Others

శివతత్త్వం.. ప్రేమరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మాతాచ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాచ స్వదేశో భువనత్రయం’’.
శివుడే సర్వస్వం. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. శివుడున్నా, విష్ణువుఅన్నా పరమాత్మ స్వరూపమే. శివకేశవులకు భేదం లేదు. ఇద్దరూ ఒక్కటే. ‘శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే’ అన్నది తెలుసుకోవాలి. శివుని హృదయంలో విష్ణువు; విష్ణువు హృదయంలో శివుడు ఉన్నాడు. భారతీయ తత్త్వంలో ఇది ఓ మహత్తర తత్త్వం. అంతేకాదు ‘‘బ్రహ్మ మురారి సురార్చిత లింగం- నిర్మల భాసిత శోభిత లింగం’’ అంటుంది లింగాష్టకం. బ్రహ్మాది దేవతలు భక్తి ప్రపత్తులతో శివలింగాన్ని అభిషేకిస్తున్నారు. ఈ విషయాన్ని మన మనో మండపంలో ప్రతిష్టించుకొంటే కలిగే ఆనందం బ్రహ్మానందం. ఓం ‘నమశివాయ’ ఈ శివ పంచాక్షరిని పల్కినా, లేక విన్నా శివదర్శనభాగ్యం కల్గినంత పుణ్యమని పెద్దల వాక్కు.
శివుడు భక్తసులభుడు. ‘హర హర మహాదేవ శంభో’అన్నంతనే నేనున్నా నంటూ భక్తులను బ్రోచే భక్తవ శంకరుడు.నిరాకారుడు, లింగాకారుడు అయిన శివుడిని మారేడు దళాలు, విభూదితో పూజిస్తారు. శివ శబ్దం మంగళకరం శివుణ్ణి మంగళకరుడు, కల్యాణకరుడు అని పిలువడంలోని అంతరార్థం ఇదే.
శివ శబ్దం మంగళం, శాంతి, శుభం, క్షేమం ఇలా ఎన్నో అర్థాలనిస్తుంది. శివుడి విశిష్టతల్ని ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ముఖ్యంగా శంకరుడు కరుణా సముద్రుడు. భక్తవశంకరుడు. అందుకే భోళాశంకరుడుగా పిల్వబడుతూన్నాడు. అల్పాయుష్కుడైన మార్కండేయుడు గర్భగుడిలోనికి ప్రవేశించి శివలింగాన్ని గట్టిగా పట్టుకుని దీనంగా వేడుకోగా శివుడు కైలాసం నుండి దిగివచ్చి మెడను పడిన ఆ యమపాశం నుండి మార్కండేయుణ్ణి రక్షించి చిరంజీవిగా ఆశీర్వదించాడు.
బోయవాడైన తిన్నడు రోజూ వచ్చి పుక్కిట పట్టిన నీటితో శివలింగానికి అభిషేకం చేసేవాడు. శివుడి మందు పడి ఉన్న చెత్తనంతటినీ తన కాలి చెప్పుతో పక్కకి తొలగించి అదే కాలిచెప్పుతోనే శివుని కనుబొమ్మలమధ్య ఎర్రటి మట్టితో బొట్టు పెట్టేవాడు. తాను తినే మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టేవాడు. ఇంత చేసినా శివుడు తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చి కైవల్య ప్రాప్తి కలిగించాడు. అలాగే సాలెపురుగు, పాము, ఏనుగుల అపార భక్తికి కరిగిపోయి వాటికి ముక్తి ప్రసాదించాడు. ఆ పవిత్ర ప్రదేశమే శ్రీకాళహస్తిగా నిలిచిపోయింది.తన పూర్వీకుల పుణ్యగతిని గూర్చి భగీరథుడు తపమాచరించి దివి నుండి గంగను భువికి తీసుకువచ్చే ప్రయత్నంలో గంగ వేగాన్ని తగ్గించమని శంకరుని వేడుకోగా శంభుడు తొలుత దివిజ గంగను తన శిరస్సుపై దూకి అక్కడి నుండి భువిని ప్రవహించు విధంగా ఏర్పాటుచేసి భగీరథ ప్రయత్నాన్ని సఫలీకృతం గావించారు.
‘శివ శివా!’ అన్నంతనే సకల పాపాలను హరింపజేయల మహిమాన్వితుడు మహేశ్వరుడు. కాశీలో మరణించినవారి చెవిలో తారక మంత్రాన్ని పలికి మోక్షాన్ని ప్రసాదించే పరమ కారుణ్యమూర్తి. ‘నమఃశివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని పలికిన వెంటనే పాపాలను పటాపంచలు చేయగల పరమాత్ముడు.
శివతత్త్వమంతా ప్రేమ తత్త్వమే. ఆ ప్రేమకు షరతుల్లేవు. అవధులూ లేవు. రాజు-పేద, ఆడ - మగ, పశువు-పక్షి, పాము- చీమ అంతా సమానమే. శివుడు నిరాడంబరుడు. స్మశానం ఆయన నివాసం. నాగుపాము ఆయన ఆభరణం. కట్టుకునేవి చర్మాంబరాలు. సుగంధ లేపనాలు ఆయనకు అవసరం లేదు. స్మశానంలోని బూడిదే ఒళ్ళంతా పూసుకుంటాడు. ప్రదోష సమయంలో పరమేశ్వరుని పూజించినా, స్మరించినా, ధ్యానం చేసినా సత్వరమే అనుగ్రహించి కటాక్షించగల దయామయుడు. *