముద్ర జలాల్లో వ్యాపిస్తున్నాయి. అలా వ్యాపిస్తున్న మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలే వివిధ జల చరాల శరీర భాగాల్లోకి చేరుతున్నాయి. తరువాత చేపలు మొదలైన జల చరాలను ఆహారంగా తీసుకున్న వారి శరీరాల్లోకి ఈ మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయి. కేవలం సముద్రాలలో డంప్ అయిన ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా వెలువడిన రసాయనాలే కాదు, సముద్రాల్లో పారవేయకముందు వాటికి అంటిన రసాయనాలు కూడా సాగర జలాలను కలుషితం చేస్తున్నాయి. దీనివల్ల ఎన్నో సాగర జీవాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రసాయనాల ప్రభావానికి గురైన చేపలు మొదలైన వాటిని ఆహారంగా తీసుకున్న వారి శరీరాలు కూడా అనారోగ్యం పాలవుతున్నాయి.
ప్లాస్టిక్‌వల్ల మనుషులకు ఎన్నోరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాడ్మియం, సీసము, పాదరసంవల్ల ప్లాస్టిక్ పదార్థాలు ఎక్కువగా విష పూరితంగా ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో పెద్దమొత్తంలో జలచరాలలో ఈ విష రసాయనాలను కనుగొన్నారు. ఇవి మనుషులకు చాలా ప్రమాదకరమైనవి. కొన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలలో డై-2-ఈథైలెక్సిల్ ఫ్తాలేట్ అనే రసాయనం ఉంటుంది. మనుషుల్లో సహజ రోగనిరోధక శక్తి తగ్గిపోవడమేకాదు, వారిలో సంతాన సాఫల్యం తగ్గడము, క్యాన్సర్ వ్యాధిసోకడం వంటి వాటికి కూడా ఈ రసాయనం కారణమవుతుంది. పసి పిల్లల ఎదుగుదల మీద కూడా ఈ రసాయనం దుష్ప్రభావాన్ని చూపుతుంది.
స్కూల్ ఆఫ్ సస్టైనబుల్ ఇంజనీరింగ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రోల్స్ హాడెన్, అరిజోనా స్టేట్ యూనివర్సిటీతో కలిసి మనుషులపై ప్లాస్టిక్ దుష్ప్రభావం గురించి అధ్యయనం చేశారు. మానవ శరీరంపై ప్లాస్టిక్ వ్యర్థాలు దుష్ప్రభావం చూపడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అని ఆ అధ్యయనం పేర్కొంటోంది.
సాగర జలాలు ప్లాస్టిక్ కాలుష్యానికి గురికాకుండా చూడడానికి, తద్వారా సాగర జీవాల అస్తిత్వాన్ని, మానవుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఇప్పటికే కొన్ని చర్యలు మొదలయ్యాయి.
ప్లాస్టిక్ కాలుష్యంనుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే చేపల వంటి జలచరాలను ఆహారంగా తీసుకోవడం మానేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రకృతిలో అంతర్భాగమైన మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసలీ కాలుష్యానికి ప్రధాన బాధ్యులం మనమే. అవకాశం ఉన్నంతమేరకు ఒకసారి వాడిపారేసే క్యారీబ్యాగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తులు కొనకుండా ఉండడమే మంచిది. ఒకవేళ ఏవైనా ప్లాస్టిక్ వస్తువులను వాడిన తర్వాత వ్యర్థాలు పారేయాల్సివస్తే, వాటిని రీసైకిల్ చేయడం పట్ల బాధ్యత వహించాలి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు బదులుగా గుడ్డ సంచులను, కాగితపు సంచులు ఉపయోగించాలి. అలాగే వాటర్ బాటిల్స్ కూడా రీసైకిల్‌చేసి మళ్లీమళ్లీ వాడటం అలవాటు చేసుకోవాలి.
‘‘ప్రపంచవ్యాప్తంగా సాగర తీరాలలోను, సముద్రాలలోను డంప్ చేయబడుతున్న చెత్త, వస్తువులను వాడి పారేసే, ప్రకృతి వనరులను విచక్షణారహితంగా నాశనంచేసే ఆధునిక సమాజ మనస్తత్వాన్ని తెలియజేస్తోంది’’అని ఆచిమ్ స్టెయినర్ అంటారు. ఈయన ఐక్యరాజ్యసమితి ఎన్విరానె్మంట్ ప్రోగ్రాంకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే పర్యావరణం పట్ల ఆధునిక మానవుడు దురుసుతనంతోకూడిన మనస్తత్వానే్న ప్రదర్శిస్తున్నాడు. కనీసం మనవరకు పరిసరాలని శుభ్రంగా ఉంచాలన్న ఆలోచనే లేదు మనలో. ప్రతి మనిషి సగటున రోజుకి 11 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేస్తున్నాడు. మరి అతి తక్కువ కాలంలోనే సముద్రాలలో లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయంటే ఆశ్చర్యమేముంది?
మిగతా కాలుష్యాలకన్నా ప్లాస్టిక్ కాలుష్యం చాలా సంక్లిష్టమైనది. ఆధునిక పారిశ్రామిక యుగంలో ప్లాస్టిక్‌ను ఒక అద్భుత ఉత్పత్తిగా పరిచయం చేసాం. దానివలన మనం అన్నిరకాల మంచినీ పొందాం. కానీ అదే సమయంలో మనమంతా ఏమాత్రం ఊహించని, పరిష్కారం కూడా తోచని ఉపద్రవంలో కూరుకుపోయాం. ఈ ఉపద్రవం మనం కోరుకున్నది కాదే! నిన్న మొన్నటిదాకా అసలు ప్లాస్టిక్‌వల్ల ముప్పు ఎక్కడ మొదలౌతోందో కూడా తెలియని స్థితిలోనే ఉన్నాం. మన వ్యక్తిగత జీవన శైలిలోనే ప్లాస్టిక్ కాలుష్యానికి మూలాలున్నాయి. మన జీవనశైలిలో కొద్దిపాటి మార్పునైనా తీసుకురావడం ద్వారానే ఈ సమస్య పరిష్కారం దిశగా కొన్ని అడుగులైనా వేయగలం. ఇందుకు అసలు సమస్యను, దానిపట్ల మన వ్యక్తిగత బాధ్యతను కూడా ప్రతి ఒక్కరమూ గుర్తించాలి. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులను మనం వినియోగించడం మానేసి, మన తోటివారిని కూడా ఆ దిశలో ప్రోత్సహించాలి. మనందరికీ పరిశుభ్రమైన ఆహారం అందేందుకు సముద్రాలు కలుషితం కాకుండా పారిశ్రామికవేత్తలపై, రాజకీయ నాయకులపై వత్తిడి తేవాలి.
ప్లాస్టిక్ వస్తువుల వినిమయం, వ్యర్థాల విసర్జనం విషయంలో సగటు ప్రజలకు ఎంత బాధ్యత ఉందో, వాటి ఉత్పత్తుల వినియోగం, వ్యర్థాల విసర్జనల విషయంలో వివిధ దేశాల ప్రభుత్వాలకు కూడా అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది. మొదట ప్లాస్టిక్ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలను విధిస్తూ ప్రభుత్వాలు కఠిన చట్టాలను చేయాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను డంప్ చేసే విషయంలో కఠినమైన ఆంక్షలు విధిస్తూ చట్టాలను చెయ్యాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా నిషేధించాలి.
భూమి, నీరు, గాలి మాత్రమే కాదు, మనం కూడా మనకి తెలియకుండానే ప్లాస్టిక్ మయమైపోతున్నాం. ఇప్పటికైనా వ్యక్తిగత స్థాయిలో మన బాధ్యతను నిర్వర్తించకపోతే మన భవిష్యత్తు పూర్తిగా మన చేతుల్లో ఉండకుండాపోతుంది.

- ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్, 8008264690