Others

అమ్మభాషను కాపాడుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మాతృభాషా దినోత్సవం..
*
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏదో ఒక భాషలో మాట్లాడతారు. సమాజంలో వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్‌కు భాష ఒక ముఖ్యమైన సాధనం. అంటే అది ఒక పనిముట్టు లాంటిది. ఇతర పనిముట్లను మనిషి అవి పనిముట్లని గుర్తెరిగి వాడతాడు. కానీ భాష ఒక పనిముట్టని సాధారణంగా మన గమనంలో ఉండదు. కారణం మనిషి పసి వయసు నుంచీ భాష నేర్చుకునే తీరులోనే ఉంది. తనకు తెలియకుండానే మనిషి భాష నేర్చుకుంటాడు. దానే్న మనం ఇంటి భాష, అమ్మ భాష.. మాతృభాష అంటాం. ఏదెలా ఉన్నా ప్రతి సమూహానికి ఒక భాష ఉండి ఆ సమూహపు చరిత్ర, సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రకృతిలో మనిషికి సంజ్ఞల నుంచి భాష ఏర్పడటం ఒక అద్భుతం. లిపి ఏర్పడటం మరో అద్భుతం. పరిణామ క్రమంలో ప్రపంచమంతటా వివిధ ప్రాంతాల్లో సహజసిద్ధంగా ఒకే తరహాలో భాషలు, లిపులు వికసించాయి. ఆ లిపి వివిధ రూపాల్లో రాతపూర్వకంగా వికసించింది. నేడు సాంకేతికాభివృద్ధితో డిజిటైజేషన్ రూపం తీసుకున్నది.
చరిత్ర గమనంలో తెగల మధ్య ఆధిపత్య పోరాటాలు, తరువాత రాజుల మధ్య సామ్రాజ్యాల నిర్మాణం కోసం పోరాటాలు, ఆధునిక యుగంలో కూడా వలసవాదం రూపంలో ఐరోపా దేశాలు ప్రపంచమంతటా తమ వలసలు స్థాపించటం, ఆ ప్రపంచ మార్కెట్ పంపకం కోసం తగాదాల కారణంగా రెండు ప్రపంచ యుద్ధాలు జరగటం మనకు తెలుసు. ఒకప్పుడు ఐరోపాలో ఫ్రెంచి ప్రధానమైన ఆధిపత్య భాషగా ఉండేది. నేడు అంతర్జాతీయ భాషగా వెలుగొందుతున్న ఆంగ్లం నాడు ఒక చిన్న తెగ మాట్లాడే భాష. అప్పుడది ఫ్రెంచి ప్రభావం, ఆధీనంలో ఉండేది. అయితే సూర్యుడస్తమించని సామ్రాజ్యాన్ని బ్రిటీషు వారు స్థాపించడంతో ఆంగ్లం తిరుగు లేకుండా అంతర్జాతీయ భాషగా స్థానం సంపాదించింది. ఆ కారణంగా ఫ్రెంచి భాష పెత్తనం నుంచి బయటపడింది. మానవ చారిత్రక పరిణామ క్రమంలో రాజకీయ చదరంగంలో భాష కూడా ఒక ఆయుధంగా మారింది. ఎందుకంటే ఒక సమాజంపై ఇంకో సమాజం ఆధిపత్యం సంపాదించినప్పుడు తన భాషను వారి మీద రుద్దితేనే ఆధిపత్యం నెరవేర్చబడుతుంది. పాలకులకు కావలసినట్టుగా పాలన జరగాలంటే అది వారి భాషలోనే జరిగితేనే సులువుగా ఉంటుంది. అందుకు ఓడిపోయిన సమూహం భాషను అణగదొక్కడం జరుగుతుంది. కానీ మన దేశంలో ఎన్నో జాతులు, తెగలు, భాషలు ఉన్నందున ఆంగ్లేయులు ఈ దేశపు పెద్దపెద్ద సమూహాల భాషలను తుడిచిపెట్టలేక పోయారు. కానీ పాలనావసరాలకు బ్రిటీష్ విద్యా విధానం ప్రవేశపెట్టి వారికి అనుకూలంగా ఉండే విధంగా కొత్త విద్యావంతులను తయారుచేసుకున్నారు. ఈ కొత్త విద్యావంతులు ఆంగ్లంతో పరిచయమై ఆధునిక శాస్త్రాల గురించి, అలాగే హేతువాదం గురించి తెలుసుకోవటం వల్ల ఆంగ్లం కూడా ఒక రకమైన అభిమానం పొందే పరిస్థితి వచ్చింది. భారత జాతీయోద్యమంలో వివిధ ప్రాంతాల నాయకులు, మేధావులు ఐక్యం కావటానికి ఆంగ్లం ఉపయోగపడిందనేది వాస్తవం. ఆ కారణంగా ఆంగ్లం మన జాతీయ ఐక్యతకు దోహదపడింది కనుక ఆంగ్లేయులకు రుణపడి ఉన్నామనే వితంత వాదం చేసేవారు కూడా ఉన్నారు. జాతీయ ఐక్యత జాతీయ అవసరాల కోసం వస్తుంది. నేడు కూడా మన దేశంలో ప్రపంచీకరణ యుగంలో ఇంగ్లీషే తారక మంత్రంగా పరిగణించబడుతోంది. నేటి మారిన పరిస్థితుల కారణంగా అది కొంత వాస్తవమైనా దేశీయ భాషలకు గ్రహణం పడుతోంది. ఏ రాష్ట్రంలో చూసినా మనం చదువుకున్న వారిలో తన మాతృభాషకన్నా ఇంగ్లీషే బాగా రావటాన్ని చూస్తాం. చాలామందికైతే సొంత భాష రావడం లేదనేది ఒక ఫ్యాషన్. పరభాషీయులు మాట్లాడే పద్ధతిలో మాతృభాషను మాట్లాడే దురవస్థ నేడు ఉంటోంది. తెలుగువారి పరిస్థితి అయితే మరీ దారుణం. దేశమంతటితో పోలిస్తే తన భాషంటే అభిమానం లేకపోవటం, పట్టు అంతకన్నా లేకపోవటంలో తెలుగువారిదే అగ్రస్థానంగా ఉంది. సాంకేతిక కారణాల వల్ల మన భాషలోకి వచ్చి చేరిన కొన్ని పదాలు వాడొచ్చు. కానీ చాలా సాధారణ పదాలు, అంటే ఇంతకు ముందు కూడా సమాజంలో వేటి అవసరం ఉందో అలాంటి వాటికి కూడా ఆంగ్ల పదాన్ని వాడటం జరుగుతోంది. భాషా పత్రికలన్నిటా, దేశమంతటా ఈ జాఢ్యం కనిపిస్తోంది. ఇక టీవీలో కార్యక్రమాలు నిర్వహించేవారైతే స్థానిక భాష మాట్లాడుతున్నారా లేక ఇంగ్లీషా అన్నట్టు ఉంటోంది.
ప్రపంచ స్థాయిలోనే ఏటా ఎన్నో భాషలు అంతరించిపోతున్నాయని భాషా శాస్తజ్ఞ్రులు చెబుతున్నారు. మానవుడి ‘తెలివితక్కువతనం’ వల్ల ప్రకృతిలో ఎలాగైతే జీవ వైవిధ్యం అంతరించిపోతోందో అలాగే భాషలు కూడా దోపిడీ సమాజాల్లో ఆధిపత్య పోరుకు బలై అంతరించి పోతున్నాయి. భాషలేని, లిపిలేని చిన్నచిన్న తెగలు ఇంకా ప్రపంచంలో అనేకం ఉన్నాయి. వాటి సంగతి అటుంచినా పెద్ద పెద్ద జన సమూహాలున్న మన దేశంలో కూడా చాలా భాషలు అంతరించి పోయే స్థితికి రావడం మంచిది కాదు. ఇది సహజసిద్ధమైన వైవిధ్యాన్ని నాశనం చేయడమే అవుతుంది. దేశం నేడు ఎన్నో సమస్యలతో సతమతవౌతున్నది. భాష ఆర్థికాంశంలా అంత కీలకం కాదు కదా అని అనుకోవచ్చు. కానీ జాతి సంస్కృతి మనుగడకు భాష కూడా ముఖ్యమైనదే. జాతి, సమూహాల ఉనికికి కీలకమైనదే. అది గుర్తించి చైతన్యవంతులైన వారంతా జాతీయ భాషలను పరిరక్షించే విషయాన్ని తన సొంత విషయంగా భావించి దానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
పర భాషా వ్యామోహంతో ఇంగ్లీషు ప్రాథమిక స్థాయి నుండే బోధనా మాధ్యమంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలలో ఏర్పాటవుతోంది. భాషోద్యమంతో ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా, ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగుకి ప్రాధాన్యత రాలేదు. పైగా ఇప్పుడు ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే పూర్తిగా ఆంగ్ల మాధ్యమ బోధనలకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలతో పనిలేకుండా చదువులు ఉండే స్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మాతృభాషను కాపాడుకోవాలి. తెలుగు తల్లి ముద్దుబిడ్డలుగా ప్రతి ఒక్కరూ మాతృభాషా పరిరక్షణకు పూనుకోవాలి. ఎటువంటి ప్రజా ప్రయోజన ఉద్యమంతో సంబంధం ఉన్నవారైనా దీని గురించి తప్పక ఆలోచించాలి. తగు విధంగా స్పందించాల్సిన అవసరం ఎంతో వుంది. లేదంటే తెలుగు భాష అంతరించిపోయి తరువాయి భావితరాలకు మాతృభాషంటే ఆంగ్లమే అన్న స్థితికి దిగజారే గడ్డుకాలం రాక మానదు. అమ్మా నాన్న పిలుపులు పూర్తిగా పోయి మమీ డాడీ సంస్కృతి దాపురించక తప్పదు. అందుకే మేల్కోండి. మాతృభాషను పరిరక్షించుకోండి! దేశ భాషలందు తెలుగు లెస్స.

- కంచర్ల సుబ్బానాయుడు