Others

సంత్ రవిదాస్ రామభక్తుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు
సంత్ రవిదాస్
జయంతి
*
పధ్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం ఆక్రమణకారుల పట్టుబిగిసింది. బలవంతపు మత మార్పిడులు సామూహికంగా జరుగుతున్న కాలమది. రెండవవైపు హిందూ సమాజంలో కులం పేరుతో అసమానతలు, అంటరానితనం తీవ్రంగా వున్న కాలమది. అనేక రూపాల్లో దురాచారాలు, మూఢాచారాలు ఉన్నకాలమది. ఆ చీకటియుగంలో జన్మించిన రవిదాస్ సుమారు 120 సంవత్సరాలు జీవించారు. తన భక్తిగీతాల ద్వారా భక్తి ఉద్యమానికి తెరతీశారు. ఆనాడు, తరువాత కాలంలో పండితులు, మహారాజులు, సామాన్యులు, పామరులు అందరూ వారి భక్తులయ్యారు. సంత్ శిరోమణిగా అందరిచే కొనియాడబడ్డారు. నేటికీ ఉత్తరభారతంలో వారి శిష్యులుగా భక్తి ఉద్యమానికి ప్రచారకులుగా పనిచేస్తున్నవారు ఎందరో వున్నారు. సంత్ రవిదాస్ దేవాలయాలు దేశంలో విదేశాలలో ధార్మిక, సామాజిక శ్రద్ధా కేంద్రాలుగా, ప్రేరణా కేంద్రాలుగా స్ఫూర్తినిస్తున్నాయి.
సంత్ రవిదాస్ క్రీ.శ. 1377లో కాశీవద్ద సీర్ గోవర్దనపురం అనే గ్రామంలో, మాఘపూర్ణిమ రోజున చర్మకార కుటుంబంలో జన్మించారు. కలసాదేవి, సంతోఖ్‌దాస్ తల్లిదండ్రులు. ఆనాటి సామాజిక పరిస్థితిలో రవిదాస్‌కు పాఠశాలకు వెళ్ళే అవకాశం ఎక్కడిది? పూర్వజన్మ సుకృతమేమో కానీ చిన్ననాటనే ప్రహ్లాదునివలే దైవభక్తి ఏర్పడింది. దేవాలయంలోకి వెళ్ళే అనుమతి లేదు. దేవాలయం బయట నిలబడి దేవాలయాలంలోని భక్తి గీతాలను శ్రద్ధగా వినేవాడు. మననం చేసుకునేవాడు. ఇలా అనేక భక్తిగీతాలు కంఠస్థమయ్యేవి. తనివితీరా గంగానదిలో ఈతకొట్టేవాడు. గంగామాత ఒడిలో ఈతకొట్టడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. గంగానదిలో ఈత, దేవాలయాల బయట భక్తిగీతాలను శ్రద్ధగా వినటం రవిదాసు దినచర్యలో ఒక ప్రధాన భాగం. 12 సంవత్సరాలు వచ్చినా అతని దినచర్యలో మార్పు రాలేదు. కులవృత్తిపట్ల అభిరుచి లేకపోవడాన్ని తండ్రి, అన్న గమనించారు. అన్న ద్వారా చెప్పులు కుట్టే కులవృత్తిని నేర్చుకున్నాడు. కుట్టిన కొత్త చెప్పుల జతను సహితం ఉచితంగా తమ దగ్గరకు వచ్చిన సాధుసంతులకు ఇచ్చేవాడు. ‘‘నేను ఈ కాశీ నగరాన్ని వదిలి దేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించే స్థితిలో లేను. మీరు సౌభాగ్యవంతులు, దేశమంతటా పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నారు. నేను కుట్టిన చెప్పులను ధరించి మీరు దేశమంతా పర్యటిస్తే నా మనస్సు ఆనందం కలుగుతుంది’’ అంటూ చెప్పులను ఉచితంగా సమర్పించుకొనేవారు. కుటుంబంపట్ల, సంపాదనపట్ల బాధ్యత లేకపోవటాన్ని గుర్తించి ఆందోళన చెంది తండ్రి పెళ్లి చేస్తే బాధ్యతలు తెలిసి వస్తాయని చిన్ననాటనే రవిదాస్‌కు పెళ్లిచేశాడు, వేరు కాపురం కూడా పెట్టించారు.
రవిదాస్ భార్య పేరు భగవంతి (లోనాదేవి). గ్రామంలో ఒక మూల వారి పూరి గుడిసె ఉండేది. రోజులా భక్తిగీతాలు పాడుతూ చెప్పులు కుట్టడం, సాయంత్రం పూట ఆ పూరి గుడిసె వద్ద భజన కార్యక్రమం జరుగుతుండేది. రవిదాస్ మనసు ఎరిగి లోనాదేవి నడుచుకునేది. రామానుజుని శిష్యుడు రామానందుడు (1299-1448). వారి కేంద్రం కాశీయే. నేను చర్మకారుణ్ణి, అంటరానివాణ్ణి అంటూ రవిదాస్ దూరంగా నిలబడ్డాడు. తనని శిష్యునిగా స్వీకరించమని రవిదాస్ రామానందుని కోరాడు. సమతామూర్తి రామానుజుడు నుండి సమతాస్ఫూర్తిని వొంటపట్టించుకుని ఆచరిస్తూ, సమతా సందేశాన్ని ప్రచారం చేస్తున్న రామానందుడు ‘్భగవంతుని ముందు అందరూ సమానమే. భక్తుడు కావడానికి కులం ప్రధానం కాదు, భక్త్భివం ముఖ్యం’ అంటూ రవిదాస్‌ను శిష్యునిగా రామానందుడు స్వీకరించాడు. రామానందుని ద్వాదశ శిష్యులలో అన్ని కులాలవారు ఉన్నారు. వారు అనంతానందా, సుఖానందా, సురసరానందా, నరహర్యానందా, యోగానంద (వీరందరూ బ్రాహ్మణులు), సంత్ పీపా(క్షత్రియ), సంత్ కబీర్ (చేనేత), సంత్ సేన్ (నారుూ), సంత్ ధన్నా (ఝాట్), సంత్ శిరోమణి రవిదాస్ (చర్మకారుడు), పద్మావతి, సురసరి (స్ర్తిలు) ఇలా అందరూ ఉన్నారు.
సికిందర్‌లోడి ఆనాటి పాలకుడు, బలవంతంగా ఎంతోమందిని ముస్లిములుగా మతం మార్చేవాడు. సంత్ రవిదాస్‌ను ఇస్లాం మతం స్వీకరించమంటూ పీర్‌సద్దా ఎంతో వొత్తిడి చేశాడు. రవిదాస్ ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రభావితుడై రామదాసు పేరుతో రవిదాస్ శిష్యుడయ్యాడు. ఆ సందర్భంగా రవిదాస్ వెలువరించిన రెండు గీతాలు-
వేద ధరమ హై పూరన ధరమా, వేద అతిరిక్త ఔర్ సబ్ భరమా!
వేద ధరమకీ సచ్ఛీరీతా, ఔర్ సబ్ ధరమ కపోల ప్రతీకా
వేద వాక్య ఉత్తమ ధరమ, నిర్మల వాకా జ్ఞాన్
యహ్ సచ్చామత ఛోడ్‌కర్, మై క్యోమ్ పడోఁ ఖురాన్
అర్థము: వేద ధర్మము ప్రాచీనమైనది. వేద ధర్మము మినహా మిగిలినవన్నీ భ్రమలు. వేద ధర్మమే సత్యమైనది. మిగిలినవన్నీ కపోల కల్పితాలు. వేదవాక్యాలు ఉత్తమమైనవి. నిర్మల జ్ఞానాన్ని అందించేవి. ఇలాంటి స్వచ్ఛమైన మతాన్ని వీడి నేనెందుకు ఖురాన్ చదవాలి?
ఆనాటి హిందూ సమాజంలో కులం పేరుతో హెచ్చుతగ్గులు, అంటరానితనము, కులం పేరుతో అహంకారాలు, భక్తిపేరుతో మూఢాచారాలు అనేకం ఉండేవి. ఈ దురాచారాలను తొలగించటానికి తన గేయాల ద్వారా సంత్ రవిదాస్ ఎంతో ప్రయత్నించాడు. వారి సాహిత్య ప్రభావం సామాన్యులను సైతం ఆకట్టుకునేది. వారిలో ఆలోచనలను రేకెత్తించేది.
చెప్పులు కుట్టడానికి ఉపయోగించే తొట్టెలోని నీటిలో గంగామాతను దర్శించిన గొప్ప భక్తుడు ఆయన. వారి జీవితానికి సంబంధించే అనేక కథలు ప్రచారంలో వున్నాయి.
ఒకరోజు ఓ బ్రాహ్మణుడు స్నానమాచరించేందుకు గంగానదికి వెళ్తుంటే, దారిలో చెప్పు తెగిపోయింది. ఆ బ్రాహ్మణుడు చెప్పు కుట్టించుకోవడానికి రవిదాసు వద్దకు వచ్చాడు. రవిదాసు అప్పటికే కుట్టి ఉంచిన కొత్త చెప్పుల జతను ఆ బ్రాహ్మణుడికి బహూకరిస్తారు. కొత్త చెప్పుల జత తీసుకున్న బ్రాహ్మణుడు చాలా సంతోషపడ్డాడు. తాను గంగానది స్నానానికి వెళ్తోన్న విషయం చెప్పి తనతో రావాల్సిందిగా రవిదాసును అడిగాడు. నేను రోజూ ఇంటివద్దనే గంగమ్మ తల్లిని దర్శించుకుంటున్నానని చెప్పి, మీరు పోతున్నారు కాబట్టి నా పేరున గంగామాతకు ఈ పోకచెక్కను ఇవ్వమని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చారు. బ్రాహ్మణుడు పోక చెక్క తీసుకొని గంగానది స్నానానికి వెళ్ళాడు. స్నానం ముగించుకొని తిరిగి కొంతదూరం వచ్చాడు. అపుడు ఆ బ్రాహ్మణుడికి పోకచెక్క సంగతి గుర్తుకువచ్చింది. వెంటనే గంగానదికి వెళ్ళాడు. గంగామాతకు నమస్కరించి, రవిదాసు ఇచ్చిన ఆ పోకచెక్కను సమర్పించాడు. ఆ సమయంలో గంగమ్మతల్లి స్వయంగా కెరటాలపైకి వచ్చి ఆ పోక చెక్కను తీసుకుంది.
పోకచెక్కను తీసుకుని దానికి బదులుగా రవిదాసుకు ఇవ్వమని చెప్పి ఒక బంగారు కంకణాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చింది. ఈ సంఘటనతో బ్రాహ్మణుడు ఎంతో ఆనందానికి, ఆశ్చర్యానికి లోనై బంగారు కంకణాన్ని తీసుకొని వస్తున్నాడు. గంగామాత దివ్యదర్శనం. రవిదాసు గొప్పతనాన్ని ఆలోచించుకుంటూ వస్తుండగానే ఆ బ్రాహ్మణుడికి దురాలోచన వచ్చింది. ఈ కంకణాన్ని రవిదాసుకు ఇవ్వకుండా రాజుగారికి ఇచ్చినట్లయితే బహుమతులు, ప్రశంసలు లభిస్తాయని ఆశపడ్డాడు. బంగారు కంకణాన్ని తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చాడు. సుందరంగా ఉన్న బంగారు కంకణాన్ని చూసి ముగ్ధుడైన రాజు దానిని రాణికి కానుకగా ఇచ్చాడు.
కంకణం చూసి ఆనందపడ్డ రాణి ఇలాంటిదే మరో కంకణం కావాలని రాజును కోరింది. రాజు దేశంలో ఉండే స్వర్ణకారులను పిలిపించి ఇలాంటి బంగారు కంకణాన్ని తయారుచేయాల్సిందిగా ఆదేశిస్తాడు. ఆ కంకణాన్ని చూసి స్వర్ణకారులు ఇలాంటి కంకణం తయారుచేయడం మా వల్ల కాదని రాజుకు విన్నవించుకుంటారు. మరో బంగారు కంకణం కావాలన్న తన కోరిక నెరవేరకపోవడంతో రాణి నిరుత్సాహపడింది. దిగాలుపడి మంచం పట్టింది. దీంతో రాజు ఇలాంటి కంకణం మరొకటి దొరికే మార్గం ఏదైనా ఉందా అని విచారించాడు.
రోజురోజుకు రాణి అనారోగ్యం తీవ్రం కాసాగింది. చివరికి ప్రాణాల మీదికి వచ్చింది. రాజు వైద్యులు రాణిని పరీక్షించి ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని చెప్పారు. ఆమె దుస్థితికి కారణం దిగులు అని స్పష్టం చేశారు. దిగులు పోవాలంటే ఆమె కోరిక నెరవేరాలి. అంతవరకు ఆమెకు ఈ బాధ తప్పదని తేల్చి చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన రాజు ఈ బంగారు కంకణం ఎక్కడి నుండి వచ్చిందో కనుక్కోవడానికి బ్రాహ్మణుడిని పిలిపిస్తారు. బంగారు కంకణం గురించి ప్రశ్నించగా బ్రాహ్మణుడు భయపడి గంగామాత రవిదాసుకు ఇవ్వమని చెప్పిందని జరిగిన సంగతంతా రాజుకు వివరించాడు.
రాజు వెంటనే బ్రాహ్మణుడిని తీసుకొని రవిదాసు వద్దకు వస్తాడు. జరిగిన విషయం చెప్పి క్షమించమని వేడుకుంటాడు. రాణిని కాపాడాలని కోరుతాడు. రవిదాసు గంగమ్మ తల్లిని ప్రార్థించి పక్కనున్న లందెగోళంలో (చెప్పులు తడుపుటకు నీటిని నిలువ ఉంచే గోళం) చెయ్యిపెట్టి మరో బంగారు కంకణాన్ని తీసి రాజుకు ఇచ్చాడు. రవిదాసు మహిమలను చూసిన రాజు అచ్చెరువొంది శిష్యుడిగా మారాడు.
మరొక సంఘటన
రవిదాసు ఎక్కడికి వెళ్లినా తన నిర్గుణ భక్తితో ఉండేవారు. రవిదాసు ఒకసారి ప్రయాగ కుంభమేళా వెళ్లారు. దూరదూరాల నుండి అనేకమంది సాధు, సంతులు, రాజులు, సామాన్యులు, బ్రాహ్మణులు కుంభమేళాకు వచ్చారు. ఈ కుంభమేళాలో అనేకమంది ఉపదేశం ఇచ్చారు. తదుపరి రవిదాసు వంతు వచ్చింది. రవిదాసు ఉపదేశం ఇస్తుండగానే ఎంతోమంది అక్కడికి తరలివచ్చారు. ఆయన వాక్కులు విని మైమరచిపోయారు. దీనిని చూసి కొందరు పండిత బ్రాహ్మణులు ముఖం మాడ్చుకున్నారు. రవిదాసుతో విభేదించి తమ ఉపదేశ శాస్త్రార్థాన్ని నిరూపించమని సవాల్ విసిరారు. రవిదాసు మాత్రం ఈ శాస్త్ర నిరూపణకు ఆసక్తి చూపలేదు. జస్త్ర నిరూపణ పరీక్షలు పెట్టడం సంతుల లక్షణం కాదని రవిదాసు భావన. ఎవరైతే పవిత్ర హృదయంతో భగవంతుడిని ఉపాసన చేస్తారో వారే భగవంతుడిలో లీనమవుతారని, దేవుడిని పూజించడం కేవలం బ్రాహ్మణుల పని కాదని, దైవకృపతో జరుగుతుందని రవిదాసు సవినయంగా పండిత బ్రాహ్మణులకు వివరిస్తారు.
బ్రాహ్మణులు మాత్రం రవిదాసుతో ఏకీభవించలేదు. మూర్ఖంగా వాదనకు దిగారు. దీంతో ‘‘మీరు మీ సాలగ్రామమును పూజించండి. నేను ఏ రాతిపై నా జీవతము గడుపుతానో దానిని (పన్‌రాయి.. అనగా చెప్పులు కుట్టుటకు సహాయపడే రాయి) పూజిస్తాను.’’ అని నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు.
అయినా సంతృప్తి చెందని పండిత బ్రాహ్మణులు ఉపదేశ శాస్త్రానిర్థారణను నిరూపించలేని పక్షంలో మీ ఉపదేశం తప్పని ఒప్పుకొని, అక్కడి నుండి వెళ్లిపోవాలని రవిదాసుతో వాదనకు దిగుతారు. తప్పని పరిస్థితులలో రవిదాసు శాస్త్ర పరీక్షకు అంగీకరిస్తారు.
‘‘ఓ పండిత బ్రాహ్మణులారా! మీరు మీ సాలగ్రామమును ఆ పవిత్ర గంగలో వేయండి. ఆ తరువాత నేను నా పన్‌రాయిని గంగలో వేస్తాను,’’ అని రవిదాసు చెప్పాడు. ఆ బ్రాహ్మణులు తమ సాలగ్రామంను గంగలో వేశారు. బ్రాహ్మణుల సాలగ్రామం గంగలో మునిగిపోయింది. ఆ తరువాత రవిదాసు తన పన్‌రాయిని గంగలో వేశారు. ఆ పవిత్ర గంగలో ఆ పన్‌రాయి తేలింది. దీంతో రవిదాసు మహిమలను బ్రాహ్మలణులు గుర్తించారు. తమ తప్పును అంగీకరించారు. ఈ ఘటనతో రవిదాసు కీర్తి మరింత విస్తరించింది.
సంత్ రవిదాస్ భక్తిని వారి శక్తులను తెలియజేసే ఇలాంటి కథలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. సంత్ రవిదాస్ వందల గేయాలను, కవితలను రాశారు.. వారు రాసిన గేయాలను భార్య లోనాదేవి శ్రద్ధగా వినేది. పదేపదే పాడుకునేది. కంఠస్థం చేసేది. అలా లోనాదేవి ద్వారా రవిదాస్ కీర్తనలు తరువాతి తరం వారికి అందాయి. రవిదాస్ మరణానంతరం సిక్కుల అయిదవ గురువు గురు అర్జున్‌దేవ్ వీరి కీర్తనలలో 39 ఎంపిక చేసి సిక్కుల గురువైన గురుగ్రంధసాహేబ్‌లో చేర్చారు.
సంత్ రవిదాస్ గొప్ప రామభక్తుడు. రాముడిపై భక్తిని ప్రకటిస్తూ అనేక గేయాలు వారు రాశారు. గోవింద సాహేబ్‌లో సంత్ రవిదాస్ ఊహించిన ఆదర్శ రాజ్యం బేంగపురా గురించి వర్ణిస్తూ...
పట్టణం పేరు బేగంపూర్. అక్కడ దుఃఖానికి, కలతలకు ఎలాంటి స్థానం లేదు. వస్తువులు గానీ, పన్నులు కట్టే ఆలోచనగానీ లేదు. భయం లేదు. దోషం లేదా పడిపోతామనే భయం లేనే లేదు. నేను అలాంటి గొప్ప పట్టణాన్ని కనుగొన్నాను. నా సోదరా! అక్కడ ఎల్లప్పుడూ సుఖశాంతులే. అక్కడ ప్రభుత్వం ఎప్పుడూ స్థిరత్వంతో ఉంటుంది. అక్కడ రెండు మూడు భేదాల్లేవు. అందరూ సమానమే. ఎప్పుడూ ఆ పట్టణం సుసంపన్నంగా ఉంటుంది. అక్కడ సంపన్నులు, ధనవంతులు నివశిస్తారు. అక్కడ ప్రజలు తమ ఇష్టానుసారం మనుగడ సాగిస్తారు. రాజాధికారం ఎవరినీ అడ్డగించదు. మాదిగ అయిన స్వతంత్ర రవిదాసు ఇలా అంటారు. మా పట్టణంలో ఎవరైతే నివశిస్తారో వారే మా మిత్రులు.
వైశిష్ట్యం: రవిదాసు వాణిలో ఈ పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రచనలో రవిదాసు దోపిడీ లేని సమాజాన్ని ఊహించారు. అ కాలంలో ఇదొక యుటోపియా అనవచ్చు. అయితే ఈ యుటోపియాలో రవిదాసు దూరదృష్టి కనబడుతుంది. సంత్ శిరోమణి రవిదాస్ శిష్యులలో కాశీమహారాజు, రాజస్థాన్‌కు చెందిన భక్త మీరాభాయి, మీరాభాయి అత్త రాణీ ఝాలీదేవి. రాజులు, పండితులు, సామాన్యులు, పామరులు ఇలా ఎందరో రవిదాస్ శిష్యులయ్యారు. చిత్తోడ్ రాజు రాణా సంగా, రాణిఝాలీదేవిల అభ్యర్థన మేరకు రవిదాస్ దంపతులు చిత్తోడ్ వెళ్లారు. వీరికి అక్కడ రాజమర్యాదలతో స్వాగతం లభించింది. మహారాజు వద్ద అతిథిగా కొంతకాలం అక్కడే ఉన్నారు. చిత్తోడ్ కోటలోనే రవిదాస్ తన 120వ ఏట భగవంతునిలో లీనమయ్యారని చెపుతారు. మీరాభాయి శ్రీకృష్ణుని గురించి ప్రార్థనలు చేసిన మండపంలోనే రవిదాస్ యొక్క పాదచిహ్నాలు నేటికి భక్తులందరికీ దర్శనీయ స్థలాలుగా ఉన్నాయి.

- కె.శ్యామ్‌ప్రసాద్ సామాజిక సమరసత జాతీయ కన్వీనర్, 9440901360