Others

స్ఫూర్తిదాయకుడు ధర్మభిక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ధర్మభిక్షంగారి జయంతి
*
స్వాతంత్య్ర సమరయోధుడు.. మాజీ పార్లమెంట్ సభ్యులు. కీ.శే.బొమ్మగాని ధర్మభిక్షంగారి 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన జీవితం గురించి స్మరించుకోవడం నేటి తరానికి స్ఫూర్తివంతంగా ఉంటుంది. సూర్యాపేటలో ఒక సామాన్య నిరుపేద కల్లుగీత కుటుంబంలో శ్రీ ముత్తిలింగం, గోపమ్మ దంపతుల మూడవ సంతానమే ధర్మభిక్షం. ధర్మభిక్షం కంటే పెద్దవారు ఇద్దరు అక్కలు ఎల్లమ్మ, తిరుపతమ్మ. తమ్ముళ్లు వెంకటయ్య, ముత్తయ్య. ఇంటికి పెద్దవాడైన ధర్మభిక్షంను బాగా చదివించి ప్రయోజకుడైతే చూడాలని కలలుకనేవారు తల్లిదండ్రులు. బడిలో చేరిన ధర్మభిక్షం చదువులో క్లాసుఫస్టు విద్యార్థిగానే కాకుండా ఆటల్లోకూడ చురుకైన విద్యార్థి అగుటవలన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇష్టపడేవారు. ధర్మభిక్షం తీరికవేళల్లో ఖాళీగా కూర్చోకుండా సూర్యాపేట పట్టణంలోని ఆంధ్రప్రకాశిని గ్రంథాలయానికి పోయి ఆంధ్రపత్రిక, గోల్కొండ దినపత్రిక, రయ్యత్ వంటి దినపత్రికలతోపాటు భోగరాజు పట్ట్భా సీతారామయ్యగారు రచించిన కాంగ్రెస్ చరిత్ర, భారత స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన గ్రంథాలను చదువుతుండేవారు. అంతేకాకుండా తనకు ఉచితంగా ట్యూషన్ చెప్తూ, చదువులో కూడా తనను ప్రోత్సహించే తమ స్కూల్ మాష్టరు శ్రీ వౌలానా అబ్దుల్ సయ్యద్ సత్తారుగారు లాహోర్, అలహాబాద్‌ల నుంచి తెప్పించుకొనే సాహిత్యం పత్రికలను కూడ చదువుతూ జాతీయ భావాలను పెంపొందించుకున్నారు. దేశ స్వాతంత్య్రంకోసం జాతీయ కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమాలు, స్టేట్ కాంగ్రెస్ తలపెట్టిన సత్యాగ్రహాలు, మునగాల పరగణాల్లో విస్తరించిన రైతు పోరాటాలు ఆయనలో బలమైన బీజాలు వేసాయి. దోపిడీకి, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాలనే దృఢ సంకల్పాన్ని ఏర్పరిచినది. తాను చదువుకుంటున్న మిడిల్ స్కూల్‌లో నైజామ్ ప్రభుత్వ ఏడవ నవాబు జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని స్కూల్ హెడ్మాష్టర్ ‘హుకూమ్’ జారీచేశారు. ఈ సందర్భంగా నిజామ్ ప్రధానమంత్రిగా కిషన్‌ప్రసాద్ సూర్యాపేటకు వస్తారని, వారికి విద్యార్థులంతా మాస్ డ్రిల్ యూనిఫారమ్ ధరించి ఘన స్వాగతం పలకాలనీ హెడ్మాష్టర్‌గారు ఆదేశించారు. ఇది తెలిసి ధర్మభిక్షం తమకు మాతృభాషలో విద్యాబోధనకు తిరస్కరించడమే కాకుండా తమ ప్రజలను వెట్టిచాకిరికి గురిచేస్తున్న నిజామ్ సర్కార్‌కు నిరసన తెలియజెప్పే సమయం ఇదేనని గ్రహించి, తమ పాఠశాల విద్యార్థులను సమావేశపరిచి, వారిని ఒప్పించి, నిజామ్ జన్మదిన్సోవాలను బహిష్కరిస్తున్నాం అని ప్రకటించారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకడానికి ఒక్క విద్యార్థికూడ మాస్‌డ్రిల్‌లో పాల్గొనలేదు. నిజాం జన్మదినోత్సవాలను బహిష్కరిస్తూ విద్యార్థులు జరిపిన మొట్టమొదటి ఆందోళన విజయవంతం కావడంతో ఈ వార్త సంస్థానంలో సంచలనం రేపింది. పత్రికలు పతాక శీర్షికన ప్రచురించాయి. ధర్మభిక్షంపై సర్కారు ‘నిఘా’ ప్రారంభమైంది. ధర్మభిక్షంలో ఈ విజయం నూతనోత్తేజాన్ని నింపింది.
హైదరాబాద్ రెడ్డి హాస్టల్‌లో తన స్నేహితుని సోదరుణ్ణి కలుసుకోవడానికి వచ్చిన ధర్మభిక్షంకు అక్కడి క్రమశిక్షణ, విద్యార్థుల చైతన్యం నింపేందుకు జరుగుతున్న డిబేట్స్ ఆకట్టుకొన్నాయి. మిడిల్ స్కూల్ చదువు పూర్తిచేసికొన్న ధర్మభిక్షం హైస్కూల్ విద్యకు నల్లగొండ వెళ్ళడం అక్కడ వీరిని రెడ్డి హాస్టల్‌లో ఫ్రీబోర్డర్‌గా చేర్చుకోవడం వలన హైస్కూల్‌లో చేరగలిగారు. నల్లగొండ రెడ్డి హాస్టల్ నిర్వాహకులకు ధర్మభిక్షం కార్యకలాపాల గురించి ఎరిగిన వారగుటవలన అక్కడి ‘డిబేట్ ఫోరమ్’కు దర్మభిక్షంనే కన్వీనర్‌గా నియమించారు.
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘వందేమాతరం’ గీతాన్ని ప్రార్థనామందిరంలో పాడరాదంటూ, అది హిందూయేతర మతస్థుల మనోభావాలను దెబ్బతీస్తుందని పాలకులు దాన్ని నిషేధించారు. దానికి ఆగ్రహించిన విద్యార్థులు నిషేధాజ్ఞలను ధిక్కరించి గీతం ఆలపించిన సందర్భంగా యూనివర్సిటీ అధికారులు 115 మంది విద్యార్థులను కాలేజీనుంచి తొలగించారు. దీనికి నిరసనగా సంస్థాన వ్యాపితంగా ఉద్యమం వ్యాపించింది. ఉన్నత పాఠశాల చదువులకోసం నల్లగొండకు వచ్చి హాస్టల్ బోర్డర్‌గా చదువుకుంటున్న ధర్మభిక్షం వందేమాతర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో కార్యాచరణ సమితి ఉద్యమ నిలిపివేతకు పిలుపునిచ్చినా నల్లగొండలో విద్యార్థులు సమ్మెను 23రోజులు కొనసాగించారు. ఫలితంగా ధర్మభిక్షంతో సహా 230 మంది విద్యార్థులు పాఠశాలనుంచి తొలగించబడ్డారు. దానితో పలువురు విద్యార్థులు వేర్వేరు ప్రాంతాలకు చదువులకోసం వెళ్ళినా ధర్మభిక్షం మాత్రం చదువుకు స్వస్తి పలికి సూర్యాపేటకు చేరుకుని ఆర్యసమాజం స్థాపనకు పూనుకున్నాడు. సూర్యాపేటలో గవ్వా అమృతరెడ్డి, కోదాటి వెంకటేశ్వరరావు, యామా కన్నయ్య వంటి ప్రముఖుల సహకారంతో ఆర్యసమాజ్ కార్యక్రమాలకోసం ఒక భవంతిని కొని అక్కడినుంచి జంతుబలి నిషేధంకోసం ప్రచారాన్ని సాగించారు. సంస్థానం ఆవల జరుగుతున్న స్వాతంత్య్రోద్యమాల ప్రభావం ముఖ్యంగా మహాత్మాగాంధీగారి అహింసా సిద్ధాంతాల ప్రభావం ధర్మభిక్షంగారిపై పడింది. దీంతో ధర్మభిక్షంగారు ఖాదీ ధరించి, విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం గురించి జిల్లాలో ప్రచారం సాగించారు. గ్రంథాలయోద్యమంలో భాగంగా గోల్గొండ పత్రిక, ఆంధ్రపత్రికలతోపాటు పలు గ్రంథాలను సేకరించి, తాను చదువుటయే కాకుండా ప్రజలకు అందుబాటలో ఉంచారు. వయోజనులకోసం రైతుల బావులవద్దకుపోయి ఆముదపు దీపాల వెలుగులో హరిజనులకు అక్షరాలు దిద్దబెట్టి వయోజన విద్యను ప్రోత్సహించారు. ధర్మభిక్షంగారు స్వయంగా స్థాపించిన ‘అర్జున పుస్తక బండార్’ అభ్యుదయ, వామపక్ష సాహిత్యకేంద్రంగా మారింది. ముఖ్యంగా మాక్సంగోర్కీ రాసిన నవల ‘అమ్మ’తనను కమ్యూనిస్టుగా మారడంలో ప్రభావితం చేసిందంటారు ధర్మభిక్షం.
ధర్మభిక్షంగారు సూర్యాపేటలో స్థాపించిన విద్యార్థి హాస్టల్ కేవలం వసతి కల్పించే గృహంగాకాకుండా విద్యతోపాటు క్రమశిక్షణ, వ్యాయామం, యోగ, సూర్యనమస్కారాలు నిత్యం అమలుచేసేవారు. చర్చలు, డిబేట్స్ ద్వారా పరిణతిని సాధించారు. ఇక్కడి తర్ఫీదుపొందిన విద్యార్థులే స్వాతంత్య్ర పోరాటం, ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీర యోధులై పోరాటం సాగించారెందరో! తెలంగాణ విముక్తిపోరులో ఆత్మ బలిదానం చేశారెందరో! ధర్మభిక్షంగారు స్థాపించిన హాస్టల్ వార్షికోత్సవాల సభలో పాల్గొన్న హైదరాబాద్ నగర కొత్వాల్ రాజబహద్దూర్ వెంకట్రామిరెడ్డిగారు ప్రసంగిస్తూ ‘‘ఏక్ హాత్‌సే బిక్షా మాంగ్‌కర్ దూస్‌రే హాత్‌సే దర్మకర్‌నే వాలా సిర్ఫ్ బిక్షం నహీ, ఓ ధర్మభిక్షం హై’’ (ఒక చేత్తో దానమడుగుతూ, రెండో చేత్తో ధర్మంచేస్తున్న వ్యక్తి కేవలం భిక్షం కాదు.. ఆయన ధర్మభిక్షం) అన్నాడు. కొత్వాల్ ఇచ్చిన ఈ బిరుదుతో భిక్షం ధర్మభిక్షం అయినాడు. ఆంధ్రమహాసభ పిలుపులో భాగంగా పాలకుర్తి అయిలమ్మ పంట రక్షణకై భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి, చకిలం యాదగిరిరావు, మల్లు ప్రతాప్‌రెడ్డి, కట్కూరి రాంచంద్రారెడ్డి వంటి యువ కిశోరాలు విసునూరు రామచంద్రారెడ్డి దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా నడిపిన పోరాటం చారిత్రకమైనదని చెప్పవచ్చును. ధర్మభిక్షంను ప్రమాదకరమైన ఖైదీగా ఎంచి చేతులు, కాళ్ళను గొలుసులతో బంధించి 6నెలలపాటు చీకటి గదుల్లోనే బంధించారు. ఆయన ధైర్యంవీడని ధర్మభిక్షం ఖైదీల హక్కులకోసం జైలుగోడల నడుమ ఉద్యమాలను నిర్వహించి జైలు అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. అనేక హక్కులను రాజకీయ ఖైదీలకు సాధించిన ఘనత కూడ వారికే దక్కుతుంది. సూర్యాపేట, నల్లగొండ, చెంచెల్‌గూడ, జాల్నా, ఔరంగాబాద్ జైళ్ళలో ఐదున్నర సంవత్సరాలపాటు జైలు అనుభవించారాయన. రెండేళ్ళపాటు అజ్ఞాత వాసంలో గడిపారు. 1952లో పి.డి.ఎఫ్. అభ్యర్థిగా సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1957లో నల్లగొండ, 1962లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఏగా ఎన్నికై ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించారు.
ధర్మభిక్షంగారు నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంనుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. రెండవసారి ఆయన పోటీచేసినప్పుడు లోక్‌సభ చరిత్రలోనే తొలిసారిగా 480 మంది అభ్యర్థులు తన నియోజకవర్గం ఎన్నికల బరిలో నిలబడగా ధర్మభిక్షం మిత్రపక్షాల అభ్యర్థిగా 76వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇది ఆయన పట్ల ప్రజలకున్న అపారమైన విశ్వాసానికి చిహ్నంగాక మరేమిటి? ధర్మభిక్షంగారు వనాన్ని నమ్ముకొని కల్లుగీస్తూ జీవిస్తున్న గీత కార్మికుల సంక్షేమంకోసం అవిరళ కృషిచేశారు. ముఖ్యంగా వృత్తిని హర్రాజు పాట ద్వారా సాధించుకొనే విధానాన్ని పోరాడి రద్దుచేయించి దాని స్థానంలో సహకార సంఘాలను, టి.ఎఫ్.టిలను సాధించారు. చెట్టుపై నుండి పడి మరణించిన లేదా వికలాంగులైన గీత కార్మిక కుటుంబాలకోసం ఎక్స్‌గ్రేషియాను సాధించిపెట్టారు. కమ్యూనిస్టు నాయకునిగా, ట్రేడ్ యూనియనిస్టుగా, ప్రజాప్రతినిధిగా, మానవతావాదిగా ఆయన అజాతశత్రువు. అందుకే ఆయన జీవితం నేటితరానికి ఆదర్శనీయం. స్ఫూర్తిదాయకం.

- బి. నాగభూషణం 9849622633