Others

జయ ఏకాదశి విశిష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరతభూమి పుణ్యభూమి. భక్తికి, భక్తితత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తివిశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు మన పూర్వులు నియమించిన కొన్ని పర్వదినాలలో, ఏకాదశి ఒకటి. శ్రీమహావిష్ణువునకు ప్రీతిపాత్రమైన తిథులలో ‘ఏకాదశి’ ముఖ్యమైనది. దీనినే ‘హరివాసరము’ అని కూడా అంటారు. ఏకాదశి తిథిన భక్తజనులు ఉపవాసము చేస్తారు. భగవన్నామ స్మరణ, జప, పారాయణలతో భగవానుని సమీపమున (ఉప) మనస్సును ఉంచుటయే (వాసము) ఉపవాసము చేస్తారు. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి. భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈనాడు జపిస్తే విశేష ఫలితం దక్కుతుంది. అందుకనే ఈ రోజుని శ్రీవిష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుచుకోవడం కద్దు. భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజని అంటారు. భీష్మ ఏకాదశిని ‘జయ ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఓ నమ్మకం. భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకూ వున్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు. ఏకాదశి రోజున ఉపవాసవ్రతం చేయడం వలన పది రోజులనుండి తిన్న ఆహారంలో చేరిన మలినాలు, అధికోష్ణ పదార్థాలు కరిగి బయటకి పోతాయి. ఏకాదశి రోజు కడుపు శుభ్రపడుతుంది. ఆ రోజు జీర్ణక్రియకు విశ్రాంతి లభిస్తుంది. మనకు ముఖ్యంగా విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’ అవసరపడతాయి. అందువలన ద్వాదశి నాడు ఏ విటమిన్ అధికంగా కలిగిన ఆకు కూరను, సి విటమిన్ అధికంగా కలిగిన పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటున్నాము. ప్రతిరోజూ మనం సూర్యనమస్కారాలు చేసి ఏకాదశి నాడు ఉపవాసము చేయడంవలన నేత్ర దృష్టికి, దేహానికి ఆరోగ్యం లభిస్తుంది. ప్రతినెల అమావాస్య ముందు, పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులు వస్తుంటాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్య ఉన్నను, ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశేషం పరిగణిస్తాము. అవే 1. ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి/ శయనేకాదశి) 2. కార్తీక శుద్ధ ఏకాదశి 3. పుష్యశుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి) 4. మాఘశుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి).
మాఘశుద్ధ ఏకాదశిభీష్మ ఏకాదశి. భీష్మఏకాదశినే భౌమి ఏకాదశి, జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు కురు పితామహుని స్మరిస్తూ తర్పణం ఇవ్వడం సంప్రదాయం. భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని విశ్వాసం. భీష్ముడు కురుక్షేత్రంలో తనువు చాలించే సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉద్బోధించిన పరమ పవిత్రమైన తిథి ఈ ఏకాదశి. ఈ రోజు శ్రీమహావిష్ణువును పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగునని విశ్వాసం. భీష్ముడు పరమపదం కోరిన మాఘ శుద్ధ అష్టమిని ‘్భష్మాష్టమి’ గాను, మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను, మానవాళి స్మరించడమే మనం ఆ పితామహునికి ఇచ్చే అశ్రుతర్పణం.
తన తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాలకోసం, స్వసుఖాలను, జీవన మాధుర్యాన్ని తృణప్రాయంగా త్యజించి, ‘నా జీవితంలో వనితకు, వివాహానికి తావులేదు’ అని సత్యవతికి వాగ్దానం చేసి, భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అందుకే ఆయన భీష్ముడయ్యాడు. భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకూ వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున, తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. అలాంటి భీష్ముని కొలిచేందుకు ఆయన నిర్యాణం చెందిన తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాము. భగవద్గీతను శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు కానీ విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యుని తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలో ప్రాప్తి చేకూరుతుంది. అంతేగాకుండా ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. దేనివల్ల మానవులకు శుభం కలుగుతుంది, అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమేది దేనిని జపించుటవలన మనిషి సంసారబంధములనుండి విముక్తి పొందుతాడు అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు భీష్ముడు జవాబు చెపుతూ, జగత్ ప్రభుం, దేవదేవం అనంతం పురుషోత్తమం అని చెబుతూ ‘అనాది నిధానం విష్ణుం, సర్వలోక మహేశ్వరం, లోకాధ్యక్షం స్తువన్నిత్యం, సర్వదుఃఖాతి గో భవేత్. ఆది అంతము లేని, సర్వవ్యాపి అయిన, దేవదేవుడైన, భగవంతుడైన విష్ణుస్తుతి వల్ల సర్వదుఃఖాలు తొలగుతవి అని ఇంకా చెబుతూ ఏషమే సర్వధర్మానాం ధర్మాదిక తమో మతః- ఇదియే అన్ని ధర్మములోకి ఉత్తమ ధర్మమని నా మాట అంటాడు.
వైయాగ్ర పాదగోత్రాయ సాంకృత్య ప్రవరాయచ
అపుత్రాయ దదామ్యతత్ జలం భీష్మాయ వర్మణే
వసూనాం అవతారాయ శంతన్‌రాత్మ జాయచ
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆ బాల బ్రహ్మచారిణే
ఇలా ఈ మంత్రములలో అర్ఘ్యం, తిల తర్పణం చేసి మరునాడు అనగా ద్వాదశి నాడు శ్రాద్ధం, అన్నదానం చేసినచో పునర్జన్మ ఉండదు. జీవితంలో బ్రతికినంతకాలం అన్ని కోరికలు నెరవేరి ఆనందముగా ఉండెదరు. భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తున్నా ఆయన ప్రవచించిన ‘విష్ణు సహస్రనామ స్తోత్రం’ ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే వుంది. మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడైన భీష్ముడి పూర్వనామం దేవవ్రతుడు. భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది కనుక ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన భీష్మాచార్యునికి తిలాంజలులు సమర్పించి శ్రద్ధాంజలి ఘటిద్దాం.

- కె.రామ్మోహన్‌రావు