Others

సమసమాజ స్థాపనే లక్ష్యంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మహర్షి దయానంద సరస్వతి జయంతి
*
19వశతాబ్దపు ప్రముఖ భారతీయ సంఘసంస్కర్తలలో దయానంద సరస్వతి ఒకరు. వీరు ఫిబ్రవరి 12, 1824న గుజరాత్‌లోని టంకర గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు మూలశంకర్. వేద సంప్రదాయంలో హిందూ సంస్కృతిని పరిరక్షించడంలో వీరి కృషి అమోఘమైనది. మూలశంకరుడు చిన్నతనంలోనే ఇల్లువదిలి అనేకచోట్ల పర్యటన చేశాడు. చివరకు అతడు మధుర సమీపంలోని విరజానంద సరస్వతి ఆశ్రమానికి చేరుకుని అతనికి శిష్యుడైనాడు. స్వామి విరజానంద సరస్వతి దగ్గర వేదాధ్యయనం చేశాడు. వేదాలను క్షుణ్ణంగా అర్ధం చేసుకున్నాడు. స్వామి విరజానంద సరస్వతి మూలశంకరుడి పేరును దయానంద సరస్వతిగా మార్చాడు. సనాతన ధర్మంలో వచ్చిన ప్రతి సంస్కరణోద్యమంలో దయానందుల ప్రభావం ఎంతోఉంది. గురువుగారి ఆజ్ఞతో భారతదేశ నిర్మాణానికి, సనాతన ధర్మ పునరుద్ధరణకు ఎంతో కృషిచేశారు. సనాతన ధర్మంలో వివక్షలేదని, అంటరానితనం వేదాల్లో లేదని అని ప్రచారం చేస్తూ అంటరాని వారికి యజ్ఞోపవీతాలు వేసి, ఉపనయనం చేసి, వేదాధ్యయనానికి బాటలు వేశారు. స్ర్తిలు కూడా వేదం చదవవచ్చని, వితంతువులు పునర్వివాహం చేసుకోవడం శాస్తబ్రద్ధమని వేద ప్రమాణంగా నిరూపించారు. స్ర్తిలకోసం వేద పాఠశాలలను స్థాపించారు. గోవధమీద ఆంగ్లేయ ప్రభుత్వంతో మాట్లాడి, గోవధను నిషేధించాలని చెప్పిన వారిలో అగ్రగణ్యుడు దయానందుడు, 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో కీలకపాత్ర పోషించడంతోపాటు, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం రావాలని ఎలుగెత్తి చాటారు. బ్రతికింది 59 ఏళ్ళే అయినా అందులో ఋగ్వేదానికి సంపూర్ణంగానూ, యజుర్వేదానికి సగంవరకు భాష్యం రాశారు. మేడం కామా, పండిత లేఖారాం, స్వామి శ్రద్ధానంద, సావర్కర్, రాంప్రసాద్ బిస్మల్, లాలాలజపతిరాయ్ మొదలైన వారిపై వీరి ప్రభావం తీవ్రంగా ఉంది. అరబిందో, సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదలైనవారు వీరిని, ఆధునిక భారత నిర్మాతగా అభివర్ణించారు. దయానందుడు వ్రాసిన గ్రంథం పేరు సత్యార్థప్రకాశ్. ఇందులో భారతదేశం నుండి సమస్త భారతీయుల మనుషులలోని మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాల నిర్మూలన గూర్చి వ్యాఖ్యానించాడు. ఈ గ్రంథాన్ని 1874లో రాశారు ఈ గ్రంథంలో 13 భాగాలున్నాయి. సమాజంలో ఉత్తమ, ఆదర్శమానవునిగా జీవించేందుకు అనుసరించాల్సిన విధానాలను, వైదిక విధులను సూచించారు. ఆర్యసమాజాన్ని స్థాపించి పెక్కుమంది కంట్లో నలుసైనందున ఆయనపై ఏడుసార్లు విషప్రయోగాలు జరిగాయి. బస్తి, న్యోళి అనే యోగ ప్రక్రియ ద్వారా ప్రేగులను ప్రక్షాళనము చేసుకుని, వాటిని విఫలముచేసినను, చివరిసారిగా అక్టోబర్ 30, 1883 దీపావళి సాయంత్రం జరిగిన విషప్రయోగంలో క్షీణిస్తూ ఓంకార నాదంతో సమాధి అవస్థలో మోక్షాన్ని పొందాడు. దయానంద సరస్వతీ లేకున్ననూ, నేడు ఎంతోమంది ఆర్యసమాజీయులు ఆయన అసంపూర్తిగా వదిలిన స్వప్నాన్ని పూర్తిచేస్తున్నారు. ‘ఆర్యసమాజపు బైబిల్’గా పిలువబడే సత్యార్థప్రకాశికలో ఆయన తన బోధనలను పొందుపరిచారు. ఏది ఏమైనప్పటికీ ఆయన చేసిన సంస్కరణల కృషి అనన్యసామాన్యమైంది.
ఆర్యసమాజ్ స్థాపన
10 ఏప్రిల్, 1875లో దయానంద సరస్వతి ముంబైలో ఆర్యసమాజ్‌ను స్థాపించారు. ‘వేదాలకు తరలిపోండి’ (గోబ్యాక్ టు ద వేదాస్) అనే నినాదంతో భారతదేశమంతా పర్యటించారు. ఇతర మతాల్లో చేరినవారిని తిరిగి హిందూ మతంలో చేర్చుకునేందుకు, శుద్ధిఉద్యమం, గోవుల రక్షణకు గోరక్షక ఉద్యమాన్ని ప్రారంభించారు. దయానంద సరస్వతి విద్యావ్యాప్తి, కులవ్యవస్థ, మూఢాచారాల నిర్మూలనకు ఆర్యసమాజ్ ఎంతగానో కృషిచేసింది. ‘కృణ్వంతో విశ్వమార్యం’ అనేది ఆర్యసమాజ్ ప్రధాన నినాదం. భగవంతుడు ఒక్కడేనని, ఆయన నిరాకారుడని చాటింది ఆర్యసమాజం. స్ర్తి పురుష బేధం లేకుండా సమాజంలో అన్ని కులాలవారు పౌరోహిత్యం చేయవచ్చని పిలుపునిచ్చారు దయానంద సరస్వతి. ఒకసారి మతం మారిన హిందువు తిరిగి స్వధర్మంలోకి రాలేడు అనే భ్రమను ఆర్యసమాజ్ దూరంచేసింది. ఆర్యసమాజం అనతి కాలంలోనే భారతదేశం అంతటా వ్యాపించింది. విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ ఆర్యసమాజ శాఖలు ఏర్పాటుచేశారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, గయానా, మెక్సికో, నెదర్లాండ్, కెన్యా, టాంజీనియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బర్మా తదితర దేశాలకు ఆర్యసమాజం వ్యాపించింది. నిరంకుశ నిజాం పాలనలో నలిగిపోయిన హైదరాబాద్ సంస్థాన విముక్తిలో ఆర్యసమాజం పాత్ర చాలా ఉన్నది. 1892లో స్వామి నిత్యానంద సరస్వతి హైదరాబాద్‌లో ఆర్యసమాజ్ శాఖను ప్రారంభించారు. హైదరాబాద్ సంస్థానంలో కూడా ఆర్యసమాజ్ అనేక ఉద్యమాలని పెద్దఎత్తున చేపట్టింది.
సమసమాజ స్థాపనే ఆర్యసమాజ సిద్ధాంతము. ఆర్యసమాజానికి మూలము వేదాలు. వైదిక ధర్మాన్ని గ్రహించుట, కాపాడుట మరియు ప్రచారం చేయుటకు ఇప్పటికీ యత్నించుచున్నది. సమస్త సత్వ విద్యల గ్రంథమైన ‘సత్యార్థప్రకాశ’ను ప్రచారం చేసినది మహర్షి విరజానంద సరస్వతి (దయానంద సరస్వతి గురువు), మహర్షి దయానంద సరస్వతి (ఆర్యసమాజ్ స్థాపకుడు), స్వామి రామానందతీర్థ, శ్రద్ధానంద సరస్వతి, పండిత శపదేవ్‌శాస్ర్తీ, పండిత నరేంద్రజీ వంటి ఆర్యసమాజ్ ప్రముఖులు. ఇప్పటికీ ఆర్యసమాజ్‌వారు చేస్తున్న కృషి ఎనలేనిది.

- కె. రామ్మోహన్‌రావు